భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ఒక మంచి ఉదాహరణగా భాసిల్లుతోంది. అనేక మతాలూ, కులాలూ ఉన్నా... అందరం భారతీ యులమే అన్న భావనతో ప్రజలు సహజీవనం చేస్తు న్నారు. అటువంటి దేశంలో మతతత్త్వ వాదులు... మైనారిటీలపై విద్వేషాన్ని ప్రచారం చేస్తూ హిందూ త్వాన్ని రెచ్చగొడుతున్నారు. అదే సమయంలో వివిధ భాషలు మాట్లాడే జనాలపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రెండూ దేశ లౌకిక తత్త్వాన్ని దెబ్బతీసేవే. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కేవే!
హిందూ ముస్లింల ఐక్యత సుదీర్ఘమైనది. 1857 తిరుగుబాటులో హిందూ ముస్లింలు కలిసి పోరాడారు. దేశ ప్రజల్ని బ్రిటిష్‌వారి నుంచి వేరుచేసి చూపటానికి ఉత్తర భారతదేశ పత్రికలు ‘హిందుస్తానీలు’ అన్న పదం వాడాయని ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర తన రచనల్లో తెలిపారు. కానీ దానినే తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు ఈ దేశం హిందువులది మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశ సమగ్రత, లౌకిక వాదాలకు గొడ్డలిపెట్టు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలను ఆశించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అహింసా సిద్ధాంత ఆయుధంతో దేశాన్ని ఒక్క తాటిపై నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ... గాడ్సే చేతిలో బలవ్వడానికి మతోన్మాదమే కారణం. ఆ తర్వాత బాబ్రీ మసీదు ధ్వంసం, గుజరాత్‌తో సహా దేశంలో అనేక ప్రాంతాల్లో విద్వేష పూరిత అల్లర్లు వంటివన్నిటికీ ఈ ఉన్మాదమే కారణమయింది. దీంతో మన లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర భావనే ప్రమాదంలో పడింది. దీనికితోడు ‘ఒకే దేశం, ఒకే భాష’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదేమి టని ప్రశ్నించిన రాష్ట్రాలపైనా, రాష్ట్ర పాలకులపైనా ఆధిపత్యం చెలాయించటమే గాకుండా... ఆ ప్రభు త్వాలను కూల్చివేసే చర్యలు మొదలుపెట్టారు.
సమాజంలో కొన్ని వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మాట నిజం. నేటికీ కొన్ని వర్గాలు ఇంకా ప్రభుత్వ నిర్లక్ష్య నీడల్లోంచి బైటపడక దుర్భర స్థితిలో ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, మైనారి టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కోట్లాది మంది సంచార జాతుల వాళ్లు స్థిరనివాసం లేక చెట్ల వెంట, పుట్టల వెంట, గుట్టల వెంట, జనావా సాలకు దూరంలో తమ జీవనాన్ని కొనసాగిస్తు న్నారు. వీరి ఈ స్థితి ఆధునిక భారతదేశానికి అవమానకరం. ఇటువంటి కోట్లాదిమంది అభివృద్ధి గురించి ప్రణాళికలు వేయవలసిన వారు మత తత్త్వంతో దేశాన్ని ఛిన్నాభిన్నం చేయచూడటం ఎంతవరకు సమంజసం? మతతత్త్వం ఎంత ప్రమాదకరమో మన ఇటీవలి చరిత్రే చెబుతోంది.
జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్‌వారు అను సరించిన ‘విభజించి పాలించు’ విధానం మతాల వారీగా భారత సమాజాన్ని చీల్చింది. హిందూ మహాసభ, ముస్లింలీగ్ వంటి రాజకీయ సమూ హాలు ఈ క్రమంలో తలెత్తినవే. ఆ తర్వాత దేశంలో జరిగిన మత ఘర్షణలకు ఆయా మతతత్త్వ సమూ హాలు కారణమయ్యాయి. 1922–27 మధ్య కాలంలో 112 మత ఘర్షణలు జరిగాయని ‘సైమన్ కమిషన్’ తన నివేదికలో పేర్కొందంటే అప్పటి పరిస్థితి అర్థమవుతుంది. ఇక 1947 దేశ విభజన సమయంలో జరిగిన దారుణ మారణకాండ గురించి చెప్పనవసరమే లేదు.
అప్పుడప్పుడూ మత సహనానికి ఇటువంటి దాడుల రూపంలో హాని జరిగినప్పటికీ దేశంలో జాతీయోద్యమ కాలంలోనే కాక... అంతకు ముందూ మతసామరస్యం వెల్లివిరిసిన మాట వాస్తవ దూరం కాదు. అప్పటి ఆ పునాదులే ఇప్ప టికీ ప్రజలను తప్పుదోవ పట్టకుండా కాపాడు తున్నాయి. భాష సంగతి కొస్తే... ‘ఒకే దేశం... ఒకే భాష’ అన్న నినాదంతో దేశ ‘విభిన్నత్వం’పై ఇవ్వాళ దాడి జరుగుతోంది.
దేశంలోని అంతర్గత అస్తిత్వాలు, భిన్న సంస్కృతుల మేళవింపులు ఛిద్రం అవుతాయి. ఈ మట్టి పెట్టిన పట్టెడన్నం తిని బతుకుతున్న వాళ్లం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఇంత గొప్ప సంస్కృతి వర్ధిల్లే ఈ నేలపై ‘ఒక మతంగా మన మంతా ఏకం కాకపోతే మనకు మనుగడ లేదని’ చేసే వాదనలు విషతుల్య వాదనలుగా గుర్తించాలి. రామ్ రహీమ్‌ల దోస్తానా వర్ధిల్లాలి.
జూలూరు గౌరీశంకర్
వ్యాసకర్త ఛైర్మన్,తెలంగాణ సాహిత్య అకాడమీ
మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి
Published Sun, Oct 30 2022 12:37 AM | Last Updated on Sun, Oct 30 2022 12:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment