ఆ రెండు రోజులు పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు
7 నుంచి 28 వరకు కూడా ముహూర్తాలు..
ఫంక్షన్‌హాళ్లు, కల్యాణ మండపాలకు భారీ డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. ఆషాఢ మాసం వెళ్లి శ్రావణం రావడంతో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు కూడా వచ్చేశాయి. దీంతో ఈ నెలలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నట్లు పురోహితవర్గాలు అంచనా వేస్తున్నాయి. కొంతకాలంగా ఎలాంటి పెళ్లిళ్లు, వేడుకలు లేకుండా ఉన్న పురోహితులు ఈ నెల రోజుల పాటు బిజీ బిజీగా గడపనున్నారు.
ఈ నెల 7 నుంచి 28 వరకూ అన్నీ మంచి ముహూర్తాలే అయినా 17, 18 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ రెండు రోజుల పాటు నగరంలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫంక్షన్‌హాళ్లు, కల్యాణమండపాలు, హోటళ్లకు బుకింగ్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే భాజాభజంత్రీలు, మండపాలను అలంకరించేవారికి, కేటరింగ్ సంస్థలకు సైతం ఆర్డర్లు పెరిగినట్లు అంచనా. ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు ప్రముఖ పురోహితుడు చిలకమర్రి శ్రీనివాసాచార్యులు తెలిపారు.
15వ తేదీ నుంచి అన్నీ దివ్యమైన ముహూర్తాలే అని చెప్పారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైనదని పేర్కొన్నారు. ఈ నెలలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్న దృష్ట్యా మార్కెట్‌లో సైతం సందడి పెరిగింది. వస్త్రదుకాణాలు, బంగారం దుకాణాల్లో అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల బంగారం ధరలు కూడా కొంత వరకూ తగ్గడం వల్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ రావడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇవి చదవండి: ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’.. : స్టార్ డిజైనర్ ఓస్వాల్
Comments
Please login to add a commentAdd a comment