మహా ప్రగతి | Hyderabad is ready for the decade celebrations | Sakshi
Sakshi News home page

మహా ప్రగతి

Published Sun, Jun 2 2024 5:08 AM | Last Updated on Sun, Jun 2 2024 5:08 AM

Hyderabad is ready for the decade celebrations

పదేళ్లలో భాగ్యనగరం అభివృద్ధి పథం

పరుగులు పెడుతున్న మెట్రో రైళ్లు   

పెరిగిన వాహన వేగం 

తగ్గిన ప్రయాణ సమయం 

నగరానికి గ్లోబల్‌ సిటీ ఘనత  

ప్రతిష్టాత్మకంగా ఫార్ములా– ఈ పోటీలు 

రోడ్డెక్కిన డబుల్‌ డెక్కర్‌ 

పాదచారుల భద్రతకు స్కైవాక్‌ 

అంతర్జాతీయ ప్రమాణాలతో సైకిల్‌ ట్రాక్‌ 

పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు 

బస్తీ దవాఖానాలతో ఆరోగ్య భాగ్యం 

గ్రేటర్‌ పరిధిలో సమృద్ధిగా జలసిరి

నగరానికే తలమానికంగా ఐసీసీసీ

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 

దశాబ్ది వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్‌

నింగినంటే  ఆకాశ హర్మ్యాలు.. వేగం పెంచిన రహదారులు.. ఫ్లైఓవర్‌లు.. ప్రపంచ నగరాల చెంతన నిలిపిన అంతర్జాతీయ  హంగులతో మహానగరం గ్లోబల్‌ సిటీగా అవతరించింది. దేశవిదేశాలకు చెందిన కార్పొరేట్‌ దిగ్గిజాలకు కేరాఫ్‌గా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు, ఉత్కంఠభరితమైన పోటీలు జరిగాయి. గత పదేళ్లలో నగరంలో అనేక మార్పులు  వచ్చాయి. 

దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి, శ్వేతసౌధాన్ని తలపించే  సచివాలయం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహం, ఆ చెంతనే కొలువుదీరిన మాజీ ప్రధాని పీవీ విగ్రహం.. లుంబినిని ఆనుకొని నిర్మించిన అమరుల స్మారకం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు మార్గంలో పర్యాటకులను ఆకట్టుకొనే డబుల్‌ డెక్కర్‌ బస్సులు, లక్షలాదిమంది ప్రయాణికులకు చేరువైన మెట్రో రైలు. 

సుమారు రూ.వంద కోట్లతో  నిర్మించిన సైకిల్‌ట్రాక్, ప్రపంచదేశాలను ఆకట్టుకున్న ఫార్ములా–ఈ వంటి పోటీలు జరిగాయి. తెలంగాణ  రాష్ట్ర అవతరణ అనంతరం పదేళ్లలో మహా నగరం రూపురేఖల్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరాలతో పోటీ అన్నట్లుగా విశ్వనగరం దిశగా అడుగులు వేస్తోంది.

నూతన రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన భాగ్యనగరం ప్రగతి పథంలోనూ తనదే పైచేయి అంటూ సగర్వంగా నినదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లవుతున్న సందర్భంగా ‘సాక్షి’ బిగ్‌ స్టోరీ.     – సాక్షి, హైదరాబాసిటీబ్యూరో బృందం 

రూ.8 వేల కోట్లతో ఎస్సార్‌డీపీ.. 
నగరంలో ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద దాదాపు రూ.8 వేల కోట్ల పనులు జరిగాయి. వీటిలో ఎలివేటెడ్‌ కారిడార్లు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు, తదితరమైనవి ఉన్నాయి. మొదటి దశ కింద చేపట్టిన ఈ  పనుల్లో 36 పూర్తిచేశారు. మరో ఆరు పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన పనుల వల్ల రద్దీ మార్గాల్లో వాహన వేగం 15 కేఎంపీహెచ్‌ నుంచి 35 కేఎంపీహెచ్‌కు పెరిగింది. దాదాపు రూ.450 కోట్లతో స్లిప్‌రోడ్లు, లింక్‌రోడ్లు నిర్మించారు.

రూ.530 కోట్లతో ఎస్‌ఎన్‌డీపీ..  
ఎస్‌ఎన్‌డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) కింద రూ. 530 కోట్ల పనులు చేశారు. లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లకుగాను దాదాపు 70 వేల గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. థీమ్‌పార్కులు, కాలనీపార్కుల వంటివి వందలాదిగా అభివృద్ధి చేశారు. సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) పథకం ద్వారా ఎంపిక చేసిన ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకివ్వడంతో రోడ్ల సమస్యలు తగ్గాయి. 38 మోడల్‌ మార్కెట్లు, 12 మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు, 30కి పైగా శ్మశాన వాటికల నిర్మాణం/ఆధునికీకరణ పనులు చేశారు. 

బస్తీ దవాఖానాలు.. అన్నపూర్ణ భోజనం 
పేదలకు రూ. 5లకే అన్నపూర్ణ భోజనం, బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. చెత్త తరలింపునకు స్వచ్ఛ ఆటోలు, రెఫ్యూజ్‌ కాంపాక్ట్‌ వాహనాలు వినియోగంలోకి తెచ్చారు. 5 ప్రధాన కారిడార్ల ద్వారా నిత్యం 15 లక్షల వాహనాలు (పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. దశాబ్ద కాలంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ అనేక సంస్కరణలు చేపట్టింది. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు అండర్‌ గ్రౌండ్‌ లైన్ల సంఖ్యను పెంచింది. సామర్థ్యానికి మించి నమోదవుతున్న డిమాండ్‌ను తట్టుకుని నిలిచేలా సరఫరా వ్యవస్థను మెరుగుపర్చింది.  

రయ్‌మన్న ఫార్ములా– ఈ 
హుస్సేన్‌సాగర్‌ తీరంలో గతేడాది ఫిబ్రవరి 11న అత్యంత  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  ఫార్ములా–ఈ పోటీలు  ప్రపంచం దృష్టినిఆకర్షించాయి. ఈ పోటీల కోసం   నెక్లెస్‌రోడ్డులో 2.8 కిలోమీటర్‌ల  స్ట్రీట్‌ సర్క్యూట్‌ను  ఏర్పాటు చేశారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా దేశంలోనే  మొదటిసారిగా హైదరాబాద్‌లో జరిగిన  ఫార్ములా– ఈ  ప్రిక్స్‌ పోటీల్లో 11 జట్లకు చెందిన 22 మంది రేసర్లు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.   

పాదచారుల భద్రతకు ఉప్పల్‌ స్కైవాక్‌  
ప్రతిరోజు  వేలాది మంది బాటసారులు నలువైపులా నడిచే  ఉప్పల్‌ రింగ్‌రోడ్డు వద్ద హెచ్‌ఎండీఏ  నిర్మించిన  స్కైవాక్‌తో పాదచారుల భద్రతకు భరోసా ఏర్పడింది. సుమారు రూ.25 కోట్లతో ఈ స్కైవాక్‌ను నిర్మించారు. దీని  నిర్మాణంలో 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, మరో 4 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు.  

సైకిల్‌ ట్రాక్‌.. అదరహో.. 
ఔటర్‌రింగ్‌ రోడ్డు మార్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 23 కిలోమీటర్ల మేర సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించారు. దీనికి  సోలార్‌ రూఫ్‌ను కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది తొట్టతొలి అధునాతన సైక్లింగ్‌ ట్రాక్‌. నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్‌ అకాడమీ వరకు 8.5 కి.మీ, కొల్లూరు నుంచి నార్సింగి వరకు మరో 14.5 కి.మీ మేర దీన్ని ఏర్పాటు చేశారు. 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్‌లతో ట్రాక్‌ను  నిర్మించారు.  

125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం.. 
నెక్లెస్‌ రోడ్డులో సుమారు  11.4 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన పచ్చదనం వాతావరణం మధ్య భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకొనేవిధంగా ఈ మహామూర్తిని ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌ భవనం ఆకృతిలో ఏర్పాటు చేసిన బేస్‌మెంట్‌ మరో  ప్రత్యేకమైన ఆకర్షణ. ఇది 50 అడుగుల ఎత్తు ఉంటుంది. బేస్‌మెంట్‌లోని హాళ్లలో అంబేడ్కర్‌ జీవితంపై విస్తారమైన సమాచారంతో కూడిన  గ్రంథాలయం, ఆయన జీవిత విశేషాలను, రాజ్యాంగ రచనా కాలం నాటి  ఫొటోలను, చిత్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.   
 
నలువైపులా మెట్రో సేవలు... 
నగరంలో  2017 నవంబర్‌లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మెట్రో ప్రయాణికుల సంఖ్య 54 కోట్లు దాటింది. నగరంలోని మూడు కారిడార్‌లలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం  ఎల్‌బీనగర్, పాతబస్తీ రూట్‌ల నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మించనున్నారు.అలాగే నగరం నలువైపులా మెట్రో రైళ్లను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించారు. 

భేషుగ్గా నీటి నిర్వహణ  
కోటిన్నరకు పైగా జనాభా కలిగిన మహా నగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణను జలమండలి సమర్థంగా నిర్వహిస్తోంది. నగర నలుమూలల తాగునీటి రిజర్వాయర్లతో పాటు మంచినీటి శుద్ధి కేంద్రాలను నిర్మించి తాగునీరు సరఫరా చేస్తోంది. 

భవిష్యత్‌ తాగునీటి సరఫరాకు భరోసా కల్పిస్తూ సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తోంది. మరోవైపు వంద శాతం మురుగు శుద్ధి కోసం మూడు ప్యాకేజీల్లో అధునాతన సీక్వెన్సింగ్‌ బ్యాచ్‌ రియాక్టర్‌ టెక్నాలజీతో  కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా అందులో ఇప్పటికే  సగానికి పైగా పూర్తయ్యాయి. 

నగర వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి సరఫరా పథకం అమల్లోకి వచి్చంది. పారిశుద్ధ్య విధానం పూర్తిగా మ్యానువల్‌  నుంచి యాంత్రికానికి మారింది. ప్రస్తుతం సివర్‌ జెట్టింగ్‌ యంత్రాలను వినియోగిస్తోంది. మ్యాన్‌ హోళ్లలో మానవ సహిత పారిశుద్ధ్య పనులు నిషేధించింది. హుస్సేన్‌ సాగర్‌ పరిరక్షణ చర్యల్లో భాగంగా  కూకట్‌పల్లి నుంచి వచ్చే మురుగు నీటిని సాగర్‌లో కలవకుండా వేరే ప్రాంతానికి మళ్లించింది. 

దశాబ్ది ధగధగలు 
అవతరణ ఉత్సవాలకు ముస్తాబైన గ్రేటర్‌ 
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. ఆదివారం జరగనున్న వేడుకల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను రంగురంగుల విద్యుద్దీపాలతో  అలంకరించారు. సెక్రటేరియట్, అంబేడ్కర్‌ విగ్రహం, అమరుల స్మారకం, నెక్లెస్‌రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాలు వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. 

ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారులతో పాటు, అమరుల కుటుంబాలను సమున్నతంగా గౌరవించనుంది. సాయంత్రం 6 గంటలకు  ట్యాంక్‌బండ్‌ వద్ద సుమారు 700 మందికి పైగా కళాకారులు, వివిధ సాంస్కృతిక బృందాలు భారీ కవాతును నిర్వహించనున్నాయి. 

బతుకమ్మ, బోనాలు, డప్పు వాద్యాలు, ఒగ్గుడోలు తదితర కళాకారుల బృందాలు వేడుకల్లో  పాల్గొంటాయి. తెలంగాణ రుచులను పరిచయం చేసే  వివిధ రకాల వంటలతో స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. లేజర్‌ షోలతో ఆకాశం సరికొత్త అందాలను సంతరించుకోనుంది. రాత్రి 8.50 గంటలకు బాణాసంచా వెలుగుల్లో వేడుకలను ముగించనున్నారు.

నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు
మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు   
ఖైరతాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలతో పాటు మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు.  

» లుంబినీ పార్క్, ఎన్టీఆర్‌ ఘాట్, ఎన్టీఆర్‌ గార్డెన్, ఐమాక్స్, పీపుల్స్‌ ప్లాజా ఎగ్జిబిషన్‌లు ఆదివారం మూసివేసి ఉంటాయి. సాధారణ ప్రజలు, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు రాకూడదు.   
»    ట్యాంక్‌బండ్‌పై జరిగే ఉత్సవాలకు పాసులు ఉన్నవారికే అనుమతి ఉంటుంది.  
»     మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్, ఐపిఎస్‌ అధికారులతో పాటు పోలీసులు, అధికారులు వారి వారి వాహనాల పార్కింగ్‌ కోసం బోట్స్‌ క్లబ్, చి్రల్డన్స్‌ పార్క్, హోటల్‌ అమోఘం, సచివాలయం నార్త్‌ ఈస్ట్, సౌత్‌ ఈస్ట్‌ రోడ్డు, నెక్లెస్‌ రోడ్డు సంజీవయ్య పార్క్‌ రోడ్డు, జీహెచ్‌ఎంసీ లేన్‌లతో పాటు ఎనీ్టఆర్‌ స్టేడియంను పార్కింగ్‌ కోసం కేటాయించారు.  
»    రాణిగంజ్‌ రైల్వే ట్రాక్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డు వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఆ వాహనాలు మినిస్టర్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు. సైఫాబాద్‌ ఓల్డ్‌ పీఎస్‌ నుంచి వచ్చే వాహనాలు రవీంద్రభారతి వైపు డైవర్షన్‌ తీసుకోవాలి.  
»     తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పై నుంచి స్టీల్‌ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను అనుమతిస్తారు. తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతి లేదు.  
»  కూకట్‌పల్లి నుంచి పంజాగుట్ట, సికింద్రాబాద్‌ వైపు, పంజాగుట్ట వైపు వాహనాలకు అనుమతి ఉంటుంది. ఖైరతాబాద్‌ చౌరస్తా వైపు అనుమతించరు.   
»  మెహిదీపట్నం నుంచి లక్డీకాపూల్‌ వైపు వచ్చే వాహనాలను మాసబ్‌ ట్యాంక్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు అనుమతిస్తారు.  
»  లిబర్టీ, హిమాయత్‌నగర్‌ నుంచి ట్యాంక్‌బండ్, అంబేద్కర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు.  ఖైరతాబాద్‌ ఫ్రైలఓవర్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డు, ఐమాక్స్‌ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు.  

నేరాల నియంత్రణకు ఐసీసీసీ
పదేళ్ల కాలంలో ‘గ్రేటర్‌’లో పోలీసు విభాగాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌– తెలంగాణ స్టేట్‌ పోలీసు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీఎస్‌పీఐసీసీసీ) తలమానికంగా నిలిచింది. దీన్ని 6.427 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 

ఈ భవనంలో హైదరాబాద్‌ కమిషనర్‌ ఇతర ఉన్నతాధికారులతో పాటు సైబర్‌ సేఫ్టీ బ్యూరో, నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, డయల్‌–100, వ్యవస్థీకృత నేరాల నిరోధక విభాగం, ప్రాసిక్యూషన్‌ సపోర్ట్‌ సెంటర్, సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ సపోర్ట్‌ సెంటర్‌ తదితరాలు ఉన్నాయి. ఇది మొత్తం ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులోని ‘ఏ’ టవర్‌ 1,69,000, ‘బీ’ టవర్‌ 1,25,000, ‘సీ’ టవర్‌ 34,414, ‘డీ’ టవర్‌ 27,166, ‘ఈ’ టవర్‌ 45,000, బేస్‌మెంట్‌ 2,16,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 

60 మీటర్ల ఎత్తులో 14,15 అంతస్తుల మధ్య ఉన్న స్కై బ్రిడ్జ్‌ 20,750 అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల సీసీ కెమెరాలన్నీ ఇక్కడి కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించి ఉంటాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సుమారు పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల విషయంలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. సైబరాబాద్‌లోని తూర్పు భాగంతో ప్రత్యేకంగా రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటైంది.  ప్రతి కమిషనరేట్‌లోనూ జోన్లు, డివిజన్లు, పోలీసుస్టేషన్లు పునర్‌ వ్యవస్థీకరణ జరిగింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement