నేడు ప్రొ. కొత్తపల్లి జయశంకర్ జయంతి
డాక్టర్ కొత్తపల్లి జయశంకర్‌ను తలుచుకుంటేనే 1969లో తుపాకీ తూటాలకు బలై నేలకొరిగిన వంద లాది తొలి తెలంగాణ రాష్ట్ర సాధన సమరయోధులు గుర్తు కొస్తారు. ఓరుగల్లు బిడ్డగా, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా, ప్రొఫెసర్‌గా, ‘సీఫెల్’ రిజిస్ట్రార్‌గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఆయన జ్ఞానరంగాన్ని తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలి దశల ఉద్యమాల వెంట నడుచుకుంటూ ఉద్యమాన్ని సక్రమ పట్టాలపైకెక్కించి నడిపించిన జయశంకర్‌ను తెలంగాణ మట్టి ఎప్పటికీ మరిచిపోదు.
తెలంగాణ అంతా నిరాశా నిస్పృహల్లోకి పోయినప్పుడు తమ ఒంటికి నిప్పంటించుకుని ‘జై తెలంగాణ’ నినాదాన్ని మిన్నంటేలా చేసిన శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్యలు, ఆత్మబలి దానాలు చేసుకున్న వందలాది మంది ఆత్మగౌరవ యోధుల త్యాగాలు, తెగిపడ్డ తల్లి పేగుల ఆర్తనాదాలు ఇంకా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి. తెలంగాణ మేధావుల సంఘమంటే, ‘మేధావులన్న పదమెందుకు? విద్యా వంతులంటే సరిపోతుం’దన్న విద్యావంతుడు జయశంకర్ సార్.
రెండు తెలుగు రాష్ట్రాలేర్పడితే అగ్రవర్ణ పెత్తనాల రాజ కీయాలు క్రమంగా కనుమరుగవుతాయని జయశంకర్ చెప్పిన కాలజ్ఞానం బహుజన రాజ్యాలకు ముగ్గులు పోస్తుంది. తెలుగు భాషపై చర్చ ఎగుస్తున్న ఉద్యమకాలంలో ‘నలుగురు ఖైదీలు జైలు నుంచి పరార్’ అన్న దినపత్రికల బ్యానర్లలోని ఉర్దూ తెలుగు కలగలిసిన తెలంగాణ భాషపై జయశంకర్ పదే పదే చెప్పిన మాటలు జ్ఞప్తికొస్తున్నాయి. 14 ఏళ్ళ సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమంలో ప్రజాసంఘాలు చేసిన పోరాటాన్నీ, రాజకీయ ప్రక్రియ ద్వారా జరిగే ఉద్యమ ప్రస్థా నాన్నీ సమన్వయం చేసుకుంటూ జయశంకర్ నిలిచి కది లారు. రాష్ట్రసాధన ఉద్యమం పిడికిలెత్తుతున్న సందర్భంలో మల్లెపల్లి రాజయ్య వర్ధంతి సభలో జయశంకర్ ప్రసంగాల్ని అక్షరాలుగా పేర్చి మల్లెపల్లి లక్ష్మయ్య అందించిన ‘తెలంగాణలో ఏం జరుగుతుంది’ అన్న పుస్తకం ఉద్యమానికి రూట్ మ్యాప్‌గా నిలిచింది.
జయశంకరుణ్ణి తలుచుకుంటుంటే మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్, జాతీయ రహదారులపై వంటా వార్పుల దగ్గర నుంచి దేశచరిత్రలోనే మరువలేని 42 రోజుల సకల జనుల సమ్మె గుర్తుకొస్తాయి. ఢిల్లీ కార్ల యాత్రలు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడ గట్టుకోవటాలు, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావుల ఆందోళనలు, ప్రజాసంఘాల పోరాటాలు, ఊరూరు జేఏసీగా మారడాలు, ఉద్యమ నృత్యం చేసిన ధూంధాంలు తెలంగాణ స్మృతిపథంలో చెదిరి పోని జ్ఞాపకాలుగా నిలిచాయి. రాజకీయ పార్టీలన్నీ కలవవని ప్రచారాలు జరుగు తున్న సమయంలో ‘ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యు వరకు’ స్వరాష్ట్రం కోసం అందరూ ఒక్కతాటిపైకి వస్తారన్న జయశంకర్ సూత్రీకరణ ఆచ రణ రూపమైంది.
క్యాన్సర్‌ను జయిస్తూ ఉద్యమ జీవితపు ఎగుడుదిగుళ్ళను జయశంకర్ చెబుతుంటే రాసుకుంటూ పోయిన వెంకట్ గౌడ్ అందించిన ‘వొడవని ముచ్చట’నే కదా తెలంగాణ ముచ్చట. జయశంకర్ సార్‌ను ఇపుడు ఎవరు ఎట్లయినా విభజించుకుని మాట్లాడుకోవచ్చును. కానీ ఆయన తెలంగాణ ఉమ్మడి సంపద. తెలంగాణ స్వరాష్ట్రాన్ని చూడకుండానే సెలవంటూ వెళ్ళిపోయారు. కానీ ఆయన అందించిన స్ఫూర్తికి గుర్తుగా విశ్వవిద్యాలయానికి పేరుపెట్టుకోవటం తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలేర్పడితే రెండు చోట్ల బడుగులు నాయకత్వ దశకు వస్తారని జయశంకర్ చెప్పారు.
అది జరగా లంటే తెలంగాణలో అరవై శాతంగా వున్న బీసీలకు పల్లెనుంచి పార్లమెంటు దాకా చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలి. కులగణన జరిగితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరేందుకు దారి ఏర్పడుతుంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు తోడుగా బీసీ రిజర్వేషన్లు కూడా వస్తేనే రాజకీయ న్యాయం జరుగుతుంది.
– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment