Telangana Sahitya Akademi
-
దీర్ఘ కవితల నుండి దీర్ఘ కావ్యం దాకా...
‘తెలంగాణ కవులు సోక్రటీస్ వారసులు.’ – (జూలూరు పథం: పుట 43) తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ రాస్తే దీర్ఘకవితే రాస్తారు అని రూఢి అయ్యింది. ‘ఎలియాస్’, ‘పాదముద్ర’, ‘చెకిముకిరాయి’, ‘నాలుగో కన్ను’ నుండి దాదాపు 20 దీర్ఘ కవితలు రాసిన కవి గౌరీశంకర్. వాటి పరిణతి రూపంగా ఇప్పుడు ‘జూలూరు పథం’ వచన మహాకావ్యం రాశారు. ఇది 200 పుటల కావ్యం. ఇది ‘తెలంగాణ’ (కుందుర్తి),‘ నా దేశం నా ప్రజలు’ (శేషేంద్ర), ‘కొయ్యగుర్రం’ (నగ్నముని), ‘ఆసుపత్రి గీతం’ (కె. శివారెడ్డి), ‘విశ్వంభర’ (సినారె), ‘జలగీతం’ (ఎన్. గోపి) వంటి వచన మహాకావ్యాల కోవకు చెందిన కావ్యం. ‘జూలూరు పథం’ కావ్య విశిష్టత కేవలం దీర్ఘ కావ్యం కావడమే కాదు, అది ఆయన స్వీయ చరిత్రాత్మక కావ్యం. గుర్రం జాషువ తన జీవితాన్ని ‘నా కథ’ అని పద్యకావ్యంగా రాశారు. శీలా వీర్రాజు తన జీవితాన్ని ‘పడుగు పేకల మధ్య జీవితం’ అన్న వచన కావ్యంగా రాశారు. ఆ తానులో గౌరీశంకర్ తన జీవితాన్ని వచన కావ్యంగా రాశారు. ఇది కేవలం గౌరీశంకర్ సొంతగోల వర్ణనకే పరిమితమైన కావ్యం కాదు. ఇందులో ఆయన జీవిత చిత్రణ కొంతభాగమే. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజాయుద్ధ వర్ణనే ‘జూలూరు పథం’గా రూపుదిద్దుకొంది. తెలంగాణ తన నేలలో తాను పరాయీకరణకు గురై ఇతర ప్రాంతాల దోపిడీకి గురై తనను తాను విముక్తం చేసుకొని, తన రాష్ట్రం తాను ఏర్పాటు చేసుకున్న క్రమానికి ఈ కావ్యం విమర్శనాత్మక కళాత్మక ప్రతిబింబం. ‘తెలంగాణలో ఒక్కొక్కరు ఒక మహాకావ్యం’ అని తెలంగాణ ఔన్నత్యాన్ని నిర్వచించారు గౌరీశంకర్. కవి, కవిత్వం అంటే ఏమిటో వర్ణించి, తెలంగాణ కవుల సౌందర్యాన్ని నోరారా వర్ణించి తన జీవితాన్ని క్లుప్తంగా పరిచయం చేశారు మొదట. ‘జై తెలంగాణ అంటే నా జన్మ ధన్యమైంది’ అని పులకరించి పోతారు కవి. జై తెలంగాణ అంటేనే భార్య మెడలో తాళి కడతానన్న వరుని సంఘటనను పరిచయం చేశారు. 1956 అక్టోబర్ 31న అర్ధరాత్రి జరిగింది కొత్త ఆధిపత్యమని, కొత్త ఆక్రమణ అని నిర్వచించి దాని ముద్దుపేరు ‘సమైక్యత’ అని తన కంఠాన్ని స్పష్టంగా వినిపించారు. తెలంగాణ ఆహారం, తెలంగాణ సంస్కృతి ఈ కావ్యంలో కావ్య గౌరవం పొందాయి. తనను కవిగా, ఉద్యమకారునిగా నిలబెట్టిన తెలంగాణ గడ్డను గౌరీశంకర్ కృతజ్ఞతతో కీర్తించారు. కవిగా కవిత్వ శక్తి తెలిసిన గౌరీశంకర్, కవిత్వం ఏమి సాధిస్తుందంటే ‘ఒక రాష్ట్రాన్ని సాధించి పెడ్తది’ అన్నారు. తెలంగాణ రాష్ట్రోద్యమంలో కళారంగం నిర్దేశించిన చారిత్రక పాత్రను కవి గర్వంగా వర్ణించారు. ‘తెలంగాణ కవులు విముక్తి పోరు వారసులు’ అని నిర్వచించారు. తెలంగాణ రాష్ట్రోద్యమం విజయం సాధించడాన్ని ‘యుద్ధమిప్పుడు గెలిచిన కల’ అని పరవశించి చెప్పారు. గౌరీశంకర్ కవిత్వం ఒక ఉప్పెనలాగా ఉంటుంది. ఆవేశం, ఆవేదన, ఆగ్రహం ముప్పేట దాడితో ఆయన కవిత్వం నడుస్తుంది. మార్క్సిజం, అంబేడ్కరిజం సమన్వయ సిద్ధాంతంగా సాగుతున్న తీరును కవిత్వీకరించారు. ఆయన నడి గూడెం వడ్లబజారు నుంచి ప్రారంభించి అస్తిత్వ సాహిత్య ఉద్యమ జెండాలను పట్టుకుని తెలంగాణ నడిబొడ్డు నడిగడ్డ దాకా దీర్ఘకవితల్ని నడిపించాడు. తెలుగు సాహిత్యంలో దీర్ఘకవితల పథం ‘జూలూరు పథం.’ వ్యాసకర్త సాహితీ విమర్శకులు (రేపు హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘జూలూరు పథం’ ఆవిష్కరణ) -
మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి
భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ఒక మంచి ఉదాహరణగా భాసిల్లుతోంది. అనేక మతాలూ, కులాలూ ఉన్నా... అందరం భారతీ యులమే అన్న భావనతో ప్రజలు సహజీవనం చేస్తు న్నారు. అటువంటి దేశంలో మతతత్త్వ వాదులు... మైనారిటీలపై విద్వేషాన్ని ప్రచారం చేస్తూ హిందూ త్వాన్ని రెచ్చగొడుతున్నారు. అదే సమయంలో వివిధ భాషలు మాట్లాడే జనాలపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రెండూ దేశ లౌకిక తత్త్వాన్ని దెబ్బతీసేవే. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కేవే! హిందూ ముస్లింల ఐక్యత సుదీర్ఘమైనది. 1857 తిరుగుబాటులో హిందూ ముస్లింలు కలిసి పోరాడారు. దేశ ప్రజల్ని బ్రిటిష్‌వారి నుంచి వేరుచేసి చూపటానికి ఉత్తర భారతదేశ పత్రికలు ‘హిందుస్తానీలు’ అన్న పదం వాడాయని ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర తన రచనల్లో తెలిపారు. కానీ దానినే తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు ఈ దేశం హిందువులది మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశ సమగ్రత, లౌకిక వాదాలకు గొడ్డలిపెట్టు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలను ఆశించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహింసా సిద్ధాంత ఆయుధంతో దేశాన్ని ఒక్క తాటిపై నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ... గాడ్సే చేతిలో బలవ్వడానికి మతోన్మాదమే కారణం. ఆ తర్వాత బాబ్రీ మసీదు ధ్వంసం, గుజరాత్‌తో సహా దేశంలో అనేక ప్రాంతాల్లో విద్వేష పూరిత అల్లర్లు వంటివన్నిటికీ ఈ ఉన్మాదమే కారణమయింది. దీంతో మన లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర భావనే ప్రమాదంలో పడింది. దీనికితోడు ‘ఒకే దేశం, ఒకే భాష’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదేమి టని ప్రశ్నించిన రాష్ట్రాలపైనా, రాష్ట్ర పాలకులపైనా ఆధిపత్యం చెలాయించటమే గాకుండా... ఆ ప్రభు త్వాలను కూల్చివేసే చర్యలు మొదలుపెట్టారు. సమాజంలో కొన్ని వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మాట నిజం. నేటికీ కొన్ని వర్గాలు ఇంకా ప్రభుత్వ నిర్లక్ష్య నీడల్లోంచి బైటపడక దుర్భర స్థితిలో ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, మైనారి టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కోట్లాది మంది సంచార జాతుల వాళ్లు స్థిరనివాసం లేక చెట్ల వెంట, పుట్టల వెంట, గుట్టల వెంట, జనావా సాలకు దూరంలో తమ జీవనాన్ని కొనసాగిస్తు న్నారు. వీరి ఈ స్థితి ఆధునిక భారతదేశానికి అవమానకరం. ఇటువంటి కోట్లాదిమంది అభివృద్ధి గురించి ప్రణాళికలు వేయవలసిన వారు మత తత్త్వంతో దేశాన్ని ఛిన్నాభిన్నం చేయచూడటం ఎంతవరకు సమంజసం? మతతత్త్వం ఎంత ప్రమాదకరమో మన ఇటీవలి చరిత్రే చెబుతోంది. జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్‌వారు అను సరించిన ‘విభజించి పాలించు’ విధానం మతాల వారీగా భారత సమాజాన్ని చీల్చింది. హిందూ మహాసభ, ముస్లింలీగ్ వంటి రాజకీయ సమూ హాలు ఈ క్రమంలో తలెత్తినవే. ఆ తర్వాత దేశంలో జరిగిన మత ఘర్షణలకు ఆయా మతతత్త్వ సమూ హాలు కారణమయ్యాయి. 1922–27 మధ్య కాలంలో 112 మత ఘర్షణలు జరిగాయని ‘సైమన్ కమిషన్’ తన నివేదికలో పేర్కొందంటే అప్పటి పరిస్థితి అర్థమవుతుంది. ఇక 1947 దేశ విభజన సమయంలో జరిగిన దారుణ మారణకాండ గురించి చెప్పనవసరమే లేదు. అప్పుడప్పుడూ మత సహనానికి ఇటువంటి దాడుల రూపంలో హాని జరిగినప్పటికీ దేశంలో జాతీయోద్యమ కాలంలోనే కాక... అంతకు ముందూ మతసామరస్యం వెల్లివిరిసిన మాట వాస్తవ దూరం కాదు. అప్పటి ఆ పునాదులే ఇప్ప టికీ ప్రజలను తప్పుదోవ పట్టకుండా కాపాడు తున్నాయి. భాష సంగతి కొస్తే... ‘ఒకే దేశం... ఒకే భాష’ అన్న నినాదంతో దేశ ‘విభిన్నత్వం’పై ఇవ్వాళ దాడి జరుగుతోంది. దేశంలోని అంతర్గత అస్తిత్వాలు, భిన్న సంస్కృతుల మేళవింపులు ఛిద్రం అవుతాయి. ఈ మట్టి పెట్టిన పట్టెడన్నం తిని బతుకుతున్న వాళ్లం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఇంత గొప్ప సంస్కృతి వర్ధిల్లే ఈ నేలపై ‘ఒక మతంగా మన మంతా ఏకం కాకపోతే మనకు మనుగడ లేదని’ చేసే వాదనలు విషతుల్య వాదనలుగా గుర్తించాలి. రామ్ రహీమ్‌ల దోస్తానా వర్ధిల్లాలి. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ఛైర్మన్,తెలంగాణ సాహిత్య అకాడమీ -
సాహిత్య వేదికలపై ఫత్వాలు సరికాదు
తెలంగాణలో ఇక తెరవే (తెలంగాణ రచయితల వేదిక) అవసరం లేదనీ, వారు ఇక్కడితో ఆగితేనే గౌరవమనీ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి రెండురోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కేవలం తెలంగాణ రచయితల వేదికని ఉద్దేశించి మాత్రమే అన్నట్లుగా భావించలేము. ‘ప్రశ్నించడమే కవిత్వం ప్రధాన తత్త్వం. నిలదీయలేనిది అసలు కవిత్వమే కాదు’ అని అదే సభలో ఉన్న సీనియర్ పాత్రికేయులు కూడా అన్నారు. అదిగో – అలాంటి ప్రశ్ననే ఇప్పుడు పూర్తిగా చంపేయాలనుకుంటున్నారు నందిని సిధారెడ్డి. ఆయనకు తెలియనిదీ, ఇంక తననుంచి ఏమాత్రమూ తెలుసుకోగోరనిదీ ఏమంటే – తెలంగాణ సమాజం ఊరుకోదు. ప్రశ్నించి తీరుతది. నిలదీసి నిలుస్తది. బరిగీసి కొట్లాడుతది. అక్షరం ఎల్లప్పుడూ ప్రజల పక్షమే నిలుస్తది అని మాత్రమే. అక్షరం, సాహిత్యం పోషించే ఇలాంటి పాత్రపై సరిగ్గా ఇదే భయం నందిని సిధారెడ్డిని ఇవాళ ఆవరించింది. ప్రశ్నలెక్కువైతే ఏలికకు ఇబ్బంది అని. ప్రభువులను ప్రజలు ప్రశ్నించే పరి స్థితి పట్ల ఆందోళన ఆయనది. ఆనాడు సిధారెడ్డి ఒక నదీప్రవాహం అయితే– నేడాయన పాలకుల రీడిజైన్‌లో గతి తప్పిన శుష్క ప్రేలాపం, పాలక స్తుతిలో తెలంగాణలో కవులను, రచయితలను సాహితీ నిర్వాసితులను చేసే ముంపు ఉపద్రవం! అందుకే అంటున్నాం – ప్రవహించు మంజీరా! కలాల్ని భయపెట్టొద్దు మంజీరా!! ఏలికల కాళ్ళ మణి మంజీరం కావొద్దు మంజీరా!!! తెలంగాణలోని కొంతమంది మేధావులు, కవులు, రచయితలు, జర్నలిస్టులు ప్రభువుల సింహాసనపు సాలభంజికలుగా మారిపోవడంతో అందరూ అదే తొవ్వ తొక్కాలని అంటున్నడు సిధారెడ్డి. ఆ సాలభంజికలకంటే రెండాకులు ఎక్కువ చదివిన భజనభంజిక నందిని గారికి, ఆయన పోషకులకూ కొత్తగా చెప్పాలని మేమయితే అనుకోవడం లేదు. కానీ, నిత్య చైతన్య దీప్తి అయిన తెలం గాణ ఏమాత్రం మసకబారినా భవిష్యత్తు నాశనమైతదని చెప్పడమే ఈ ప్రయత్నం. ప్రత్యేకించి తెలం గాణ ప్రగతిశీల శక్తులకు ఈ సవినయ విన్నపం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరని ప్రస్తుత సందర్భంలో, ముఖ్యంగా రెండవసారి ఎన్నిక అయిన ప్రభుత్వాలు (అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో) ప్రజలు తమకు గంపగుత్త మెజారిటీ యిచ్చిన్రు కాబట్టి (ఇందులోని వాస్తవావాస్తవాలు, న్యాయాన్యాయాలూ వేరే చర్చ) తాము ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారు. ఉద్యమ ఆకాంక్షలను సులువుగా తొక్కేస్తామని, తెలంగాణ ఆత్మకు ఉనికి అన్నదే లేకుండా చేస్తామని భావిస్తున్న పాలకులనూ, వారి ఈ భావనను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్న బానిస కలాలనూ తెలంగాణ మేధోవర్గం నిరసించాలి. ఖండించాలి. అందుకే ఈ విన్నపం. మరొక విషయం. భారత్‌ను మతరాజ్యంగా మార్చే సంకల్పంతో జాతీయ స్థాయిలో కమ్ముకొస్తున్న ప్రస్తుత తరుణంలో, ఆ ఫాసిజం రేపు నందిని సిధారెడ్డి వంటి పోషకులనూ కమ్మేస్తుంది. కానీ, రచయితలుగా ఒక మాట ఇస్తున్నాం. రేపు మేము వాటినీ ఖండిస్తాం. ఆ ప్రజాస్వామ్య స్పృహ, హక్కుల స్పూర్తి మాకున్నది. ఫ్యూడల్, క్యాపిటల్, ఫాసిస్ట్ శక్తులను ఎదిరిస్తూనే, ఎవరు ఎక్కువ ప్రమాదకారి అన్న చర్చ వచ్చినపుడు తప్పకుండా బలమైన శత్రువుపై దాడి చేయాల్సిందే. ప్రశ్నలు రావాల్సిందే. వాటికి సాహిత్యకారులు తమ గళమూ కలమూ మద్దతు ఇవ్వాల్సిందే. తెలం గాణ ఉద్యమవీణకు తంత్రియై మూర్చనలు పోయిన కవులూ రచయితలూ కళాకారులూ మేధావులూ... రేపు కూడా ఉండేది తెలంగాణ ప్రజల పక్షమే. నేడూ రేపూ వారిది ఉద్యమ ఆకాంక్షల సాధనామార్గమే. సాహిత్య సంస్థలను రద్దుచేయాలనే ఫత్వాలు జారీ చేసి దేశంలో తెలంగాణ రాష్ట్ర గౌరవం మంటకలపొద్దు. ప్రతిపక్షాలను ఏరేసే తీరుగా కవులను, కళాకారులను కొనివేయలేరు. సన్మానాలు, శాలువాల కోసం కిమ్మనకుండే రచయితలారా మీరు గళం విప్పకపోతే రేపు ప్రజలు మిమ్మల్ని క్షమించరు.రచయితల కర్తవ్యాలను, లక్ష్యాలను చెప్పుకుంటూనే, సిధారెడ్డి లాంటి కలుపుమొక్కల కారణంగా, మరోసారి మనమెరిగిన ఓ పాతప్రశ్న వేయాల్సి వస్తున్నది... కవీ, ఓ కళాకారుడా/కవయిత్రీ, ఓ కళాకారిణీ నీవెటువైపు?!/రాజ్యంవైపా?/ జనం ఆకాంక్షల దిక్కా? (జూలై 14, 2019 ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలాల స్వేచ్ఛ కోసం, 27 ప్రజాసంఘాలతో జరగనున్న సభ సందర్భంగా) వ్యాసకర్త రాష్ట్రకమిటీ సభ్యుడు, తెలంగాణ జన సమితి ‘ మొబైల్ : 90309 97371 శ్రీశైల్ రెడ్డి పంజుగుల -
తెలుగుకు పట్టం కట్టండి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు భాషకు పట్టం కట్టాలని, అందులో భాగంగా నేటి నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్న దృష్ట్యా ప్రతి స్కూల్లో పిల్లలు తెలుగు భాషను తప్పనిసరి నేర్చుకునేవిధంగా ప్రోత్సహించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకూ తెలుగును తప్పనిసరిగా చదవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఎస్సీఈఆర్టీతో కలసి తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త కార్యాచరణ చేపట్టింది. గతేడాది నుంచి అన్ని స్కూళ్లలో తెలుగు అమలు దిశగా రెండు సంస్థలు దృష్టి సారించాయి. తెలంగాణ ప్రజల భాష, సాహిత్యం, చారిత్రక, సాంస్కృతిక జీవితం ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలనే లక్ష్యంతో తెలుగును తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆ లక్ష్యం అన్ని పాఠశాలలకు చేరుకునేవిధంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు పిల్లలకు తెలుగు నేర్పించే ఉపాధ్యాయుల కోసం ఎస్సీఈఆర్టీతో కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను, వర్క్‌షాపులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘తెలుగు తప్పనిసరి’కి అడుగులు ఇలా ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించింది. కానీ ఇంటర్మీడియెట్ స్థాయిలో అమలుపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. తమిళనాడులో పదో తరగతి వరకే తమిళం తప్పనిసరి భాషగా అమలు కావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కూడా ఒకటి నుంచి పదోతరగతి వరకు పరిమితం చేశారు. తెలుగు భాషేతరుల కోసం ఎస్ఈఆర్టీ గతేడాది ఒకటి, ఆరోతరగతి పాఠ్యపుస్తకాలను ముద్రించి అందజేయగా, ఈ ఏడాది రెండు, ఏడో తరగతులకు కూడా అందజేశారు. ‘‘తెలుగు అమలు తీరును పర్యవేక్షించేందుకు గతేడాది నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాం, కొన్ని స్కూళ్లు మినహా చాలా వరకు తెలుగును తప్పనిసరి చేశాయి. కేంద్రీయ విద్యాలయ వంటి విద్యాసంస్థల్లో మాత్రంపై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అమలు చేయనున్నట్లు చెప్పారు’’అని సిధారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల్లో ఏముంది? హిందీ, కన్నడం, తమిళం, మరాఠీ వంటి ఇతర మాతృభాషల విద్యార్థులు కూడా తెలుగు నేర్చుకొనేందుకు వీలుగా వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు, చిన్న చిన్న పదాలతో పుస్తకాలను ముద్రించారు. ఏడో తరగతి స్థాయిలో చిన్న చిన్న గేయాలను పరిచయం చేశారు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, ఆచార సాంప్రదాయాలు, తెలంగాణ కళలను కూడా పరిచయం చేయనున్నట్లు సిధారెడ్డి తెలిపారు. 2023 నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తిస్థాయిలో తెలుగు అమలులోకి వస్తుందన్నారు. ‘‘తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పించడాన్ని ఒక బాధ్యతగా భావించాలి. ఏ ప్రాంతం వారైనా సరే ఇక్కడి వారైనప్పుడు ఈ ప్రాంత ప్రజల భాషలోనే మమేకం కావడం వల్ల మానవసంబంధాలు బలపడు తాయి. అందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీ స్కూళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేసేందుకు సిద్ధంగా ఉంది’’అని చెప్పారు. -
రేపటి నుంచి చరిత్ర, సాహిత్యాలపై సదస్సు
సాక్షి, హైదరాబాద్: చరిత్ర, సాహిత్యాలపై ఈ నెల 23 నుంచి రెండ్రోజుల పాటు రవీంద్రభారతిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. చర్రితలో చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర సాహిత్య అకాడమీ, వారధి సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల నుంచి అసఫ్‌జాహిల వరకు రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం అనే అంశాలపై సదస్సు జరుగుతుందన్నారు. నాణేల ఆధారంగా తెలంగాణ చరిత్రను పరిశోధకులు రాజారెడ్డి, మనం మరిచిన తెలంగాణ చరిత్రపై జితేంద్రబాబు, కాకతీయుల నాటి లిపి విశేషాలు, లేఖన సంప్రదాయాలపై ఉమామహేశ్వర శాస్త్రి పత్ర సమర్పణ చేస్తారన్నారు. ప్రముఖ చరిత్రకారులు సూర్యకుమార్ కాకతీయుల కొత్త శాసనాలపై, ఆచార్య ఎం. సుజాతరెడ్డి కుతుబ్షాహి కాలం నాటి తెలుగు భాషా వికాసంపై, స్వతంత్ర కాకతీయ పాలకుల వివరాలపై శ్రీనివాసులు పత్ర సమర్పణ చేస్తారన్నారు. సదస్సు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. సమావేశంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
మన తెలుగు సాహిత్యం మరో కోహినూర్!
సాక్షి, హైదరాబాద్ : కోహినూర్ వజ్రం.. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన వజ్రాల్లో ఒకటి. తెలుగు నేలపై దొరికిన ఆ వజ్రం ఎక్కడుంది? బ్రిటన్ రాణి ఎలిజబెత్ కిరీటంలో.. ఆంగ్లేయులు దానిని దేశం నుంచి తరలించుకుపోయారు. ‘ప్రపంచం మొత్తం చేసే ఒక రోజు ఖర్చులో సగం విలువ.. కోహినూర్ సొంతం’అని మొఘల్ చక్రవర్తి బాబర్ తన బాబర్నామాలో ప్రస్తావించాడట. అంతటి విలువైన ‘తెలుగు’కోహినూర్‌ను సొంతం చేసుకున్న బ్రిటన్.. అంతకుమించిన అద్భుత తెలుగు సాహిత్య సంపదనూ సొంతం చేసుకుంది. ఒకటి రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో తెలుగు గ్రంథాలు బ్రిటన్ రాజధాని లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి. ఆ గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు 8,639! ప్రపంచ సాహిత్యంలో వినూత్న ప్రక్రియలకు నెలవు తెలుగు సాహిత్యం. ఈ ఔన్నత్యాన్ని ఇటీవలే ప్రపంచ తెలుగు మహాసభలు మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కరించాయి. అంతటి సమున్నత తెలుగు సాహిత్యంలో ఎంతోమంది ఉద్ధండులు ఎన్నో గ్రంథాలు రాశారు. కానీ వాటిలో చాలా వరకు మనకు అందుబాటులో లేవు. ఇలా అలభ్యంగా ఉన్న గ్రంథాలెన్నో బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నట్లు గుర్తించారు. అవీ ఒకటి రెండు కాదు ఏకంగా 8,639 పుస్తకాలు కావడం గమనార్హం. ఇందులో రెండు మూడు వేల గ్రంథాలు, పుస్తకాలు మన వద్ద అందుబాటులో లేనివేనని అంచనా. 1700 సంవత్సరం నుంచి 1970 వరకు వివిధ సమయాల్లో వెలువడిన తెలుగు గ్రంథాలు, పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఆంగ్లేయులు స్వాతంత్య్రం వరకు వివిధ సందర్భాల్లో భారత్ నుంచి పలు భాషల గ్రంథాలను లండన్‌కు తరలించారు. తర్వాత కూడా ఇది కొనసాగింది. అయితే అంతకుముందు జరిగింది కొల్లగొట్టడంకాగా.. తర్వాత కొనసాగింది ‘సేకరణ’. ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రంథాలయం లండన్ గడ్డపై ఉండాలన్న సంకల్పంతో ఈ పుస్తకాలను తరలించారు. ఎలా తెలిసింది..? ప్రపంచ సాహిత్యానికి తెలుగు నేల అందించిన సారస్వతం ఎనలేనిది. కానీ భావితరాల కోసం భద్రపరిచే విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. దాంతో ఇప్పటివరకు తెలుగు భాషలో ఎన్ని గ్రంథాలు వెలువడ్డాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయనే లెక్కలేవీ లేవు. అయితే తాజాగా లండన్ బ్రిటిష్ లైబ్రరీలో భారీ సంఖ్యలో తెలుగు గ్రంథాలున్న విషయాన్ని పురావస్తు పరిశోధకుడు డాక్టర్ రాజారెడ్డి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయన ఇటీవల బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న శాతవాహనుల నాణేలపై పరిశోధన కోసం లండన్ వెళ్లారు. ఆ సమయంలో బ్రిటిష్ లైబ్రరీని కూడా సందర్శించారు. అక్కడి కేటలాగ్ (పుస్తకాల జాబితా)లను పరిశీలిస్తుండగా.. తెలుగు పుస్తకాల కేటలాగ్ కనిపించింది. దాన్ని పరిశీలించగా ఆ లైబ్రరీలో 8,639 తెలుగు పుస్తకాలున్నట్టు తేలింది. వెంటనే విశ్వనాథ సత్యనారాయణ పుస్తకాలు కావాలని సిబ్బందిని కోరగా.. కొద్దిసేపట్లోనే 21 పుస్తకాలను తెచ్చి ఇచ్చారు. తెలుగు నిఘంటువుకు రూపమిచ్చిన బ్రౌన్ పుస్తకాలు కావాలని అడిగితే.. 27 పుస్తకాలు తెచ్చిపెట్టారు. ఇలా వేలకొద్దీ తెలుగు పుస్తకాలు అక్కడ కనిపించేసరికి రాజారెడ్డి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక ఈ విషయాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు మహాసభల నేపథ్యంలో.. బ్రిటిష్ లైబ్రరీ పుస్తకాల విషయంగా ప్రపంచ తెలుగు మహాసభలకు ముందు కసరత్తు మొదలైంది. నందిని సిధారెడ్డి నెల రోజుల కింద లండన్‌లోని ప్రవాస తెలుగువారు సృజన్‌రెడ్డి, కరుణనాయుడు, ఆదిత్య తదితరులకు ఆ పుస్తకాల వివరాలు సేకరించే బాధ్యత అప్పగించారు. వారు కొద్దిరోజులు కసరత్తు చేసి 1,200 పుస్తకాల పేర్లతో కేటలాగ్ తయారు చేశారు. ఆ జాబితాను ఇక్కడికి పంపారు. దీంతో కవి, పరిశోధకుడు జగన్‌రెడ్డి చేయూతతో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆ పుస్తకాల పట్టికతో కూడిన పుస్తకాన్ని ముద్రించింది. త్వరలో మిగతా పుస్తకాల వివరాల సేకరణకు చర్యలు చేపట్టింది. మొత్తం వివరాలన్నీ క్రోడీకరించి.. ఆ జాబితాలో మనవద్ద అందుబాటులో లేని పుస్తకాలను గుర్తించనున్నారు. వాటిని బ్రిటిష్ లైబ్రరీ సాయంతో స్కాన్ చేయించి, తిరిగి ఇక్కడ ముద్రింపజేసే ప్రయత్నం జరుగుతోంది. ప్యారిస్ లైబ్రరీలో కూడా.. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రంథాలయంలోనూ పెద్ద సంఖ్యలో తెలుగు పుస్తకాలున్నట్టు బ్రిటిష్ లైబ్రరీలో సమాచారం ఉంది. ప్యారిస్ లైబ్రరీలోని పుస్తకాల వివరాలతో కూడిన కేటలాగ్ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది. అందులో తెలుగు పుస్తకాల వివరాలూ ఉన్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు పుస్తకాలు ఉన్నాయనే వివరాలు సేకరించాల్సి ఉంది. వందల ఏళ్లనాటి గ్రంథాలెన్నో.. తెలుగు నేలపై పుస్తకాల ప్రచురణ 1750 సమయంలో మొదలైందని అంచనా. 1850లో వచ్చిన ఓ పుస్తకం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ‘వందేళ్లలో తెలుగు పుస్తకాలు’పేరుతో మంగమ్మ అనే పరిశోధకురాలు 1850లో ఓ పుస్తకాన్ని వెలువరించారు. అది ఇక్కడ లభించకున్నా బ్రిటిష్ లైబ్రరీలో భద్రంగా ఉంది. లైబ్రరీలో గణితం, పురాణం, ఇతిహాసం, చరిత్ర.. ఇలా 13 అంశాల్లో తెలుగు పుస్తకాల జాబితాలు పొందుపరిచారు. 17వ శతాబ్దంలో ధూర్జటి రచించిన కాళహస్తి మహత్మ్యము మొదలు భాస్కర శతకం, దాశరథి శతకం, రకరకాల పెద్ద బాలశిక్షలు, లావణ్య శతకం, కాళహస్తి లింగాష్టకం, కవిజన రాజసం, హంస వింశతి కథలు, వివేక సంగ్రహం, మదాలసోపాఖ్యానం, గ్రంథ తంత్రం.. ఇలా (తాజా సేకరణలోనివి మాత్రమే) ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి. అద్భుతంగా పరిరక్షణ... ఇక్కడి పుస్తకాలు అటు తరలాయే అన్న బాధ ఉన్నా.. బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాలు నిక్షేపంగా ఉన్నాయి. మన వద్ద లైబ్రరీలలో చెద పురుగులకు ఆహారంగా మారే దుస్థితి ఉండగా.. బ్రిటిష్ లైబ్రరీలో ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతూ కంటికిరెప్పలా కాపాడుతున్నారు. కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా సురక్షితంగా ఉండడం గమనార్హం. తిరిగి ముద్రించుకోవాలి ‘‘బ్రిటిష్ లైబ్రరీలో గొప్ప తెలుగు సాహితీ సంపద పదిలంగా ఉంది. అక్కడున్న వాటిలో మన వద్ద లేని పుస్తకాలను భాషా పండితులు గుర్తించాలి. వాటిని స్కాన్ చేసుకువచ్చి, తిరిగి ముద్రించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల తెలుగు పుస్తకాలున్నట్టు అంచనా. తంజావూరు గ్రంథాలయంలో కృష్ణ దేవరాయలు రాసిన ఆముక్త మాల్యద తాళపత్ర గ్రంథం ఉంది. 780 తెలుగు గ్రంథాలూ ఉన్నాయి. మైసూరు గ్రంథాలయంలోనూ తెలుగు పుస్తకాలు ఉన్నాయి..’ – రాజారెడ్డి, చరిత్రకారుడు అన్ని పుస్తకాలు సేకరిస్తాం ‘‘రాజారెడ్డి గొప్ప మేలు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాల వివరాలు సేకరిస్తున్నాం. వాటిలో మన వద్ద అలభ్యంగా ఉన్న పుస్తకాలను తెలుగు నేలపైకి తెస్తాం..’’ – నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహాసభలు జరిగే ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. స్డేడియం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు ఎల్బీ స్టేడియం కేంద్రంగా ట్రాఫిక్ మళ్లించారు. ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్‌కు మళ్లిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి ఛాపెల్ రోడ్‌కు పంపిస్తారు. బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి జీపీవో వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోఠి మీదుగా పంపిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు పంపిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ మీదుగా మళ్లించనున్నారు. కాగా, ప్రపంచ తెలుగు మహా సభలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యే తెలుగు మహా సభలు ఈ నెల19 వరకు జరుగనున్నాయి. మహాసభలకు వివిధ ప్రాంతాల నుంచి 30 వేలమంది అతిథులు హాజరుకానున్నారు. సభలకు వచ్చే వారి కోసం 32 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మహాసభలకు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మహాసభలకు దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసే ప్రాంతాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కొత్వాల్ పేర్కొన్నారు. భద్రత, బందోబస్తు విధుల కోసం నగర పోలీసు విభాగంలోని 9 వేల మందికి తోడు మరో మూడు వేల మందిని మోహరిస్తున్నట్టు తెలిపారు. -
అందరూ ఆహ్వానితులే..
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సారస్వత పరిషత్తు తదితర వేదికలు తెలుగు వెలుగులతో జిగేల్ మంటున్నాయి. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో తళుకులీనుతున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి తెలిపారు. గురువారం వారు ‘తెలంగాణ సాహిత్య వైభవం’పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిధారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఐదు రోజుల తెలుగు పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, తెలుగు వారందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటే సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం అవుతాయన్నారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంను తెలుగుదనం ఉట్టిపడేలా కళాత్మకంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అలంకరించినట్లు చెప్పారు. ప్రాంగణానికి నలువైపులా ఎనిమిది ద్వారాల్లో ప్రముఖులకు, ప్రతినిధులకు, సాధారణ ప్రజలకు విడివిడిగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. రవీంద్రభారతిలో కిట్ల పంపిణీ.. హైదరాబాద్‌కు చెందిన ప్రతినిధులకు గురువారం మహాసభల కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే అతిథులు, ప్రతినిధులకు హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు నేతృత్వంలోని ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిట్లను అందజేస్తారు. ఇందుకోసం అన్ని చోట్లా ఆహ్వాన కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నట్లు సిధారెడ్డి తెలిపారు. ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారని, వారందరినీ ఆహ్వాన కమిటీ సాదరంగా ఆహ్వానించి వారి బస కేంద్రాలకు తోడ్కొని వెళుతోందని చెప్పారు. సుమారు 6,000 మంది ప్రతినిధులకు వివిధ హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. భోజనం, వసతి అన్నీ అక్కడే ఉంటాయి. మహాసభలకు వెళ్లేందుకు, తిరిగి వారిని హోటళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా శాఖ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇందుకు 150 బస్సులను సిద్ధంగా ఉంచారు. అలాగే ఎల్బీ స్టేడియం వద్ద 60 ఆహార విక్రయ శాలలు, 25 పుస్తక ప్రదర్శన శాలలు సిద్ధమయ్యాయని చెప్పారు. మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట్, వరంగల్, జనగామ తదితర సమీప జిల్లాలకు చెందిన ప్రతినిధులు కిట్ల కోసం రవీంద్రభారతికి రావలసిన అవసరం లేదని సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. వారికి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. -
పాల్కురికి ప్రాంగణం.. పోతన వేదిక
సాక్షి, హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో సమున్నత శిఖరాలుగా వెలుగొందిన కవులు, రచయితలు, సాహితీవేత్తల పేర్లతో ప్రపంచ తెలుగు మహాసభల వేదికలను ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరగనున్న ఈ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. నగరాన్ని అందంగా అలంకరించడంతో పాటు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులు ఉట్టిపడే విధంగా ప్రత్యేక స్వాగత తోరణాలను సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక లాల్‌బహదూర్ స్టేడియాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయనున్నారు. ఎల్బీస్టేడియానికి బసవ పురాణం, పండితారాధ్య చరితము, శివతత్వం వంటి ద్విపద కావ్యాలతో తెలుగు సాహి త్యాన్ని సుసంపన్నం చేసిన పాల్కురికి సోమన ప్రాంగణంగా నామకరణం చేశారు. ప్రధాన వేదికకు మహాకవి బమ్మెర పోతన పేరు పెట్టారు. అలాగే స్టేడియానికి నాలుగు వైపులా 8 ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ద్వారాలకు వరుసగా తెలుగు సాహితీ మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి, సినారె, జాషువా, వేమన పేర్లు పెట్టారు. ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియానికి మహాకవి శ్రీశ్రీ, వానమామలై వేదికలుగా నామకరణం చేశారు. రవీంద్రభారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయ నున్నారు. దీనికి కాపు రాజయ్య, పీటీ రెడ్డి ఆర్ట్ గ్యాలరీలుగా నామకరణం చేశారు. చిందు ఎల్లమ్మ ప్రాంగణంగా లలిత కళాతోరణం పబ్లిక్‌గార్డెన్స్‌లోని తెలుగు లలిత కళాతోర ణానికి చిందు ఎల్లమ్మ ప్రాంగణంగా, వేదికకు మిద్దె రాములు వేదికగా నామకరణం చేశారు. అలాగే బాలలు, మహిళల సాహిత్యానికి చర్చావేదిక అయిన ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియానికి యశోదారెడ్డి ద్వారం అని, ఒద్దిరాజు సోదరుల వేదిక అని పేరు పెట్టారు. తెలుగు వర్సిటీకి తెలంగాణ జానపద సాహి త్యంపైన, ముఖ్యంగా మౌఖిక సాహిత్యంపైన పరిశోధనలు చేసిన ఆచార్య బిరుదరాజు రామరాజు ప్రాంగణం అని, వేదికకు సామల సదాశివ వేదిక అని నామకరణం చేశారు. జాయపసేనాని ప్రాంగణంగా రవీంద్రభారతి రవీంద్రభారతికి కాకతీయుల కాలంలో నృత్యరత్నావళి వంటి గొప్ప కావ్యాన్ని రాసిన జాయపసేనాని ప్రాంగణం అని, ప్రధాన వేదికకు నటరాజ రామకృష్ణ వేదిక అని నామకరణం చేశారు. రవీంద్రభారతి మినీహాల్‌కు ఇరివెంటి కృష్ణమూర్తి వేదికకగా, దేవులపల్లి రామానుజరావు ప్రాంగణంగా పేర్లు పెట్టారు. తెలంగాణ సారస్వత పరిషత్‌కు మరిగంటి సింగనాచార్యుల ప్రాంగణంగా, శతావధాని కృష్ణమాచార్యుల వేదికగా నామకరణం చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌కు అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణంగా, పేర్వారం జగన్నాథం వేదికగా పేర్లు పెట్టారు. ప్రస్తుతం ప్రాథమికంగా నామకరణం చేసిన ఈ వేదికలు, ప్రాంగణాల పేర్లలో కొన్ని మార్పులు, చేర్పులు ఉండవచ్చని అధికారులు తెలిపారు. -
తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకా రుడు రవిశంకర్ రూపొందించగా.. సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఎం.వి.రమణారెడ్డి రూపొందించారు. మంగళవారం ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలో.. కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో పొందుపరిచారు. లోగో పై భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రించారు. మన తెలంగాణము తెలుగు మాగాణము అనే వాక్యం కనిపిస్తుంది. సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పుటలను నీటి అలలుగా చిత్రించారు. లోగో పైభాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా పొందుపరిచారు. లోగో మధ్యలో పాల్కూరి సోమనాథుడి పద్యభాగం ‘సరసమై బరగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని ప్రముఖంగా చేర్చారు. -
తెలంగాణ సాహిత్య అకాడమీ నా కల
- అకాడమీ ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు - అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నందిని సిధారెడ్డి హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పాటు కావాలనేది నా మొదటి కల. తెలంగాణ సాహిత్య అకాడమీ స్థాపన నా రెండో కల. ఇప్పుడు ఈ 2 స్వప్నాలు నెరవేరడం సంతోషంగా ఉంది’’ అని రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతిలో అకాడమీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరిం చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణా చారి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమక్షంలో అధ్యక్ష ఆసనంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా రవీంద్రభారతి ప్రధాన వేదికపై అభినందన సత్కార సభ జరిగింది. కేవీ రమణాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ.. నందిని సిధారెడ్డి గొప్ప బావుకుడని, తెలంగాణ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా నియమితులవుతూనే.. తన వెంట ప్రపంచ తెలుగు మహా సభలను తీసుకొస్తున్నారని అన్నారు. కవులే నా సంపద: సిధారెడ్డి సిధారెడ్డి తన స్పందనను తెలియజేస్తూ.. సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతో కేబినెట్ హోదా తీసుకునే శక్తి ఉన్నా.. తెలుగు సాహిత్యంపై మమకారంతో ఆ పని చేయలేదని, ఆలస్యంగానైనా అకాడమీ అధ్యక్షుడిగా నియమితులైనందుకు గర్వంగా ఉందని చెప్పారు. కవులే తన సంపదని అన్నారు. 34 ఏళ్ల తర్వాత కొత్త రాష్ట్రంలో కొత్త అకాడమీని ఏర్పాటు చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సాహిత్యప్రచారం, పరిశోధన, ప్రచురణలు, వర్తమాన కవులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. కొత్త తరానికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. పుస్తకాలను అచ్చు వేయలేని వారిని ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కృషి ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి సాహిత్య అకాడమీ కృషి చేస్తుందని, సాహిత్య అకాడమీ తెలుగు వర్సిటీతో కలసి పనిచేస్తుందని తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య యస్వీ సత్యనారాయణ అన్నారు. వివక్షకు గురైన కళలు, సాహిత్యం, చరిత్రకు పూర్వ వైభవం వస్తుం దని, తెలంగాణలో సాహిత్య అకాడమీ దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తుందని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు ఆకాంక్షించారు. అన్ని అర్హతలున్న వ్యక్తికి సాహిత్య అకాడమీ పదవి దక్కిందని, తెలం గాణ సాహిత్యం మళ్లీ ఓ వెలుగు వెలుగుతుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి, ప్రముఖ రచయి త ఎన్ గోపి, ప్రముఖ కవి కె.శివారెడ్డి, గ్రంథాలయా ల సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రసమయి, రామలింగా రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరి కృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు గౌరీశంకర్, వకుళాభర ణం కృష్ణమోహన్, కవయిత్రి ఓల్గా, సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు.