harmony
-
Bharat Jodo Nyay Yatra: అన్యాయాన్ని ప్రశ్నించేందుకే...
థౌబాల్/ఇంఫాల్: జాతుల ఘర్షణలతో అట్టుడికిపోతున్న కల్లోల మణిపూర్ రాష్ట్రానికి శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని థౌబాల్ నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖోంగ్జామ్ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో రాష్ట్రంలో లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కన్నీళ్లు తుడిచేందుకు, చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ దృష్టిలో మణిపూర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చని ఆక్షేపించారు. ‘‘మీ బాధను వారి బాధగా భావించడం లేదు. కానీ మీ దుఃఖాన్ని, మీకు తగిలిన గాయాలు, మీరెదుర్కొంటున్న విచారాన్ని మేం అర్థం చేసుకున్నాం’’ అని చెప్పారు. బాధితులు ఆప్యాయతను కోరుకుంటున్నారని రాహుల్ అన్నారు. ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం దేశంలో అన్యాయ కాలం కొనసాగుతున్నందు వల్లే న్యాయ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఏకం చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామరస్యంతో కూడిన ‘న్యూ విజన్ ఆఫ్ ఇండియా’ను సాధించడం ధ్యేయమని స్పష్టం చేశారు. ‘‘ఈ యాత్రలో ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం. ప్రజలను నేరుగా కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాం’’ అని వెల్లడించారు. బీజేపీ క్షుద్ర రాజకీయాల వల్ల మణిపూర్‌లో శాంతి, సామరస్యం కనుమరుగు అయ్యాయని రాహుల్ ద్వజమెత్తారు. సమాజంలో విద్వేషం, హింస, అరాచకత్వానికి స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ సంపద కొందరి జేబుల్లోకి వెళ్తోందని రాహుల్ ఆరోపించారు. ఒకరిద్దరు వ్యాపారవేత్తలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం సాధిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వ్యాపారాల్లోకి వారు ప్రవేశిస్తున్నారని, ఫలితంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. దేశ జనాభాలో అధిక భాగం ఉన్న కింది కులాలు, దళితులు, గిరిజనులకు రాజకీయ వ్యవస్థలో, ప్రభుత్వ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ యాత్రలో లేవనెత్తుతామని తెలిపారు. రాహుల్ యాత్రలో బీఎస్పీ బహిష్కృత ఎంపీ డానిష్ అలీ ఇటీవల బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీ రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. రాహుల్ యాత్రపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఘర్షణలింకా ఆగలేదు. ఇలాంటప్పుడు యాత్ర పేరుతో పరిస్థితిని దిగజార్చడానికి వచ్చారా?’’ అంటూ మండిపడ్డారు. -
సహృదయం.. సామరస్యం.. ద్వేష రాహిత్యం
ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ కాలంలో అయినా మానవుల్లో ఉండాల్సినవి ఏవి? సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం ఇవి ప్రపంచ మానవుల్లో ఉండాల్సినవి. మానవులు క్షేమంగా ఉండాలంటే ఉండి తీరాల్సినవి ఇవే. అదేంటో మానవ చరిత్ర మొదలు అయినప్పటి నుంచీ ఇవి ఉండాల్సినంతగా, ఉండాల్సినట్టుగా ఉండడం లేదు. అందువల్లే మానవులకు శాంతి, భద్రతలు కరువైపోయాయి. ఈ దుస్థితి ఇకనైనా మారాలి; ఇకపైనైనా మనిషి వల్ల మనిషికి కలుగుతున్న ముప్పుకు ముగింపు రావాలి; మనకు సుస్థితి సమకూడాలి. అథర్వ వేదపాఠం అయిన సాంమనస్య సూక్తం ఎప్పటి నుంచో ‘సహృదయం సాంమనస్యం అవిద్వేషం కృణోమి వః’ అనీ, ‘అన్యో అన్యమభి హర్యత వత్సం జాతమివాఘ్న్యా’ అనీ ఘోషిస్తూనే లేదా చాటిస్తూనే ఉంది. అంటే సహృదయులుగానూ, సామరస్యంతోనూ లేదా ఏకమనస్కులుగానూ, ద్వేషరహితులుగానూ మిమ్మల్ని రూపొందిస్తాను అనీ, అపుడే పుట్టిన దూడను తల్లి ఆవు ప్రేమించేట్టుగా పరస్పరం ప్రేమించుకోవాలి అనీ అర్థం. ఈ మాటల్ని మనం అర్థం చేసుకోనేలేదు. అందుకే మనలో అపాయం అతిగా వ్యాపిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని మనం వెనువెంటనే పరిష్కరించుకోవాలి. ప్రపంచం, దేశం, సమాజం వీటికి తొలిదశ ఇల్లు. ఒక ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సంమనాః‘ అనీ, ‘జాయా పత్యే మధుమతీమ్ వాచమ్ వదతు శాన్తివామ్‘ అనీ చెబుతోంది. అంటే ఒక కొడుకు తన తండ్రిని అనుసరించే వాడుగానూ, తన తల్లితో సామరస్యంతోనూ ఉండాలి, భార్య భర్తతో మధురమైనదై ప్రశాంతతను ఇచ్చే మాటల్ని చెప్పనీ అని అర్థం. ఒకరిని ఒకరు వెన్నంటి ఉండడం, ప్రశాంతత, హితవచనం ఇవి ఇంటి నుంచే మొదలు అవ్వాలి. ద్వేషరాహిత్యం అన్నది కూడా ఇంటి నుంచే రావాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘మా భ్రాతా భ్రాతరం దదిక్షన్మా స్వసారముత స్వసా’ అనీ, సమ్యఞ్చః సవ్రతా భూత్వా వాచం వదత భద్రయా’ అనీ చెబుతోంది. అంటే సోదరీ సోదరులు ద్వేషించుకోకూడదు, కలిసికట్టుగా పనిచెయ్యండి, అందరూ శుభం కలిగించే మాటల్ని పలకండి అని అర్థం. అభిప్రాయ భేదాలతో ఒక ఇంట్లోని సభ్యులు పరస్పరం ద్వేషించుకుంటూ విడిపోవడం కాదు ఉమ్మడిగా ఉండడానికి వాళ్ల మధ్య అవగాహన ఉండాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘యేన దేవా న వియన్తి నో చ విద్విషతే మిథః’ అనీ,‘తత్ కృణ్మో బ్రహ్మ వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః’ అనీ చెబుతోంది. అంటే దేనివల్ల దేవతలు విడిపోరో, ద్వేషించుకోరో అవగాహన అన్న ఆ ఉన్నతమైన భావన ఇంట్లోని సభ్యుల్లో ఉండాలి అని అర్థం. సంజ్ఞానం లేదా అవగాహన మనకు ఉండి తీరాలి. చిన్నవాళ్లు పెద్దలను వెన్నంటి వెళుతున్నట్టుగా ఒకరికి ఒకరై ఏకమనస్కులుగా, సామూహిక ఆరాధన చేసేవాళ్లుగా, పరస్పరం ప్రీతితో మాట్లాడుకునేవాళ్లుగా కలిసి మెలిసి బతకండి అని సూచిస్తూ ‘జాయస్వన్తశ్చిత్తినో మా వి యౌష్ట సమారాధయన్తః సధురాశ్చరన్తః’ అని సాంమనస్య సూక్తం మనకు చెబుతోంది. అంతేకాదు ప్రేమ అనే తాడుతో అందరూ కట్టబడాలి అన్న సూచ్య అర్థం వచ్చేట్టుగా ‘సమానే యోక్త్రే సహ వో యునజ్మి’ అనీ, ‘దేవా ఇవామృతమ్ రక్షమాణాః సాయం ప్రాతః సౌమనసో వో అస్తు‘ అంటూ దేవతలు అమృతాన్ని రక్షిస్తున్నట్టుగా ఉదయ, సాయం కాలాల్లో సద్భావనల్ని రక్షించండి అనీ చెబుతోంది సాంమనస్య సూక్తం. సాంమనస్య సూక్తం చేసిన ఈ సూచనను అందుకుని సద్భావనల్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి; ఆపై మనం రాణించాలి. ‘భారతీయ వైదిక సాహిత్యం సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం వీటితో మానవులు మెలగాలని ప్రగాఢంగా ప్రవచించింది. దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అది జరగకపోతే మన జీవితాలు అనర్థ దాయకమూ, అల్లకల్లోలమూ అయిపోతాయి‘. – రోచిష్మాన్ -
మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి
భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ఒక మంచి ఉదాహరణగా భాసిల్లుతోంది. అనేక మతాలూ, కులాలూ ఉన్నా... అందరం భారతీ యులమే అన్న భావనతో ప్రజలు సహజీవనం చేస్తు న్నారు. అటువంటి దేశంలో మతతత్త్వ వాదులు... మైనారిటీలపై విద్వేషాన్ని ప్రచారం చేస్తూ హిందూ త్వాన్ని రెచ్చగొడుతున్నారు. అదే సమయంలో వివిధ భాషలు మాట్లాడే జనాలపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రెండూ దేశ లౌకిక తత్త్వాన్ని దెబ్బతీసేవే. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కేవే! హిందూ ముస్లింల ఐక్యత సుదీర్ఘమైనది. 1857 తిరుగుబాటులో హిందూ ముస్లింలు కలిసి పోరాడారు. దేశ ప్రజల్ని బ్రిటిష్‌వారి నుంచి వేరుచేసి చూపటానికి ఉత్తర భారతదేశ పత్రికలు ‘హిందుస్తానీలు’ అన్న పదం వాడాయని ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర తన రచనల్లో తెలిపారు. కానీ దానినే తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు ఈ దేశం హిందువులది మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశ సమగ్రత, లౌకిక వాదాలకు గొడ్డలిపెట్టు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలను ఆశించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహింసా సిద్ధాంత ఆయుధంతో దేశాన్ని ఒక్క తాటిపై నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ... గాడ్సే చేతిలో బలవ్వడానికి మతోన్మాదమే కారణం. ఆ తర్వాత బాబ్రీ మసీదు ధ్వంసం, గుజరాత్‌తో సహా దేశంలో అనేక ప్రాంతాల్లో విద్వేష పూరిత అల్లర్లు వంటివన్నిటికీ ఈ ఉన్మాదమే కారణమయింది. దీంతో మన లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర భావనే ప్రమాదంలో పడింది. దీనికితోడు ‘ఒకే దేశం, ఒకే భాష’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదేమి టని ప్రశ్నించిన రాష్ట్రాలపైనా, రాష్ట్ర పాలకులపైనా ఆధిపత్యం చెలాయించటమే గాకుండా... ఆ ప్రభు త్వాలను కూల్చివేసే చర్యలు మొదలుపెట్టారు. సమాజంలో కొన్ని వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మాట నిజం. నేటికీ కొన్ని వర్గాలు ఇంకా ప్రభుత్వ నిర్లక్ష్య నీడల్లోంచి బైటపడక దుర్భర స్థితిలో ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, మైనారి టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కోట్లాది మంది సంచార జాతుల వాళ్లు స్థిరనివాసం లేక చెట్ల వెంట, పుట్టల వెంట, గుట్టల వెంట, జనావా సాలకు దూరంలో తమ జీవనాన్ని కొనసాగిస్తు న్నారు. వీరి ఈ స్థితి ఆధునిక భారతదేశానికి అవమానకరం. ఇటువంటి కోట్లాదిమంది అభివృద్ధి గురించి ప్రణాళికలు వేయవలసిన వారు మత తత్త్వంతో దేశాన్ని ఛిన్నాభిన్నం చేయచూడటం ఎంతవరకు సమంజసం? మతతత్త్వం ఎంత ప్రమాదకరమో మన ఇటీవలి చరిత్రే చెబుతోంది. జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్‌వారు అను సరించిన ‘విభజించి పాలించు’ విధానం మతాల వారీగా భారత సమాజాన్ని చీల్చింది. హిందూ మహాసభ, ముస్లింలీగ్ వంటి రాజకీయ సమూ హాలు ఈ క్రమంలో తలెత్తినవే. ఆ తర్వాత దేశంలో జరిగిన మత ఘర్షణలకు ఆయా మతతత్త్వ సమూ హాలు కారణమయ్యాయి. 1922–27 మధ్య కాలంలో 112 మత ఘర్షణలు జరిగాయని ‘సైమన్ కమిషన్’ తన నివేదికలో పేర్కొందంటే అప్పటి పరిస్థితి అర్థమవుతుంది. ఇక 1947 దేశ విభజన సమయంలో జరిగిన దారుణ మారణకాండ గురించి చెప్పనవసరమే లేదు. అప్పుడప్పుడూ మత సహనానికి ఇటువంటి దాడుల రూపంలో హాని జరిగినప్పటికీ దేశంలో జాతీయోద్యమ కాలంలోనే కాక... అంతకు ముందూ మతసామరస్యం వెల్లివిరిసిన మాట వాస్తవ దూరం కాదు. అప్పటి ఆ పునాదులే ఇప్ప టికీ ప్రజలను తప్పుదోవ పట్టకుండా కాపాడు తున్నాయి. భాష సంగతి కొస్తే... ‘ఒకే దేశం... ఒకే భాష’ అన్న నినాదంతో దేశ ‘విభిన్నత్వం’పై ఇవ్వాళ దాడి జరుగుతోంది. దేశంలోని అంతర్గత అస్తిత్వాలు, భిన్న సంస్కృతుల మేళవింపులు ఛిద్రం అవుతాయి. ఈ మట్టి పెట్టిన పట్టెడన్నం తిని బతుకుతున్న వాళ్లం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఇంత గొప్ప సంస్కృతి వర్ధిల్లే ఈ నేలపై ‘ఒక మతంగా మన మంతా ఏకం కాకపోతే మనకు మనుగడ లేదని’ చేసే వాదనలు విషతుల్య వాదనలుగా గుర్తించాలి. రామ్ రహీమ్‌ల దోస్తానా వర్ధిల్లాలి. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ఛైర్మన్,తెలంగాణ సాహిత్య అకాడమీ -
ఐటీలో ‘అనంత’ వెలుగులు: తొలి ఐటీ పరిశ్రమ
అనంతపురం సెంట్రల్: జిల్లాలో తొలి ఐటీ పరిశ్రమ త్వరలోనే ఏర్పాటవుతోందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం దాదులూరు సమీపంలో హార్మొనీ సిటీ కార్బన్ ఐటీ టవర్లు నెలకొల్పేందుకు కార్బన్ సంస్థ చైర్మన్ సుర్ అసిజా, గోల్డెన్ గ్లోబ్ కంపెనీ ఎండీ రవికుమార్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురం శివారులోని హార్మొనీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోల్డెన్ గ్లోబ్ కంపెనీ ఎండీ రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన శంఖారావ సదస్సు వేదికగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారన్నారు. అందులో భాగంగానే జిల్లాలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. హార్మొనీ సిటీని 120 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో మరో ఐదు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఇది వరకే అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. హార్మొనీ సిటీ కార్బన్ ఐటీ టవర్ పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా చూస్తామన్నారు. ఐటీ టవర్ల నిర్మాణం పూర్తయ్యాక దాదాపు ఐదు వేల మంది వరకు ఐటీ రంగ నిపుణులకు, పరోక్షంగా మరో ఐదు వేల మంది వరకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఉద్యోగుల సౌకర్యార్థం హోటల్ కాంప్లెక్స్, మూవీ కాంపెక్స్‌లు, సూపర్ మార్కెట్ కాంప్లెక్స్, హెల్త్ క్లబ్‌లతో పాటు అన్ని రకాల వసతులూ కల్పిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో కంపెనీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కంపెనీ ఎండీ రవికుమార్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో తమను భాగస్వాములు చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. -
శారీరక దృఢత్వంతోనే లక్ష్య సాధన: తమిళిసై
రాయదుర్గం: శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే అనుకున్నది సాధించగలమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి శాంతి సరోవర్ లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్ సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన హోప్–హ్యాపీనెస్–హార్మోనీ ప్రాజెక్టును గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ సంస్థ మహిళా విభా గం చైర్పర్సన్ రాజయోగిని బీకే చక్రదారి దీదీ, మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతి, సామరస్యాలు దేశ సైద్ధాంతిక మూలాలు: మోదీ
జైపూర్: శాంతి, సామరస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన అజ్మీర్‌లోని సూఫీ మతగురువు హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. ప్రధాని తరఫున కేంద్ర మైనా రిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దర్గాను సందర్శించి, చాదర్ ను సమర్పించారు. 806వ వార్షిక ఉర్సు సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనుచరులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘శాంతి, సామ రస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలు. సూఫీయిజం కూడా భారతీయ తత్వమే. భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చిహ్నంగా సూఫీ తత్వ వేత్త ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ నిలుస్తారు’ అని మోదీ ఆ సందేశంలో పేర్కొన్నారు. -
ఆలయాలపై దాడుల గురించి మాట్లాడరేం?
న్యూఢిల్లీ: అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను పరిరక్షించాల్సిన అవసరముందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ప్రార్థనా మందిరాలపై ఎలాంటి దాడులు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వేలాది సంవత్సరాలుగా భారత దేశంలో మత సామరస్యం పరిఢవిల్లుతోందని, ఇది ఇలాగే కొనసాగాలని జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ వ్యాఖ్యానించారు. క్రైస్తవుల మత ప్రయోజనాలు కాపాడాలంటూ దాఖలైన 'పిల్'పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని చర్చిలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఈ పిల్ దాఖలు చేశారు. మత సంబంధమైన ప్రయోజనాల కోసమే ఈ వ్యాజ్యం వేశారని, మతంతో సంబంధం లేకుండా అన్ని ప్రార్థనా మందిరాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అనిల్ సోని వాదించారు. ఆలయాలు, గురుద్వారాలు, మసీదులపై కూడా దాడులు జరిగాయని... వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదని వాపోయారు. పిటిషనర్ అన్ని మతాల గురించి ఆలోచించాలని సూచించారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను సమానంగా కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. -
సామరస్యంగానే పరిష్కారం
ఇరు రాష్ర్ట సమస్యలపై గవర్నర్ నరసింహన్ సాక్షి, తిరుమల: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెల కొన్న సమస్యలన్నీ సామరస్యంగానే పరిష్కారం అవుతాయని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఇందుకోసం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారు కూడా ఆశీస్సులు అందజేస్తారని ఆయన ఆకాం క్షించారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. కాగా రాష్ర్ట గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం సాయంత్రం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో శ్రీవారిని దర్శిం చుకున్నారు. గురువారం తిరుప్పావడ సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు. 2015 టీటీడీ కేలండర్, డైరీ ఆవిష్కరణ 2015 నూతన సంవత్సరం 12 షీట్ల టీటీడీ కేలండర్, డైరీలను గవర్నర్ ఆవిష్కరించారు. శ్రీవారి కేలండర్, డైరీ పొందినవారికి అంతా మంచే జరుగుతుందని గవర్నర్ అన్నారు. 20 లక్షల కేలండర్లు, 6 లక్షల డైరీలు అందుబాటులో ఉన్నాయని నరసింహన్ తెలిపారు. -
ఇరుప్రాంతాల వారు సంయమనం పాటించాలి: జానారెడ్డి
అలిపిరి వద్ద రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై సమైక్యవాదుల దాడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.జానారెడ్డి శనివారం ఖండించారు. సంయమనం పాటించాలని అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతాల ప్రజలకు ఆయన సూచించారు. రెచ్చగొట్టే చర్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎంతో సహా ఎవరైన పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని జానారెడ్డి స్పష్టం చేశారు. సీఎం సమైక్య రాష్ట్రం అని చెప్పడం ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు. లేదంటే కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని జానారెడ్డి తెలిపారు.