సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో మూడో రోజు ఆదివారం భాషాభిమానులు పోటెత్తారు. కార్యక్రమాలు జరుగుతున్న అన్ని వేదికల వద్ద కూడా పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, అభిమానులు పాలుపంచుకున్నారు. సారస్వత పరిషత్తులో జరిగిన అవధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొని భాషాభిమానుల్లో ఉత్సాహం నింపారు. తెలుగు విశ్వవిద్యాలయంలో కవితా సదస్సు, నవలా సాహిత్య సదస్సు, కథా సదస్సు, తెలంగాణ నవలా సాహిత్యం, ఎల్బీ స్టేడియంలో సాహిత్య సభ, సాంస్కృతిక సమావేశం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవిసమ్మేళనం, రవీంద్ర భారతిలో బాలకవి సమ్మేళనం, అష్టావధానం, గణితావధానం, నేత్రావధానం, ప్రతాపరుద్రుని విజయం నృత్యరూపక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా అక్షరగణితావధానం
అక్షర గణితావధాని పుల్లూరు ప్రభాకర్ ఏ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి. వాక్యంలో ఎన్ని అక్షరాలున్నాయి. తెలుగులో అయితే ఎన్ని.. హిందీ, ఇంగ్లిష్‌లో అయితే ఎన్ని అక్షరాల్లో ఉంటాయనేది ఇట్టే చెప్పేస్తారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆకట్టుకున్న కథలు
తెలుగు విశ్వవిద్యాలయంలోని సామల సదాశివ వేదికమీద వక్తల ఉపన్యాసాల్లో ‘కథలల్లిన కథకుల కథలు’తెలుగు భాషాభిమానులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మారెడ్డి, అధ్యక్షత వహించిన బీఎస్ రాములు తెలంగాణ కథల నేప«థ్యానికున్న వైవిధ్యాన్ని, వాటితో ఇక్కడి ప్రజలకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఒక్క నిమిషం కవితలు..
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఎస్ రఘు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో కవులు ఒక నిమిషం నిడివి కవితలతో సభికులను మెప్పించారు. సమావేశంలో 25 మంది చొప్పు న కవులకు అవకాశం కల్పించారు. మంత్రి పోచారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఔరా అనిపించిన నేత్రావధానం
ప్రేక్షకుల్లోని కొంతమంది ఏదైనా రాసి ఇస్తే.. ఒక అవధాని దానిని కేవలం కంటి రెప్పల కదలిక ద్వారా చూపగా, మరో అవ ధాని అర్థం చేసుకుని తిరిగి రాసి చూపించి న నేత్రావధానం విశేషంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులు రాసి ఇచ్చిన కాగితాలను గురు వు, సమన్వయకర్త ఆదినారాయణ తీసుకుని.. ఒక అవధాని కె.శిరీషకు అందజేశారు. ఆమె ఆ కాగితంలోని అక్షరాలను తన కనురెప్పల కదలికలతో.. ఎదురుగా ఉన్న రెండో అవధాని ఎస్‌వీ శిరీషకు చూపా రు. రెండో అవధాని ఆ కనురెప్పల కదలికలను బట్టి.. అక్షరాలను కాగితంపై రాసి, వినిపించారు. తెలుగు పదాలే కాకుం డా, ఇంగ్లిష్, హిందీ పదాలనూ నేత్రావధానం ద్వారా గుర్తించడం సభికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక బొటనవేలితో చేసే ‘అంగుష్టావధానం’ ప్రక్రియలో భాగంగా ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అనే పదానికి అక్షరరూపం ఇచ్చారు.
అలరించిన బాలకవి సమ్మేళనం
డాక్టర్ సునీతా రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాల కవి సమ్మేళనం ఆద్యంతం అలరించింది. ఎనభై మందికిపైగా బాల కవులు ఇందులో పాల్గొన్నారు. చక్కటి తెలుగులో గేయాలను ఆలపించారు. సమ్మక్క సారక్క, రామప్ప గుడి, గోల్కొండ కోట వంటి చారిత్రక అంశాలను పాటలతో కళ్లకు కట్టారు. శాతవాహనులు, కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు, నిజాం నవాబులు, వేమన, పోతన, సోమన, సురవరం ప్రతాపరెడ్డిల నుంచి ఆధునిక కవి వరేణ్యులు జయశంకర్ వరకు తెలుగు సాహిత్యకారులను తలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment