‘రోజుకో యాపిల్.. డాక్టర్‌ను దూరం పెడుతుంద’ని ఓ సామెత ఉంది. అది సీజనల్. రేటు కూడా కాస్త ఎక్కువే. అదే సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉండేది అరటి పండు. ధర కూడా తక్కువే. మరి యాపిల్‌లా అరటిపండుతోనూ బోలెడన్ని పోషకాలు అందితే.. తక్కువ ఖర్చుతోనే మంచి ఆరోగ్యం సొంతం. ఈ ఆలోచనతోనే ఉగాండా, ఆ్రస్టేలియా శాస్త్రవేత్తలు బిల్‌గేట్స్ ఫౌండేషన్ సాయంతో ‘సూపర్ బనానా’ను రూపొందించారు. అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు.
కోట్ల మందికి ప్రయోజనం
ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాల్లో కోట్లాది మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం, కంటి చూపు దెబ్బతినడం, వ్యాధినిరోధక శక్తి లేక రోగాల పాలవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారని ప్రకటించింది. ఈ క్రమంలోనే విటమిన్ ఏ, ఇతర పోషకాలు అధికంగా ఉండే సూపర్ బనానాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
బనానా21 ప్రాజెక్టు పేరిట.. జన్యు మార్పిడితో..
♦ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు చెందినఫౌండేషన్ ఆర్థిక సాయం, ఆ్రస్టేలియా వ్యవసాయ శాస్త్రవేత్త జేమ్స్ డేల్ సహకారంతో ఉగాండా జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ లేబోరేటరీ శాస్త్రవేత్తలు ‘సూపర్ బనానా’పై 2005లో పరిశోధన చేపట్టారు.
♦ అత్యవసర పోషకాలన్నీ ఉండటంతోపాటు తెగుళ్లు, ఫంగస్‌లను తట్టుకోవడం, కరువు ప్రాంతాల్లోనూ పండించగలిగేలా నీటి ఎద్దడిని తట్టుకోగలగడం
వంటి లక్షణాలు ఉండేలా అరటిని అభివృద్ధి చేశారు.
♦ జన్యు మార్పిడి విధానంలో సుమారు 18 ఏళ్లపరిశోధన తర్వాత.. విటమిన్ ఏ సహా అత్యవసర పోషకాలన్నీ ఉండేలా సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేయగలిగారు.
ప్రపంచంలో ఇదే మొదటిసారి..
ఇలా పోషకాలన్నీ ఉండేలా జన్యుమార్పిడి అరటి పండ్లను అభివృద్ధి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారుల జీవితాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కొత్త అరటి రకం సాగుకు సిద్ధమైనట్టేనని, అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment