Special programs
-
తల్లీబిడ్డల ఆరోగ్యానికి అభయం.. ‘కిల్కారీ’కి శ్రీకారం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు ‘కిల్కారీ’ పేరిట ఆడియో కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల మొబైల్‌కు డాక్టర్ అనిత అనే కల్పిత వైద్యురాలి వాయిస్‌తో ఆరోగ్యపరమైన సూచనలు, తీసుకోవాల్సిన పోషకాహారం, చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు వంటి అంశాలను వివరిస్తారు. ఈ సందేశాలు గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. వారిలో తలెత్తే ఎన్నో సందేహాలను నివృత్తి చేసే విధంగా వాయిస్ సందేశం ఉంటుందని చెబుతున్నారు. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి.. మహిళ గర్భం దాల్చిన నాల్గవ నెల నుంచి పాలిచ్చే తల్లుల వరకు.. బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకూ 72 సార్లు మొబైల్ సందేశాలు వచ్చేలా కిల్కారీ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరికీ 0124488000 నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఒకసారి ఫోన్ ఎత్తకుండా మిస్ అయితే, ఐవీఆర్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఒకేరోజు మూడుసార్లు ఫోన్ వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత మూడు రోజులకు రెండుసార్లు కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. గర్భిణులు, బాలింత కిల్కారీ నుంచి కాల్ పొందలేకపోయినా, ఆ వారాల సందేశాన్ని తిరిగి వినాలనుకున్నా ఆమె దానిని మళ్లీ వినడానికి 14423కు డయల్ చేయవచ్చు. బాలింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలనే దానితోపాటు వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలను వివరిస్తారు. కిల్‌కారీపై విస్తృత అవగాహన గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ప్రవేశ పెట్టిన కిల్కారీ విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాం. ఏఎన్ఎంలు ప్రతి గర్భిణి, పాలిచ్చే తల్లులను నమోదు చేస్తుండగా, ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని వారు తప్పకుండా ఆ సందేశాలు వినేలా అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి, పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఆరోగ్యం విషయంలో చేపట్టాల్సిన చర్యలు ఇలా సమగ్ర సమాచారాన్ని కల్పిత డాక్టర్ వాయిస్‌తో వారికి చేరవేస్తారు. డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌వో, ఎన్టీఆర్ జిల్లా -
గన్ షాట్ : అప్పుల కుప్ప వయ్యారి బాబు
-
ఎక్కేశారు... చెక్కేశారు
టాలీవుడ్ సగం ఖాళీ. అటు బాలీవుడ్ పరిస్థితీ అంతే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫై్లట్ ఎక్కేసి కొందరు విదేశాలు చెక్కేస్తే.. కొందరు ఇండియాలో ప్లాన్ చేసుకున్నారు. పార్టీలు చేసుకోవడానికి పక్కాగా రెడీ అయిపోయారు. కొంతమంది అందాల భామలు మాత్రం న్యూ ఇయర్ ఈవెంట్స్ లోకాలు కదపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరెవరు ఎక్కడెక్కడ? రండి తెలుసుకుందాం. విదేశాల్లో వెల్కమ్ సంక్రాంతి అంటే చాలు.. మెగా కుటుంబం బెంగళూరు వెళ్లిపోతుంది. మొత్తం 50 మంది వరకూ అక్కడికి వెళ్లి, తమ ఫామ్‌హౌస్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు. వచ్చే సంక్రాంతికి ఎప్పటికలా బెంగళూరు వెళతారో లేదో కానీ, న్యూ ఇయర్ డెస్టినేషన్ మాత్రం దుబాయ్ అని సమాచారం. చిరంజీవితోపాటు రామ్‌చరణ్ ఫ్యామిలీ అంతా దుబాయ్‌లో వెళ్లారని తెలిసింది. అలాగే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఒమన్‌లో ఉన్నారు. అక్కడ సబీనా, గ్జేవియర్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో దిగిన ఫొటోను మహేశ్ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంతకీ సబీనా, గ్జేవియర్ ఎవరంటే.. నమ్రతకు బెస్ట్ ఫ్రెండ్స్. న్యూ ఇయర్‌కి మహేశ్ దంపతులు ఒమన్‌లోనే స్వాగతం పలుకుతారు. జనవరి ఫస్ట్ వీక్‌లో ఇండియా వస్తారట. ‘జై లవ కుశ’ తర్వాత కొత్త సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు ఎన్టీఆర్. లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి లండన్‌లో ఉన్నారని భోగట్టా. ఇంకొన్ని రోజుల పాటు హాలిడేస్‌ని ఎంజాయ్ చేసి, ఆ తర్వాత త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోతారు ఎన్టీఆర్. ఇక.. బాహుహలి.. అదేనండి... ప్రభాస్ లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అవ్వగానే జనవరి 5 నుంచి హైదరాబాద్‌లో జరిగే ‘సాహో’ సినిమా షూటింగ్ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. మరోవైపు హీరోయిన్ పూజా హెగ్డే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు లండన్ వెళ్లారు. ఇక.. రత్తాలు.. రత్తాలు అంటూ ఈ ఏడాది కుర్రకారును హుషారెత్తించిన రాయ్ లక్ష్మీ ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్నారు. న్యూ ఇయర్‌ని అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా విదేశాల్లో ఇంగ్లిష్ న్యూ ఇయర్‌ని వెల్కమ్ చేస్తున్న మన తారలు చాలామందే ఉన్నారు. గో.. గో.. గోవా కొందరు తారలు మాత్రం విదేశాలు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. ఎంజాయ్మెంట్కి ‘గోవా’ బెస్ట్ అనుకున్నారేమో! అందుకే చాలామంది స్టార్స్ ‘గో.. గో.. గోవా’ అంటూ అక్కడ వాలిపోయారు. పార్టీలకు, పబ్బులకు, నైట్ క్లబ్‌లకు హెవెన్లాంటి గోవాలో ‘న్యూ ఇయర్’కి వెల్కమ్ చెప్పబోతున్నారు. సండే నైట్ సందడి కోసం ఫ్రైడేనే ఫ్లై అయ్యారు. ఇంతకీ గోవా ఎగిరిపోయిన స్టార్స్ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే.. రకుల్ ప్రీత్‌సింగ్, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి, ప్రగ్యా జైస్వాల్, హెబ్బా పటేల్. ఓన్లీ హీరోయిన్సేనా? నో..నో.. హీరోలూ ఉన్నారు. రవితేజ, అల్లు అర్జున్, రానా, సుశాంత్, అఖిల్ కూడా గోవా సెలబ్రేషన్స్ లిస్ట్‌లో ఉన్నారు. గోవాలో మూడు ముళ్ల బంధంతో ఒకింటివాళ్లైన నాగచైతన్య–సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి కూడా ఆ ప్లేస్‌నే సెలక్ట్ చేసుకున్నారు. మ్యారేజ్ మెమరీస్‌ని రీ కలెక్ట్ చేసుకోకుండా ఉండలేరు. నో హాలిడే ఇయర్ ఎండింగ్లో కొందరు తారలకు ‘నో హాలిడే’. ఈవెంట్స్‌లో పాల్గొంటూ, బిజీ బిజీగా గడపబోతున్న తారలు ఎవరెవరంటే... మిల్కీ బ్యూటీ తమన్నా ‘స్వింగు జరా స్వింగ్’ అంటూ వెండితెర మీద స్టెప్పులేస్తే థియేటర్లో ఫ్యాన్స్ స్వింగ్ అయ్యారు. ఇక, ఈ బ్యూటీ డైరెక్ట్‌గా మన కళ్ల ముందు డ్యాన్స్ చేస్తే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. బాసూ.. తమన్నా డ్యాన్సు ఎక్కడ అంటున్నారా? విజయవాడలో. హాయ్ అంటూ అభిమానులను ‘హాయ్‌ల్యాండ్’లో పలకరించనున్నారు తమన్నా. అక్కడ జరిగే ఈవెంట్లో ఈ పాలబుగ్గల సుందరి స్టెప్పులు స్పెషల్ ఎట్రాక్షన్. అలాగే కైరా దత్ కూడా అదే ప్లేస్‌లో హాయ్ చెప్పనున్నారు. ‘రేసు గుర్రం’లో ‘బూచోడే... బూచోడే.. భూమ్.. భూమ్ చేస్తాడే’, ‘పైసా వసూల్’లో ‘వసూలు వసూలు వసూలు..’ సాంగ్‌లో కైరా వేసిన స్టెప్స్‌కు చాలామంది ఫిదా అయ్యారు. ఓన్లీ ఈ ఇద్దరే కాదు.. బబ్లీ బ్యూటీ మెహరీన్ కూడా అదే ఈవెంట్లో డ్యాన్స్ చేయబోతున్నారు. . ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ’ అంటూ ఫ్లాట్ చేసిన ముమైత్ ఖాన్ కూడా న్యూ ఇయర్ ఈవెంట్లో స్టెప్పులేయనున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఓ ఈవెంట్లో కాలు కదిపి హుషారెత్తించడానికి రెడీ అయ్యారు. ఇంకా తెలుగు స్క్రీన్‌పై కనిపించని కియారా అద్వానీ కూడా తెలుగు రాష్ట్రంలో సందడి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో ‘ఫగ్లీ, ఎం.ఎస్. ధోని, మెషీన్’ అనే చిత్రాల్లో నటించిన ఈ 27 ఏళ్ల అందం హ్యాండ్సమ్ హీరో మహేశ్‌బాబు సరసన ఓ చిత్రం (‘భరత్ అనే నేను’ పరిశీలనలో ఉంది)లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఓ ఈవెంట్లో డ్యాన్స్ చేయనున్నారు. ఆమిర్ చలే థాయ్‌ల్యాండ్ ఆమిర్ ఖాన్ థాయ్‌ల్యాండ్‌కు బయలుదేరి వెళ్లిపోయాడు. అతని కుటుంబం బహుశా అతణ్ణి ఇవాళో రేపో చేరుకుంటుంది. రణ్వీర్ కపూర్‌ని చూసి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ గుమిగూడారు. కొంచెం హల్చల్ వేషధారణలో ఉన్న అతడు ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగి శ్రీలంకకు చక్కాపోయాడు. ఇంకా చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈసారి న్యూ ఇయర్ వేడుకల కోసం విమానాలు ఎక్కారు. ఈ దేశంలో వారికి తగిన ప్రైవసీ లేకపోవడం, లేదా ఈ దేశంలో చూడదగ్గ ప్రదేశాలు లేకపోవడం వల్లనో ఏమో అందరూ ఫారిన్ లొకేషన్లలో హుషారును వెతుక్కుంటూ వెళ్లిపోయారు. శ్రీలంక వైపు అందరి దృష్టి ఈసారి ఆశ్చర్యకరంగా శ్రీలంకకు ఎక్కువమంది సెలబ్రిటీలు క్యూ కట్టారు. ‘పద్మావతి’ స్టార్ రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మరో హీరోయిన్ దిశా పాట్నీ శ్రీలంకకు ప్రయాణం అయిన వారిలో ఉన్నారు. ఎల్‌టిటిఇ సమస్య తీరాక శ్రీలంక టూరిజమ్ మీద విపరీతమైన దృష్టి పెట్టింది. ఇండియా నుంచి దగ్గర కావడం, అక్కడ లొకేషన్సు ఇంకా పర్యాటకుల బారిన పడి పాడుకాకుండా ఉండటంతో ఇప్పుడు ఎక్కువ మంది స్టార్స్ అటు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. స్విట్జర్లాండ్ మంచులో తైమూర్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ చలికి వెరవడం లేదు. స్విట్జర్లాండ్‌లో విపరీతమైన మంచు కురుస్తుంటే దానిని ఎంజాయ్ చేయడానికి తమ ముద్దుల కుమారుడు తైమూర్ అలీఖాన్‌తో బయలుదేరి వెళ్లిపోయారు. వాళ్ల వెకేషన్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్నాయి. ఇక మరో స్టార్ జంట అక్షయ్‌కుమార్– ట్వింకిల్ ఖన్నా తమ ఇద్దరు కుమార్తెలతో కేప్ టౌన్లో ఉన్నారు. అక్కడి విశాలమైన దార్లలో భార్యను పక్కన కూచోబెట్టుకుని అక్షయ్ కారులో చక్కర్లు కొడుతున్నాడు. ఆలియా భట్ తన స్నేహితురాళ్లను తీసుకొని కొంచెం కొంచెం బట్టల్లో బాలీ దీవుల్లోని బీచ్ వొడ్డున షికార్లు చేస్తుండటం అభిమానులకు ముచ్చట కలిగిస్తున్నది. ఒక్క దీపికా పదుకోన్ మాత్రం ముఖాన్ని కవర్ చేసుకుని వియన్నా వీధుల్లో తిరుగుతుండటం కెమెరాల కంట పడింది. ఆమె ఒక్కర్తే వెకేషన్‌కు వెళ్లిందా ఫ్రెండ్స్ ఉన్నారా తెలియడం లేదు. విరుష్క సౌత్ ఆఫ్రికాకు పెళ్లయ్యాక ఇది మొదటి జనవరి ఫస్ట్. అందుకే విరాట్ అనుష్క (ఈ జంటకు నెటిజన్లు పెట్టిన పేరు ‘విరుష్క’) లు తమ న్యూ ఇయర్ పార్టీని దక్షిణాఫ్రికాలో ప్లాన్ చేశారు. విరాట్ కొద్దిమంది క్రికెట్ స్నేహితులను తోడు తీసుకుని ఈ ట్రిప్‌కు బయలుదేరాడు. ఇక దుబాయ్ కూడా ఈసారి హాట్ డెస్టినేషన్‌గా ఉంది. సన్ని లియోన్, జూహీ చావ్లా దుబాయ్‌లో థర్టీ ఫస్ట్ నైట్‌ను గడపబోతున్నారు. మరో సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ భర్తతో జపాన్‌కు వెళ్లారు. జపనీస్ భాషలో విషెస్ వినబోతున్నారు. టెలివిజన్ క్వీన్ ఏక్తా కపూర్ మాత్రం అమెరికాలో ఫ్రెండ్స్‌తో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతోంది. కొత్త సంవత్సరం వీరందరితో పాటు బాలీవుడ్‌కు మంచి విజయాలను ఇవ్వాలని కోరుకుందాం. -
తెలుగు పరిమళాల గుబాళింపు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో మూడో రోజు ఆదివారం భాషాభిమానులు పోటెత్తారు. కార్యక్రమాలు జరుగుతున్న అన్ని వేదికల వద్ద కూడా పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, అభిమానులు పాలుపంచుకున్నారు. సారస్వత పరిషత్తులో జరిగిన అవధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొని భాషాభిమానుల్లో ఉత్సాహం నింపారు. తెలుగు విశ్వవిద్యాలయంలో కవితా సదస్సు, నవలా సాహిత్య సదస్సు, కథా సదస్సు, తెలంగాణ నవలా సాహిత్యం, ఎల్బీ స్టేడియంలో సాహిత్య సభ, సాంస్కృతిక సమావేశం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవిసమ్మేళనం, రవీంద్ర భారతిలో బాలకవి సమ్మేళనం, అష్టావధానం, గణితావధానం, నేత్రావధానం, ప్రతాపరుద్రుని విజయం నృత్యరూపక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా అక్షరగణితావధానం అక్షర గణితావధాని పుల్లూరు ప్రభాకర్ ఏ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి. వాక్యంలో ఎన్ని అక్షరాలున్నాయి. తెలుగులో అయితే ఎన్ని.. హిందీ, ఇంగ్లిష్‌లో అయితే ఎన్ని అక్షరాల్లో ఉంటాయనేది ఇట్టే చెప్పేస్తారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకట్టుకున్న కథలు తెలుగు విశ్వవిద్యాలయంలోని సామల సదాశివ వేదికమీద వక్తల ఉపన్యాసాల్లో ‘కథలల్లిన కథకుల కథలు’తెలుగు భాషాభిమానులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మారెడ్డి, అధ్యక్షత వహించిన బీఎస్ రాములు తెలంగాణ కథల నేప«థ్యానికున్న వైవిధ్యాన్ని, వాటితో ఇక్కడి ప్రజలకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక్క నిమిషం కవితలు.. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఎస్ రఘు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో కవులు ఒక నిమిషం నిడివి కవితలతో సభికులను మెప్పించారు. సమావేశంలో 25 మంది చొప్పు న కవులకు అవకాశం కల్పించారు. మంత్రి పోచారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఔరా అనిపించిన నేత్రావధానం ప్రేక్షకుల్లోని కొంతమంది ఏదైనా రాసి ఇస్తే.. ఒక అవధాని దానిని కేవలం కంటి రెప్పల కదలిక ద్వారా చూపగా, మరో అవ ధాని అర్థం చేసుకుని తిరిగి రాసి చూపించి న నేత్రావధానం విశేషంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులు రాసి ఇచ్చిన కాగితాలను గురు వు, సమన్వయకర్త ఆదినారాయణ తీసుకుని.. ఒక అవధాని కె.శిరీషకు అందజేశారు. ఆమె ఆ కాగితంలోని అక్షరాలను తన కనురెప్పల కదలికలతో.. ఎదురుగా ఉన్న రెండో అవధాని ఎస్వీ శిరీషకు చూపా రు. రెండో అవధాని ఆ కనురెప్పల కదలికలను బట్టి.. అక్షరాలను కాగితంపై రాసి, వినిపించారు. తెలుగు పదాలే కాకుం డా, ఇంగ్లిష్, హిందీ పదాలనూ నేత్రావధానం ద్వారా గుర్తించడం సభికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక బొటనవేలితో చేసే ‘అంగుష్టావధానం’ ప్రక్రియలో భాగంగా ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అనే పదానికి అక్షరరూపం ఇచ్చారు. అలరించిన బాలకవి సమ్మేళనం డాక్టర్ సునీతా రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాల కవి సమ్మేళనం ఆద్యంతం అలరించింది. ఎనభై మందికిపైగా బాల కవులు ఇందులో పాల్గొన్నారు. చక్కటి తెలుగులో గేయాలను ఆలపించారు. సమ్మక్క సారక్క, రామప్ప గుడి, గోల్కొండ కోట వంటి చారిత్రక అంశాలను పాటలతో కళ్లకు కట్టారు. శాతవాహనులు, కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు, నిజాం నవాబులు, వేమన, పోతన, సోమన, సురవరం ప్రతాపరెడ్డిల నుంచి ఆధునిక కవి వరేణ్యులు జయశంకర్ వరకు తెలుగు సాహిత్యకారులను తలుచుకున్నారు. -
నేటి నుంచే ప్రపంచ తెలుగు మహాసభలు..
-
ఐదు రోజుల తెలుగు సంబురం
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుకుందాం’నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్బీ స్టేడియానికి పాల్కురికి సోమనాథ ప్రాంగణంగా.. ప్రధాన వేదికకు బమ్మెర పోతన వేదికగా నామకరణం చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహాసభలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే మహాసభల ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హాజరవుతారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు మహాసభల ప్రధాన వేదికతో పాటుగా ఉప వేదికల్లో సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఐదు రోజుల పాటు జరగనున్న మహాసభల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాల వివరాలివీ.. 15శుక్రవారం సాహిత్య సమావేశం: సాయంత్రం 6 గంటలకు అధ్యక్షత :డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ,ఉపాధ్యక్షుడు, తెలుగు విశ్వవిద్యాలయం ముఖ్యఅతిథి : హరీశ్‌రావు, భారీనీటిపారుదల మంత్రి గౌరవ అతిథి : ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్, చెన్నై సత్కారం : సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్లకు (ఒడిశా జ్ఞానపీఠ పురస్కార స్వీకర్తలు) సాయంత్రం 6.30–7–00: ‘మన తెలంగాణ’ సంగీత నృత్యరూపకం. డాక్టర్ రాజారెడ్డి–రాధారెడ్డి, కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన. రాత్రి 7.00–7:30: పాటకచేరీ(శ్రీరామాచారి బృందం, లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ) రాత్రి 7:30–9:00: జయ జయోస్తు తెలంగాణ(సంగీత నృత్య రూపకం) రచన: దేశిపతి శ్రీనివాస్, సంగీతం: ఎం.రాధాకృష్ణన్, నృత్య దర్శకత్వం: కళాకృష్ణ 16శనివారం ‘తెలంగాణలో తెలుగు భాషా వికాసం’సాహిత్య సభ అధ్యక్షత: డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి ముఖ్యఅతిథి: కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి గౌరవ అతిథి: ఆచార్య బేతవోలు రామబ్రహ్మం వక్తలుడాక్టర్ రవ్వా శ్రీహరి, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ సాయంత్రం 6:30 : సాంస్కృతిక సమావేశం అధ్యక్షుడు: డాక్టర్ అయాచితం శ్రీధర్, అధ్యక్షుడు, గ్రంథాలయ పరిషత్ ముఖ్యఅతిథి: సిరికొండ మధుసూదనాచారి, శాసనసభాపతి గౌరవ అతిథి: తనికెళ్ల భరణి రాత్రి 7:00–7:30: హైదరాబాద్ సోదరుల ‘శతగళ సంకీర్తన’(రామదాసు సంకీర్తనల ఆలాపన) రాత్రి 7:30–7:45: మైమ్ కళాకారుడు మధు మూకాభినయ ప్రదర్శన రాత్రి 7:45–8:00: వింజమూరి రాగసుధ నృత్య ప్రదర్శన రాత్రి 8:00–8:15: షిర్నికాంత్ బృంద కూచిపూడి నృత్యం రాత్రి 8:15–9:00: డాక్టర్ అలేఖ్య ‘రాణి రుద్రమదేవి నృత్యరూపకం’ 17ఆదివారం సాయంత్రం 5 గంటలకు: ‘మౌఖిక వాఙ్మయం భాష’సాహిత్య సభ అధ్యక్షత : డాక్టర్ వెలిచాల కొండలరావు ముఖ్యఅతిథి : తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర మంత్రి గౌరవ అతిథి: ఆచార్య కొలకలూరి ఇనాక్ సత్కారం: సత్యవ్రత శాస్త్రి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ఢిల్లీ భాష–నుడికారం: డాక్టర్ నలిమెల భాస్కర్, సామెతలు జాతీయాలు: కసిరెడ్డి వెంకట్‌రెడ్డి పద, గేయ కవిత్వం: గోరటి వెంకన్న, సాయంత్రం 6:30: సాంస్కృతిక సమావేశం అధ్యక్షుడు: దేవులపల్లి ప్రభాకర్‌రావు ముఖ్యఅతిథి: స్వామిగౌడ్, మండలి అధ్యక్షుడు గౌరవ అతిథి: డాక్టర్ ద్వానాశాస్త్రి రాత్రి 7.00–8.00: రసమయి బాలకిషన్ సారథ్యంలో కళా ప్రదర్శన 8–00–8.15: జానపద గేయాలు–కళా మీనాక్షి 8.15–8.30: జానపదం–నృత్య కళాంజలి 8.30–8.50: జానపద నృత్యం–మంగళ, రాఘవరాజ్ భట్ 8.50–9.30: జానపద జాతర 18సోమవారం సాయంత్రం 5 గంటలకు: ‘తెలంగాణ పాటజీవితం’ సాహిత్య సభ అధ్యక్షత : డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ ముఖ్యఅతిథి : ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి గౌరవ అతిథి : సిరివెన్నెల సీతారామశాస్త్రి వక్తలు: రసమయి బాలకిషన్, జయరాజు, దేశిపతి శ్రీనివాస్ సాయంత్రం 6:30: సాంస్కృతిక సమావేశం, అధ్యక్షత: దిల్‌రాజు ముఖ్యఅతిథి: కేటీఆర్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి, గౌరవ అతిథి: అక్కినేని నాగార్జున సాయంత్రం 6.30–7.00: మలేసియా తెలుగు వారి సాంస్కృతిక కదంబ కార్యక్రమం రాత్రి 7.00: సినీసంగీత విభావరి, సినీ మ్యూజీషియన్స్ యూనియన్ 19మంగళవారం సాయంత్రం 5 గంటలకు: ప్రపంచ తెలుగు మహాసభల సమాపనోత్సవం ముఖ్యఅతిథి రాష్ట్రపతి : రామ్‌నాథ్ కోవింద్ విశిష్ట అతిథిగవర్నర్ : ఈఎస్ఎల్ నరసింహన్ సభాధ్యక్షత : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇతర వేదికలు - కార్యక్రమాలు అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం(ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌గార్డెన్), వానమామలై వేదిక 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు బృహత్ కవి సమ్మేళనం(ఏడు వందల మంది కవులతో కవి సమ్మేళనం) మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం (తెలంగాణ సారస్వత పరిషత్తు సభా భవనం),శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదిక 16వ తేదీ నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శతావధానం పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ (రవీంద్రభారతి) 16వ తేదీ నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యువ చిత్రోత్సవం ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ(రవీంద్రభారతి) 16వ తేదీ నుంచి 19 వరకు కార్టూన్ ప్రదర్శన రవీంద్రభారతి ప్రాంగణం 16వ తేదీ నుంచి 19 వరకు ఛాయాచిత్ర ప్రదర్శన ఛాయాచిత్ర ప్రదర్శన: చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ బిరుదురాజు రామరాజు ప్రాంగణం(తెలుగు వర్సిటీ ఆడిటోరియం), సామల సదాశివ వేదిక 16వ తేదీ కార్యక్రమాలు ఉ.10 గం: తెలంగాణ పద్య కవితా సౌరభం (సదస్సు) మ.3 గం: తెలంగాణ వచన కవితా వికాసం (సదస్సు) 17వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: కథా సదస్సు మధ్యాహ్నం 3 గంటలు: తెలంగాణ నవలా సాహిత్యం సాయంత్రం 6 గంటలు: కథా, నవలా, రచయితల గోష్ఠి 18వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: తెలంగాణ విమర్శ–పరిశోధన మధ్యాహ్నం 3 గంటలు: శతక, సంకీర్తనా, గేయ సాహిత్యం సాయంత్రం 6 గంటలు: కవి సమ్మేళనం 19వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: తెలంగాణలో తెలుగు భాషా సదస్సు గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రాంగణం (రవీంద్రభారతి సమావేశ మందిరం), ఇరివెంటి కృష్ణమూర్తి వేదిక 16వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: అష్టావధానం మధ్యాహ్నం 12:30: హాస్యావధానం మధ్యాహ్నం 3 గంటలు: పద్యకవి సమ్మేళనం 17వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: జంట కవుల అష్టావధానం మధ్యాహ్నం 12:30: అక్షర గణితావధానం మధ్యాహ్నం 3 గంటలు: అష్టావధానం సాయంత్రం 5:30: నేత్రావధానం సాయంత్రం 6 గంటలు: శ్రీప్రతాపరుద్ర విజయం(రూపకం) 18వ తేదీ కార్యక్రమాలు ఉ.10 గంటలు: పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు మ.3 గం: న్యాయ వ్యవహారాలు, ప్రభుత్వ పాలనలో తెలుగు 19వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: తెలంగాణ చరిత్ర(సదస్సు) డాక్టర్ యశోధారెడ్డి ప్రాంగణం(రవీంద్రభారతి), బండారు అచ్చమాంబ వేదిక 16వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: బాల సాహిత్యం(సదస్సు) మధ్యాహ్నం 4 గంటలు: హరికథ(లోహిత) మ.4:30: నృత్యం(వైష్ణవి) మ.4:45: సంగీతం(రమాశర్వాణి) 17వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: బాలకవి సమ్మేళనం మధ్యాహ్నం 3 గంటలు: తెలంగాణ వైతాళికులు(రూపకం) 18వ తేదీ కార్యక్రమాలు ఉ.10 గం: తెలంగాణ మహిళా సాహిత్యం (సదస్సు) మధ్యాహ్నం 3 గంటలు: కవయిత్రుల సమ్మేళనం 19వ తేదీ కార్యక్రమాలు ఉ.10 గం: ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు (విదేశీ తెలుగువారితో గోష్ఠి) మ.2 గం: ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు(రాష్ట్రేతర తెలుగువారితో గోష్ఠి) -
అమ్మ భాషకు పట్టం
♦ స్వస్తిశ్రీ హేవళంబినామ సంవత్సరం.. దక్షిణాయనం.. హేమంత రుతువు.. మార్గశిర మాసం.. కృష్ణపక్షం.. త్రయోదశి.. సాయంత్రం 6 గంటలు.. స్థలం భాగ్యనగరం.. వేదిక లాల్‌బహదూర్ మైదానం.. పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదిక ♦ తేనెలూరే తియ్యటి తెలుగు భాషకు సమున్నతంగా పట్టంకట్టే మహా వేడుక.. ♦ మరే భాషలో లేని అత్యున్నత సాహితీ ప్రక్రియలను తనలో ఇముడ్చుకుని ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’.. అంటూ ప్రపంచవ్యాప్తంగా జయజయధ్వానాలు అందుకునేలా, మహోజ్వలంగా వెలుగొందేలా మనమంతా కలసి చేసుకునే దివ్యమైన ఉత్సవం.. ప్రపంచ తెలుగు మహాసభలు నేడే మొదలు. సాక్షి, హైదరాబాద్ : తెలుగు వర్ణమాలలో అక్షరాలెన్ని..? తెలుగు భాష ఔన్నత్యానికి ఒక్క నిదర్శనం..? తేనెలూరే ఈ భాషలో ఉత్కృష్ట సాహిత్య ప్రక్రియ అవధానం అంటే ఏంటి..? ప్రపంచ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై పేర్కొంటున్న సాహితీ దిగ్గజాల్లో ఒకరి గురించైనా తెలుసా..? నేటి తెలుగు తరానికి ఈ ప్రశ్నలు సంధిస్తే ఒక్కదానికైనా సమాధానం రావడం కష్టమే. వెయ్యేళ్ల తెలుగు భాష పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో దీనితో తెలిసిపోతుంది. తప్పులు లేకుండా, పరభాషా పదాలు లేకుండా తెలుగులో మాట్లాడడం, ఒక్క వాక్యమైనా రాయడం ఎంత మందికి సాధ్యం. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా కీర్తిస్తున్నా.. ప్రపంచంలోని సుమధుర భాషల్లో తెలుగు ముందు వరసలో ఉన్నా.. మరే భాషలోనూ లేని సాహితీ ప్రక్రియలు తెలుగు సొంతమైనా సరే... కనుమరుగయ్యే ప్రమాదమున్న భాషల్లో తెలుగూ చేరబోతోందన్న మాట ఆందోళన కలిగిస్తోంది. కోటి ఆశలతో.. కోటి ఆశలు మోసుకొస్తూ కొత్త ఆలోచనలతో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భ వించిన తర్వాత తొలిసారిగా జరుగుతుండ టంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిని తొలి తెలుగు మహాసభలుగానే పరిగణిస్తోంది. తెలుగు భాష ఘనతను చాటడం ఒక ఎత్తయితే.. తెలంగాణ యాసకు పట్టాభిషేకం చేయడం ప్రధానంగా మహాసభలను వైభవంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగువారిని ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని స్వాగతించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమవుతున్నాయి. తొలి తెలుగు మహాసభలు జరిగిన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణమే ఈసారి వేడుకలకు ప్రధాన వేదికగా ముస్తాబైంది. ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, గవర్నర్లు నరసింహన్, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు విశిష్ట అతిథులుగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సభాధ్యక్షుడిగా వేడుకలు మొదలుకాబోతున్నాయి. ప్రధాన వేదిక లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణంతోపాటు రవీంద్రభారతి ప్రధాన మందిరం, మినీ మందిరం, తెలుగు విశ్వవిద్యాలయం సభా మందిరం, తెలుగు లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని మందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తులలో తెలుగు భాషా వైభవం కళ్లకు కట్టనుంది. ఇన్నాళ్లూ నిర్లక్ష్య జాడ్యం నీడలో.. మన పొరుగునే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆవిర్భవించిన కన్నడ, తమిళ రాష్ట్రాలు.. తమ భాషకు ఘనంగా పట్టం కట్టాయి. తమ భాషను బతికించుకోవడమే కాదు, అద్భుతంగా వికసింపచేసుకుంటూ వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఢిల్లీ విశ్వవి ద్యాలయాల్లోనూ వాటికి ప్రత్యేక విభాగాలు తెచ్చుకునే రీతిలో, ప్రాచీన హోదా పొంది భాష బాగు కోసం వందల కోట్లు సాధించు కునే స్థాయిలో కృషి చేశాయి. కానీ అమృత ప్రాయమైన తెలుగు భాషకు ‘గుర్తిం పు’పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడి పోయింది. ‘ఇప్పటికైనా తెలుగు వంతు వచ్చింది..’అన్న ఆశతో తెలుగు ప్రజలు సంతోషిస్తున్నారు. అసలు 1975లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహాసభల ప్రభావం భాషపై కొంత కనిపించినా.. తర్వాత ఈ సభలు హడావుడికే పరిమితమయ్యాయి. ఆ బాధ ముల్లులా పొడుస్తున్నా.. ఇప్పటి మహాసభలను మాత్రం భాషాభిమానులు కొత్త కోణంలో చూస్తున్నారు. తెలుగు భాష, పద్యం, సాహిత్యంపై తనకున్న అభిమా నాన్ని వీలున్నప్పుడల్లా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తాజా మహాసభల రథసారథి కావడమే దీనికి కార ణం. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన చేపట్టిన చర్యలు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయటంతో ఆయనపై ఆశాభావం నెలకొంది. మంచిరోజులు వచ్చేనా? 2012 తెలుగు మహాసభల సందర్భంగా.. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేస్తామంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది మాటలకే పరిమితమైంది. ఆర్భాటానికి పరిమితమయ్యే అలాంటి హామీలు భాషను కాపాడలేవనే సంగతి అందరికీ బోధపడింది. అందుకే తెలుగు భాషను కాపాడేందుకు నిర్బంధ చర్యలు, భాషను సుసంపన్నం చేసుకునేలా ప్రజల్లో ఆసక్తి, చైతన్యం పెంపొందించే చర్యలు అవసరమన్న భాషావేత్తల సూచనలు అమలు కావాల్సి ఉంది. ‘తెలుగు వెలుగులు ప్రపంచా నికి పంచుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం’అంటూ ఈ మహాసభలకు ప్రభుత్వం ఖరారు చేసిన నినాదం నలుదిశలా మారుమోగాల్సి ఉంది. మన భాష మరిన్ని తరాలు మహోజ్వలంగా వెలుగొందేందుకు ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి. అలాగైతేనే మహాసభల సాక్షిగా చేసే తీర్మానాలు నీటిమీద రాతలు కాకుండా ఉంటాయి. ఈ దిశగా ప్రభుత్వంపై ఎంత బాధ్యత ఉందో, తెలుగు ప్రజలందరిపైనా అంతే బాధ్యత ఉంది. తెలుగులో పలకరించుకుందాం.. తెలుగులో రాద్దాం.. అమ్మ భాషను ఆదరిద్దాం.. మన భాషను కాపాడుకుందాం.. అందుకే ఇది మన పండుగ.. ఇంటింటి వేడుక. లోటుపాట్లు ఉండొద్దు: కడియం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్లతో కలసి మహాసభల ఏర్పాట్లపై సమీక్షించారు. వేదిక, ఇతర పనులను పరిశీలించారు జిల్లాల నుంచి 30 వేల మందికిపైగా ప్రతినిధులు ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారని.. దేశవిదేశాల నుంచి భాషావేత్తలు, సాహితీ ప్రియులు, విశిష్ట అతిథులు, భాషాభిమానులు మహాసభల్లో పాల్గొంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకల్లా ప్రధాన వేదిక సిద్ధం కావాలని, అధికారులు సమన్వయంతో బాధ్యతలు పంచుకుని సభలను విజయవంతం చేయాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం ఇలా.. ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతాయి. వేడుకల ప్రధాన అతిథి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా గవర్నర్ నివాసానికి చేరుకుంటారు. అదే సమయానికి సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకుంటారు. వారంతా తేనీటి విందు స్వీకరించి.. ఎల్బీ స్టేడియంలో మహాసభల ప్రాంగణానికి వెళతారు. అతిథులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకుతారు. వీఐపీలంతా వేదికపైకి చేరుకుని.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశాక మహాసభలు ప్రారంభమవుతాయి. స్టేడియంలో 10 వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. -
2030 మలేరియా ఖతం..!
నిర్మూలన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటా వేలాది మందిపై పంజా విసురుతున్న మలేరియా మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. మలేరియా నిర్మూలనకు అవసరమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, త్వరితగతిన వైద్య సాయం అందించడం అనే రెండు వ్యూహాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఏటా సగటున 3 వేలకుపైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 2017 జనవరి నుంచి జూలై 2 వరకు రాష్ట్రంలో 1,102 మలేరియా కేసులు నమోదైతే.. కొత్తగూడెం జిల్లాలోనే 400 కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. సరైన చికిత్సతోనే..: పరిసరాలు శుభ్రంగా లేక దోమలు వృద్ధి చెంది మలేరియా సంక్రమిస్తుంది. ఆరోగ్యపరమైన అవగాహన పెద్దగా లేని గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా మలేరియా రెండు రకాలు. జ్వర లక్షణాలతో ఉండే మలేరియాకు 14 రోజులు చికిత్స అవసరం. జ్వరం లేకుండా ఉండే తరహా మలేరియాకు 3 రోజులు చికిత్స తీసుకోవాలి. చాలా మంది జ్వరం తగ్గగానే మందులు వేసుకోవడం మానేస్తుంటారు. దాంతో మలేరియా క్రిమి మళ్లీ విజృంభిస్తుంది. 2030లోపు శాశ్వతంగా.. దశాబ్దాలుగా పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న మలేరియాను 2030లోపు పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 2027, 2028, 2029 సంవత్సరాల్లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాకుంటే.. 2030 నాటికి మలేరియా రహితంగా ప్రకటించడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. స్థానిక అవసరాలకనుగుణంగా ప్రణాళికను రూపొందించాలని సూచించింది. ఇందుకు నిధులను కేంద్రమే మంజూరు చేస్తోంది. భవిష్యత్తు తరాల కోసం.. ఆరోగ్యకరమైన భవిష్యత్ సమాజం కోసం మలేరియాను శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే 17 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మలేరియా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో 2.60 లక్షల దోమ తెరలు పంపిణీ చేశాం. మరో 4.89 లక్షల దోమ తెరలను పంపిణీ చేయనున్నాం.. –డా.ఎస్.ప్రభావతి, రాష్ట్ర అధికారి మలేరియా నిర్మూలన కార్యక్రమం -
పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు :విద్యాశాఖ
ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయిన సందర్భంగా అన్ని రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, పాఠశాలల్లో ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల విద్యా శాఖ కార్యదర్శులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 23వ తేదీన అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఒకేసారి జనగణమన గీతాలాపన చేయాలని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం ముసాయిదాపై, డిటెన్షన్ విధానంపై స్పష్టమైన అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలు సూచించాలని పేర్కొన్నారు.