గ్రామ రాజ్యం బీసీల పరం కావాలి! Juluru Gaurishankar's Opinion On Local Rural Politics Guest Column News | Sakshi
Sakshi News home page

గ్రామ రాజ్యం బీసీల పరం కావాలి!

Published Fri, Jun 14 2024 10:16 AM | Last Updated on Fri, Jun 14 2024 10:16 AM

Juluru Gaurishankar's Opinion On Local Rural Politics Guest Column News

తెలంగాణ పల్లెల్లో నేటికినీ కొనసాగుతున్న ఆధిపత్య వర్గాల పెత్తందారీతనాలు నామరూపాలు లేకుండా పోవాలంటే స్థానిక రాజ్యాలు (సంస్థలు) బహుజన వర్గాల చేతుల్లోకి రావాలి. స్థానిక రాజ్యాలైన గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, కో ఆపరేటివ్‌ సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు, స్కూలు కమిటీలు, గ్రామ అభివృద్ధి కమిటీలలోకి పెద్దసంఖ్యలో చదువుకున్న బహుజన యువకులు రావాలి.

అంటే బీసీ యువత పెద్దఎత్తున స్థానిక గ్రామీణ రాజకీయ రంగంలోకి రావాలి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి స్థానిక పాలనలో రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల స్థానాల్లోకి చదువుకున్న దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ తెగలకు చెందిన యువత రావాలి. ఈ పని జరిగినప్పుడే గ్రామాలలో సామాజిక మార్పులు సాధ్యమవుతాయి.

తరతరాలుగా బీసీ వర్గాలకు చెందినవాళ్ళు ఎంబీసీలు, సంచార, అర్థసంచార జాతులు, ఉత్పత్తి కులాలకు చెందినవాళ్ళు సంపద సృష్టికర్తలుగా ఉన్నారు. కానీ రాజకీయ రంగంలోకి మాత్రం రాలేదు. సమాజంలో సగానికిపైగా ఉన్న ఉత్పత్తి కులాలకు చెందినవారి భాగస్వామ్యం స్థానిక సంస్థల్లో లేకపోవడం వల్ల ఆ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాల సమస్యల పరిష్కారాలు ఆ యా కులాలవారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నప్పుడే సాధ్యమవుతుంది.

తరతరాలుగా విన్నపాలు, విజ్ఞప్తులు పట్టుకుని గ్రామ పంచాయతీలు, మండల, జడ్పీ కార్యాలయాలు, కలెక్టరేట్‌ల దగ్గర నుంచి సచివాలయాల వరకు చెప్పులరిగేలా తిరిగిన బహుజన కులాలవాళ్ళు తమ సమస్యల పరిష్కారానికి తామే స్థానిక రాజ్యాల నాయకులు కావటం చాలా మార్పులకు దారితీస్తుంది. ఇది బీసీలకు రాజకీయ న్యాయంగా మాత్రమే కాకుండా మొత్తంగా సామాజిక పరివర్తనగా చూడాలి.

గ్రామాలు దేశానికి ఊపిరైతే ఆ గ్రామాలకు ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి శక్తులే ప్రాణాలు. బీసీల్లో చదువుకున్న కొత్తతరం తనకున్న పరిశోధనాత్మక ఆలోచనలను గ్రామాభివృద్ధిపై పెడితే ఊహించని అద్భుత ఫలిలాలు వస్తాయి. గ్రామం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తన చుట్టూ ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని సంపద సృష్టించే కేంద్రంగా మారుతుంది. కులవృత్తులు నేడు కునారిల్లుతున్నాయి. అవి అత్యాధునిక రూపం దాల్చితేనే నేటి ప్రపంచానికి అవసరమైన సంపదలను అందించే కేంద్రంగా గ్రామాలను తయారుచేయడం సాధ్యమవుతుంది. ఇదంతా జరగాలంటే స్థానిక సంస్థలపై బహుజనుల అధికారం నెలకొనాలి.

జనాభాలో బీసీల సంఖ్యను బట్టి దామాషా ప్రకారం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి. ఆ యా బీసీ కులాలవారు అన్ని రంగాల్లో శిరసెత్తుకుని నిలిచేందుకు తమ అస్తిత్వ ఉద్యమాలను కొనసాగించక తప్పదు. దీన్ని కులకోణంగా తప్పుడు విశ్లేషణలు చేసి బడుగుల చైతన్యాన్ని పక్కదారి పట్టించే పనిని ఆధిపత్య వర్గాలు విస్తృతంగా చేస్తూ ఉన్నాయి. కులగణన చేయాలని అస్తిత్వ కోణం నుంచి అడుగుతుంటే అడ్డుతగులుతూ కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుదన్న వాదనలు తీసుకువస్తున్నారు.

బీసీలు సంపూర్ణ రాజకీయ సాధికారత సాధించకుండా సమాజ వికాసం సంపూర్ణం కాదు. ఈ విషయాన్ని మరుగున పరుస్తూ బీసీల అస్తిత్వమే లేకుండా చేసేందుకు ఆధిపత్య వర్గాలు పనిచేయటం కొత్తేమీ కాదు. బడుగులకు విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేసే సమయంలో ఆధిపత్య వర్గాలు సృష్టించిన అలజడులు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీలలోని ఆధిపత్యవర్గాలు తెరవెనుకనుంచి చేసిన కుట్రలన్నీ చరిత్రలో పదిలంగా రికార్డయ్యే ఉన్నాయి.

ఇపుడు బీసీల కులగణన చేయమంటే సమాజం కులాల పేరున విడిపోయి అల్లకల్లోలం అవుతుందన్న వాదనలు ఆధిపత్య వర్గాలు ముందుకు తెస్తున్నాయి. తెలంగాణ ప్రజలు స్వీయరాజకీయ అస్తిత్వం కోణం నుంచి 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం నిర్వహించి రాష్ట్ర సాధనలో విజయం సాధించి ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలలో నిలిచారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఇపుడు బహుజన స్వీయరాజకీయ అస్తిత్వాన్ని సాధించుకోవాలి. ఇది సాధించినప్పుడే స్వరాష్ట్రం సాధించుకున్న లక్ష్యం పరిపూర్ణమవుతుంది.

ఈ దిశలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు తమ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ విడుదల చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని వాగ్దానం చేసింది. జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సందర్భంగా బడుగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

రాహుల్‌ గాంధీ, కులగణన చేస్తామని దేశమంతా చెబుతున్నారు. కులగణన చేసి స్థానిక సంస్థల్లో ‘మేమెంతో మా వాటా అంత రిజర్వేషన్లు ఇవ్వాల’నీ, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీలు బెర్రగీసి అడుగుతున్నారు. ఈ విషయంలో బీసీలపై కాంగ్రెస్‌కు ఉన్నది అసలు ప్రేమా లేక ఓట్ల కోసం చేసిన వాగ్దానమా బట్టబయలు కావల్సి ఉంది. ఏం జరుగబోతుందోనని 2 కోట్ల మంది బీసీలు ఎదురు చూస్తున్నారు.


– అభిప్రాయం: జూలూరు గౌరీశంకర్‌, వ్యాసకర్త కవి, రచయిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement