♦ స్వస్తిశ్రీ హేవళంబినామ సంవత్సరం.. దక్షిణాయనం.. హేమంత రుతువు.. మార్గశిర మాసం.. కృష్ణపక్షం.. త్రయోదశి.. సాయంత్రం 6 గంటలు.. స్థలం భాగ్యనగరం.. వేదిక లాల్‌బహదూర్ మైదానం.. పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదిక
♦ తేనెలూరే తియ్యటి తెలుగు భాషకు సమున్నతంగా పట్టంకట్టే మహా వేడుక..
♦ మరే భాషలో లేని అత్యున్నత సాహితీ ప్రక్రియలను తనలో ఇముడ్చుకుని ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’.. అంటూ ప్రపంచవ్యాప్తంగా జయజయధ్వానాలు అందుకునేలా, మహోజ్వలంగా వెలుగొందేలా మనమంతా కలసి చేసుకునే దివ్యమైన ఉత్సవం.. ప్రపంచ తెలుగు మహాసభలు నేడే మొదలు.
సాక్షి, హైదరాబాద్ :
తెలుగు వర్ణమాలలో అక్షరాలెన్ని..?
తెలుగు భాష ఔన్నత్యానికి ఒక్క నిదర్శనం..?
తేనెలూరే ఈ భాషలో ఉత్కృష్ట సాహిత్య ప్రక్రియ అవధానం అంటే ఏంటి..?
ప్రపంచ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై పేర్కొంటున్న సాహితీ దిగ్గజాల్లో ఒకరి గురించైనా తెలుసా..?
నేటి తెలుగు తరానికి ఈ ప్రశ్నలు సంధిస్తే ఒక్కదానికైనా సమాధానం రావడం కష్టమే. వెయ్యేళ్ల తెలుగు భాష పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో దీనితో తెలిసిపోతుంది. తప్పులు లేకుండా, పరభాషా పదాలు లేకుండా తెలుగులో మాట్లాడడం, ఒక్క వాక్యమైనా రాయడం ఎంత మందికి సాధ్యం. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా కీర్తిస్తున్నా.. ప్రపంచంలోని సుమధుర భాషల్లో తెలుగు ముందు వరసలో ఉన్నా.. మరే భాషలోనూ లేని సాహితీ ప్రక్రియలు తెలుగు సొంతమైనా సరే... కనుమరుగయ్యే ప్రమాదమున్న భాషల్లో తెలుగూ చేరబోతోందన్న మాట ఆందోళన కలిగిస్తోంది.
కోటి ఆశలతో..
కోటి ఆశలు మోసుకొస్తూ కొత్త ఆలోచనలతో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భ వించిన తర్వాత తొలిసారిగా జరుగుతుండ టంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిని తొలి తెలుగు మహాసభలుగానే పరిగణిస్తోంది. తెలుగు భాష ఘనతను చాటడం ఒక ఎత్తయితే.. తెలంగాణ యాసకు పట్టాభిషేకం చేయడం ప్రధానంగా మహాసభలను వైభవంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగువారిని ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని స్వాగతించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమవుతున్నాయి. తొలి తెలుగు మహాసభలు జరిగిన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణమే ఈసారి వేడుకలకు ప్రధాన వేదికగా ముస్తాబైంది. ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, గవర్నర్లు నరసింహన్, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు విశిష్ట అతిథులుగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సభాధ్యక్షుడిగా వేడుకలు మొదలుకాబోతున్నాయి. ప్రధాన వేదిక లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణంతోపాటు రవీంద్రభారతి ప్రధాన మందిరం, మినీ మందిరం, తెలుగు విశ్వవిద్యాలయం సభా మందిరం, తెలుగు లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని మందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తులలో తెలుగు భాషా వైభవం కళ్లకు కట్టనుంది.
ఇన్నాళ్లూ నిర్లక్ష్య జాడ్యం నీడలో..
మన పొరుగునే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆవిర్భవించిన కన్నడ, తమిళ రాష్ట్రాలు.. తమ భాషకు ఘనంగా పట్టం కట్టాయి. తమ భాషను బతికించుకోవడమే కాదు, అద్భుతంగా వికసింపచేసుకుంటూ వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఢిల్లీ విశ్వవి ద్యాలయాల్లోనూ వాటికి ప్రత్యేక విభాగాలు తెచ్చుకునే రీతిలో, ప్రాచీన హోదా పొంది భాష బాగు కోసం వందల కోట్లు సాధించు కునే స్థాయిలో కృషి చేశాయి. కానీ అమృత ప్రాయమైన తెలుగు భాషకు ‘గుర్తిం పు’పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడి పోయింది. ‘ఇప్పటికైనా తెలుగు వంతు వచ్చింది..’అన్న ఆశతో తెలుగు ప్రజలు సంతోషిస్తున్నారు. అసలు 1975లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహాసభల ప్రభావం భాషపై కొంత కనిపించినా.. తర్వాత ఈ సభలు హడావుడికే పరిమితమయ్యాయి. ఆ బాధ ముల్లులా పొడుస్తున్నా.. ఇప్పటి మహాసభలను మాత్రం భాషాభిమానులు కొత్త కోణంలో చూస్తున్నారు. తెలుగు భాష, పద్యం, సాహిత్యంపై తనకున్న అభిమా నాన్ని వీలున్నప్పుడల్లా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తాజా మహాసభల రథసారథి కావడమే దీనికి కార ణం. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన చేపట్టిన చర్యలు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయటంతో ఆయనపై ఆశాభావం నెలకొంది.
మంచిరోజులు వచ్చేనా?
2012 తెలుగు మహాసభల సందర్భంగా.. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేస్తామంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది మాటలకే పరిమితమైంది. ఆర్భాటానికి పరిమితమయ్యే అలాంటి హామీలు భాషను కాపాడలేవనే సంగతి అందరికీ బోధపడింది. అందుకే తెలుగు భాషను కాపాడేందుకు నిర్బంధ చర్యలు, భాషను సుసంపన్నం చేసుకునేలా ప్రజల్లో ఆసక్తి, చైతన్యం పెంపొందించే చర్యలు అవసరమన్న భాషావేత్తల సూచనలు అమలు కావాల్సి ఉంది. ‘తెలుగు వెలుగులు ప్రపంచా నికి పంచుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం’అంటూ ఈ మహాసభలకు ప్రభుత్వం ఖరారు చేసిన నినాదం నలుదిశలా మారుమోగాల్సి ఉంది. మన భాష మరిన్ని తరాలు మహోజ్వలంగా వెలుగొందేందుకు ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి. అలాగైతేనే మహాసభల సాక్షిగా చేసే తీర్మానాలు నీటిమీద రాతలు కాకుండా ఉంటాయి. ఈ దిశగా ప్రభుత్వంపై ఎంత బాధ్యత ఉందో, తెలుగు ప్రజలందరిపైనా అంతే బాధ్యత ఉంది. తెలుగులో పలకరించుకుందాం.. తెలుగులో రాద్దాం.. అమ్మ భాషను ఆదరిద్దాం.. మన భాషను కాపాడుకుందాం.. అందుకే ఇది మన పండుగ.. ఇంటింటి వేడుక.
లోటుపాట్లు ఉండొద్దు: కడియం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లతో కలసి మహాసభల ఏర్పాట్లపై సమీక్షించారు. వేదిక, ఇతర పనులను పరిశీలించారు జిల్లాల నుంచి 30 వేల మందికిపైగా ప్రతినిధులు ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారని.. దేశవిదేశాల నుంచి భాషావేత్తలు, సాహితీ ప్రియులు, విశిష్ట అతిథులు, భాషాభిమానులు మహాసభల్లో పాల్గొంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకల్లా ప్రధాన వేదిక సిద్ధం కావాలని, అధికారులు సమన్వయంతో బాధ్యతలు పంచుకుని సభలను విజయవంతం చేయాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం ఇలా..
ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతాయి. వేడుకల ప్రధాన అతిథి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా గవర్నర్ నివాసానికి చేరుకుంటారు. అదే సమయానికి సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకుంటారు. వారంతా తేనీటి విందు స్వీకరించి.. ఎల్‌బీ స్టేడియంలో మహాసభల ప్రాంగణానికి వెళతారు. అతిథులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకుతారు. వీఐపీలంతా వేదికపైకి చేరుకుని.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశాక మహాసభలు ప్రారంభమవుతాయి. స్టేడియంలో 10 వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment