Juluru Gaurishankar
-
కాలజ్ఞాని స్ఫూర్తితో బీసీ ఉద్యమం..
డాక్టర్ కొత్తపల్లి జయశంకర్‌ను తలుచుకుంటేనే 1969లో తుపాకీ తూటాలకు బలై నేలకొరిగిన వంద లాది తొలి తెలంగాణ రాష్ట్ర సాధన సమరయోధులు గుర్తు కొస్తారు. ఓరుగల్లు బిడ్డగా, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా, ప్రొఫెసర్‌గా, ‘సీఫెల్’ రిజిస్ట్రార్‌గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఆయన జ్ఞానరంగాన్ని తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలి దశల ఉద్యమాల వెంట నడుచుకుంటూ ఉద్యమాన్ని సక్రమ పట్టాలపైకెక్కించి నడిపించిన జయశంకర్‌ను తెలంగాణ మట్టి ఎప్పటికీ మరిచిపోదు.తెలంగాణ అంతా నిరాశా నిస్పృహల్లోకి పోయినప్పుడు తమ ఒంటికి నిప్పంటించుకుని ‘జై తెలంగాణ’ నినాదాన్ని మిన్నంటేలా చేసిన శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్యలు, ఆత్మబలి దానాలు చేసుకున్న వందలాది మంది ఆత్మగౌరవ యోధుల త్యాగాలు, తెగిపడ్డ తల్లి పేగుల ఆర్తనాదాలు ఇంకా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి. తెలంగాణ మేధావుల సంఘమంటే, ‘మేధావులన్న పదమెందుకు? విద్యా వంతులంటే సరిపోతుం’దన్న విద్యావంతుడు జయశంకర్ సార్.రెండు తెలుగు రాష్ట్రాలేర్పడితే అగ్రవర్ణ పెత్తనాల రాజ కీయాలు క్రమంగా కనుమరుగవుతాయని జయశంకర్ చెప్పిన కాలజ్ఞానం బహుజన రాజ్యాలకు ముగ్గులు పోస్తుంది. తెలుగు భాషపై చర్చ ఎగుస్తున్న ఉద్యమకాలంలో ‘నలుగురు ఖైదీలు జైలు నుంచి పరార్’ అన్న దినపత్రికల బ్యానర్లలోని ఉర్దూ తెలుగు కలగలిసిన తెలంగాణ భాషపై జయశంకర్ పదే పదే చెప్పిన మాటలు జ్ఞప్తికొస్తున్నాయి. 14 ఏళ్ళ సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమంలో ప్రజాసంఘాలు చేసిన పోరాటాన్నీ, రాజకీయ ప్రక్రియ ద్వారా జరిగే ఉద్యమ ప్రస్థా నాన్నీ సమన్వయం చేసుకుంటూ జయశంకర్ నిలిచి కది లారు. రాష్ట్రసాధన ఉద్యమం పిడికిలెత్తుతున్న సందర్భంలో మల్లెపల్లి రాజయ్య వర్ధంతి సభలో జయశంకర్ ప్రసంగాల్ని అక్షరాలుగా పేర్చి మల్లెపల్లి లక్ష్మయ్య అందించిన ‘తెలంగాణలో ఏం జరుగుతుంది’ అన్న పుస్తకం ఉద్యమానికి రూట్ మ్యాప్‌గా నిలిచింది.జయశంకరుణ్ణి తలుచుకుంటుంటే మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్, జాతీయ రహదారులపై వంటా వార్పుల దగ్గర నుంచి దేశచరిత్రలోనే మరువలేని 42 రోజుల సకల జనుల సమ్మె గుర్తుకొస్తాయి. ఢిల్లీ కార్ల యాత్రలు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడ గట్టుకోవటాలు, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావుల ఆందోళనలు, ప్రజాసంఘాల పోరాటాలు, ఊరూరు జేఏసీగా మారడాలు, ఉద్యమ నృత్యం చేసిన ధూంధాంలు తెలంగాణ స్మృతిపథంలో చెదిరి పోని జ్ఞాపకాలుగా నిలిచాయి. రాజకీయ పార్టీలన్నీ కలవవని ప్రచారాలు జరుగు తున్న సమయంలో ‘ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు’ స్వరాష్ట్రం కోసం అందరూ ఒక్కతాటిపైకి వస్తారన్న జయశంకర్ సూత్రీకరణ ఆచ రణ రూపమైంది.క్యాన్సర్‌ను జయిస్తూ ఉద్యమ జీవితపు ఎగుడుదిగుళ్ళను జయశంకర్ చెబుతుంటే రాసుకుంటూ పోయిన వెంకట్ గౌడ్ అందించిన ‘వొడవని ముచ్చట’నే కదా తెలంగాణ ముచ్చట. జయశంకర్ సార్‌ను ఇపుడు ఎవరు ఎట్లయినా విభజించుకుని మాట్లాడుకోవచ్చును. కానీ ఆయన తెలంగాణ ఉమ్మడి సంపద. తెలంగాణ స్వరాష్ట్రాన్ని చూడకుండానే సెలవంటూ వెళ్ళిపోయారు. కానీ ఆయన అందించిన స్ఫూర్తికి గుర్తుగా విశ్వవిద్యాలయానికి పేరుపెట్టుకోవటం తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలేర్పడితే రెండు చోట్ల బడుగులు నాయకత్వ దశకు వస్తారని జయశంకర్ చెప్పారు.అది జరగా లంటే తెలంగాణలో అరవై శాతంగా వున్న బీసీలకు పల్లెనుంచి పార్లమెంటు దాకా చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలి. కులగణన జరిగితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరేందుకు దారి ఏర్పడుతుంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు తోడుగా బీసీ రిజర్వేషన్లు కూడా వస్తేనే రాజకీయ న్యాయం జరుగుతుంది.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యులు -
ఓబీసీల కోసం రాజ్యాంగ సవరణ తప్పదు..
బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇది దేశంలోని బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. బిహార్ నమునాగా ఇతర రాష్ట్రాలు కూడా కులగణన చేసి శాస్త్రీయంగా బీసీల జీవన స్థితిగతుల లెక్కలు తీసుకుని విద్యా–ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంపుదల చేసుకోవచ్చని ఆశగా ఎదురు చూసిన వారు విస్మయానికి గురైనారు. దీంతో రాజ్యాంగ సవరణ చేయకుండా ఓబీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుదల జరుగదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం 69 శాతానికి పెంచిన మొత్తం రిజర్వేషన్ శాతం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం గమనార్హం. శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. పార్టీలకు అతీతంగా సీఎం జయలలిత ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి అప్పటి పీవీ నరసింçహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... తమ శాసన సభ చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా చేశారు. దీంతో తమిళనాడులో అమలు జరుగుతున్న 69 శాతం రిజర్వేషన్లపై ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేసే అవకాశం లేకుండాపోయింది.బిహార్ రాష్ట్రం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ తరహాలో బీసీలకు అధిక రిజర్వేషన్లు అందేలా చూడాలి. బిహార్‌తో పాటుగా అన్ని రాష్ట్రాలూ ఇదే దారిలో ప్రయాణించవలసి ఉంది. ఇది జాతీయ ఉద్యమంగా రూపుదాల్చవలసి ఉన్నది. ఏ రాష్ట్రంలోనైనా బీసీల రిజర్వేషన్లు పెంచాలనే తలంపుతో ఏ విధాన నిర్ణయం తీసుకున్నప్పటికీ 1992లో ‘ఇందిరా సహానీ’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాద’నే తీర్పును అడ్డుపెట్టుకుని ఆధిపత్య వర్గాలు కోర్టులకు వెళ్ళి అడ్డుపడుతున్నాయి. బిహార్‌లో మాదిరిగా మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు మించి ఇచ్చాయని సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే విధిగా రాజ్యాంగసవరణ చేస్తే తప్ప బీసీలకు న్యాయం చేయడానికి వేరే మార్గం లేదని అర్థమవుతుంది.బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 50 శాతానికి మించి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా అంగీకరించిందని బీసీలు ప్రశ్నిస్తున్నారు.ఈ డబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జనాభా గణన చేయలేదు. వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయకుండా అగ్రవర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దేశజనాభాలో అగ్రవర్ణాలు ఎంతమంది? వారిలో పేదరికం ఎంత శాతం? ఈ లెక్కలు లేకుండా 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో కేంద్రమే చెప్పాలి. అయినా సుప్రీంకోర్టు ధర్మాసనం 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 85 శాతం మంది ఉంటే వీరిలో 56 శాతంగా ఉన్న బీసీలలో పేదలు ఎంతమందో ఎవరి దగ్గరా లెక్కలు లేవు. అందుకే ఓబీసీ రిజర్వేషన్లలో ఎలాంటి పరిమితి విధించకుండా అత్యవసరంగా రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్‌ను సవరించాలి. అపుడే బీసీలకు విద్యా– ఉద్యోగ రంగాలలో న్యాయం జరుగుతుంది.పట్నా హైకోర్టు తీర్పు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇపుడు దేశంలోని ఓబీసీలంతా స్పష్టంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచనలతో తమిళనాడులో రామస్వామి పెరియార్ కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తితో ఓబీసీ ఉద్యమం కొనసాగించవలసి ఉంది. నితీష్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున తమిళనాడులాగా ఒక చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చుకుని బిహారు రాష్ట్రం వరకు రిజర్వేషన్ల పెంపును అమలు జరుపుకునే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రత్వం బిహారుకు కలిసివచ్చే విధంగా ఉంది.దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి బడుగులందరి తరఫున నిలిచి కేంద్రంపై బీసీ రిజర్వేషన్లు పెంచడానికై రాజ్యాంగ సవరణ చేయాలని ఒత్తిడి పెంచాలి. ఓబీసీల హక్కుల సాధన కోసం జాతీయోద్యమం రూపుదాల్చే సమయం ఆసన్నమయ్యింది.దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పాటు పడిన బీఆర్ అంబేడ్కర్ తర్వాత అంతగా కృషి చేసినవారు తమిళనాడు సామాజిక, రాజకీయ రంగాల నాయకులనే చెప్పాలి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు విద్యా–ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదల కోసం తమిళనాడులో మహోద్యమాలు జరిగాయి. పెరియార్ రామస్వామి చేసిన కృషి మరువలేనిది. రిజర్వేషన్లను న్యాయస్థానం అడ్డుకోకుండా చేయడంలో పెరియార్ రామస్వామి జరిపిన పోరాటం మరిచిపోలేనిది. అంబేడ్కర్ రిజర్వేషన్ల రక్షణ కోసం చేసిన పోరాటానికి కొనసాగింపుగా తమిళనాడులో పెరియార్, ఉత్తర భారతంలో రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్లు చేసిన ఉద్యమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దేశవ్యాపితంగా ఓబీసీ రిజర్వేషన్ల కోసం జాతీయ ఉద్యమం రూపుదాల్చవలసి ఉంది. నేటి ఓబీసీ యువతరం, విద్యావంతులు ఈ ఉద్యమంలో కీలకంగా పాల్గొనాలి. బడుగు వర్గాల నుంచి వచ్చిన యువతరం బీసీలకు జరిగిన అన్యాయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. బీసీలను ఐకమత్యం చేసే పనిలో పాలుపంచుకోవాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాలలో బీసీలకు న్యాయం జరిగేదాకా ఉద్యమపథంలో ముందుకు సాగక తప్పదు. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం విధిగా చేయాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ -
గ్రామ రాజ్యం బీసీల పరం కావాలి!
తెలంగాణ పల్లెల్లో నేటికినీ కొనసాగుతున్న ఆధిపత్య వర్గాల పెత్తందారీతనాలు నామరూపాలు లేకుండా పోవాలంటే స్థానిక రాజ్యాలు (సంస్థలు) బహుజన వర్గాల చేతుల్లోకి రావాలి. స్థానిక రాజ్యాలైన గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, కో ఆపరేటివ్ సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు, స్కూలు కమిటీలు, గ్రామ అభివృద్ధి కమిటీలలోకి పెద్దసంఖ్యలో చదువుకున్న బహుజన యువకులు రావాలి.అంటే బీసీ యువత పెద్దఎత్తున స్థానిక గ్రామీణ రాజకీయ రంగంలోకి రావాలి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి స్థానిక పాలనలో రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల స్థానాల్లోకి చదువుకున్న దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ తెగలకు చెందిన యువత రావాలి. ఈ పని జరిగినప్పుడే గ్రామాలలో సామాజిక మార్పులు సాధ్యమవుతాయి.తరతరాలుగా బీసీ వర్గాలకు చెందినవాళ్ళు ఎంబీసీలు, సంచార, అర్థసంచార జాతులు, ఉత్పత్తి కులాలకు చెందినవాళ్ళు సంపద సృష్టికర్తలుగా ఉన్నారు. కానీ రాజకీయ రంగంలోకి మాత్రం రాలేదు. సమాజంలో సగానికిపైగా ఉన్న ఉత్పత్తి కులాలకు చెందినవారి భాగస్వామ్యం స్థానిక సంస్థల్లో లేకపోవడం వల్ల ఆ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాల సమస్యల పరిష్కారాలు ఆ యా కులాలవారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నప్పుడే సాధ్యమవుతుంది.తరతరాలుగా విన్నపాలు, విజ్ఞప్తులు పట్టుకుని గ్రామ పంచాయతీలు, మండల, జడ్పీ కార్యాలయాలు, కలెక్టరేట్ల దగ్గర నుంచి సచివాలయాల వరకు చెప్పులరిగేలా తిరిగిన బహుజన కులాలవాళ్ళు తమ సమస్యల పరిష్కారానికి తామే స్థానిక రాజ్యాల నాయకులు కావటం చాలా మార్పులకు దారితీస్తుంది. ఇది బీసీలకు రాజకీయ న్యాయంగా మాత్రమే కాకుండా మొత్తంగా సామాజిక పరివర్తనగా చూడాలి.గ్రామాలు దేశానికి ఊపిరైతే ఆ గ్రామాలకు ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి శక్తులే ప్రాణాలు. బీసీల్లో చదువుకున్న కొత్తతరం తనకున్న పరిశోధనాత్మక ఆలోచనలను గ్రామాభివృద్ధిపై పెడితే ఊహించని అద్భుత ఫలిలాలు వస్తాయి. గ్రామం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తన చుట్టూ ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని సంపద సృష్టించే కేంద్రంగా మారుతుంది. కులవృత్తులు నేడు కునారిల్లుతున్నాయి. అవి అత్యాధునిక రూపం దాల్చితేనే నేటి ప్రపంచానికి అవసరమైన సంపదలను అందించే కేంద్రంగా గ్రామాలను తయారుచేయడం సాధ్యమవుతుంది. ఇదంతా జరగాలంటే స్థానిక సంస్థలపై బహుజనుల అధికారం నెలకొనాలి.జనాభాలో బీసీల సంఖ్యను బట్టి దామాషా ప్రకారం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి. ఆ యా బీసీ కులాలవారు అన్ని రంగాల్లో శిరసెత్తుకుని నిలిచేందుకు తమ అస్తిత్వ ఉద్యమాలను కొనసాగించక తప్పదు. దీన్ని కులకోణంగా తప్పుడు విశ్లేషణలు చేసి బడుగుల చైతన్యాన్ని పక్కదారి పట్టించే పనిని ఆధిపత్య వర్గాలు విస్తృతంగా చేస్తూ ఉన్నాయి. కులగణన చేయాలని అస్తిత్వ కోణం నుంచి అడుగుతుంటే అడ్డుతగులుతూ కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుదన్న వాదనలు తీసుకువస్తున్నారు.బీసీలు సంపూర్ణ రాజకీయ సాధికారత సాధించకుండా సమాజ వికాసం సంపూర్ణం కాదు. ఈ విషయాన్ని మరుగున పరుస్తూ బీసీల అస్తిత్వమే లేకుండా చేసేందుకు ఆధిపత్య వర్గాలు పనిచేయటం కొత్తేమీ కాదు. బడుగులకు విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసే సమయంలో ఆధిపత్య వర్గాలు సృష్టించిన అలజడులు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీలలోని ఆధిపత్యవర్గాలు తెరవెనుకనుంచి చేసిన కుట్రలన్నీ చరిత్రలో పదిలంగా రికార్డయ్యే ఉన్నాయి.ఇపుడు బీసీల కులగణన చేయమంటే సమాజం కులాల పేరున విడిపోయి అల్లకల్లోలం అవుతుందన్న వాదనలు ఆధిపత్య వర్గాలు ముందుకు తెస్తున్నాయి. తెలంగాణ ప్రజలు స్వీయరాజకీయ అస్తిత్వం కోణం నుంచి 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం నిర్వహించి రాష్ట్ర సాధనలో విజయం సాధించి ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలలో నిలిచారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఇపుడు బహుజన స్వీయరాజకీయ అస్తిత్వాన్ని సాధించుకోవాలి. ఇది సాధించినప్పుడే స్వరాష్ట్రం సాధించుకున్న లక్ష్యం పరిపూర్ణమవుతుంది.ఈ దిశలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు తమ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ విడుదల చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని వాగ్దానం చేసింది. జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా బడుగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.రాహుల్ గాంధీ, కులగణన చేస్తామని దేశమంతా చెబుతున్నారు. కులగణన చేసి స్థానిక సంస్థల్లో ‘మేమెంతో మా వాటా అంత రిజర్వేషన్లు ఇవ్వాల’నీ, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీలు బెర్రగీసి అడుగుతున్నారు. ఈ విషయంలో బీసీలపై కాంగ్రెస్‌కు ఉన్నది అసలు ప్రేమా లేక ఓట్ల కోసం చేసిన వాగ్దానమా బట్టబయలు కావల్సి ఉంది. ఏం జరుగబోతుందోనని 2 కోట్ల మంది బీసీలు ఎదురు చూస్తున్నారు.– అభిప్రాయం: జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త కవి, రచయిత -
మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి
భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ఒక మంచి ఉదాహరణగా భాసిల్లుతోంది. అనేక మతాలూ, కులాలూ ఉన్నా... అందరం భారతీ యులమే అన్న భావనతో ప్రజలు సహజీవనం చేస్తు న్నారు. అటువంటి దేశంలో మతతత్త్వ వాదులు... మైనారిటీలపై విద్వేషాన్ని ప్రచారం చేస్తూ హిందూ త్వాన్ని రెచ్చగొడుతున్నారు. అదే సమయంలో వివిధ భాషలు మాట్లాడే జనాలపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రెండూ దేశ లౌకిక తత్త్వాన్ని దెబ్బతీసేవే. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కేవే! హిందూ ముస్లింల ఐక్యత సుదీర్ఘమైనది. 1857 తిరుగుబాటులో హిందూ ముస్లింలు కలిసి పోరాడారు. దేశ ప్రజల్ని బ్రిటిష్‌వారి నుంచి వేరుచేసి చూపటానికి ఉత్తర భారతదేశ పత్రికలు ‘హిందుస్తానీలు’ అన్న పదం వాడాయని ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర తన రచనల్లో తెలిపారు. కానీ దానినే తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు ఈ దేశం హిందువులది మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశ సమగ్రత, లౌకిక వాదాలకు గొడ్డలిపెట్టు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలను ఆశించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహింసా సిద్ధాంత ఆయుధంతో దేశాన్ని ఒక్క తాటిపై నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ... గాడ్సే చేతిలో బలవ్వడానికి మతోన్మాదమే కారణం. ఆ తర్వాత బాబ్రీ మసీదు ధ్వంసం, గుజరాత్‌తో సహా దేశంలో అనేక ప్రాంతాల్లో విద్వేష పూరిత అల్లర్లు వంటివన్నిటికీ ఈ ఉన్మాదమే కారణమయింది. దీంతో మన లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర భావనే ప్రమాదంలో పడింది. దీనికితోడు ‘ఒకే దేశం, ఒకే భాష’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదేమి టని ప్రశ్నించిన రాష్ట్రాలపైనా, రాష్ట్ర పాలకులపైనా ఆధిపత్యం చెలాయించటమే గాకుండా... ఆ ప్రభు త్వాలను కూల్చివేసే చర్యలు మొదలుపెట్టారు. సమాజంలో కొన్ని వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మాట నిజం. నేటికీ కొన్ని వర్గాలు ఇంకా ప్రభుత్వ నిర్లక్ష్య నీడల్లోంచి బైటపడక దుర్భర స్థితిలో ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, మైనారి టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కోట్లాది మంది సంచార జాతుల వాళ్లు స్థిరనివాసం లేక చెట్ల వెంట, పుట్టల వెంట, గుట్టల వెంట, జనావా సాలకు దూరంలో తమ జీవనాన్ని కొనసాగిస్తు న్నారు. వీరి ఈ స్థితి ఆధునిక భారతదేశానికి అవమానకరం. ఇటువంటి కోట్లాదిమంది అభివృద్ధి గురించి ప్రణాళికలు వేయవలసిన వారు మత తత్త్వంతో దేశాన్ని ఛిన్నాభిన్నం చేయచూడటం ఎంతవరకు సమంజసం? మతతత్త్వం ఎంత ప్రమాదకరమో మన ఇటీవలి చరిత్రే చెబుతోంది. జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్‌వారు అను సరించిన ‘విభజించి పాలించు’ విధానం మతాల వారీగా భారత సమాజాన్ని చీల్చింది. హిందూ మహాసభ, ముస్లింలీగ్ వంటి రాజకీయ సమూ హాలు ఈ క్రమంలో తలెత్తినవే. ఆ తర్వాత దేశంలో జరిగిన మత ఘర్షణలకు ఆయా మతతత్త్వ సమూ హాలు కారణమయ్యాయి. 1922–27 మధ్య కాలంలో 112 మత ఘర్షణలు జరిగాయని ‘సైమన్ కమిషన్’ తన నివేదికలో పేర్కొందంటే అప్పటి పరిస్థితి అర్థమవుతుంది. ఇక 1947 దేశ విభజన సమయంలో జరిగిన దారుణ మారణకాండ గురించి చెప్పనవసరమే లేదు. అప్పుడప్పుడూ మత సహనానికి ఇటువంటి దాడుల రూపంలో హాని జరిగినప్పటికీ దేశంలో జాతీయోద్యమ కాలంలోనే కాక... అంతకు ముందూ మతసామరస్యం వెల్లివిరిసిన మాట వాస్తవ దూరం కాదు. అప్పటి ఆ పునాదులే ఇప్ప టికీ ప్రజలను తప్పుదోవ పట్టకుండా కాపాడు తున్నాయి. భాష సంగతి కొస్తే... ‘ఒకే దేశం... ఒకే భాష’ అన్న నినాదంతో దేశ ‘విభిన్నత్వం’పై ఇవ్వాళ దాడి జరుగుతోంది. దేశంలోని అంతర్గత అస్తిత్వాలు, భిన్న సంస్కృతుల మేళవింపులు ఛిద్రం అవుతాయి. ఈ మట్టి పెట్టిన పట్టెడన్నం తిని బతుకుతున్న వాళ్లం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఇంత గొప్ప సంస్కృతి వర్ధిల్లే ఈ నేలపై ‘ఒక మతంగా మన మంతా ఏకం కాకపోతే మనకు మనుగడ లేదని’ చేసే వాదనలు విషతుల్య వాదనలుగా గుర్తించాలి. రామ్ రహీమ్‌ల దోస్తానా వర్ధిల్లాలి. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ఛైర్మన్,తెలంగాణ సాహిత్య అకాడమీ -
