
అనంతపురం సెంట్రల్: జిల్లాలో తొలి ఐటీ పరిశ్రమ త్వరలోనే ఏర్పాటవుతోందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం దాదులూరు సమీపంలో హార్మొనీ సిటీ కార్బన్ ఐటీ టవర్లు నెలకొల్పేందుకు కార్బన్ సంస్థ చైర్మన్ సుర్ అసిజా, గోల్డెన్ గ్లోబ్ కంపెనీ ఎండీ రవికుమార్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురం శివారులోని హార్మొనీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోల్డెన్ గ్లోబ్ కంపెనీ ఎండీ రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన శంఖారావ సదస్సు వేదికగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారన్నారు. అందులో భాగంగానే జిల్లాలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. హార్మొనీ సిటీని 120 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో మరో ఐదు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఇది వరకే అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. హార్మొనీ సిటీ కార్బన్ ఐటీ టవర్ పనులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా చూస్తామన్నారు.
ఐటీ టవర్ల నిర్మాణం పూర్తయ్యాక దాదాపు ఐదు వేల మంది వరకు ఐటీ రంగ నిపుణులకు, పరోక్షంగా మరో ఐదు వేల మంది వరకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఉద్యోగుల సౌకర్యార్థం హోటల్ కాంప్లెక్స్, మూవీ కాంపెక్స్‌లు, సూపర్ మార్కెట్ కాంప్లెక్స్, హెల్త్ క్లబ్‌లతో పాటు అన్ని రకాల వసతులూ కల్పిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో కంపెనీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కంపెనీ ఎండీ రవికుమార్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో తమను భాగస్వాములు చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.