థౌబాల్/ఇంఫాల్: జాతుల ఘర్షణలతో అట్టుడికిపోతున్న కల్లోల మణిపూర్ రాష్ట్రానికి శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని థౌబాల్ నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖోంగ్‌జామ్ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో రాష్ట్రంలో లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి కన్నీళ్లు తుడిచేందుకు, చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దృష్టిలో మణిపూర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చని ఆక్షేపించారు. ‘‘మీ బాధను వారి బాధగా భావించడం లేదు. కానీ మీ దుఃఖాన్ని, మీకు తగిలిన గాయాలు, మీరెదుర్కొంటున్న విచారాన్ని మేం అర్థం చేసుకున్నాం’’ అని చెప్పారు. బాధితులు ఆప్యాయతను కోరుకుంటున్నారని రాహుల్ అన్నారు.
ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం
దేశంలో అన్యాయ కాలం కొనసాగుతున్నందు వల్లే న్యాయ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఏకం చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామరస్యంతో కూడిన ‘న్యూ విజన్ ఆఫ్ ఇండియా’ను సాధించడం ధ్యేయమని స్పష్టం చేశారు. ‘‘ఈ యాత్రలో ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం.
ప్రజలను నేరుగా కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాం’’ అని వెల్లడించారు. బీజేపీ క్షుద్ర రాజకీయాల వల్ల మణిపూర్‌లో శాంతి, సామరస్యం కనుమరుగు అయ్యాయని రాహుల్ ద్వజమెత్తారు. సమాజంలో విద్వేషం, హింస, అరాచకత్వానికి స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ సంపద కొందరి జేబుల్లోకి వెళ్తోందని రాహుల్ ఆరోపించారు. ఒకరిద్దరు వ్యాపారవేత్తలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం సాధిస్తున్నారని మండిపడ్డారు.
అన్ని వ్యాపారాల్లోకి వారు ప్రవేశిస్తున్నారని, ఫలితంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. దేశ జనాభాలో అధిక భాగం ఉన్న కింది కులాలు, దళితులు, గిరిజనులకు రాజకీయ వ్యవస్థలో, ప్రభుత్వ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ యాత్రలో లేవనెత్తుతామని తెలిపారు.
రాహుల్ యాత్రలో బీఎస్పీ బహిష్కృత ఎంపీ డానిష్ అలీ
ఇటీవల బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీ రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. రాహుల్ యాత్రపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఘర్షణలింకా ఆగలేదు. ఇలాంటప్పుడు యాత్ర పేరుతో పరిస్థితిని దిగజార్చడానికి వచ్చారా?’’ అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment