ఎన్నికల నియమావళిలో మార్పులపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆగ్రహం
ప్రజాస్వామ్యంపై దాడిని అడ్డుకుంటామని స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో మార్పులు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961లోని రూల్ 93(2)(ఏ)ను ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు శుక్రవారం కేంద్ర న్యాయశాఖ సవరించడం తెలిసిందే. ఈ చర్య ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా ఖర్గే అభివర్ణిస్తూ ఆదివారం ‘ఎక్స్’లో పలు వ్యాఖ్యలు చేశారు.
‘మోదీ ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో చేసిన మార్పులు ఈసీ సమగ్రతకు భంగం కలిగించే ప్రణాళిక బద్ధమైన కుట్రలో భాగమే. ఈసీని నిరీ్వర్యం చేసేందుకు మోదీ గతంలో ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎన్నికల సమాచారాన్ని దాచిపెడుతున్నారు.
ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపు, ఈవీఎంల్లో పారదర్శకత లోపించండం వంటి అవకతవకలపై కాంగ్రెస్ ఈసీకి లేఖలు రాసిన ప్రతీసారీ కించపరిచే ధోరణితో స్పందించింది. తీవ్రమైన ఫిర్యాదులను కనీసం స్వీకరించనూలేదు. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. ఈసీ సమగ్రతను దెబ్బ తీయడమంటే, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం ప్రత్యక్షంగా దాడి చేయడమే. దీన్ని అడ్డుకుని తీరతాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment