ఇది.. ప్రగతి, సంక్షేమాల బడ్జెట్‌! | Komatireddy Venkatreddy Comments On Telangana State Budget Sakshi Guest Column News | Sakshi
Sakshi News home page

ఇది.. ప్రగతి, సంక్షేమాల బడ్జెట్‌!

Published Fri, Jul 26 2024 11:13 AM | Last Updated on Fri, Jul 26 2024 11:13 AM

Komatireddy Venkatreddy Comments On Telangana State Budget Sakshi Guest Column News

‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు’’ అన్నారు అంబేడ్కర్‌ మహాశయుడు. అక్షరాలా ఈ మార్గంలోనే సాగుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజసంక్షేమాన్ని నిర్భయంగా అందించేందుకు, నిజాయితీగా ప్రజల జీవితాలను గాడిన పెట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. ‘అభయ హస్తం’ కింద ఎన్నికలలో ప్రకటించిన ఆరు హామీలు ఇవ్వాళ తెలంగాణ నిరుపేదల జీవితాల్లో విశేషమైన మార్పు తెస్తు్తన్నాయి. వాటిని నెరవేర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. రూ. 2,91,159 కోట్ల బడ్జెట్‌ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించేందుకు, గత దశాబ్ద కాలంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు భరోసా కల్పించేందుకు తోడ్పడుతుంది.

‘‘వెన్నెలలు లేవు–పున్నమ కన్నె లేదు
పైడి వన్నెల నెలవంక జాడలేదు
చుక్కలే లేవు ఆకాశ శోక వీధి
ధూమధామమ్ము దుఃఖ సంగ్రామ భూమి’’ – దాశరథి కృష్ణమాచార్య

అవును... దాశరథి స్థితికి దగ్గరగా... గత అరవై యేండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలో మాత్రమే కాదు, గత ప్రభుత్వ దశాబ్ద పాలనలో కూడా తెలంగాణ అదే నిస్తేజ పరిస్థితిని అనుభవించింది. సంక్షేమం మాటను ఆశ్రితులకు సమర్పయామి మంత్రం... రూల్స్‌ మాటున తమ రాజకీయ యవనికకు రూట్స్‌గా నిలబడ్డ బడా బాబులకు అప్పనంగా ప్రజల ఆస్తుల సంతర్పణ చేసింది బీఆర్‌ఎస్‌ సర్కారు. ఏ బడ్జెట్‌ చూసినా... కేటాయింపులు, ఆపై తటపటాయింపులతో తల్లడిల్లిపోయిన తెలంగాణ ప్రజానీకానికి నిజసంక్షేమాన్ని నిర్భయంగా అందించేందుకు, నిజాయితీగా ప్రజల జీవితాలను గాడిన పెట్టేందుకు కావాల్సిన కేటాయింపులను ఈ బడ్జెట్‌లో చేశాం. అటు అసెంబ్లీలో గౌరవ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖామాత్యులు భట్టి విక్రమార్క, ఇటు మండలిలో సోదరుడు, ఐటీ పరిశ్రమల శాఖా మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సంక్షేమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఒకవైపు సంక్షేమం, మరో వైపు పురోగామి నిర్ణయాలతో జనరంజక బడ్జెట్‌ను మిత్రులిద్దరూ ప్రవేశపెట్టారు.

నిరుద్యోగులకు అభయం..
దాదాపు లక్షన్నర ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు తమ కోర్సులను పూర్తి చేసుకొని ఉద్యోగ సాధనలోకి దిగుతున్నారు. వీరికి స్కిల్స్‌ అందించే స్కిల్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. దానివల్ల ప్రతీ యేటా నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ, ఉద్యమాలు చేసే స్థాయికి సమస్య పెరిగింది. అందుకే, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు దిగ్గజ సంస్థ టాటా టెక్నాలజీస్‌తో కలిసి రూ. 2,324 కోట్లతో 65 ఐటీఐలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా మార్చుతున్నాం. యూనివర్సిటీల పునర్వై భవం కోసం రూ. 500 కోట్లను కేటాయించాం. నిరుద్యోగ జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాం. కృత్తిమ మేధలో నిపుణులను తయారు చేసేందుకు, హైదరాబాద్‌ను ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సెప్టెంబర్‌ 5, 6 తేదీలలో ‘మేకింగ్‌ ఏఐ ఫర్‌ ఎవ్రీవన్‌’ ప్రధానాంశంగా నిర్వహించ తలపెట్టిన సమావేశం తెలంగాణ యువతకు కొత్త భవి ష్యత్తుకు మార్గం చూపిస్తుందని విశ్వసిస్తున్నాం. 

తెలంగాణ ప్రజల ఆయురారోగ్యాలకు శ్రీరామరక్షగా నిలిచిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. ఈ పథకం కింద ఉన్న 1,672 చికిత్సలలో 1,375 చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ ధరలను 20 శాతం పెంచడంతోపాటుగా 163 వ్యాధులను కొత్తగా ఈ పథకంలో చేర్చాం. ప్రతీ ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డును తీసుకువస్తున్నాం. ఇవేకాదు, ఎస్సీ సంక్షేమానికి రూ. 33,124 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.17,056 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 9,200 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ. 3,003 కోట్లు కేటాయించాం.

అభయహస్తం – పేదోళ్ల నేస్తం..
రహదారులు అభివృద్ధికి జీవనాడులు అంటారు. అందుకే మా ప్రభుత్వం రహదారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టే రీజినల్‌ రింగు రోడ్డుకు ఈ బడ్జెట్‌లో రూ.1,525 కోట్లు కేటాయించాం. దాదాపు రూ. 26,502 కోట్ల ప్రాథమిక అంచనాతో నిర్మించతలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్యలో పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు ఏర్పడి అనూహ్యమైన అభివృద్ధిని సాధించి తెలంగాణను దేశంలో నెంబర్‌ వన్‌గా మార్చు తాయి. రాష్ట్ర రహదారులు, భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో రూ. 5,790 కోట్లు కేటాయించాం.

అభయ హస్తం క్రింద ఎన్నికలలో ప్రకటించిన ఆరు హామీలు ఇవ్వాళ తెలంగాణ నిరుపేదల జీవితాల్లో విశేషమైన మార్పును తెస్తు్త న్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 68.60 కోట్ల మంది అక్కలు, చెల్లెండ్లు, తల్లులు తమ గమ్యాలకు చేరు కున్నారు. దీనికోసం రూ. 2,351 కోట్లను సోదరీమణులకు ఆదా చేశాం. అంతేకాదు 39,57,637 కుటుంబాల్లోని సోదరీమణులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నాం. దీనికోసం ఇప్పటికే రూ. 200 కోట్లను కేటాయించాం. బడ్జెట్‌లో మరో రూ. 723 కోట్లను కేటాయించాం. గృహజ్యోతి పథకం ద్వారా అల్పాదాయ వర్గాల ఇళ్లలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. ఇప్పటికే ఈ పథకం కింద 45,81,676 ఇళ్లకు ఉచిత విద్యుత్‌ వెలుగులు అందించాం. దీని కోసం బడ్జెట్‌లో రూ. 583.05 కోట్లు కేటాయించాం. నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ఇంది రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. దీని కింద ప్రతీ నియోజక వర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4 లక్షల 50 వేల ఇండ్లను నిర్మించాలని సంకల్పించాం.

వెలుగుల తెలంగాణను నిర్మిస్తాం..
ప్రతీకార రాజకీయాలకన్నా, ప్రగతి రాజకీయాలను విశ్వసిస్తాం. అందుకే, 2014 నాటికి ఉన్న రూ. 75,577 కోట్ల అప్పులను 2023 డిసెంబర్‌ నాటికి రూ. 6,71,757 కోట్ల రూపాయలకు చేర్చినప్పటికీ విశాల ఆలోచనలతో పొదుపు మంత్రాన్ని పఠిస్తూ, దుబారాను తగ్గిస్తూ, క్రమశిక్షణతో కూడిన పాలనకు బాటలేస్తున్నాం. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కలిపి ఇప్పటికే రూ. 42,892 కోట్లు చెల్లించాం. సంక్షేమానికి రూ. 34,579 కోట్లు ఖర్చు చేశాం. అంబేడ్కర్‌ మహాశయుడు చెప్పినట్టు, ‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. పునాది ఎంత బలంగా ఉంటే, ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది.’’ అక్షరాలా మేం ఈ మార్గాన్నే ఎంచు కున్నాం.

‘అది చేసేంతవరకూ చూడటానికి ఎప్పుడూ అసాధ్యంగా కనిపి స్తుంది’ అని  నెల్సన్‌ మండేలా చెప్పినట్టు, మేం రుణమాఫీ ప్రకటించిన రోజు అందరూ సందేహించినవారే. కానీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 11 లక్షల మంది లక్షలోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేశాం. ఆగస్ట్‌ 15 లోపలే రెండు లక్షల రుణాలున్న రైతన్నలందరి రుణాలను మాఫీ చేసి ఈ దేశ స్వాతంత్యం వచ్చిన రోజు నాటికి తెలంగాణ రైతన్నకు రుణ స్వాతంత్య్రం కలిగిస్తాం. భూమిలేని రైతుకూలీ లకు యేడాదికి 12 వేల ఆర్థిక సాయం అందిస్తాం. పంట బీమా చేసి రైతన్న కష్టనష్టాల్లో అండగా ఉంటాం. వరి రైతుకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 500 బోనస్‌ను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం.

శ్రీధర్‌ బాబు బడ్జెట్‌లో మహాత్మాగాంధీ మాటను ఉట్టంకించినట్టు, ‘‘మనం చేసే పనులకు, చేయగలిగే సామర్థ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటిని పరిష్కరించడానికి సరి పోతుం’’దనే మాట అక్షర సత్యం. ఇవ్వాళ మేం ప్రవేశపెట్టిన రూ. 2,91,159 కోట్ల బడ్జెట్‌ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించేందుకు, గత దశాబ్ద కాలంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు భరోసా కల్పించేందుకు తోడ్పడుతుంది.


– కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, వ్యాసకర్త రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement