ఐదు దశాబ్దాల పైగా అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణకు జనగీతం ఏది? పదేళ్ల క్రితం ‘మా రాష్ట్రం’ అని చెప్పుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కింది. ఒక రాష్ట్రంగా చిహ్నం, విగ్రహం రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ అవతరణ పదేళ్ల తరువాత, కాంగ్రెస్ పార్టీవారి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా మార్చి కొత్త చిహ్నాన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా రకరకాల చర్చలు మొదలయ్యాయి.
దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లే రాష్ట్రానికి ఓ రాష్ట్ర గీతం ఉండాలని కోరుకోవడం సహజమే. రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తరువాత ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.
జాతీయ గీతంలాగే రాష్ట్ర గీతం...
జాతీయ గీతం ‘జన గణ మన’, జాతీయ గేయం ‘వందేమాతరం’... రెండింటినీ సమానంగా గౌరవించాలని మన రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యంగ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి భారతీయులు ఆ యా గీతాలను అత్యంత గౌరవంతో ఆలాపిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాలను నిర్వహించే సమయంలో చిన్నా పెద్ద, అధికారి, అనధికారి అనే భేదం లేకుండా అందరూ గౌరవంగా నిలబడాలనేది ఒక నియమం. కనీసం జాతీయ గీతాలాపన సమయంలో మౌనంగా ఉండి తమ గౌరవాన్ని వ్యక్తం చేయాలి. అయితే అలా గౌరవించనివారూ ఉంటారు. అందుకు శిక్షలు ఉండవు. కాని, అవమానిస్తే మాత్రం నేరమే. రెండు జాతీయ గీతాలకూ, జాతీయ చిహ్నానికీ, జాతీయ పతాకానికీ సంబంధించి ఒక చట్టం కూడా చేసుకున్నాం.
దేశ సౌభాగ్యాన్నీ, సంస్కృతీ వారసత్వాలూ, గొప్పదనాన్నీ ప్రతిబింబించే మన జాతీయ గీతాలను గర్వంగా భారతీయులమంతా ఎలా ఆలపిస్తున్నామో... అంతే గర్వంగా రాష్ట్రాల ప్రజలు తమ తమ రాష్ట్ర గీతాలను ఆలపించడం సహజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లయినా ఇంతవరకూ రాష్ట్ర గీతం అంటూ ఏదీ లేకపోవడాన్ని కొందరు చర్చిస్తూ వచ్చారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వాల పేర సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో చాలామంది స్వాగతించారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణలో ఉన్న పాత జిల్లాల అన్నింటి ప్రత్యేకతలనూ, వైశిష్ట్యాన్నీ అద్భుతంగా ఆవిష్కరించింది కనుక. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఒక ఊపు ఊపింది కనుక. అలాగే దీని రచయిత అందెశ్రీ తెలంగాణ మట్టిమనిషి, ఉద్యమకారుడు. తన కలం, గళం ద్వారా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినవారు. అందుకే చాలామంది రాష్ట్ర గీత ప్రకటనను స్వాగతిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కొత్త చిహ్నం..
గత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అమలులో పెట్టిన ప్రభుత్వ చిహ్నాన్ని పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం మరో నమూనాను రూపొందిస్తున్నది. ఇప్పటికే దానిపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి వంటి రాజకీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ నమూనా చాలా బాగుందని కొందరూ, బాగులేదనీ మరికొందరూ అంటున్నారు.
అసలు ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర గీతం అంటూ ఒక గీతాన్ని ప్రకటించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోనీ వాటిని నిర్ణయించేటప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించాలి కదా? దాన్నీ ఈ ప్రక్రియలో భాగం చేయలేదనేది ప్రధానమైన విమర్శ. ఇది సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించి ఏమార్చడానికే అని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.
విధానం, సంవిధానం?
దేశానికి కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి కానీ ఒక ప్రత్యేక నిర్ణయ విధానం (పాలసీ) అంటూ ఒకటి ఉండాలి. ప్రజలందరికీ సంబంధించిన కొన్ని అంశాలపై నిర్ణయాలను కేవలం ‘మంత్రివర్గం’ తీసుకుంటే సరిపోదు. విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. సభలు, సదస్సులు, జిల్లా స్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వివిధ వర్గాలవారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలూ, అసెంబ్లీ సమావేశాల్లో చేసిన చర్చలూ, నిర్ణయాలను అందరికీ అందుబాటులో ఉండేలా వైబ్‌సైట్‌లో పెట్టాలి. మొత్తంమీద రాష్ట్ర గీత ప్రకటన, ప్రభుత్వ చిహ్నం మార్పు వంటి అంశాల్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం. – వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ
అభిప్రాయం: మాడభూషి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment