మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి
వికారాబాద్/కొడంగల్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, ఎంపీ ఒవైసీ ముగ్గురూ తోడు దొంగలేనని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ట్రిపుల్ తలాక్, 370డీ రద్దు వంటి మోదీ తీసుకున్న నిర్ణయాలకు కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని గెలిపించాలని ఒవైసీ.. ముస్లింలకు ఎలా చెబుతాడని ప్రశ్నించారు. వికారాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే ఎంతో మంది యువత ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని ప్రారంభించి వైఎస్ రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాణహితకు పాతరేశాడన్నారు. రంగారెడ్డి జిల్లాకు, దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ తన సొంత ఊరు బాగుంటే చాలనుకుంటున్నారని, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక చింతమడకకు సర్పంచో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
ముదిరాజ్‌లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు
రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని కేసీఆర్ పూర్తిగా గాలికి వదిలేశారని రేవంత్ విమర్శించారు. జనాభాలో మెజార్టీ శాతం ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్‌ఎస్ రాష్ట్రం మొత్తంలో ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వలేదని, మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్న చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రజాగర్జన సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు.
కొడంగల్ రుణం ఎన్నటికీ తీర్చలేనిది
కొడంగల్ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణానికి వచి్చన ఆయన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులను కలిసి.. తనకు మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొడంగల్‌ను మరువను.. విడువను అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టంచేశారు.
కాంగ్రెస్‌లో చేరిన మైత్రి గ్రూప్ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జైపాల్ పార్టీలో చేరిక సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆయన అనుచరులు గాందీభవన్‌కు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment