సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహాసభలు జరిగే ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. స్డేడియం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు ఎల్బీ స్టేడియం కేంద్రంగా ట్రాఫిక్ మళ్లించారు. ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్‌కు మళ్లిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ నుంచి ఛాపెల్ రోడ్‌కు పంపిస్తారు. బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి జీపీవో వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోఠి మీదుగా పంపిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు పంపిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ మీదుగా మళ్లించనున్నారు.
కాగా, ప్రపంచ తెలుగు మహా సభలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యే తెలుగు మహా సభలు ఈ నెల19 వరకు జరుగనున్నాయి. మహాసభలకు వివిధ ప్రాంతాల నుంచి 30 వేలమంది అతిథులు హాజరుకానున్నారు. సభలకు వచ్చే వారి కోసం 32 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మహాసభలకు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు నగర ఇన్‌చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మహాసభలకు దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసే ప్రాంతాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కొత్వాల్ పేర్కొన్నారు. భద్రత, బందోబస్తు విధుల కోసం నగర పోలీసు విభాగంలోని 9 వేల మందికి తోడు మరో మూడు వేల మందిని మోహరిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment