అద్వితీయం... | different programs in lb stadium | Sakshi
Sakshi News home page

అద్వితీయం...

Published Sun, Dec 17 2017 1:54 AM | Last Updated on Sun, Dec 17 2017 1:56 AM

different programs in lb stadium - Sakshi

భాగ్యనగరం రెండోరోజూ తెలుగు వెలుగులతో  జిగేల్‌మంది. సాహితీ సౌరభాలతో గుబాళించింది. కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల హోరులో తడిసి ముద్దయింది. నగరంలో ఏర్పాటు చేసిన ఆరు ప్రాంగణాలు భాషా, సాహిత్య అభిమానులతో కిక్కిరిసిపోయాయి. అమ్మ భాషను అందలం ఎక్కిస్తూ అంగరంగవైభవంగా కార్యక్రమాలు కొనసాగాయి. ఎల్బీ స్టేడియంలో ‘సాహిత్య సభ.. తెలంగాణలో తెలుగు భాషా వికాసం’, తెలంగాణ సారస్వత పరిషత్‌లో శతావధానం, తెలుగు వర్సిటీ ప్రాంగణంలో పద్య కవితా సౌరభం, రవీంద్రభారతిలో అష్టావధానం, బాలసాహిత్యం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్‌ కవి సమ్మేళనాలు జరిగాయి. ఆయా కార్యక్రమాల విశేషాలివీ..


అమ్మ భాషకు అభయం

తెలుగు కనుమరుగవుతుందా? యునెస్కో హెచ్చరిక త్వరలోనే నిజమవుతుందా?
దీనిపై భాషాభిమానుల్లో కలవరమెంతో. ప్రపంచంలో అద్భుత సాహితీ ప్రక్రియలున్న గొప్ప భాషల్లో ఒకటిగా వెలుగొంది ఇక చరిత్రపుటలకు పరిమితమవబోతోందన్న మాటలు పెద్ద భయాన్నే రేకెత్తించాయి. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీదుగా వెలువడుతున్న మాటలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. భయం వద్దు.. కాస్త మనసు పెడితే భాష మళ్లీ శాఖోపశాఖలుగా వికసిస్తుంది, మనకే ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియలు విలసిల్లుతాయి, విరాజిల్లుతాయంటూ కొత్త అభయాన్ని ఇస్తున్నాయి.

గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఘనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభల తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ‘శతదా, సహస్రదా.. అమ్మ భాషను రక్షించుకునేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంద’ని బమ్మెర పోతన వేదిక సాక్షిగా గట్టిగా చెప్పారు. ఇప్పుడు సాహితీ ప్రముఖులు ఇదే మాటను పునరుద్ఘాటిస్తున్నారు. మన భాషకు వచ్చిన భయమేమీ లేదని, అది అద్భుతంగా వికసించి తీరుతుందంటున్నారు. సభల రెండో రోజైన శనివారం లాల్‌బహదూర్‌ క్రీడా మైదానంలోని పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై సాయం వేళ నిర్వహించిన సాహిత్య సభ, సాంస్కృతిక సమావేశంలో వక్తలు తెలుగు భాష విషయంలో భయం వద్దంటూ తేల్చి చెప్పారు. అంతా కలిస్తే అమ్మ భాష మనతో శాశ్వతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సభలో డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ముదిగొండ సుజాతారెడ్డి, డాక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ ప్రసంగించారు. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి కూడా ప్రసంగించారు. పంజాబీ రచయిత్రి డాక్టర్‌ వనిత, తమిళ రచయిత్రి సల్మాలను ఘనంగా సత్కరించారు. ఇందులో ఎవరెవరు ఏమన్నారంటే..

తెలంగాణ గొప్ప సాహిత్యానికి పుట్టినిళ్లు. తెలుగు భాషలో ఎన్నో ప్రయోగాలు ఈ నేల మీదుగానే శ్రీకారం చుట్టుకున్నాయి. మనుచరిత్ర కంటే ముందే తెలంగాణ నేలపై ప్రబంధ కావ్యాలొచ్చాయి. – ప్రముఖ సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం

శ్రామికుల చెమట చుక్కల్లోంచి మన భాష వికసించింది. దాన్ని పండితులు తీర్చి దిద్దారు. ఆ అద్భుత భాషలో సాహిత్యం పుట్టింది తెలంగాణలో. నవాబులు అణచివేత చర్యలనూ ఎదుర్కొని నిలబడ్డ ఈ భాషకు ప్రమాదం లేదు. యునెస్కో తాత దిగొచ్చి చెప్పినా మన భాషకు వచ్చే నష్టం లేదు. – ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

935 ఏళ్ల క్రితమే ముదిగొండ చాళుక్యుల శాసనం, గూడూరు శాసనం, జినవల్లభుడు తయారు చేయించిన కురిక్యాల శాసనాలు తెలంగాణలోనే తొలి తెలుగు వైభవాన్ని చాటి చెబుతున్నాయి. – డాక్టర్‌ సుజాతారెడ్డి

శాతవాహనులు నాటిన తెలంగాణ మొక్క ఊడల్లేచి పెరిగింది మర్రిచెట్టు లెక్క. – నటుడు తనికెళ్ల భరణి


జ్ఞాపకాల దొంతరలో దొరికిన బాల్యం

‘వీరగంధము తెచ్చినాము– వీరుడెవ్వడో తెల్పుడి... అమ్మా అమ్మా చెప్పమ్మా ఆకాశం అంత ఎత్తున ఎందుకుంది... చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి...’ అంటూ వేదిక మీదున్న కథాకారులు తన్మయత్వంతో ఉచ్చరిస్తుంటే... ఎవరు మాత్రం బాల్యంలోకి పరుగులు తీయకుండా ఉండగలరు?

రవీంద్రభారతిలోని డాక్టర్‌ యశోదారెడ్డి ప్రాంగణంలోని బండారు అచ్చమాంబ వేదిక మీద సరిగ్గా ఇదే జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బాలసాహిత్య సదస్సు హాలు నిండిపోయింది. ఆహూతులంతా ట్రంకు పెట్టెలో దుస్తుల అడుగున జ్ఞాపకాల దొంతరలలో దాచుకున్న బాల్యాన్ని వెతుక్కోవడానికి వచ్చినట్లే ఉన్నారు. తమ బాల్యాన్ని దాటి సమాజంలో జీవితాన్ని ఈది అలసిపోయిన కథాపిపాసులకు ఈ సదస్సు ఓ బంగారు అవకాశమైంది. పిల్లలమర్రి రాములు అధ్యక్షతన జరిగినఈ సదస్సులో చొక్కాపు వెంకటరమణ, పత్తిపాక మోహన్, ఐతా చంద్రయ్య, దాసరి వెంకటరమణ, వేదకుమార్, దేవేంద్ర, గిరిజారాణి, రంగయ్య పాల్గొన్నారు.

‘‘జానీ జానీ, ఎస్‌ పపా, ఈటింగ్‌ షుగర్, నో పపా గేయంలో... చక్కెర తినడం లేదని చెప్పిన పిల్లాడు నోరు తెరిస్తే నోటి నుంచి చక్కెర జారిపడుతుంది. ఈ గేయంలో పిల్లలకు ఏ సంస్కారాన్ని నేర్పుతున్నాం?’’ అని ఆవేదన చెందారు కథకుడు ఐతా చంద్రయ్య. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి అంటూ సాగే మన గేయాలలో పిల్లలకు సమాజాన్ని పరిచయం చేస్తాయన్నారు. మన స్థానిక సాహిత్యమైనా, తెలుగులోకి అనువదించుకున్న సింద్‌బాద్‌ సాహస యాత్ర వంటి పొరుగు సాహిత్యమైనా సరే అందులో పిల్లలకు సంస్కారాన్ని, మంచిని నేర్పే ఇతివృత్తం ఉండాలన్నారు. తెనాలి రామకృష్ణుని కథలలోని హాస్యాన్ని, మర్యాద రామన్న కథల ద్వారా యుక్తిని పిల్లలు ఆస్వాదిస్తారన్నారు.

పిల్లల భాష తియ్యగా ఉండాలి!
పిల్లలు పాలమీగడను ఇష్టపడినట్లే కథలనూ ఇష్టపడతారు. వాళ్లకు చెప్పే కథలు కూడా తేలిక పదాలతో మీగడ తరకల్లా ఉండాలి. పిల్లల కథల్లో ప్రకృతిలోని ప్రతి వస్తువూ మాట్లాడుతుంది. అదే పిల్లల కథకు అందం. పిల్లలకు ఆనందం. వీరమాత కథలు చెప్పాలి, దేశభక్తుల కథలు వినిపించాలన్నారు వక్తలు. ప్రతి స్కూల్‌లోనూ లైబ్రరీ పీరియడ్‌ ఒక గంట తప్పని సరిగా ఉండాలని వాసా నర్సయ్య తన సందేశంలో తెలియచేశారు. తమకు పాఠశాలలో ఒక తరగతి సాహిత్య పఠనానికి ఉండేదని, దానిని పునరుద్ధరించాలని కోరారు బాల సాహితీవేత్త రెడ్డి రాఘవయ్య. ప్రపంచం బతకాలంటే బాల సాహిత్యం బతకాలని ముక్తాయించారు. – వాకా మంజులారెడ్డి


సోమనాథుడి నుంచి సురవరం వరకు

వెల్లివిరిసిన పద్యకవితా సౌరభం
తెలంగాణ పద్యకవితా సౌరభానికి తెలుగు విశ్వవిద్యాలయంలోని బిరుదురాజు రామరాజు ప్రాంగణం  వేదికయ్యింది. పోతన లాంటి కవులపై సోమనాథుడి కవితా నిర్మాణం, శైలి ప్రభావాన్ని గుర్తు చేసుకుంటూ సోమనాథుడు కందం రాసినా, సీసం రాసినా రసాత్మకత ఉట్టిపడేదనీ, సంస్కృతం కాదు తెలుగుకి ప్రాధాన్యతనివ్వాలంటూ ఆయన రాసిన ‘తెలుగు మాటలనంగ వలదు’ పద్యాన్ని సభాధ్యక్షుడు అనుమాండ్ల భూమయ్య చదువుతూంటే పద్యరసాన్ని ఆస్వాదించారు  భాషాప్రేమికులు.

అప్పడాల్లాంటి కాగితాల్లో...
అప్పడాల్లాంటి కాగితాల్లో ముట్టుకుంటే రాలిపోయే శిథిలప్రాయంలోని పద్యకావ్యాలను దాచుకుని చదువుతున్నామంటూ ఎంతో విలువైన ప్రాచీన పద్యకావ్యాల పునర్‌ముద్రణకు పూనుకోవాలని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేశారు. పద్యకావ్యంలో ఒదిగిన కొత్తపదాలను తడిమి చూసిన ఈ వేదిక మీద తూర్పు మల్లారెడ్డి కౌస్తుభం అనే ఎత్తుగడతో ప్రారంభించి, ‘వాస్తుభం’ పద ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ... దాని అర్థం స్తుభం అంటే పొగడదగినదనీ, ఉర్దూలోని వాహ్‌ని తీసుకుని వాతో కలిపి వాస్తుభం అయ్యిందనీ, రెండు భాషల కలయికతో కొత్తపద సృష్టి తెలంగాణ ఘనత అనీ వివరించారు.

పద్యాన్ని మందారంగా చేసి మకరందాన్ని కురిపించిన పోతన మరెవ్వరూ రాయనంత అందమైన పద్యాలను రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ సంగనభట్ల నర్సయ్య–   ఎన్ని నోముల ఫలము ఇంతపొద్దు ఒక వార్త వింటిని మన యశోద చిన్న మగవాని కనెనట చూచివత్తునమ్మ సుధము... అని పాడి శ్రోతలను మైమరపించారు. పుట్టినప్పటి నుండి వెట్టిచాకిరి చేసి... కులకాంత రోజంత కూలిచేసినగాని బుక్కెడన్నం దక్కదాయె అంటూ తెలంగాణ పద్యకవిత్వంలోని ఆధునికతను గండ్ర లక్ష్మణరావు ప్రస్తావించారు.

ఛందస్సును ఛేదించిన సురవరం
అనంతరం మధ్యాహ్నం జరిగిన తెలంగాణ వచన కవితా వికాసం సదస్సు అనేక దశల్లో కవితాప్రవాహ వేగాన్ని లోతుగా చర్చించింది. వ్యాకరణం, ఛందస్సును ఛేదించుకుని ... అన్న శ్రీశ్రీ, పట్టాభి కంటే ముందే భావ – పద్యకవిత్వాలను నెగేట్‌ చే సి 1935లోనే సురవరం ప్రతాపరెడ్డి వచన కవిత్వాన్ని తెచ్చారని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మాత్ర ఛందస్సు, గేయ ఛందస్సు, ఆ తరువాత వచన కవిత్వం తెలంగాణలో ఆవిష్కృతం అయిన క్రమాన్ని వివరించారు. సురవరం అనంతరం వావి నారాయణ మూర్తి, కవిరాయమూర్తి వచన కవిత్వం కొనసాగించిన విధానాన్ని ఈ సదస్సు గుర్తు చేసుకుంది.

దిగంబర కవిత్వం కొనసాగింపుగా వచ్చిన విప్లవ కవిత్వం, అస్తిత్వ కవిత్వం, ఉద్యమ కవిత్వ ప్రవాహాన్ని భాషాభిమానులు తమ జ్ఞాపకాల్లో పొదివిపట్టుకున్నారు. గత 40–50 ఏళ్ళలో వచన కవిత్వంలో వచ్చిన మార్పు మరిదేనిలోనూ రాకపోవడం సామాజిక మార్పు ప్రభావాన్ని ప్రకటిస్తోందన్నారు గౌరవ అతిథి కె.శివారెడ్డి. ఇంకా జూలూరి గౌరీశంకర్, నారదాసు లక్ష్మణరావు, పెన్నా శివరామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. – అత్తలూరి అరుణ


కమనీయం.. కవి సమ్మేళనం
ఒకే వేదికపై 500 మందికిపైగా కవులు
‘అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కుక్కపిల్ల.. ఆల్లు.. ఈల్లు.. అస్తుండ్లు.. పోతండ్లు..’ ఒకటేమిటి ‘అ’నుంచి ‘ఱ’ వరకు సమస్త పదాలతో వచన కవుల ఆత్మనే కవితా çపంక్తులుగా మలిచి విసిరారు. కమ్మని గడ్డ పెరుగులాంటి కవితలతో అలిశెట్టి ప్రభాకర్‌ ప్రాంగణం తన్మయం చెందింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వచన కవితా పండితులు తమ కవితలతో పదాల్లో నవరసాలను పండించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారం జరిగిన బృహత్‌ కవి సమ్మేళనం ఆద్యంతం ఆనందభరితంగా సాగింది. వానమామలై వేదికపై ప్రముఖ కవి దిలావర్‌ అధ్యక్షతన మొదలైన తొలి సమావేశం సీహెచ్‌ మధు అధ్యక్షతన జరిగిన తొమ్మిదో సమావేశంతో ముగిసింది. ప్రతి సమావేశానికి ఒక్కో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేదికపై 500 మందికిపైగా కవులు తమ కవితలను వినిపించారు. ‘మట్టి పొరల్లోనే  మండిపడే బడబాగ్ని.. మధనపడే తిరుగుబాటు, తిరగబడే తీవ్రవాద మొలకలై.. మొక్కలు మారితే  విప్లవం వటవృక్షాలుగా మారక ఏమవుతుంది? తుపాకులు ఎగురుతూ.. తూటాల చప్పుళ్లు వినిపిస్తుంటే మర ఫిరంగుల్లా మారక మరేం చేస్తాయి?’ అంటూ అన్వేషి అనే కవి రాజ్యహింసను సూటిగా ప్రశ్నించారు. ‘ఆ రాళ్లు పులకిస్తాయి.. పువ్వులై వికసిస్తాయి.. సౌందర్య సౌరభాలను గుబాళిస్తాయి.. ఆ రాళ్లు నాట్యాలై నర్తిస్తాయి.. శృంగార సోయగాలను వినిపిస్తాయి.. మనసును మత్తెక్కిస్తాయి.. అదే ఉలి సంతకం నేడు తెలుగుగా  మహాసభలకు శోభాలంకృతమై తెలుగు వెలుగుల కీర్తికిరీటాలైతాయి..’ అంటూ మరో కవి తన కవిత వినిపించారు.

‘అ’మ్మ మన తోటలో ‘ఆ’వుదూడ నిల్చుంది. ‘ఇ’ంతలో తోటమాలి ‘ఈ’ ప్రాంతం వచ్చినాడు.‘ఉ’రికి ఆవు దూడను చూసి ‘ఊ’రుకోలేక ..‘రు’మాలునుజుట్టి ‘రూ’లుగర్రలను బట్టి ‘లు’ంబినీ వనంను.. ఇలా తెలుగు అక్షరమాల అ నుంచి ఱ వరకు గండి వెంకటేశ్వర్లు చదివిన కవిత సభికులను మంత్రముగ్ధులను చేసింది. ‘విరిసే నవచేతనం ఇది మాగాణం... ఇది మా..గానం. ఇక ఎండదు ఏ వృక్షం.. పండును ప్రతి ఫలపుష్పం. ఈ దారుల నదీనదం ఉరకలెత్తి ఉప్పొంగును. ఇది మాగాణం.. ఇది మా తెలంగాణం’ అంటూ కవి నర్సింహారెడ్డి భవిష్యత్‌  తెలంగాణను వివరించారు. ‘కంచు కంఠాలతో కండలు తెంచే బఠానీలాంటి తెలంగాణ హఠానీలను కూడా మిఠాయిలా మింగి వేసే తహతహ మాత్రం  మెండుగా ఉంది. కానీ కమ్మని కంఠం నాకు లేదు’ అంటూ షేక్‌ నబీరసూల్‌ రాసిన కవిత ఆçహూతులను ఆకట్టుకుంది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు


సురవర కల్పవృక్షమై...
సురవరం, సింగిరెడ్డి, దాశరథి, మాడపాటి పదాలతో కేసీఆర్‌ ప్రభుత్వ పాలనను వర్ణించాలని కోరగానే, ‘సురవర కల్పవృక్షమై శుభ్రకళా సుకలాప రూపమై’ అన్న తొలిపంక్తిని ఆశువుగా పూరించారు శతావధాని డాక్టర్‌ జి.ఎం.రామశర్మ. తెలంగాణ సారస్వత పరిషత్‌లో రామశర్మ శతావధానం భాషా చమత్కారాల మధ్య శనివారం ప్రారంభమైంది. ‘ఇంగ్లిషు చదువులు తెలుగు రాతను మార్చాయి. అమ్మ భాషకు కొత్త సొగసులు అద్దేందుకు భాషా పండితులే కాదు, ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. అందుకు ఈ మహాసభలకు హాజరైన వారే సాక్షిభూతులు’ అన్నారు రామశర్మ.

సభకు అధ్యక్షత వహించిన అయాచితం నటేశ్వర శర్మ మాట్లాడుతూ... ఒక జాతి చరిత్ర, సంస్కృతి, కళ, సాహిత్యం... అన్నీ భాషపైనే ఆధారపడి ఉంటాయన్నారు. తెలుగు భాష అజంతం, తెలుగు మాట అనంతం అన్నారు అనుసంధానకర్త పెరుంబుదూరు శ్రీరంగాచార్య. ‘తెలుగు భాషకు మాత్రమే ఉన్న ప్రత్యేకత అవధానం. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు విడిపోలేదు, నన్నయ విడిపోలేదు, పోతన విడిపోలేదు. సారస్వతం విడిపోలేదు. వాక్యం రసాత్మకం కావ్యమ్, విశ్వః శ్రేయమ్‌ కావ్యమ్‌... అది పరమ సత్యం చేసిన ప్రక్రియ అవధానం. తెలంగాణలోని అవధానులూ అదే నిరూపిస్తున్నారు.

పృచ్ఛకుల విషయంలో ప్రాంతీయ భావం లేకపోవడం సంతోషంగా ఉంది. శివకేశవులకు భేదం లేనట్లే ఆంధ్ర, తెలంగాణలకు భేదం లేదు’ అని గౌరవ అతిథి మేడసాని మోహన్   తన అంతరంగాన్ని పంచుకున్నారు. అధికారులు కాని, రాజకీయ నాయకులు కాని తమ పిల్లల్ని  తెలుగు మీడియంలో చదివించట్లేదు. ‘సంస్కృతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, అన్ని విభాగాలలో ఇంగ్లిషు చలామణీ అయ్యేలా కొంతమంది మేధావులు ప్రచారం చేస్తున్నారు. ఇలాగైతే దేశం బానిసత్వంలోకి వెళ్లిపోతుంది. ఆ ప్రమాదం నుంచి త్వరగా బయటపడాలి’ అని కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

‘పృచ్ఛకులు, అవధాని సమష్టిగా చేసే కృషి భాషోన్నతికి ఉపయోగపడుతుంది. వారి వారి పాండిత్యాలు ప్రదర్శించడమే కాకుండా, శ్రోతలను విజ్ఞానవంతులను చేయాలి’ అని అభిలషించారు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌. ‘1975లో మొదటి ప్రపంచ మహాసభలలో నేను కార్యకర్తగా పనిచేశాను. ఇప్పుడు ఒక కవిగా పాల్గొంటున్నాను’ అని సంబరపడ్డారు పృచ్ఛకుల్లో ఒకరైన వి.వి.సత్యప్రసాద్‌. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కావూరి పాపయ్య శాస్త్రి,  దత్తాత్రేయశర్మ, మాడుగుల నాగఫణిశర్మ తదితరులు పాల్గొన్నారు. – డాక్టర్‌ వైజయంతి


సకల జనుల ఇష్టావధానం!

రసరంజకంగా మలుగ అంజయ్య అవధానం
తెలుగు గొప్పదనం పద్యమైతే.. ఆ పద్యాన్ని శ్వాసించి, గానించి, కీర్తించి ప్రజల నాలుకలకు వారి గుండెలకు చేరువ చేసిన ఖ్యాతి అవధానులది! తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ వన్నె తరగని ఆకర్షక శక్తి, వశీకరణ యుక్తి అవధానానికి ఉందని నిరూపించింది శనివారం రవీంద్రభారతిలోగుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణంలో జరిగిన అష్టావధాన  కార్యక్రమం. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య డాక్టర్‌ మలుగ అంజయ్య అవధానం రెండు గంటలపాటు రసరంజకంగా సాగింది. పృచ్ఛకులు (ప్రశ్నించేవారు) అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘ సమాసాల జోలికి పోకుండా అలతి అలతి పదాల తెలుగు పదాల్లో బదులిచ్చారు.  వడిచర్ల సత్యం దత్తపదిగా సెల్‌ఫోన్, షేరిట్, వైఫై,  మెయిల్‌ పదాలిచ్చి రాముడి పంచన చేరిన తమ్ముడు విభీషణుడిని రావణాసురుడు దూషిస్తున్న ఘట్టాన్ని వర్ణించమని కోరారు.

‘అరివైపైనుండగా... నీకే సెల్లుపోనుండకు, రాముని కోరి భజింపుము సేరియిట్టులే, దశకంఠుడు చెండెను మేలు మేలనన్‌..’ వంటి పద విరుపులతో మెరుపులు పుట్టించారు. పల్లాలి కొండయ్య ఇచ్చిన ‘దారపు మాలలేసుకుని దంపతులయ్యిరి ప్రేమ మీరగన్‌’ సమస్యకు మం...దారపు మాలలు వేసుకుని అంటూ చమత్కారంగా పూరించారు. ఈ పద్యంలో తారలు నేల వ్రాలినను తప్పను ధర్మము...అన్న పాదానికి సినీనటుడు తనికెళ్ల భరణి సినీతారలు వ్రాలినా అని చమత్కరిస్తే... ఏ తారలైనా అంటూ అవధాని బదులిచ్చారు. చిక్కా రామదాసు అశేష జనవాహినితో నిండిన సభను వర్ణించాల్సిందిగా కోరారు. అవధాని.. ‘మంజుల సాహితీ మల్లికల్‌ పుష్పించె, ఆమని రుతువయ్యె హైద్రబాదు..’ అంటూ చక్కని సీసపద్యాన్నెత్తుకోవడంతో సభ్యులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు.

పద్యంలో ఒకచోట ‘కవితా జాగృతమయ్యి కళలు పంచె’ అనీ...‘మాన్య చంద్రశేఖరరావు మనసు నిండె’ అంటూ కేసీఆర్, కవితల పేర్లు సమయోచితంగా ప్రస్తావించారు. ఛందోభాషణ, ఆశువు, నిషిద్ధాక్షరి నిర్వహించిన పృచ్ఛకులు అవధాని అంజయ్య పటిమను ప్రశంసించారు. ఈ అవధానంలో వారగణనం ప్రత్యేకంగా నిలిచింది. సంవత్సరం, నెల, తేదీ చెప్పగానే అది ఏ వారమో చెప్పి అవధాని అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. సభ ప్రారంభంలో ప్రఖ్యాత అవధాని మాడుగుల నాగఫణిశర్మ అరగంటపాటు ప్రేక్షకుల్ని పద్యాలతో మైమరపించారు. ప్రపంచ మహాసభల పేరిట కేసీఆర్‌ భాషకు బ్రహ్మోత్సవం జరపడం తెలుగు వారి సుకృతమని ప్రశంసించారు.

పాల్కురికి సోమన, పోతన, నన్నయలాంటి పూర్వకవులను స్మరించుకోవడం మహదానందమన్నారు. సినీనటుడు తనికెళ్ల భరణి ఇది సాహితీ పునరుజ్జీవానికి నాందీవాచకమని, అందుకు ఇక్కడ కిక్కిరిసి నిలుచున్న తెలుగు వాళ్లే సాక్ష్యం అని ఉద్వేగంగా పలికారు. అవధానం పద్యంలో నాల్గు పాదాలను నాల్గు ఆవృత్తాల్లో ముగిస్తూ, మధ్యలో సాహితీ సరసోక్తులు విసురుతూ రసరంజకంగా సాగాలి. అయితే సమయాభావం వల్ల  గంటలో వేగావధనంగా ముగిసింది. సభలో యువతరానికి చెందిన కొందరు పద్యాలను చక్కగా రాసుకోవడం విశేషం. హాస్యావధానంలో శంకర నారాయణ సంధించిన చమక్కులు ఆహూతులను అలరించాయి. – రామదుర్గం


ప్రతిరోజూ హరికథ సాధన
తొమ్మిదో తరగతి చిన్నారి లోహిత
బాలసాహిత్య సభకు వచ్చిన వారిని కట్టి పడేసిన కార్యక్రమం చలసాని లోహిత చెప్పిన పార్వతీ కల్యాణం హరికథ. కూకట్‌పల్లికి చెందిన ఈ చిన్నారి తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఆసక్తిగా హరికథ చెప్పిన లోహితను పలకరించినప్పుడు...
హరికథతో పరిచయం: అమ్మ వాళ్లది తెనాలి దగ్గర వేమూరు. అక్కడ వరికూటి జయమ్మ లాంటి భాగవతార్లు ఎంతో మంది ఉన్నారు. నాకు మూడేళ్లు ఉన్నప్పుడు అమ్మ వారి హరికథలకు తీసుకెళ్లింది. కొచ్చెల రామకృష్ణ గారి దగ్గర కొంత కాలం శిష్యరికం చేశాను. ఇప్పుడు ఉమామహేశ్వర్‌ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సంస్కృతంలో కుమార సంభవం, తెలుగులో పార్వతీకల్యాణం, సీతా కల్యాణం నేర్చుకున్నాను.
కథలే కాదు...:  డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో 9 వతరగతి చదువుతున్నాను. వారంలో మూడు సార్లు హరికథ తరగతులుంటాయి. ప్రతిరోజు ప్రాక్టీస్‌ చేస్తుంటాను. అమ్మ దగ్గరుండి అన్నీ చూసుకోవటం వల్ల ఏ ఒత్తిడీ లేకుండా నేర్చుకోగలుగుతున్నాను. శోభానాయుడు, కేబి సత్యనారాయణ దగ్గర నృత్యం, నాగరాజ్‌ ప్రసాద్, శ్రీమన్నారాయణ వద్ద సంగీతం నేర్చుకున్నాను.  
భవిష్యత్తులో...: ఇటీవలే 108 మంది హరికథ భాగవతుల సత్కార కార్యక్రమం ధర్మపురిలో జరిగింది. అక్కడ సచ్చిదానంద శాస్త్రి హరికథ చెప్పారు. ఆయన చెప్పిన తీరు నన్నెంతో ఉత్సాహపరిచింది. కచ్చితంగా హరికథ భాగవతారిణిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. నాకు హరికథ నేర్పించాలని మా తల్లిదండ్రులకు ఆలోచన కలిగినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నాలుగు వందల ప్రదర్శనలు: ఇప్పటి వరకు నృత్య, సంగీత, హరికథ ప్రదర్శనలు నాలుగు వందల వరకు ఇచ్చాను. పిల్లలకు, నా వయసు వారికి హరికథల గురించి తెలియదు. పేరెంట్స్‌ అలవాటు చేస్తే వాళ్లు చూస్తారు. తెలుసుకుంటారు. నృత్యం, సంగీతం కలిపి హరికథ చెప్పటం జరుగుతుంది. చాలా తృప్తి, సంతోషం కలుగుతాయి. – ఓ.మధు


ఇలా  చేద్దాం...!
‘వివేకవర్ధని’ మాసపత్రికను వెలువరిస్తూ 1874లో కందుకూరి వీరేశలింగం పంతులు గారొక గొప్ప సంకల్పం చెప్పారు. ‘ఈ పత్రికా ప్రకటనము నందు నా యుద్దేశములు భాషాభివృద్ధియు, దేశాభివృద్ధియు ముఖ్యముగా రెండు. నేనేర్పరచుకొన్న భాషాభివృద్ధి మార్గము తెలుగు భాషలో మృదువైన, సులభమైన, సులక్షణమైన వచన రచన చేయుట. దేశాభివృద్ధి మార్గము జనులలో గల దురాచార దుర్వర్తనముల బాపియు....’’ ఎంత గొప్ప మాట! వేమన, అన్నమయ్య, వీరేశలింగం పంతులు, గురజాడ, గిడుగు, సురవరం ప్రతాపరెడ్డి, ఆళ్వార్‌స్వామి, సినారె... ఇటువంటి మహనీయులు ఒక రకంగా భాషా పరిశోధకులే! వ్యక్తులుగా, వారికి తెలియకుండానే భాషపై లోతైన పరిశోధనలు జరిపి సాహిత్య రూపంలో నూతన ఆవిష్కరణలు చేశారు.

వారందరి కృషి వల్లే తెలుగు భాష స్వరూప స్వభావాలు మార్చుకుని ప్రజలకు మరింత ఉపయోగ సాధనమైంది. జనసామాన్యం వాడుకలో భాష చెందుతున్న మార్పులకు అనుగుణంగా ఎందరెందరో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తద్వారా భాషాభివృద్ధికెంతో మేలు జరిగింది. ఇదొక స్రవంతిలా సాగాలి. భాషను దీర్ఘకాలం సజీవంగా ఉంచేందుకు అన్ని స్థాయిల్లో పరిశోధనలు, ప్రయోగాలు, పరిరక్షణ చర్యలుండాలి. మాయబజార్‌ సినిమాలో ఘటోత్కచుడిగా ఎస్వీరంగారావు, ‘ఎవరో పుట్టించకుండా మాటలెలా పుడుతాయ్‌...వెయ్‌ వీరతాడు’ అన్న స్ఫూర్తితోనే ఎక్కడైనా భాష సుసంపన్నమౌతుంది.

‘యూఎన్‌’ ని నార్లవెంకటేశ్వరరావు ‘ఐక్యరాజ్యసమితి’ అనడమైనా, ‘డ్రెడ్జింగ్‌ షిప్‌’ను మరెవరో తెలుగులో ‘తవ్వోడ’ అనడమైనా భాషాపరంగా ఓ ముందడుగు. ఆ క్రమంలోనే స్ప్రింక్లర్‌ ఇరిగేషన్‌ను ‘తుంపర సేద్యం’అని, గ్లోబల్‌ వార్మింగ్‌ను ‘భూతాపం’ అనడం వంటి పద సృష్టి భాషా ప్రగతి. ఇలా భాషాభివృద్ధికి 5 ప్రాతిపదికలున్నాయి.  1. అకాడమీలు, విశ్వవిద్యాలయాల్లో పీఠాలు, సాహితీసంస్థల్లో పరిశోధనలు జరగాలి. 2. వినియోగంపై జనమాధ్యమాల్లో ప్రయోగాలు సాగాలి. 3. సాహితీరంగంలో నిత్యసృజన జరగాలి.  4. నిఘంటువులు, ప్రమాణ గ్రంథాలు, పారిభాషిక పదకోశాలు, పాఠ్యపుస్తకాల్లో ఈ నూతన ఆవిష్కరణల్ని ఉపయోగించాలి. 5. ఫలితంగా సమగ్ర భావ మార్పిడి, అభివ్యక్తితో తెలుగుజాతి గరిష్టంగా లబ్దిపొందాలి.

– దిలీప్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement