2030 మలేరియా ఖతం..!
నిర్మూలన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటా వేలాది మందిపై పంజా విసురుతున్న మలేరియా మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. మలేరియా నిర్మూలనకు అవసరమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, త్వరితగతిన వైద్య సాయం అందించడం అనే రెండు వ్యూహాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో ఏటా సగటున 3 వేలకుపైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 2017 జనవరి నుంచి జూలై 2 వరకు రాష్ట్రంలో 1,102 మలేరియా కేసులు నమోదైతే.. కొత్తగూడెం జిల్లాలోనే 400 కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది.
సరైన చికిత్సతోనే..: పరిసరాలు శుభ్రంగా లేక దోమలు వృద్ధి చెంది మలేరియా సంక్రమిస్తుంది. ఆరోగ్యపరమైన అవగాహన పెద్దగా లేని గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా మలేరియా రెండు రకాలు. జ్వర లక్షణాలతో ఉండే మలేరియాకు 14 రోజులు చికిత్స అవసరం. జ్వరం లేకుండా ఉండే తరహా మలేరియాకు 3 రోజులు చికిత్స తీసుకోవాలి. చాలా మంది జ్వరం తగ్గగానే మందులు వేసుకోవడం మానేస్తుంటారు. దాంతో మలేరియా క్రిమి మళ్లీ విజృంభిస్తుంది.
2030లోపు శాశ్వతంగా..
దశాబ్దాలుగా పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న మలేరియాను 2030లోపు పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 2027, 2028, 2029 సంవత్సరాల్లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాకుంటే.. 2030 నాటికి మలేరియా రహితంగా ప్రకటించడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. స్థానిక అవసరాలకనుగుణంగా ప్రణాళికను రూపొందించాలని సూచించింది. ఇందుకు నిధులను కేంద్రమే మంజూరు చేస్తోంది.
భవిష్యత్తు తరాల కోసం..
ఆరోగ్యకరమైన భవిష్యత్ సమాజం కోసం మలేరియాను శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే 17 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మలేరియా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో 2.60 లక్షల దోమ తెరలు పంపిణీ చేశాం. మరో 4.89 లక్షల దోమ తెరలను పంపిణీ చేయనున్నాం..
–డా.ఎస్.ప్రభావతి, రాష్ట్ర అధికారి
మలేరియా నిర్మూలన కార్యక్రమం