విద్వేష ప్రసంగాలతో విషం చిమ్ముతున్నారు
ప్రజా జీవితం నుంచి నిష్క్రమించండి
ఇంటర్వ్యూలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హితవు
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో హిందూ, ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోదీ ప్రజాజీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న పాడిఆవులు, గేదెలను లాక్కుంటారని, మీ రిజర్వేషన్ కోటా తగ్గించి ముస్లింలకు 15 శాతం ఇస్తారని మోదీ రోజూ అబద్దాలు ప్రచారంచేస్తూ సమాజంలో చీలిక తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పీటీఐ ఇంటర్వ్యూ సందర్భంగా ఖర్గే వెల్లడించిన అభిప్రాయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..
ఆయనే వైదొలగుతానన్నారు
‘హిందూ, ముస్లింల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా మాట్లాడితే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. మళ్లీ ఆయనే రోజూ హిందూ, ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన మాటలకు ఆయనే కట్టుబ డట్లేరు. తప్పులు ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పరు. ఆయన ఎంతగా అబద్దాలడుతున్నారో తెలియాలంటే సొంత ప్రసంగాలు ఆయన ఒకసారి వింటే, చూస్తే మంచిది. ఎన్నికల ర్యాలీల్లో విష ప్రచారాన్ని దట్టించారు. ఇలా మాట్లాడే ఆయన ప్రజాజీవితానికి స్వస్తి పలకడమే అత్యుత్తమం’’
అందుకే రాహుల్ ప్రేమ దుకాణాలు తెరుస్తానన్నారు
‘‘ బీజేపీ నేతలు రాజ్యాంగం, ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మోదీ ఏనాడైనా ఖండించారా? గిరిజ నులపై మూత్ర విసర్జన ఘటనలను ఒక్కసారైనా తప్పుబట్టారా? కనీసం బీజేపీ నేతలను మందలిస్తూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారా?. తానొక్కడినే నేత అన్నట్లు వన్‌మ్యాన్ షో చేస్తున్నారు. మొత్తం దేశాన్ని ఒక్కడినే పాలిస్తానని ప్రకటించుకుంటున్నారు. ప్రచారసభల్లో విద్వేష వ్యాఖ్యానాలే చేస్తున్నారు. అందుకే విద్వేషం సమసిపోయేలా ప్రేమ దుకాణాలు తెరుస్తానని రాహుల్ గాంధీ అన్నారు’’
అవి బుజ్జగింపు రాజకీయాలు కావు
‘‘అన్యాయమైపోతున్న వారిని పట్టించుకుంటే దానిని బుజ్జగింపు రాజకీయాలు అనరు. మేమేం చేసినా బుజ్జగింపు రాజకీయాలు అంటే ఎలా? పేదలకు ఏదైనా ఇవ్వడం, స్కాలర్‌షిప్ అందించడం, ముస్లింలకు ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యనందిస్తే వాటిని బుజ్జగింపు రాజకీయాల గాటన కట్టొద్దు’’
బీజేపీలో కూర్చున్న అవినీతి నేతల సంగతేంటి?
‘‘అవినీతి నేతల్ని జూన్ 4 తర్వాత జైల్లో వేస్తామని మోదీ అన్నారు. మరి అవినీతి మరకలున్న చాలా మంది నేతలను బీజేపీ లాగేసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వారిలో కొందరిని ఎంపీలను చేసింది. మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరి వారి సంగతేంటి?’’.
బీజేపీ మెజారిటీని కచ్చితంగా అడ్డుకుంటాం
‘‘కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన చాలా పెరిగింది. కూ టమి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ బలంతో బీజేపీ మెజారిటీని ఖచ్చితంగా నిలు వరిస్తాం. మా కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది’’.
ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?
‘‘రామ మందిరం, హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్ అంశాలే దశాబ్దాలుగా చెబుతూ ప్రజల భావోద్వేగాలను ఓట్ల రూపంలో ఇన్నాళ్లూ ఒడిసిపట్టారు. ఇక ఆటలు సాగవని అర్థమైంది. అందుకే కొత్తగా కాంగ్రెస్ గెలిస్తే ఇంట్లో ఆవులు, గేదెలు తీసుకెళ్తుందని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని, మంగళసూత్రం తెంపుకుపోతుందని, భూము లు లాక్కుంటారని ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?’’
‘400’ గొడవ మొదలెట్టిందే మీరు
‘‘పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, 400 సీట్లు గెలవాలని అన్నది ఎవరు?. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? అసలు 400 సీట్ల గొడవ మొదలెట్టిందే మీరు. అర్హతలేని ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో రాజ్యాంగబద్ధ సంస్థలను నింపేద్దామని బీజేపీ భావిస్తోంది. రిజర్వేషన్లు తెగ్గోసేందుకు రాజ్యాంగంలో మార్పులకు బీజేపీ సాహసిస్తోంది. రాజ్యాంగం ప్రకారం పాలించట్లేదు. అనైతికంగా గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు’’ అని ఖర్గే ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment