పరమాణువులపై పరిశోధన చేస్తున్న ఢిల్లీ జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. ముందులకు లొంగకుండా వైరస్‌లు ‘వ్యాధి నిరోధకత’ను సంతరించుకుంటున్న పరిస్థితికి చెక్‌పెట్టే దిశగా పరిశోధకులు కీలక విజయం సాధించారు. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఒక పరిశోధనలో జేఎన్‌యూ సైంటిస్టులు హెచ్‌ఎస్‌పీ70 అనే మానవ ప్రోటీన్‌ను కనుగొన్నారు. మానవల్లో కోవిడ్, మలేరియా వంటి వైరస్ కారక వ్యాధులు ప్రబలడంలో హెచ్‌ఎస్‌పీ70 కీలకపాత్ర పోషిస్తోందని గుర్తించారు. వ్యాధికారక వైరస్‌లు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి హెచ్‌ఎస్‌పీ70 ప్రోటీన్ పరోక్షంగా సాయపడుతుంది.
వ్యాధికారక ప్రోటీన్ జాడ తెలియడంతో ఈ ప్రోటీన్ చర్య, అభివృద్ధిని కట్టడిచేసే మరో ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధిచేశారు. జేఎన్‌యూలో స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసన్ విభాగ అధ్యయనకారులు ఈ కృత్రిమ ప్రోటీన్‌ను అభివృద్ధిచేశారు. ఇది హెచ్‌ఎస్‌పీ70 పనితీరును క్షీణింపజేస్తుంది. దాంతో అది వ్యాధికారక వైరస్‌లకు పూర్తిస్థాయిలో సాయపడటంతో విఫలమవుతుంది. దాంతో మానవశరీరంలో వ్యాధి విజృంభణ ఆగుతుంది. చికిత్సకు, మందులకు లొంగకుండా వైరస్ కనబరిచే ‘వ్యాధినిరోధకత’సామర్థ్యమూ తగ్గుతుంది.
హీట్‌షాక్ ప్రోటీన్
హీట్‌షాక్ ప్రోటీన్‌కి పొట్టిరూపమే హెచ్‌ఎస్‌పీ. వ్యాధికారక వైరస్ ప్రబలినప్పుడు కణాల్లో అవి క్షణాల్లో రెండింతలు, మూడింతలు, ఇలా కోట్ల రెట్లు పెరిగేందుకు హెచ్‌ఎస్‌పీ ప్రోటీన్ సాయపడుతుంది. శరీరాన్ని వేడెక్కేలా చేసి వైరస్‌ల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వైరస్ తనలాంటి లక్షలాది వైరస్‌లను తయారుచేయడంలో, అచ్చం అలాగే ఉండటంలో, రెట్టింపు ప్రక్రియలో తప్పులు దొర్లకుండా హెచ్‌ఎస్‌పీ ప్రోటీన్ చూసుకుంటుంది. ఇంతటి కీలక ప్రోటీన్ జాడను కనిపెట్టి జేఎన్‌యూ పరిశోధకులు ఘన విజయం సాధించారు.
ఈ పరిశోధనా వివరాలు ప్రఖ్యాత బయోలాజికల్ మైక్రోమాలిక్యూల్స్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ కారక సార్స్ కోవ్–2 వైరస్‌లోని కొమ్ములతో, మానవ కణంలోని ఏస్2 గ్రాహకాలకు మధ్య హెచ్‌ఎస్‌పీ అనుసంధానకర్తలా వ్యవహరిస్తోందని పరిశోధనలో తేలింది. కణాల్లోకి వైరస్ చొరబడాలంటే ఏస్2 రిసెప్టార్లదే కీలక పాత్ర. హెచ్‌ఎస్‌పీను నిలువరించడం ద్వారా వైరస్‌ల సంఖ్య పెరగడాన్ని అడ్డుకోగలిగామని జేఎన్‌యూ ప్రొఫెసర్లు ఆనంద్ రంగనాథన్, శైలజా సింగ్ చెప్పారు.
‘‘హెచ్‌ఎస్‌పీని అడ్డుకునేలా పీఈఎస్–సీఐ అనే కొత్త ప్రోటీన్‌ను అభివృద్ధిచేశాం. దీనిని సార్స్–కోవ్2 సోకిన కణాల్లోకి జొప్పించాం. దీంతో సార్స్–కోవ్2 కణాల రెట్టింపు ప్రక్రియ గణనీయస్థాయిలో మందగించింది. సాంప్రదాయక ఔషధాలు నేరుగా వైరస్‌లపై దాడిచేస్తాయి. కానీ వైరస్‌లకు ఆతిథ్యమిచ్చే కణాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి కొత్తరకం విధానాల ద్వారా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం ముగియడంతో జనం దాదాపు కరోనా గురించి మర్చిపోయారు. కానీ పరిశోధనా ప్రపంచం ఎప్పుడూ రాబోయే కొత్తరకం వైరస్‌ల గురించి అప్రమత్తంగానే ఉంటుంది’’అని పరిశోధకులు అన్నారు.
చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!
ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ ప్రమోద్ గార్గ్, పీహెచ్‌డీ స్కాలర్ ప్రేరణ జోషి సైతం ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చి విజృంభించే కొత్త రకం వైరస్‌ల కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రేరణజోషి అన్నారు. అంతర్జాతీయంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తినప్పుడు శాస్త్రసాంకేతి రంగం ఏ స్థాయిలో నూతన చికిత్సా విధానాలు, ఆవిష్కరణలతో సంసిద్ధంగా ఉండాలనే అంశాన్ని తాజా పరిశోధన మరోసారి నిరూపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment