
తెలంగాణ జోష్
ఊరూరా ఉప్పొంగిన సంబురాలు
జోరుగా ర్యాలీలు స్వీట్ల పంపిణీ
ఎరుపెక్కిన అమరవీరుల స్థూపాలు
సాక్షి, నెట్‌వర్క్: పదిజిల్లాల తెలంగాణ ఏర్పాటుకు సిఫార్సు చేసిన జీవోఎం నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడం పట్ల తెలంగాణవాదులు సంబురాలు చేసుకున్నారు. జనం రోడ్లపైకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఉప్పొంగిన ఉత్సాహంతో డప్పు చప్పుళ్లు, బాణసంచాలు కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. అమరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. దశాబ్దాల కల సాకారమైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.
రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో తెలంగాణవాదుల సంబురాలు మిన్నంటాయి. ఉదయం బాష్పవాయు గోళాలతో దద్దరిల్లిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో..రాత్రి బాణాసంచా పేలుళ్లు మార్మోగాయి. వందలాది మంది విద్యార్థుల జై తెలంగాణ నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. బ్యాండు మేళాలు,నృత్యాలతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. నాంపల్లిలోని గన్‌పార్క్ వద్ద వివిధ పార్టీల ముఖ్య నాయకులు, తెలంగాణ ప్రజా సంఘాల నేతలు,తెలంగాణవాదులు పెద్దఎత్తున తరలివచ్చి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటు అమరుల త్యాగఫలితమేనని కొనియాడారు.
రంగారెడ్డి జిల్లా వికారాబాద్, చేవెళ్ల, పరిగి, ఇబ్రహీం పట్నం, శంషాబాద్, తాండూరు, మేడ్చల్‌లలో వివిధ పార్టీల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. విద్యార్థి జేఏసీ నాయకులు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో పాల్గొన్నారు.
మెదక్ జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి సంబరాలు మిన్నంటాయి. టీ జేఏసీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోనియాగాంధీ తెలంగాణ అంశంపై ఇచ్చిన మాట నిలుపుకున్నారని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజలు ఏకమై చేపట్టిన ఉద్యమం ఫలితంగానే తెలంగాణ కల సాకారమైందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తన ఇంట్లో కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి, మిఠాయిలు పంచారు. తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు బాణాసంచా కాల్చారు. మహబూబాబాద్ నెహ్రూ సెంటర్, జనగామ బస్టాండ్ సెంటర్‌లలో తెలంగాణవాదులు, తెలంగాణ జేఏసీ నేతలు స్వీట్లు పంచుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. పరకాలలో ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ఆధర్యంలో తెలంగాణ సంబరాలు జరిగాయి. విద్యార్థుల జై తెలంగాణ నినాదాలతో కాకతీయ యూనివర్సీటీ ప్రాంగణం మార్మోగింది.
కరీంనగర్‌లో కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్‌బాబు ఇంటివద్ద, తెలంగాణ చౌక్‌లో స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా సం ఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో కరీంనగర్‌లో మిఠాయిలు పంచిపెట్టారు. గోదావరిఖనిలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో టీఆర్‌ఎస్ నాయకులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, హుజూరాబాద్, హుస్నాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీజేఏసీ నాయకులు వేడుకలు జరిపారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోందని, పార్లమెంట్‌లో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్లగొండలో టీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి, సీపీఐ, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మలి తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి, స్వీట్లు పంచిపెట్టారు. భువనగిరిలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట, సూర్యాపేటలలో సంబరాలు జరుపుకొన్నారు.