జూన్ 2 నుంచి జనవరి 26 దాకా
సందర్భం తెలంగాణ రాష్ట్రం అవతరించటం వల్లనే పాలన ప్రజల వాకిళ్ల దగ్గరకు వచ్చింది. పోరాట పుష్పాలు వికసించేది శాంతి పుప్పొడులను వెదజల్లడానికేనన్న తత్త్వశాస్త్ర దర్శినిగా తెలంగాణ నిలిచింది. 2009 డిసెంబర్ 9న కేంద్రం ప్రకటన నుంచి, మాట మీద నిలబడ్డ మనుషుల నుంచి పార్లమెంటులో పెప్పర్ స్ప్రేల ను దాటు కుంటూ 2014 జూ న్ 2న తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా దేశపటం మీద నిలి చింది. తెలంగాణ కలల స్వప్నం జూన్ 2వ తేదీ అ య్యింది. ఇప్పుడు తెలంగాణ ప్రపంచ అస్తిత్వ ఉద్యమ శాస్త్రంగా నిలిచింది. గెలిచిన గెలుపులతో అజేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ అభివృద్ధి మంత్రంగా మారి ఈ నేల సస్యశ్యామలం కావాలి. పోరాట పుష్పా లు వికసించేది శాంతి పుప్పొడులను వెదజల్లడానికేనన్న తత్త్వశాస్త్ర దర్శినిగా తెలంగాణ నిలిచింది. ఆ పనికి తొలి తెలంగాణ రిపబ్లిక్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిన బూననుంది. ఏడెనిమిది నెలల తెలంగాణ ప్రభుత్వం ఎన్నెన్నో సాహసాలకు శ్రీకారం చుట్టింది. ఎన్నెన్నో కొత్త ఆలోచనలకు ద్వారాలు తెరిచింది. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోయేందుకు కావాల్సిన కసరత్తును కేసీఆర్ కొనసాగిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం పల్లె లు పచ్చగా ఉండేందుకు కావాల్సిన కార్యరంగాన్ని సన్నద్ధం చేసుకుంటోంది. హైదరాబాద్‌ను విశ్వనగ రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికల రూపకల్పన జరుగు తోంది. భారత సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్రం చూసినవాళ్లు పెద్దలు సైతం ఈ రిపబ్లిక్‌డే నుంచి తెలం గాణ ఏవైపుకు అడుగులు వేయబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ సమాజం పునర్నిర్మాణం కోసం తపన చెందుతోంది. రాజకీయ ప్రక్రియ ద్వారా గెలుచుకొచ్చి ఆ పీఠం మీద జయుడుగా నిలిచిన కేసీఆర్ పునర్నిర్మాణ రచనలు చేస్తూ ఆచరణాత్మక రూపం దాల్చేందుకు తపన చెందుతున్నారు. ఇప్పుడు అందరిముందు ఉన్న లక్ష్యం తెలంగాణ పునర్నిర్మాణమే. ఈ రిపబ్లిక్‌డే నుంచి కొత్తగా తెలంగాణలో ఏం జరుగుతుందనే ప్రశ్నలు వేస్తున్న సందర్భం కూడా లేకపోలేదు. వరంగల్లులో ముఖ్యమంత్రి స్వయంగా నాలుగు రోజులుండి ఇరుకు సందుల వాడల్లో గడపగడప తిరిగి వారి సమస్యలను విని పరిష్కారాల కోసం అక్కడికక్కడే ఆకస్మిక ప్రణా ళికలు తయారు చేశారు. మహబూబ్‌నగర్‌లో చిన్నచిన్న గల్లీల్లో ప్రజల జీవన విధానం చూసిన ముఖ్యమంత్రి చలించిపోయి వారి స్థితి మెరుగుపడాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాకతీయుల కాలం నాటి చెరువులు, పునరుద్ధరణకు నోచుకోని చెరువులు జలాలతో, కాలు వలతో కళకళలాడబోతున్నాయి. వాటర్‌గ్రిడ్ పథకం ద్వా రా ప్రజల దోసిళ్లలోకి మంచినీళ్లు రాబోతున్నాయి. తెలం గాణ ప్రభుత్వం పేద పిల్లల కంచాలలోకి సన్నబియ్యం పెట్టి అమ్మ ప్రేమను పంచిపెడుతుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించటం వల్లనే పాలన ప్రజల వాకిళ్ల దగ్గర కు వచ్చింది. కేసీఆర్ ఆలోచనలను కిందిస్థాయికి తీసుకు పోయేందుకు పాలనారంగం సర్వసన్నద్ధం కావాల్సి ఉంది. పునర్నిర్మాణానికి సైతం చెమటలు చిందించేం దుకు నవతరం సిద్ధంగా ఉంది. కానీ పాలనారంగంలో పేరుకుపోయిన అవినీతికి చరమగీతం పాడేందుకు కూడా కేసీఆర్ ప్రక్షాళనా చర్యలు మొదలు పెట్టారు. భారత రాజ్యాంగాన్ని సృష్టించుకొని ‘దేశం’ సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ తన ఎదుగు దలకు అభివృద్ధి రచనను చేసుకొని శక్తివంతంగా ఎదగ వలసి ఉంది. తెలం గాణ రావడానికి ఇంతకాలం పట్టింది. అభివృద్ధి జరగడానికి మరికొంతకాలం పడుతుంది. అవినీతిని అంతం చేసేం దుకు పాలనారంగంలో ప్రక్షాళనా కార్యక్రమానికి కేసీఆర్ స్వీకారం చుట్టారు. అదే బంగారు తెలంగాణకు తొలిమెట్టవుతుంది. జూలూరు గౌరీశంకర్ కవి, సీనియర్ జర్నలిస్టు. -
పిల్లల కంచాల్లోకి సన్నబియ్యం
సందర్భం సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నేలంతా పులకరిస్తోంది. ఈగలు ముసిరే కలుషిత వాతావరణంలో ఉండే సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం అన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లనే కదా సాధ్యం అవుతోంది. ముక్కిపోయిన బియ్యం, పురుగులన్నంకు నిర్వచనమైన సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేసే పనికి శ్రీకారం చుట్టింది. పేద పిల్లల ఆకలి తీర్చే సంక్షేమ హాస్టల్ కంచం లో సన్నబియ్యం బువ్వతో తెల్లగా మెరిసిపోతుంది. ఉద్య మకారుడు కేసీఆర్ పాలకుడైనందునే తెలంగాణ ప్రభుత్వం తల్లి కడుపులోని బిడ్డకు పౌష్టికాహారం అం దించే పనికి సిద్ధమైంది. మధ్యాహ్న భోజన పథకం అమ్మ చేతి వంటగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. తెలంగాణ పునర్నిర్మాణానికి ఇది తొలి మెట్టుగా భావించాలి. కాలం కళ్ల ముందు కర్పూరంలా కరిగిపో తుంటే కళ్లలో వొత్తులేసుకుని మార్పుల కోసం తెలంగాణ ఎదు రుచూసింది. ఎదురుచూసిన చూపులకు విజయాలు కనిపిస్తే అంతకంటే కావాల్సిందే ముంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మారాలని, ఆ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు వసతులను పెంచాలని విద్యార్థి సంఘాల న్నీ ముక్తకంఠంతో నినదిస్తూనే వస్తున్నాయి. కొన్ని వందల వేల విజ్ఞప్తులు, ధర్నాలు, పికెటింగ్‌లు, ప్రదర్శన లు, బంద్‌లు అనివార్యంగా జరుగుతూనే ఉన్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగు పడాల ని సుదీర్ఘకాలం విడువని పోరాటంగా ఎందరెందరో కృష్ణయ్యలు పోరాడుతూనే ఉన్నారు. కొన్ని సమస్యలను సాధించుకోవటం కూడా జరిగింది. పాలకులు సంక్షేమ హాస్టల్స్ అంటే సవతి పిల్లలుగానే చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే భౌగోళిక హద్దులు ఏర్పడ తాయి తప్పితే, మార్పులు ఏం జరుగుతాయని ఉద్యమకాలంలో, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుందని, ఏం లాభం జరుగుతుందని ప్రశ్నించిన వారికి సమాధానంగా అనేక మార్పులు జరుగుతు న్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నేలంతా పులకరిస్తోంది. పురుగు లన్నం, చారు, వసతులు సరిగాలేని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుని ఎదిగివచ్చిన వ్యక్తి చేతికి ఆర్థిక శాఖ పగ్గాలనివ్వటమే గాకుండా, సన్నబియ్యంతో అన్నం వండిపెట్టే పనిని ఈటెల రాజేందర్‌కు ఇవ్వటం తో కేసీఆర్ నూతన చరిత్రకు ద్వారాలు తెరిచినట్ల యింది. ఈగలు ముసిరే కలుషిత వాతావరణంలో సమాజంలో విసిరేసినట్లుగా మిగిలిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం అన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లనే కదా సాధ్యం అవుతుంది. లేకుంటే అంత తొందరగా పేద హాస్టల్ పిల్లల కంచాల లోకి సన్నబియ్యం వచ్చేనా అని ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సి ఉంది. ముక్కిపోయిన బియ్యం, ముతక బియ్యం, రేషన్ బియ్యం హాస్టల్స్‌కు పంపి చేతులు దులుపేసుకునే దుస్థితికి చరమగీతం పాడటం జరిగింది. కేసీఆర్ ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ ఎన్నికల ప్రణాళికల నుంచి ఆచరణ ప్రణాళికలుగా మారటం తెలంగాణకు శుభపరిణామంగా మారుతు న్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అమ్మ ఒడిగా మారినప్పుడే ప్రభుత్వాలు విజయం సాధించినట్లుగా చెప్పాలి. ఈ దేశానికి మానవ వనరులను అందించే భావి భారతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చా రు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను నరక కూపాలుగా మార్చివేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం లో తొలిగా బాగు చేసుకోవాల్సింది ప్రభుత్వ బడిని అన్న విషయం తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. పేద వర్గాల పిల్లలకు ప్రమాణాలు గల విద్యను అందించేం దుకు మా ప్రభుత్వం నడుం కట్టిందని చెప్పడానికి తొలిమెట్టుగా హాస్టళ్ల ప్రక్షాళనా కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే పేద పిల్లల కంచాలలోకి సన్న బియ్యం అందించే పని ఎంతో ఉన్నతమైనది. మధ్యా హ్న భోజన పథకం విజయవంతం కావాలంటే అమ్మ పెట్టే అన్నం ముద్దగా పిల్లలకు కడుపునిండా శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి. ఈ పిల్లలకు పెట్టే ప్రతిపైసా ఖర్చు రాష్ట్ర పునర్నిర్మాణానికి, ఈ దేశ భవిష్యత్‌కు వెలకట్టలేని పెట్టుబడిగా మారుతుంది. పీ.వీ.నర్సింహారావు విద్యాశాఖా మంత్రిగా ఉన్న ప్పుడు ఏర్పరచిన సర్వేల్ లాంటి గురుకుల పాఠశాలలే ఆ తర్వాత దేశం మొత్తానికి నవోదయ స్కూల్స్‌గా రూపుదాల్చాయి. ఇప్పుడు కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన మండలానికి ఒక గురుకుల పాఠశాల అన్నది సఫలీకృతమైతే దేశానికి ఈ విధానం ఆదర్శవంతంగా నిలుస్తుంది. గురుకుల విద్యావ్యవస్థ విజయవంతంగా నిలబ డేందుకు తీసుకున్న తొలి నిర్ణయంగా హాస్టళ్లకు సన్న బియ్యం అమలు కార్యక్రమంగా చూడవచ్చును. సాంఘి క సంక్షేమ హాస్టళ్లను మరింత విస్తృతపర్చాల్సి ఉంది. పేద పిల్లలకు అన్ని వసతులు అందించే విధంగా మొత్తం పాలనా యంత్రాంగం పని చేయాలి. పేద పిల్లలకు నాసిరకమైన తిండిపెడితే, వారికి వచ్చే నిధుల ను మింగే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి. పేద వర్గాల పిల్లలకు మంచి వసతులు, వారికి మేలైన విద్యనందిస్తే అది దేశానికి తిరుగులేని బలం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం చలికి వణుకుతున్న విద్యార్థికి కప్పుకునే దుప్పటి కావాలి. కంచంలో మెరిసే తెల్లటి అన్నంగా ప్రభుత్వం కనిపించాలి. హాస్టళ్లల్లో పేరుకుపోయిన అపరిశుభ్రతను తుడిచివేసే చేతులుగా ప్రభుత్వం మారాలి. నెత్తికి నూనెలేని చింపిరి జుట్లకు చల్లదనాన్నిచ్చే కొబ్బరినూనెగా మారాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నుంచి వచ్చిన పిల్లలే నవలోకాలు వికసింపజేస్తారు. కొత్త శకానికి ఈ సంక్షేమ హాస్టళ్లే ప్రాణం పోయాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను శక్తివంతం చే స్తే అక్కడి నుంచి వచ్చిన పిల్లలు దేశాన్ని అన్నిరంగాల్లో సర్వసమర్థంగా తీర్చిదిద్దుతారు. పిల్లలకు సన్నబియ్యం అందించే ఈ పథకాన్ని విజయవంతం చేసే పనిలో మొత్తం పాలనా యంత్రాంగం సఫలీకృతం కావాలి. పేద పిల్లల నోటికాడ కూడును కూడా సొమ్ము చేసుకునే అవినీతిపరులను జైలుకు పంపుతామని ప్రభుత్వం ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. (వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు మొబైల్ : 90599 67525) -
మన తెలుగు వాచకం
తెలంగాణ మట్టిభాష పాఠ్య ప్రణాళికలలో పాఠ్యాంశంగా మారబోతుంది. అమ్మభాషతో తెలంగాణ తెలుగువాచకాలు తయారవుతున్నాయి. తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సంస్కతీ సంప్రదాయాలు, విశిష్టమూర్తుల విశేషాలను సిలబస్‌లో చేర్చే బృహత్తర పని మొదలైంది. ప్రజల ఆకాంక్షలను ప్రజా ఉద్యమంగా మలచటంలో, ఆ లక్ష్యం నెరవేరే వరకు తుదికంటా క్రియాశీల క పాత్ర పోషించి తెలంగాణ సాహిత్య, సాంస్కృతికరంగం నిలిచి గెలిచింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తన పలుకుబళ్లతో తన భాషలో, తనయాసలో స్వేచ్ఛగా పాఠ్యప్రణాళికలను రచించుకుంటుంది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని అపూ ర్వంగా ఆవిష్కరించుకునే అరుదైన సందర్భమిది. తన మట్టిభాష పాఠ్య ప్రణాళికలలో పాఠ్యాంశంగా మారబోతుంది. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలలో తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ లోటును పూడ్చటానికి కొత్త పాఠ్యపుస్తకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1 నుండి 10వ తరగతి వరకు అన్ని పుస్తకాల సిలబస్‌లు కొత్తగా రచిస్తున్నారు. తెలంగాణ అమ్మభాషతో తెలంగాణ తెలుగు వాచకాలు తయారవుతున్నాయి. మన విస్మృత సాహిత్యం విశ్వవేదికపై ఆవిష్కరించబోతున్న సందర్భమిది. తెలంగాణ లోని చారిత్రక ప్రదేశాలన్నీ ప్రపంచానికి తెలియ చేసేందుకు సిలబస్‌లో చేర్చే బృహత్తర పని మొద లైంది. మన సంస్కృతి, మన పండుగలు, మన ఆటలు, వినోదాలు, మన భాష, మన నుడికారం, మన భావజాలం, మన ఉద్యమం, మన పోరాట వారసత్వం, తెలుగు సాహిత్య చరిత్ర పేజీల్లోకి ఎక్కించే పనికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగా ణలో ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. పాన గల్లు పచ్చల సోమేశ్వరాలయం, ఆలంపూర్లో ప్రఖ్యాత ఆలయం, పిల్లలమర్రి శివాలయం, బాసర సరస్వతి దేవాలయం, రామప్ప దేవాల యం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వేయిస్తంభాల గుడి, సమ్మక్క సారలమ్మ జాతర, భద్రాచలం రామాలయం లాంటి ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలు సిలబస్‌లోకి చేర్చేపని ముమ్మరంగా జరుగుతుంది. బతుకమ్మ పండుగ, దసరా, పీర్ల పండుగలు, మన ఏడుపాయల జాతరలు, జానపాడు సైదులు, దురాజ్‌పల్లి జాతరలు ప్రత్యేకంగా పిల్లలకు బోధనాంశాలవుతున్నాయి. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళారంగాల్లో ప్రతిభావంతులైన మన తెలంగాణ మహనీయుల చరిత్ర పిల్లలకు బోధించే విధంగా సిలబస్ తీర్చిదిద్దబడుతుంది. 1 నుంచి 10 తరగతుల పిల్లలకు ఆయా తరగతుల స్థాయిని బట్టి పాఠాలు చెబుతారు. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అవతరించాక తెలుగు భాషలో పాఠ్యాం శాలను ప్రవేశపెట్టటమే పెద్దమార్పుగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకుం టుంది. తెలంగాణ పద్య సాహిత్యంలో మన పాల్కురికి, మన పోతన, కొరవి గోపరాజు, కందుకూరి రుద్రకవి, మల్లినాధసూరి, సురవరం ప్రతాపరెడ్డి, బి.ఎన్.శాస్త్రి, కపిలవాయి లింగ మూర్తి, హీరాలాల్ మోరియా, జమలాపురం కేశవరావు, చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ లాంటి ఎందరెందరో తెలంగాణ సాహిత్య మణిరత్నాల చరిత్ర పిల్లలకు పాఠాలుగా ముందుకు రాబోతు న్నాయి. కాకతీయుల కాలం నాటి సమ్మక్క, సారలమ్మల చరిత్రతోపాటుగా ఆ కాలం నాటి తెలంగాణకు ప్రాణాధారమైన జీవధార గొలుసు కట్టు చెరువులు సిలబస్‌లోకి ఎక్కుతున్నాయి. స్థానికత నేపథ్యంలో బాలసాహిత్యం ప్రవేశపెట్టే పని మొదలైంది. తెలంగాణకు పోరువారసత్వం ఎంతో బలమై నది. ప్రపంచపటంలో తెలంగాణకున్న గుర్తింపు పోరాట వారసత్వమేనన్నది మరువ రాదు. చాకలి ఐలమ్మ బువ్వగింజల పోరాటం, దొడ్డి కొమరయ్య భూమికోసం పోరాటం, బండి యాదగిరి ఉద్యమపాట, సుద్దాల హన్మంతు రాసిన పల్లెటూరి పిల్లగాడా అన్న పాట అంతర్జా తీయ మానవతాగీతం, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, నల్లా నర్సింహులు, ఉప్పల మలుసూరు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, 4,000 మంది నేలకొరిగిన పోరువీరుల చరిత్రను భావితరాలకు తెలియ జేయటం విధిగా జరగాలి. వేరు తెలంగాణ పోరుకు ఊపిరిలూదిన 1969 ఉద్యమకారుల చరిత్ర దగ్గర నుంచి నేటి ఉద్యమ సాఫల్యం వరకు కీలక ఘటనలను పాఠాలుగా బోధించాలి. కాళోజీ, ప్రొ॥జయశంకర్ లాంటి వాళ్ల చరిత్రను ప్రవేశపెట్టాలి. నిజాం కాలం నాటి అనుకూల, ప్రతికూల పరిస్థితులను నిష్కర్షగా ఉన్నది ఉన్నట్లుగా పాఠ్యాంశాలలో చేర్చగలగాలి. నిజాం కాలం నాటి సంస్కరణలు, మంచి పనులు చెప్పటాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. కానీ ఆనాటి మట్టి మనుషులు చేసిన మహత్తర పోరాటాన్ని కూడా చెప్పాలి. నిజాం కాలంలో ఆనాటి ప్రజలు ఏ రకం గా అణిగిపోయారన్న చరిత్రను కూడా కళ్లకు కట్టిన ట్లు చెప్పాలి. త్రివేణి సంగమమైన మట్టిపల్లి లక్ష్మీనర్సింహ స్వామి, కృష్ణా, గోదావరి, మూసీ నదులు శాత వాహనుల కోటిలింగాల చరిత్ర, బొమ్మలమ్మగుట్ట, సంగారెడ్డి దగ్గరున్న అనంత పద్మనాభస్వామి, మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరలాంటి తెలంగాణ తరతరాల వారసత్వ సంపదను కొత్తతరాలకు అందించాలి. ప్రధానంగా తెలుగు వాచకంలో మన తెలంగాణ భాషను ఎలా వ్యక్తీకరిస్తామో చెప్పగలగాలి. ప్రాచీన తెలంగాణ సాహిత్యం దగ్గర నుంచి ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన జాతీయ సాహసబాలల చరిత్ర వరకూ సిలబస్‌లోకి ఎక్కాలి. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకవచ్చి సామాజిక విప్లవాలకు సాక్ష్యాలుగా నిలిచిన శ్రీశ్రీ, పోతులూరి వీరబ్రహ్మం, వేమన, జాషువా, కందుకూరి కృష్ణశాస్త్రి, ఆరుద్ర లాంటి కవులు, రచయితల సాహిత్యాన్ని తెలంగాణ నేల ఎప్పటికీ మరిచిపోలేదు. భిన్నభావాల, భిన్న అస్తిత్వాల, భిన్న పోరాటాల, విభిన్న చైతన్యాలకు నిలయమైన తెలంగాణ తనను తాను రాసుకుంటూ కొత్త చరిత్రకు ద్వారాలు తెరువ బోతుంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) -
మునగాల ముమ్మాటికీ మాదే: జూలూరు
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని భద్రచలం మండలాన్ని తూర్పుగోదావరిలో, మునగాల మండలాన్ని కృష్ణా జిల్లాలో కలపాలన్న వాదనలను ముందుకు తేవడం నీటిదొంగల కుట్రలో భాగమేనని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ఆరోపించారు. అర్థంలేదని వాదనలు ముందుకు తేవడం సంస్కారహీనమని విమర్శించారు. కృష్ణా జిల్లాలోని పరిటాల, బందరు ప్రాంతాలు తెలంగాణవేనని తాము కూడా వాదన తేవచ్చని తెలిపారు. బందరు వస్తే తెలంగాణకు సముద్రం వస్తుందని అయితే ఆ వాదనలు అర్థరహితమైనవని నేడొక ప్రకటనలో వ్యాఖ్యానించారు. నీళ్లు కావాలంటే అబద్దాలతో పనిలేదని, కేంద్ర జలసంఘం అన్నిప్రాంతాలకు నీటి పంపకాలు చేస్తుందని పేర్కొన్నారు. మునగాల తెలంగాణ ముఖద్వారమని, మట్టివారసత్వం ఉన్న పోరుగడ్డ అని కితాబిచ్చారు. రెచ్చగొట్టద్దు: మురళీధర్‌రావు విభజన రేఖలు గీస్తున్న సమయంలో సరిహద్దుల కొట్లాటలతో ఇరుప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టవద్దని టీఆర్ఎల్డీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బి.మురళీధరరావు సూచించారు. హైదరాబాద్ సహా పదిజిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని కోరారు. నగరాన్ని ఉమ్మడి రాజధాని చేయాలనడం అక్రమాస్తులు కాపాడుకునేందుకని మండిపడ్డారు. 60 ఏళ్ల పైచీలుకు తెలంగాణ పోరాటాన్ని అపహాస్యం చేసేలా కేంద్రం నిర ్ణయాలు తీసుకోవద్దని విజ ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీళ్లకోసం చరిత్రను తలకిందులు చేసి అభాసుపాలుకావద్దని కోరారు.