
ప్రస్తుత సరిహద్దుల మేరకే విభజించాలి: సురవరం సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల పరిధిలో ప్రస్తుతమున్న సరిహద్దుల ప్రకారమే యథాతథంగా విభజించాలంటూ సీపీఐ మంగళవారం కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) నివేదిక సమర్పించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నివేదికను ఖరారు చేసి మెయిల్ ద్వారా పంపారు. హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ కోరినట్టుగా 11 అంశాలపై సూచనలు చేశారు. ప్రస్తుతమున్న సరిహద్దుల ప్రకారమే ఉభయ ప్రాంతాలను విభజించాలని, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా యధాతథంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారిలో భయాందోళనలను తొలగించేలా శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఎన్నికలకు సమాయత్తం కండి: సురవరం
పొత్తులు, ఎత్తులు ఎలా ఉన్నా, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ధన, కుల, మత ప్రభావం పెరిగినప్పటికీ సానుకూల అంశాలతో ఉద్యమాలకు సన్నద్ధం కావాలని సూచించారు. మూడు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం హైదరాబాద్ శివార్లలోని యాప్రాల్‌లో ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా రాష్ట్ర సమితి సమావేశాలను సురవరం సుధాకర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు అవకాశవాద వైఖరిని అవలంభిస్తున్నాయని సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానన్న చంద్రబాబు ప్రస్తుతం అదే పార్టీ వైపు చూస్తున్నారంటూ ఉదహరించారు.