genetic changes
-
మామూలు అరటిపండు కాదు.. ‘సూపర్ బనానా’.. ప్రపంచంలో ఇదే తొలిసారి
‘రోజుకో యాపిల్.. డాక్టర్‌ను దూరం పెడుతుంద’ని ఓ సామెత ఉంది. అది సీజనల్. రేటు కూడా కాస్త ఎక్కువే. అదే సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉండేది అరటి పండు. ధర కూడా తక్కువే. మరి యాపిల్‌లా అరటిపండుతోనూ బోలెడన్ని పోషకాలు అందితే.. తక్కువ ఖర్చుతోనే మంచి ఆరోగ్యం సొంతం. ఈ ఆలోచనతోనే ఉగాండా, ఆ్రస్టేలియా శాస్త్రవేత్తలు బిల్‌గేట్స్ ఫౌండేషన్ సాయంతో ‘సూపర్ బనానా’ను రూపొందించారు. అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. కోట్ల మందికి ప్రయోజనం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాల్లో కోట్లాది మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం, కంటి చూపు దెబ్బతినడం, వ్యాధినిరోధక శక్తి లేక రోగాల పాలవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారని ప్రకటించింది. ఈ క్రమంలోనే విటమిన్ ఏ, ఇతర పోషకాలు అధికంగా ఉండే సూపర్ బనానాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బనానా21 ప్రాజెక్టు పేరిట.. జన్యు మార్పిడితో.. ♦ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు చెందినఫౌండేషన్ ఆర్థిక సాయం, ఆ్రస్టేలియా వ్యవసాయ శాస్త్రవేత్త జేమ్స్ డేల్ సహకారంతో ఉగాండా జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ లేబోరేటరీ శాస్త్రవేత్తలు ‘సూపర్ బనానా’పై 2005లో పరిశోధన చేపట్టారు. ♦ అత్యవసర పోషకాలన్నీ ఉండటంతోపాటు తెగుళ్లు, ఫంగస్‌లను తట్టుకోవడం, కరువు ప్రాంతాల్లోనూ పండించగలిగేలా నీటి ఎద్దడిని తట్టుకోగలగడం వంటి లక్షణాలు ఉండేలా అరటిని అభివృద్ధి చేశారు. ♦ జన్యు మార్పిడి విధానంలో సుమారు 18 ఏళ్లపరిశోధన తర్వాత.. విటమిన్ ఏ సహా అత్యవసర పోషకాలన్నీ ఉండేలా సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేయగలిగారు. ప్రపంచంలో ఇదే మొదటిసారి.. ఇలా పోషకాలన్నీ ఉండేలా జన్యుమార్పిడి అరటి పండ్లను అభివృద్ధి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారుల జీవితాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కొత్త అరటి రకం సాగుకు సిద్ధమైనట్టేనని, అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించారు. -
శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణ.. పెట్టలు మాత్రమే పుట్టేలా..!
సాక్షి, అమరావతి: పౌల్ట్రీ రంగంలో ఆడ కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణ చేశారు. మగ కోడి పిల్లలు పుట్టకుండా జన్యు సవరణ చేశారు. గుడ్ల ఉత్పత్తికి మగ కోడి పిల్లలు పనికిరావు. సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే బై ప్రొడక్ట్ (ఉప ఉత్పత్తి) కింద లెక్క. అంటే ఏదైనా ప్రయోగంలో ‘అసలు ఉత్పత్తి’ కాకుండా.. అదనంగా వచ్చేవి. ఇవి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. పౌల్ట్రీలో మాత్రం మగ కోడి పిల్లలూ ఎందుకూ పనికిరావు. అందుకే గుడ్లు పొదిగిన తర్వాత అవి మగవైతే వెంటనే చంపేస్తారు. వాటి నుంచి వచ్చే మాంసం కూడా ఆశించిన విధంగా ఉండదు. దాదాపు తినడానికి పనికిరాదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా వందల కోట్ల మగ కోడి పిల్లల్ని చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని వాల్కని ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు.. కేవలం గుడ్లు పొదిగే కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా వాటి జన్యువుల్ని సవరించి సత్ఫలితాలు సాధించారు. తాజా పరిశోధనతో కోట్లాది మగ కోడి పిల్లల్ని చంపే పరిస్థితి పోతుంది. ఈ జన్యు సవరణ పరిశోధన అద్భుతాలు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏటా 750 కోట్ల కోడి పిల్లల మృత్యువాత.. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా గుడ్ల కోసం 1,500 కోట్ల కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందులో సగం మగ కోళ్లు, సగం ఆడ కోళ్లు ఉంటాయి. గుడ్ల ఉత్పత్తికి మగ కోళ్లు ఉపయోగపడకపోవడంతో వాటిని పుట్టిన వెంటనే చంపేస్తున్నారు. అంటే ఏటా దాదాపు 750 కోట్ల కోళ్లను పుట్టగానే చంపేస్తారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. తాజా పరిశోధన వెనుక జంతు సంక్షేమాన్ని కాంక్షించే కంపాషన్ ఇన్ వరల్డ్ ఫార్మింగ్ సంస్థ ఉంది. కోట్లాది కోడి పిల్లలను క్రూరంగా చంపే విధానానికి స్వస్తి పలికే ఉద్దేశంతోనే ఈ పరిశోధన జరిగినట్లు చెబుతున్నారు. ఆడ కోళ్లను మాత్రమే ఎలా ఉత్పత్తి చేస్తారంటే.. ఆడ కోళ్లలో ఒక డబ్ల్యూ, ఒక జెడ్ క్రోమోజోమ్ కలిపి(డబ్ల్యూజెడ్) ఉంటాయి. మగ కోళ్లలో రెండూ జెడ్ క్రోమోజోములే(జెడ్‌జెడ్) ఉంటాయి. పరిశోధనలో భాగంగా ఆడ కోడిలోని జెడ్ క్రోమోజోమ్‌పై ఒక బ్లూ లైట్ వేయడం ద్వారా దాని జన్యువును మార్పు చేశారు. దాన్ని మగ కోడితో జత చేసినప్పుడు.. మగ కోడి పిల్లలు జన్మించవని నిరూపించారు. అదే సమయంలో ఆడ కోళ్ల పుట్టుకపై దీని ప్రభావం ఉండదు. మగ కోడిలోని జెడ్ క్రోమోజోమ్‌ను మాత్రమే అవి తీసుకుంటాయి. దీని వల్ల కేవలం గుడ్లు ఉత్పత్తి చేసే ఆడ కోళ్లు మాత్రమే పుడతాయి. -
వృద్ధాప్యానికి చెక్.. తాజా పరిశోధన ఫలితాలతో కొత్త ఆశలు!
వృద్ధాప్యం. మనిషి పరిణామ క్రమంలో అనివార్యమైన దశ. చాలామందికి నరకప్రాయం, బాధాకరం అయిన దశ కూడా. ఒంట్లో అవయవాలన్నీ ఒక్కొక్కటిగా శిథిలమవుతూ పట్టు తప్పి క్రమంగా పనికి రాకుండా పోతుంటే, అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సిన నిస్సహాయత కుంగదీస్తుంటే, నీడలా వెంట తిరుగుతూ దోబూచులాడే మృత్యువు ఎప్పటికి కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ దుర్భరంగా గడుస్తుంటుంది. అలాంటి వృద్ధాప్యాన్ని వీలైనంత వరకూ వాయిదా వేయగలిగితే? ఆ దిశగా ఇప్పటికే పరిశోధనలు మహా జోరుగా జరుగుతున్నాయి. సౌరశక్తి సాయంతో వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయవచ్చని అటువంటి అధ్యయనమొకటి తాజాగా చెబుతుండటం ఆసక్తికరం! ఎండలో నిలబడితే ఏమొస్తుందంటే విటమిన్ డి అనేస్తాం. కదా! ఇకపై ఎండలో నిలబడటం ద్వారా ముసలితనానికి టాటా చెప్పేయొచ్చని, వయసు పెరుగుదలను బాగా తగ్గించుకోవచ్చని అంటోంది తాజా అధ్యయనమొకటి. ‘‘సౌరశక్తిని మానవ కణాలు నేరుగా వాడుకునేందుకు అవసరమైన రసాయన శక్తిగా మార్చడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేయొచ్చు. కణాల్లోని కీలకమైన మైటోకాండ్రియాలో నిర్దిష్టమైన జన్యుమార్పులు చేయడం దీన్ని సాధించవచ్చు. ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమై తీరుతుంది’’ అంటూ అది కుండబద్దలు కొడుతుండటం ఆసక్తికరం! వృద్ధాప్యానికి దారి తీసే అంశాల్లో మనిషి కణజాలంలోని కీలకమైన మైటోకాండ్రియా పనితీరు మందగించడమే ప్రధాన కారణం. కాకపోతే ఎటువంటి జీవక్రియలు ఇందుకు కారణమవుతాయన్నది మనకింకా తెలియదు. ఈ సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ‘‘సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి నిర్దిష్ట పద్ధతితో కణ కేంద్రకంలోని ప్రోటాన్లను శక్తిమంతం చేస్తే మైటోకాండ్రియాలోని జీవన పరిమాణాన్ని పెంచేందుకు తోడ్పడే సమలక్షణాలు సమృద్ధిగా పెరుగుతాయి. యుక్త వయసులో ఇలా కణజాలంలోని మైటోకాండ్రియా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయొచ్చు. వయో సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స కూడా అందజేయడం వీలు పడుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని రోచెస్టర్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా చేశారు...: మౌలిక జీవపరమైన సూత్రాలను అవగాహన చేసుకోవడానికి చిరకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న ఒకరకం నట్టలనే ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వాటి కణజాలంలోని మైటోకాండ్రియాలో జన్యుపరంగా మార్పుచేర్పులు చేశారు. అనంతరం సౌరశక్తి సాయంతో దాన్ని పరిపుష్టం చేశారు. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మైటోకాండ్రియా పైపొరలోని అయాన్లన్నీ మరింత శక్తిమంతంగా మారి దాని సామర్థ్యంతో పాటు తాజాదనం కూడా బాగా పెరిగాయి. మైటోకాండ్రియా–ఓఎన్గా పిలుస్తున్న ఈ ప్రక్రియ ద్వారా మెటబాలిజం రేటులో వృద్ధి జరిగి సదరు నట్టలు మరింత ఆరోగ్యకరంగా మారాయి. పైగా వాటి జీవితకాలం కూడా 30 నుంచి 40 శాతం దాకా పెరగడం గమనించారు. ‘‘మా పరిశో ధనలు విజయవంతమయ్యాయి. వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే వయో మనుషుల్లోనూ సంబంధమైన వ్యాధులను మరింత మెరుగ్గా నయం చేయడమే గాక ఆరోగ్యకరంగా, నిదానంగా వృద్ధాప్యం వైపు సాగేలా చూసే మార్గం చిక్కుతుంది’’ అని పరిశోధనలో పాలు పంచుకున్న సీనియర్ ఆథర్ ఆండ్రూ వొజోవిక్ చెప్పుకొచ్చారు. ‘‘మనిషి శరీరంలో జీవక్రియలపరంగా మైటోకాండ్రియా పోషించే సంక్లిష్టమైన పాత్రను గురించి ఈ అధ్యయనం ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఫలితాలు జర్నల్ నేచర్‌లో పబ్లిషయ్యాయి. శక్తి కేంద్రం... మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి కేంద్రంగా చెప్పొచ్చు. కణాల్లో జరిగే జీవ క్రియలకు కావాల్సిన శక్తిని ఇవే తయారు చేస్తాయి. కణంలో రెండు పొరలతో కూడుకుని ఉండే మైటోకాండ్రియాలు స్థూప, గోళాకృతుల్లో ఉంటాయి. జీవ క్రియలు చురుగ్గా సాగే కణాల్లో వీటి సంఖ్య అపారంగా ఉంటుంది. మైటోకాండ్రియా పనితీరు ఎంతగా తగ్గుతుంటే అవయవాలు క్షీణించి శిథిలమయ్యే ప్రక్రియ అంతగా వేగం పుంజుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మలేరియా వ్యాప్తిని నిరోధించే దోమలు
లండన్: మలేరియా.. మానవాళికి పెనుముప్పుగా మారిన అతిపెద్ద వ్యాధి. దోమల నుంచి వ్యాపించే మలేరియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. వ్యాధి నివారణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మలేరియా వ్యాప్తిని అరికట్టే దోమలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం సాధారణ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేశారు. మలేరియాకు కారణమయ్యే పారాసైట్లు జన్యుపరంగా మార్పు చేసిన ఈ దోమల్లో వేగంగా పెరగవని చెబుతున్నారు. మలేరియాను అరికట్టడంలో ఇదొక శక్తివంతమైన ఆయుధం అవుతుందని పేర్కొంటున్నారు. యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌తోపాటు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ డిసీజ్ మోడలింగ్’ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన ఆడ దోమ మరో వ్యక్తిని కుడితే అతడికి కూడా వ్యాధి సోకుతుంది. అంటే దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. మలేరియా పారాసైట్లు తొలుత దోమ ఆంత్రంలోకి చేరుకుంటాయి. అక్కడే ఇన్ఫెక్షన్ కలిగించే స్థాయికి ఎదుగుతాయి. అనంతరం లాలాజల గ్రంథుల్లోకి చేరుకుంటాయి. ఆంత్రంలో పారాసైట్లు ఎదగడానికి ఎక్కువ సమయం పట్టేలా చేశారు. పారాసైట్లు అభివృద్ధి చెంది, మనిషిని కుట్టే లోపే దోమల జీవితకాలం ముగుస్తుందని చెబుతున్నారు. ప్రపంచంలో సగం జనాభాకు మలేరియా రిస్క్ పొంచి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.10 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 6,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. -
ఎడమ చేతి వాటం, ఎన్నో ప్రత్యేకతలు.. తెలివి తేటలు, గ్రహించే శక్తి అన్నీ ఎక్కువే
సాక్షి, కర్నూలు: సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరి ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టొచ్చు. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది ఎడమ చేతి వాటం (లెఫ్ట్ హ్యాండర్స్) కలిగి ఉన్నారు. వీరెక్కడ కనబడినా మనం ప్రత్యేకంగా చూస్తాం. కుడి ఎడమైతే పొరపాటే లేదోయ్ అన్నాడో సినీ కవి. ఎడమ చేతి వాటం కేవలం జన్యుప్రభావం వల్ల ఎర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్‌హ్యాండర్స్ డేగా జరుపుకుంటున్నారు. కుడి చేతి వాటం కలిగిన వారి కన్నా ఎడమ చేతి వాటం వారు ఉన్నత స్థానాల్లో ఉంటారని, వారికి తెలివి తేటలు, గ్రహించే శక్తితో పాటు మంచి అలోచన శక్తి ఉంటుందని అంటారు. అంతేకాదు ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎడమ చేతితోనే రాస్తారు. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, అమెరికా మాజీ ప్రెసిడెంట్లు ఒబామా, బిల్‌క్లింటన్, సినీ నటుడు అమితాబ్, సావిత్రి ఇలా ఎందరో లెఫ్ట్‌హ్యాండ్ వాటం వారే. ఎడమ చేతి వాటం ఉన్న వారిలో క్రియేటివిటీ, మ్యూజిక్, ఆర్ట్స్ అధికంగా ఉంటాయి. వీరికి మాట్లడే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం మెండుగా ఉంటుంది. వీరి ప్రత్యేకతల్లో కొన్ని ►చేతులకు ఉన్నట్లే కాళ్లకు కూడా వాటం ఉంటుంది. కుడి చేతి వాటం ఉన్న వారిలో కుడికాలు వాడకం, ఎడమ చేతి వాటం ఉన్న వారు ఎడమ కాలి వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు ఎదైనా చూడాలంటే మొదట ఎడమ కన్నుతోనే చూస్తారు. ►మహిళలకు మాత్రం సృజనాత్మకతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ►ఎడమ చేతివాటం వారు వేగంగా, సులభంగా పనులు మంచి టెక్నిక్‌తో పూర్తి చేస్తారు. వీరికి మెమొరీ పవర్, ఐక్యూ అధికంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాలు వెంటనే మరచిపోగలరు. వారికీ ఇబ్బందులు.. ఎడమ చేతి వాటం వాళ్లలో టైలర్లు కాస్త ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే కత్తెర, సూయింగ్ మిషన్ డిజైన్ పూర్తిగా కుడి చేతి వారికి సరిపోయే విధంగా తయారై ఉంటాయి. కంప్యూటర్ మౌస్, డ్రైవింగ్ చేసేవారు ఇలా ఎందరో ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం వారి కోసం కూడా ప్రత్యేకంగా డిజైన్లు తయారవుతున్నాయి. ►ఈ చిత్రంలో కపిస్తున్న బాలిక పేరు షాజిదాబి (లెఫ్ట్ హ్యాండర్). క్రిష్టిపాడు గ్రామానికి చెందిన హుసేన్‌బాషా, ఉసేన్బీల రెండో కూతురు. బాలిక ప్రస్తుతం ఉయ్యాలవాడ మండలం హరివరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుంది. చదువులో ముందంజలో ఉంటుంది. తెలుగు, ఆంగ్లం కంటే హిందీ రైటింగ్ బాగా రాస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బాలిక చెల్లెలు రిజ్వానతో పాటు మేనత్త కొడుక్కి ఎడమ చేతివాటం ఉండటం గమనార్హం. ►ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నోడి పేరు శివకేశవ (లెఫ్ట్ హ్యాండర్). దొర్నిపాడులోని ఎంపీపీ స్పెషల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. క్యారమ్స్ క్రీడలో చురుగ్గా రాణిస్తున్నాడు. చదువుతో పాటు క్రీడల్లో ముందుంటాడని టీచర్లు చెబుతున్నారు. ►ఇక్కడ చిత్రలేఖనం చేస్తూ కనిపిస్తున్న బాలిక పేరు మానస (లెఫ్ట్ హ్యాండర్). డబ్ల్యూ.కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుంది. చదువుతో పాటు చిత్రలేఖనంలో రాణిస్తుంది. తమ కుటుంబంలో ఎవరికీ ఎడమ చేతి వాటం లేదని మానసకు మాత్రమే వచ్చిందని తండ్రి బాలచంద్రుడు పేర్కొన్నాడు. జన్యు మార్పులతోనే ఎడమ చేతివాటం ఒక మనిషి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీర భాగాన్ని మెదడు ఎడమవైపు భాగం నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే కుడి అర్ధభాగం మెదడు బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం వస్తుంది. మన ప్రాంతంలో చాలా మంది కుడిచేతితో డబ్బులు ఇవ్వడాన్ని, మంచి పనులు ప్రారంభించడాన్ని సెంటిమెంట్‌గా పరిగణిస్తారు. అందుకే చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎడమ చేతివాటం గమనిస్తే మాన్పించే ప్రయత్నం చేస్తారు. వారికి జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం. అందుకే వారిని ఇబ్బందులకు గురి చేయవద్దు. వయస్సు పెరిగే కొద్ది సాంప్రదాయాలు చెబితే వారు అర్థం చేసుకోని మన పద్ధతులను బట్టి నడుచుకోగలరు. –డాక్టర్ నాగేంద్ర, దొర్నిపాడు పీహెచ్సీ -
ఆ జన్యువులోనే కోవిడ్ మరణాల గుట్టు!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మందిని బలితీసుకుంది. కొన్నిదేశాల్లో ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. ఈ వైరస్ బారినపడి చనిపోయినవారిలో.. పెద్దవయసువారు, వివిధ వ్యాధులున్నవారే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మధ్యవయసువాళ్లు, యువత కూడా ఉన్నారు. మరి ఇలా ఏ అనారోగ్యం లేకుండా నిక్షేపంగా ఉన్నవారు కూడా కోవిడ్‌తో చనిపోవడానికి వారిలో జన్యు వ్యత్యాసమే (జీన్ వేరియేషన్) కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతకీ ఆ జన్యువు ఏమిటి, ఎందుకు ప్రాణాల మీదికి వస్తోంది, పరిశోధనలో తేలిన వివరాలివి.. ఊపిరితిత్తుల కణాల్లో.. సాధారణంగా పిల్లలు, యువతతోపాటు 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ఎక్కువగా ఉంటుంది. 60 ఏళ్లు దాటినవారిలో వయసు పెరిగినకొద్దీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కానీ కోవిడ్ బారినపడి చనిపోయినవారిలో 30ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసువారు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జీనోమిక్స్ విభాగం శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. తీవ్రస్థాయిలో కోవిడ్‌కు గురై ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారు, తక్కువగా ప్రభావితమైన వారి జన్యుక్రమాన్ని పోల్చి చూశారు. మన ఊపిరితిత్తుల కణాల్లో ఉండే ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ అనే జన్యువులోని ఒక వేరియేషన్ కరోనా మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణమని గుర్తించారు. ఏమిటీ ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’? ఊపిరితిత్తుల కణాలగోడలు దృఢంగా ఉండటానికి, వైరస్ల దాడిని ఎదుర్కొని, కణాలు తిరిగి బలం పుంజుకోవడానికి ఈ జన్యువు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ జన్యువులో రెండు రకాలు (వేరియంట్లు) ఉన్నాయని.. అందులో ఒకరకం కోవిడ్ ఇన్ఫెక్షన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తోడ్పడితే.. మరో రకానికి ఈ శక్తి తక్కువగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఇలా తక్కువ శక్తి ఉన్న రకం జన్యువు.. దక్షిణాసియా దేశాల వారిలో 60 శాతం, యూరోపియన్ దేశాల్లో 15 శాతం, ఆఫ్రికా వారిలో 2.4 శాతం, తూర్పు ఆసియా దేశాల వారిలో 1.8 శాతం ఉన్నట్టు తేలిందని వివరించారు. ‘రిస్క్’ రెండింతలు.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా మన శరీరంలో నేరుగా ఎక్కువ ప్రభావం పడిన జన్యువు ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ డేవిస్ చెప్పారు. అయితే కేవలం ఈ ఒక్క జన్యువు కారణంగానే పెద్ద సంఖ్యలో మరణాలు నమోదైనట్టు చెప్పలేమని.. మధుమేహం, గుండెజబ్బులు వంటివి ఉన్నవారిలో తక్కువ శక్తి ఉన్న జన్యువు ఉంటే.. మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. భారతదేశంలో టైప్–2 మధుమేహం,గుండె జబ్బుల బాధితులు ఎక్కువని.. దానికితోడు తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ జన్యువు ఉన్నవారి సంఖ్య కూడా ఎక్కువేనని జేమ్స్ డేవిస్ తెలిపారు. ఈ రెండింటి కారణంగానే కరోనా రెండో వేవ్ సమయంలో భారతదేశంలోని కొన్నిప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. వయసు పెరిగిన కొద్దీ.. తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ జన్యువు ఉన్నవారు.. తమకంటే పదేళ్లు ఎక్కువ వయసున్న వారితో సమానంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు లోనవుతారని ప్రొఫెసర్ జేమ్స్ డేవిడ్ వెల్లడించారు. అలాంటి వారిలో 20–30 ఏళ్ల తర్వాత ప్రతి పదేళ్లకు ప్రమాద అవకాశం రెండింతలు అవుతూ ఉంటుందని వివరించారు. అయితే తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ జన్యువు ఉన్నంత మాత్రాన ప్రమాదకరమని అనుకోవద్దని.. ఇతర జన్యువులు, రోగ నిరోధక శక్తి, ఎలాంటి వ్యాధులు లేకపోవడం వంటివి రక్షణగా ఉంటాయని స్పష్టం చేశారు. -
జన్యుమార్పిడి బియ్యం కలకలం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం జన్యుమార్పిడి (జీఎం) బియ్యం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత్ నుంచి ఎగుమతి అయిన బియ్యపు నూకల్లో జన్యుమార్పిడి రకాలున్నట్లు యూరోపియన్ యూనియన్ ఫిర్యాదు చేసింది. వీటి వినియోగంతో అనారోగ్యం బారిన పడడమే కాకుండా..పలు దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయనే వాదనలను తెరపైకి తీసుకొచ్చింది. అయితే జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించబోదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. భారత్ నుంచి జూన్‌లో ఎగుమతి అయిన 500 టన్నుల బియ్యం ప్రస్తుతం పలు యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వివాదానికి కేంద్రబిందువయ్యాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాలను తనిఖీ చేసే యూరోపియన్ కమిషన్ చేసిన ఆకస్మిక తనిఖీల్లో ఈ జన్యుమార్పిడి బియ్యం ఉన్న విషయం బయటపడింది. ఫ్రాన్స్‌కు చెందిన వెస్తోవ్ కంపెనీ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయంపై ఫ్రాన్స్ ప్రభుత్వం పలు దేశాలను అప్రమత్తం చేసింది. దీంతో అమెరికాకు చెందిన మార్స్ ఆహార ఉత్పత్తుల కంపెనీ జీఎం అవశేషాలున్నాయనే భయంతో తాను ఉత్పత్తి చేసిన క్రిస్పీ ఎంఅండ్ఎం ప్రోడక్ట్‌ను మార్కెట్ నుంచి వెనక్కు తెప్పించింది. సేంద్రియ బియ్యంగా భావించి తాము ఇండియా నుంచి వచ్చిన ఆ బియ్యంతో ఈ ప్రోడక్ట్‌ను తయారు చేసినట్లు వివరించింది. అమెరికా కంపెనీ చేసిన ఈ పనితో ప్రపంచ వ్యాప్తంగా ఇండియా నుంచి వచ్చిన బియ్యాన్ని చాలా దేశాలు మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాయి. రంగంలోకి ఐఏఆర్ఐ.. భారత్ నుంచే జన్యుమార్పిడి బియ్యం ఎగుమతి జరిగిందని పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇండియన్ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) రంగంలోకి దిగింది. దేశంలో ఎక్కడెక్కడ జన్యుమార్పిడి వంగడాలను సాగు చేస్తున్నారనే దానిపై ముమ్మర తనిఖీ ప్రారంభించింది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలోనూ ఏవైనా ప్రభుత్వ, ప్రైవేటు విత్తన సంస్థలు లేదా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు జీఎం రైస్‌ను ప్రయోగాత్మకంగానైనా పండిస్తున్నాయా అనే విషయంపై ఆరా తీస్తోంది. తమిళనాడుకు చెందిన నాలుగు సేంద్రీయ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులను రద్దు చేయడం, కొన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో వరిపై చేస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలే ఇందుకు సాక్ష్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రూ.65వేల కోట్ల నష్టం? భారత్ నుంచి ఏటా సుమారు రూ.65 వేల కోట్ల విలువైన వరి ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ చేసిన ఫిర్యాదే గనుక నిజమైతే భారత్‌కు భారీగా నష్టం వాటిల్లుతుంది. జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించదు. అయితే కొన్ని పరిశోధన కేంద్రాల్లో జీఎం రైస్‌పై క్షేత్రస్థాయి పరిశీలనలు సాగుతున్నాయి. దీన్ని ఐఏఆర్ఐ కూడా ధ్రువీకరించింది. ఇదే సందర్భంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దేశంలోని నాలుగైదు సేంద్రియ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులు రద్దు చేసింది. ఏమీ లేనప్పుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని యూరోపియన్ యూనియన్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నది. ఎక్కడి నుంచి బియ్యం వెళ్లాయి? మహారాష్ట్ర అఖోలాలోని హోల్‌సేల్ బియ్యం వ్యాపారి ఓమ్ ప్రకాష్ శివప్రకాష్‌కి చెందిన సంస్థ నుంచి యూరప్‌కి పంపిన బియ్యంలో జీఎం అవశేషాలున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జెనిటికల్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ, ఐఏఆర్‌ఐకి చెందిన వ్యవసాయ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే నెలాఖరులోపు ఈ నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రైవేటు విత్తన సంస్థల ప్రయోగ క్షేత్రాలను, ఇటీవల విడుదల చేసిన హైబ్రీడ్ వరి వంగడాలను కూడా ఈ బృందం తనిఖీ చేస్తోంది. -
భారత్‌లో కొత్త రకం కరోనా!
న్యూఢిల్లీ: రెండుసార్లు జన్యు మార్పిడి జరిగిన కరోనా వైరస్‌ను మన దేశంలో గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దానితోపాటు పలు ఆందోళనకర వైరస్ రకాలు కూడా వ్యాపిస్తున్నట్టు తెలిపింది. జన్యుక్రమంలో ఓసారి మార్పులు జరిగిన వైరస్‌లో మరోసారి కూడా జన్యుమార్పిడి జరిగి సరికొత్త రకమైన వైరస్‌గా మారడం భారత్‌లోనే కనిపించిందని, ఇతర రకాలు కొన్ని గతంలోనే విదేశాల్లో బయటపడ్డాయని వివ రించింది. ఇటీవల మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతుండటానికి ఈ కొత్త వైరస్ రకాలే కారణమా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది. వైరస్ జన్యు క్రమంతోపాటు వ్యాధికి సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని వివరించింది. ఇన్సాకాగ్ నేతృత్వంలో.. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో ‘ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్షియం ఆన్ జినోమిక్స్ (ఇన్సాకాగ్)’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)తోపాటు దేశంలోని పది జాతీయ పరిశోధనశాలల్లో ఈ పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి వైరస్ జన్యుక్రమాలను నమోదు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారి సంబంధీకుల నుంచి శాంపిల్స్ సేకరించి, ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు. జన్యుక్రమాలను గుర్తించడం ద్వారా వైరస్‌కు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చని.. వ్యాధి చికిత్స, టీకాల తయారీలో ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తెలంగాణలో కొత్త రకాల వ్యాప్తి.. కేరళలోని 14 జిల్లాల నుంచి వచ్చిన 2,032 నమూనాలను విశ్లేషించగా.. రోగ నిరోధక వ్యవస్థ దృష్టి నుంచి తప్పించుకోగల ఎన్440కే రకం వైరస్ 123 నమూనాల్లో కనిపించిందని ఇన్సాకాగ్ వివరించింది. గతంలో ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ నమూనాల్లో 33 శాతం వరకూ ఉండేదని తెలిపింది. తెలంగాణ నుంచి సేకరించిన 104 నమూనాల్లోని.. 53 నమూనాల్లో కొత్త రకాన్ని గుర్తించామని తెలిపింది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి పదహారు దేశాల్లో ఈ ఎన్440కే రకం వైరస్ వ్యాపించిందని పేర్కొంది. 771 రకాల గుర్తింపు ఇప్పటివరకు 771 రకాల కరోనా వైరస్‌లను గుర్తించామని, అవన్నీ ఆందోళన కలిగించేవేనని ఇన్సాకాగ్ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం 10,787 నమూనాల్లో యూకే రకం వైరస్‌ను 736 నమూనాల్లో, దక్షిణాఫ్రికా రకం వైరస్‌ను 34 నమూనాల్లో, బ్రెజిల్ రకం వైరస్‌ను ఒక నమూనాలో గుర్తించామని తెలిపింది. మహారాష్ట్ర నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించినప్పుడు గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం.. ఈ484క్యూ, ఎల్452ఆర్ జన్యుమార్పులున్న వైరస్లు ఎక్కువయ్యాయని పేర్కొంది. ఈ రెండు జన్యుమార్పులు రోగ నిరోధక వ్యవస్థ దృష్టి నుంచి తప్పించుకునేందుకు వైరస్‌కు అవకాశం కల్పిస్తాయని వివరించింది. ఈ జన్యుమార్పులు 15- 20 శాతం నమూనాల్లో ఉన్నట్టు గుర్తించామని.. ఇప్పటిదాకా గుర్తించిన వైరస్‌లతో వీటికి పోలిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. కొత్త రకం వైరస్‌ను కట్టడి చేసేందుకు.. విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ వారికి దగ్గరగా వ్యవహరించిన వారిని గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, తగిన చికిత్స కల్పించడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
బ్రిటన్ కొత్త వైరస్ టెస్టులకు దొరకదా?
బ్రిటన్‌లో కొత్త రూపం సంతరించుకున్న వైరస్ ప్రస్తుతం చేసే కరోనా పరీక్షల్లో బయటపడకపోవచ్చని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈ–సీడీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం వైరస్‌పై నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం వాడుతున్న ఎస్–జీన్ (స్పైక్ జీన్) ఆధారిత ఆర్టీపీసీఆర్ టెస్టుల స్థానంలో అన్ని రకాల జీన్లు, మార్పులతో తయారైన కిట్లు తయారుచేయాలి. లేకుంటే ఈ వైరస్‌ను పూర్తిగా కనిపెట్టలేం.. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో దీన్ని గుర్తించడం తక్కువ.. అందువల్ల పరీక్షల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం స్పైక్–జీన్‌లో మార్పులను బట్టి ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరగడం లేదని తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ 60 ఏళ్లలోపు వారిపైనే పంజా ఈ వైరస్‌కు గురైన వారి సగటు వయసు 47 ఏళ్లు.. అంటే 60 ఏళ్లలోపు వారికే ఎక్కువగా ఈ వైరస్‌తో ప్రమాదముంది. దీనికి కారణమేంటంటే.. లాక్డౌన్ తర్వాత బ్రిటన్‌లో అన్నింటినీ వదిలేశారు. దీంతో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. చలికాలం కూడా అనుకూలంగా పనిచేసింది.. సాధారణ వైరస్‌తో పోలిస్తే దీని వల్ల ఎక్కువ మరణాలు సంభవించలేదు. వైరస్‌పై లేబొరేటరీల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. దీని ఇన్ఫెక్టెవిటీని తెలుసుకుంటున్నారు. ఎలా గుర్తించారంటే? బ్రిటన్‌లో జన్యు విశ్లేషణ ప్రతీ పది కరోనా కేసుల్లో ఒకదానిపై జరుగుతోంది. అదే భారత్‌లో 5 వేలకు ఒక కేసుపై జన్యు విశ్లేషణ చేస్తున్నారు. దేశంలో కేసులు పడిపోతుండటంతో గత రెండు నెలలుగా కరోనా జన్యు విశ్లేషణ నిలిచిపోయింది. అయితే ఇటు సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్‌లో కేసులు బాగా పెరిగినట్లు గుర్తించారు. 14 రోజుల్లో నాలుగు రెట్లు పెరిగాయి. పెరిగిన కేసుల్లో జన్యు విశ్లేషణ ఆధారంగా కొత్త వర్గానికి చెందిన కరోనా బయటపడింది. ప్రపంచంలో 10 రకాల కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లున్నాయి. అందులో కోవిడ్ ఒకటి. కోవిడ్‌లో 11 రకాల ఉప గ్రూప్‌లున్నాయి. ప్రస్తుతం ప్రపం చాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్‌లో ఏ2ఏ అనే వర్గపు వైరస్ ప్రధానమైంది. మన దేశంలోనూ అదే ఉంది. ఇప్పుడు యూకేలో వచ్చింది కోవిడ్–19లో బీ వర్గానికి చెందినది. ఇది అనూహ్యంగా జన్యు మార్పులు చెంది 29 రకాలుగా మార్పులు చెందింది. సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్‌లో వారం పది రోజుల్లో నమోదైన వెయ్యి కేసుల్లో సగం ఈ వర్గానికి చెందినవే.. గతంలో 5% ఉన్నది కాస్తా ఇప్పుడు 50% పెరిగింది. మిగిలిన కరోనా వైరస్ల కంటే ఇది 70% వేగంగా విస్తరిస్తుంది. అయితే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో గుర్తించలేదని ఈ–సీడీసీ తెలిపింది. దక్షిణాఫ్రికాలోనూ ఇదే వర్గానికి చెందినదే గతంలో వచ్చింది. సింగపూర్‌లోనూ కొత్త వెరైటీలు వచ్చి బలహీనపడ్డాయి. దీనిపై పరిశోధనలు జరగాలి.. ప్రతీ దేశంలోనూ కొత్త వైరస్‌పై జన్యువిశ్లేషణ జరగాలని సూచించింది. కొత్త వైరస్‌తో అనూహ్యంగా కేసులున్నాయే కానీ, మరణాలు పెద్దగా పెరగలేదని తెలిపింది. కొత్త వైరస్లలో మార్పులకు కారణమేంటంటే? కొత్త రకం వైరస్లలో అనూహ్యంగా మార్పులున్నాయి. బీ వర్గం వైరస్ కూడా మార్పులకు లోనై తక్కువ కాలంలో వేగంగా విస్తరిస్తోంది. దీనికి గల కారణాలను ఈ–సీడీసీ విశ్లేషించింది. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న అతి కొద్దిమంది కరోనా రోగుల్లో కొన్ని నెలల పాటు వైరస్ ఉంటుంది. దీంతో వైరస్ వారి శరీరంలో ఎన్నో మార్పులకు లోనవుతుంది. అలా అది ఆ మార్పులతో బయటకు వచ్చి మరింత వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. ఇక రెండోది జంతువుల్లోకి వైరస్ వెళ్లి మార్పులు చెంది మళ్లీ మనిషికి రావడం వల్ల దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చదవండి: (కరోనాకు కొత్త కొమ్ములు) ఉదాహరణకు డెన్మార్క్‌లో మింక్ అనే జంతువులో వైరస్ ప్రవేశించి అనేక మార్పులకు లోనైంది. అందులో ఒక ప్రత్యేక మార్పును ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అదే మార్పు ఇంగ్లండ్‌లోని బీ వర్గం వైరస్‌లోనూ కనిపిస్తోంది. అయితే అది ప్రమాదకరం కాదని నిర్ధారణ అయింది. బ్రిటన్‌లోని కొత్త రకం వైరస్ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ–సీడీసీ చెప్పింది. బ్రిటన్ నుంచి వచ్చేవారిని ఇతర దేశాల్లో క్వారంటైన్లో ఉంచాలి. ఎవరూ ఎక్కువ ప్రయాణాలు చేయవద్దు. ప్రస్తుతం తీసుకుంటున్న కరోనా జాగ్రత్తలు పాటించాలి. అనవసరంగా బయటకు రాకూడదని తెలిపింది. ఈ–సీడీసీ ప్రతిపాదనలు ►ప్రస్తుతం వాడుతున్న మందులతో నయం కాని కరోనారోగులను ప్రత్యేకంగా పరిశీలించాలి.. ►కరోనా రీఇన్ఫెక్షన్ వచ్చిన వారిలోని మార్పులను గుర్తించాలి. రెండోసారి వచ్చింది బీ వర్గానిదా కాదా చూడాలి. ►వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా వచ్చినవారున్నారా లేదా చూడాలి. వాళ్లల్లో కొత్త వైరస్ ఉందా లేదా పరీక్షించాలి. జాగ్రత్తలే శ్రీరామరక్ష.. కొత్త వైరస్ ప్రమాదకారి అని చెప్పలేం.. ఆర్ఎన్ఏ వైరస్లలో మార్పులు సహజమే.. దీనివల్ల మనుషులపై చూపించే ప్రభావం కూడా తక్కువేనని ఈ–సీడీసీ స్పష్టం చేసింది. బీ వర్గానికి చెందిన కొత్త వైరస్‌కు దగ్గరి పోలికలున్న వైరస్‌ను దక్షిణాఫ్రికా, సింగపూర్, డెన్మార్క్‌ల్లో గుర్తించారు. కానీ ఇది ఏమాత్రం ప్రభావితం చేయలేదని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. వ్యాక్సిన్ పురోగతికి, కరోనా వైద్యంపై కొత్త వైరస్ ప్రభావం చూపదు.. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజల్ని ప్రభుత్వాలు వైరస్‌కు దూరంగా ఉంచాలి. ఆ మేరకు ప్రజలూ తగు జాగ్రత్తలు పాటించాలి.. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
కరోనాకు కొత్త కొమ్ములు
సాక్షి, హైదరాబాద్: లండన్‌లో బయటపడి పలు దేశాలకు విస్తరించిన కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని కొందరు చెబుతుండగా, ఇందుకు తగిన ఆధారాలు, సమాచారం చూపాలని బ్రిటన్ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఈ కొత్త రకం వైరస్ మరింత తీవ్రమైందని, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగపు ముఖ్యాధికారి మైకేల్ ర్యాన్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించ కూడదని నిర్ణయించుకున్నామని అమెరికా వ్యాక్సిన్ నిపుణుడు ఆంథోనీ పాసీ ప్రకటిం చారు. ఇప్పటివరకు 1,000 మంది ఈ రూపాం తర వైరస్ బారిన పడగా నలుగురు మాత్రమే మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉండేలా వ్యాధి కారక వైరస్లలో జన్యుమార్పులు జరగడం ఇది తొలిసారేమీ కాదు. అయితే గతంలో రూపాంతర వైరస్ కారణంగా వచ్చే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ‘వీయూఐ 202012/01’వైరస్ సోకిన వారి పరిస్థితి ఏంటన్నది నిశితంగా గమనించాల్సి ఉంది. చదవండి: (కొత్త రకం కరోనా: భారత్‌లో ఆందోళన అవసరం లేదు!) జన్యుమార్పులు ఎలా? శరీరంలోకి చేరిన వైరస్ వేగంగా తన నకళ్లను తయారు చేసుకుంటుందని తెలిసిందే. ఒక వైరస్ రెండుగా విడిపోయే క్రమంలో సహజసిద్ధంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు వైరస్ మనుగడకు ఉపయోగపడకపోతే అవి మరణిస్తాయి. ఈ ఏడాది జనవరిలో తొలిసారి గుర్తించిన సార్స్ సీవోవీ–2 వైరస్ పలు ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా.. అనేక మార్పులకు గురయ్యాయి. సాధారణంగా జనాభాలో అత్యధికుల్లో పాత వైరస్ లేదా ఇతర వ్యాధులకు వేసిన టీకాల వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో యాంటీబాడీల ఉత్పత్తి జరిగి ఉంటే వాటిని అధిగమించి మనుగడ సాగించేందుకూ ఈ జన్యుమార్పులు దోహదపడతాయి. కాకపోతే ఇందుకు చాలా సమయం పడుతుంది. ‘వీయూఐ 202012/01’వైరస్ ఉనికి అక్టోబర్ నుంచి క్రమేపీ పెరుగుతుండటాన్ని బట్టి చూస్తే ఇది నిలకడ కలిగిందని తెలుస్తోంది. ఈ వైరస్ ఉన్న రోగులను పరిశీలించగా, వైరస్‌లో మొత్తం 23 జన్యుమార్పులు ఉన్నట్లు తెలిసింది. జన్యుక్రమంలో రెండు చోట్ల (పొజిషన్ 69/70, 144/145) తొలగింపులు ఉండటం వ్యాధి వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమని నిపుణుల అంచనా. కొమ్ములోనే అధిక జన్యుమార్పుల వల్ల వైరస్ నకళ్లు ఏర్పడే వేగం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్‌కు చెందిన నిపుణుల బృంద సభ్యుడు వెండీ బార్క్లే అంటున్నారు. వ్యాప్తి వేగం మునుపటి వైరస్ కంటే 71 శాతం ఎక్కువగా ఉందని వివరించారు. చదవండి: (బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!) ఆ మూడింటి విషయంలో జాగ్రత్త.. కోవిడ్ నియంత్రణ కోసం మాస్కులు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో.. త్రీసీలు కూడా అంతే ముఖ్యమని నిపుణులు అంటున్నారు. గాలి, వెలు తురు సక్ర మంగా లేని చోట్ల గుమి కూడకపోవ డం (క్లోస్డ్ స్పేసెస్), జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరక్కపోవడం (క్రౌడెడ్ స్పేసెస్), సన్నిహితంగా మెలగకపోవడం (క్లోజ్ కాంటాక్ట్)లను జాగ్రత్తగా పాటించాలని వివరిస్తున్నారు. వదంతులు నమ్మకండి కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి ఇంకా తెలియాల్సిన అంశా లు చాలా ఉన్నాయని, అంత వర కూ ప్రజలు వదంతులు నమ్మ కూడదని, జాగరూకతతో వ్యవ హరించాలని జస్లోక్ ఆసుపత్రి సాం క్రమిక వ్యాధుల విభాగపు అధ్య క్షుడు డాక్టర్ ఓం శ్రీవాత్సవ స్పష్టం చేశారు. కొత్త రకం వైరస్ కార ణం గా వచ్చే వ్యాధి లక్షణాల్లో పెద్ద తేడాలేమీ లేవని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు అవ సరమైన నిబంధనలు పాటించడం ద్వారా కొత్త రకం వైరస్‌ను కట్టడి చేయొచ్చని అన్నారు. -
కరోనా 2.O: వైరస్ కొత్త రూపం, అసలు కథేంటి?
సమస్త దేశాల్లో కంగారు పుట్టిస్తున్న కరోనా కొత్త రూపు దాల్చింది. వైరస్‌ల్లో జన్యుమార్పులు సహజంగానే జరుగుతుంటాయి. కానీ నెమ్మదిగా జరగాల్సిన ఇలాంటి జన్యుమార్పులను వేగంగా పూర్తి చేసుకొని కరోనా రివైజ్డ్ వెర్షన్‌లాగా సిద్ధమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాలు వచ్చాయని సంతోషించేలోగానే కొత్త రూపంలో కరోనా దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఈ రివైజ్డ్ కరోనా వివరాలు ఇవీ.. ఏమని పిలుస్తారు? వీయూఐ 20212/01. ఎలా ఏర్పడింది?: కోవిడ్ వైరస్‌లో 23 జన్యుమార్పులు జరిగి ఏర్పడింది. ఎక్కడ, ఎప్పుడు బయటపడింది? దక్షిణ లండన్‌లో, గత అక్టోబర్‌లో బయటపడింది. డిసెంబర్ నాటికి వేగంగా వ్యాపిస్తోంది. యూరప్‌లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సహా పలు చోట్ల ఈ వేరియంట్ జాడలు కనిపిస్తున్నాయి. బ్రిటన్‌లో కేసులు పైపైకి బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు సంఖ్య కేవలం రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా, 21వ తేదీన కడపటి వార్తలుఅందే సమయానికి 33,364 కేసులు నమోదయ్యాయి. ఎంత ప్రమాదకరం? గత రూపాల కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా. అయితే వైరస్ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పులేదని నిపుణులు చెబుతున్నారు. టీకాలు పనిచేస్తాయా? కరోనా నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక వైరస్ టీకాకు లొంగని విధంగా పూర్తి జన్యుమార్పులు చెందేందుకు సంవత్సరాలు పడుతుందని, ఇప్పుడు తయారవుతున్న ఆధునిక వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లను అడ్డుకోగలవని చెబుతున్నారు. జనాభాలో 60 శాతం పైగా వ్యాక్సిన్ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు. ఏం చర్యలు చేపట్టారు? ముందుగా బ్రిటన్‌కు పలు దేశాలు రాకపోకలను నియంత్రించాయి. బ్రిటన్‌లో కూడా నూతన వ్యాప్తి అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు వాక్సినేషన్ మొదలెట్టారు. భారత్‌లో పరిస్థితి.. ఇండియాలో ఇంకా అధికారికంగా ఈ కొత్త వేరియంట్ వైరస్ ఉనికి నిర్ధారించలేదు. అటు ఆరోగ్య శాఖ జనవరి నుంచి దేశ ప్రజలకు టీకాలు అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్తగా బ్రిటన్‌కు విమాన రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అనవసర పుకార్లు నమ్మవద్దని, కరోనా నివారణకు సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోకిన వారికే మళ్లీ? దక్షిణ లండన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త చర్యలు పాటించకపోతే కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్‌లోనూ ఈ కొత్త వైరస్ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని సోమవారం ‘సాక్షి’తో చెప్పారు. గుండెజబ్బులతో పాటు మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. కొత్త వైరస్ వల్ల ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు మరోసారి అదే వ్యాధి బారిన పడతారేమోనన్న అనుమానం తనకు ఉందని, అదే జరిగితే సమస్య చాలా తీవ్రమవుతుందని వివరించారు. బ్రిటన్‌తో పాటు అమెరికాలోనూ కొత్త రకం వైరస్‌పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే భారత్‌లో చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వైరస్‌లోని పలు భాగాలపై ఏక కాలంలో దాడి చేస్తాయని, అందువల్ల వైరస్‌లో జన్యుమార్పులు జరిగినా టీకా సామర్థ్యంలో తేడా ఉండదని వివరించారు. (చదవండి: బ్రిటన్ విమానాలపై నిషేధం) -
10 రెట్లు ఎక్కువ ముప్పు
కౌలాలంపూర్: కరోనా వైరస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా రూపాంతరం చెందుతూ మరింత సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. మలేసియాలోని వైరస్‌లో మరో కొత్త రకమైన జన్యు మార్పుల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డీ614జీ అని పిలిచే ఈ కొత్త రకం మార్పులతో వైరస్ 10 రెట్లు వేగంగా ఇతరులకి సోకుతుందని మలేసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించింది. దీనినే సూపర్ స్ప్రెడర్గా పిలుస్తారు. (జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!) భారత్ నుంచి వచ్చిన వ్యక్తితో సంక్రమణ భారత్ నుంచి వచ్చిన ఒక రెస్టారెంట్ ఓనర్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించడంతో 45 మందికి వైరస్ సోకింది. అలా వైరస్ బారిన పడిన మూడు కేసుల్లో జన్యుపరమైన మార్పుల్ని గుర్తించినట్టుగా మలేసియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ నూర్ హిషమ్ అబ్దుల్లా ఫేస్బుక్ పోస్టింగ్‌లో వెల్లడించారు. ఆ వ్యక్తికి అయిదు నెలల జైలు శిక్ష విధించారు. అదే విధంగా, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నుంచి వైరస్ సోకిన వారిలో కూడా జన్యుపరమైన మార్పులున్నట్టు వెల్లడైంది. ఈ జన్యు మార్పులతో వైరస్ ఇతరులపైకి సులభంగా దాడి చేస్తూ , 10 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. కరోనా వైరస్‌లో ఈ కొత్త తరహా మార్పులతో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అబ్దుల్లా తన పోస్టింగ్‌లో హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ప్రజలు పరిశుభ్రంగా ఉంటూ భౌతిక దూరం పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. వైరస్ 10 రెట్లు వేగంగా విజృంభిస్తుంది. ఆ చెయిన్‌ని బద్దలు కొట్టాలంటే ప్రజలు సహకరించాలి’’అని అబ్దుల్లా హితవు పలికారు. వ్యాక్సిన్ తయారీ కష్టమా ? గత ఏడాది డిసెంబర్లో చైనాలోని వూహాన్లో తొలిసారిగా వైరస్ బయటకొచ్చి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందే క్రమంలో జన్యుపరమైన మార్పుల్ని ఇప్పటికే గుర్తించారు. గతంలో ఈ తరహా జన్యు మార్పులు అమెరికా, యూరప్‌లలో గుర్తించారు. తాజాగా మలేసియాలోనూ బయటపడడం ఆందోళన పుట్టిస్తోంది. ఇలా వైరస్ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ ఉంటే కరోనాకి వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలోనూ, ఔషధ తయారీలోనూ సవాళ్లు ఎదురవుతాయని కొందరు శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొని ఉంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాత్రం వైరస్లలో జన్యుపరమైన మార్పులు చాలా సహజంగా జరుగుతూ ఉంటాయని, అవేమంత ప్రమాదకరం కాదని ఇప్పటికే వెల్లడించింది. కరోనా వైరస్‌లో చోటు చేసుకుంటున్న జన్యుమార్పులు టీకా తయారీకి ఎలాంటి అవరో«ధం కాదని చెబుతోంది. -
జన్యు వైద్యం మరింత చేరువ!
శరీరంలోని ప్రతి కణంలో జన్యుమార్పులను గుర్తించి సరిచేసేందుకు ఓ యంత్రం సిద్ధమవుతోందా? అవునంటున్నారు అల్బ్రెట్టా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. బ్రిడ్జ్డ్ న్యూక్లియిక్ యాసిడ్ లేదా బీఎన్ఏ అనే కృత్రిమ ఆర్ఎన్ఏ ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునని బాసిల్ హబ్బార్డ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. జన్యువులను మన అవసరాల మేరకు కత్తిరించేందుకు, అదనపు భాగాలను జోడించేందుకు ప్రస్తుతం క్రిస్పర్ క్యాస్ 9 పేరుతో ఒక టెక్నాలజీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. బ్యాక్టీరియా తనపై జరిగిన దాడులను గుర్తుంచుకుని భవిష్యత్తులో అవే రకమైన దాడులు జరిగినప్పుడు తగు విధంగా ప్రతిఘటించడం క్రిస్పర్లోని ముఖ్యమైన అంశం. అయితే ఈ టెక్నాలజీ ద్వారా కూడా కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశముందని బీఎన్ఏ ద్వారా జన్యుమార్పులు కనీసం పదివేల రెట్లు ఎక్కువ కచ్చితంగా జరుగుతాయని బాసిల్ తెలిపారు. శరీరంలోని కోటానుకోట్ల కణాల్లో మార్పులు చేయడం క్రిస్పర్‌తో సాధ్యమైనప్పటికీ ఒక్క చిన్న పొరబాటు జరిగినా క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చేస్తాయి. ఈ సమస్యలను కూడా బీఎన్ఏ ద్వారా అధిగమించవచ్చునని బాసిల్ తెలిపారు. ప్రస్తుతానికి తమ పరిశోధన ప్రాథమిక స్థాయిలోనే ఉందని.. కాకపోతే తప్పులకు దాదాపు ఆస్కారం లేని బీఎన్ఏ ద్వారా భవిష్యత్తులో ఎన్నో వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించవచ్చునని హాబార్డ్ అంటున్నారు. -
సాలీడుకు, మనకూ జన్యు పోలికలు..!
జన్యు మార్పిడి చేసిన సాలీడు కాటు వల్ల తాజా స్పైడర్‌మ్యాన్ సినిమాలో హీరోకు విచిత్ర శక్తులు వస్తాయి. వాస్తవానికి సాలీడు కాటువల్ల సినిమాలో తప్ప నిజజీవితంలో ఎలాంటి శక్తులూ రావు. కానీ.. జన్యుపరంగా సాలీడుకు, మనకూ కొన్ని పోలికలు మాత్రం ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. డెన్మార్క్ ఆరస్ యూనివర్సిటీ, బీజింగ్ జీనోమిక్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా చిన్నగా ఉండే వెల్వెట్ స్పైడర్, పెద్దగా, వెంట్రుకలతో ఉండే టరంటులా స్పైడర్ల జన్యుపటాలను ఆవిష్కరించారు. ఈ రెండు సాలీడు జాతులు 30 కోట్ల ఏళ్ల క్రితం ఒకే జాతి సాలీడుల నుంచి పరిణామం చెందాయని అంచనా. సుదీర్ఘ కాలం అయినందున వీటిలో 300 జన్యువులు మాత్రం ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. అయితే టరంటులా సాలీడు జన్యుపటంలో ఇంకా కొన్ని జన్యుక్రమాలను ఆవిష్కరించాల్సి ఉంది. సాలెగూడు అల్లేందుకు సన్నటి, దృఢమైన దారాన్ని, విషాన్ని అవి ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి? అందుకు జన్యుపరంగా ఉన్న అనుకూలతలు ఏమిటన్నది సాలీడు జన్యుపటంతో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటి జన్యుసమాచారంపై అధ్యయనం ద్వారా భవిష్యత్తులో అత్యుత్తమమైన బయోమెటీరియల్స్, ఔషధాలు, పురుగుమందులు వంటివాటిని తయారు చేయవచ్చని చెబుతున్నారు. -
‘జన్యుమార్పిడి’ దూకుడు!
ఫ్రాన్స్‌లో ఆ మధ్య మొక్కజొన్నలు తిని పెరిగిన ఎలుకలు జబ్బులపాలై ముందుగానే కాలం చేశాయట. ఎలుకలు ఎప్పుడు, ఎలా చస్తే ఎవరిక్కావాలంటారా? నిజమే! అయి తే, ఈ ఎలుకలు తిన్నది ఆషా మాషీ మొక్కజొన్నలు కావు. అవి తిన్నది జన్యుమార్పిడి(జీఎం) చేసిన మొక్కజొన్నలు కావడం, చని పోయింది పెద్ద విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఫాన్స్‌కు చెందిన సీనియర్ జీవశాస్త్రవేత్త డాక్టర్ జీఈ సెరాలిని సారథ్యంలో జరిగిన ఒక అధ్యయనంలో ఎలుకలు అకాల మృత్యువు పాలయ్యాయి. గత ఏడాది హెదరాబాద్లో గత ఏడాది అం తర్జాతీయ జీవవైవిధ్య సదస్సు సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ అధ్యయన ఫలితాలు అప్పట్లోనే కలకలం సృష్టించాయి. ఈ అధ్యయన వ్యాసాన్ని ‘ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ (ఎఫ్‌సీటీ)’ పత్రిక అప్పటికే ప్రచురించడంతో జన్యుమార్పిడి ఆహారం మంచిచెడులపై తీవ్రస్థాయిలో చర్చ సాగింది. అయితే, ఉన్నట్టుండి ఈ అధ్యయనం అరకొరగా ఉం దంటూ వ్యాసాన్ని ఉపసంహరించుకుంటున్న ట్లు ఇటీవల ఆ పత్రిక ప్రకటించింది. దాంతో శాస్త్రవేత్తల్లో మరోమారు చర్చ రాజుకుంది. సుదీర్ఘ అధ్యయనం మోన్శాంటో కంపెనీ రూపొందించిన కలుపు మందు (రౌండప్ రెడీ)ను తట్టుకొనే జన్యుమార్పిడి మొక్కజొన్న(ఎన్కే603)లను ఎలుకలకు మేతగా పెట్టి... వాటి ఆరోగ్యంపై కేన్ యూనివర్సిటీ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సెరాలిని బృందం అధ్యయనం చేసింది. కొత్త జీఎం విత్తనాలపై 90 రోజుల పాటు అధ్యయ నం చేసి దాని మంచి చెడులను అంచనావేయ డం రివాజు. అయితే, డా.సెరాలిని రెండేళ్ల పా టు వంద ఆడ, వంద మగ ఎలుకలపై ప్రయోగాలు చేశారు. వీటికి జీఎం మొక్కజొన్నల మేత తినిపించారు. వీటికి అసాధారణంగా పెద్ద కణుతులు రావడంతోపాటు పిట్యుటరీ గ్రంధి, కిడ్నీలు పాడయ్యాయి. ఆడ ఎలుకలు 70%, మగ ఎలుకలు 50% అకాల మృత్యువు పాలయ్యాయి. ‘సాధారణంగా పరిశోధనలు 3 నెలలతో ముగిస్తుంటారు. అయితే, 4 నెలల నుంచి కణుతులు పెరగడం మా అధ్యయనం లో గమనించాం..’ అని డా. సెరలిని బృంద సభ్యుడు రాబిన్ మసంగె హైదరాబాద్ జీవవైవిధ్య సదస్సుకు వచ్చినప్పుడు చెప్పారు. ఈ అధ్యయన ఫలితాలపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. మోన్శాంటో కంపెనీ స్పం దిస్తూ.. ఈ అధ్యయనంలో పరిశోధన ప్రమాణాలు పాటించలేదని, మొక్కజొన్నలను ఎక్క డి నుంచి తెచ్చి ఎలుకలకు మేపారో తెలియదని, ఇంకా అనేక లోపాలు జరిగాయని పేర్కొంది. ఏ తప్పూ లేదంటూనే..! డా.సెరలిని అధ్యయన వ్యాసాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఎఫ్‌సీటీ ఎడిటర్ హయెస్ గత నెల 29న ప్రచురించిన ఏడాది తర్వాత ప్రకటించారు. ఎఫ్‌సీటీ పత్రిక యాజమాన్యం ఎల్సెవీర్ మొత్తం 2 వేలకు పైగా శాస్త్రసాంకేతిక పత్రికలను ప్రచురిస్తుంటుంది. ఈ అధ్యయనంలో ఎటువంటి అక్రమాలూ చోటుచేసుకోలేదని, గణాంకాల వక్రీకరణ జరగలేదని, అసమగ్రంగా ఉన్నందునే దీన్ని తమ రికార్డుల నుంచి తొలగిస్తున్నామని ఎడిటర్ పేర్కొనడం విశేషం. అయితే, అధ్యయనంలో ఏ తప్పూలేదని ఒప్పుకుంటూనే ఉపసంహరించుకోవడం ఈ అంతర్జాతీయ సంప్రదాయాలకు విరుద్ధమని డా. సెరలిని నిరసన తె లిపారు. వత్తిళ్లవల్ల ఇలా చేయడం బొత్తిగా అసమంజసమని వాపోయారు. వ్యాసాన్ని వెనక్కితీసుకోవడం వెనుక ‘ప్రజారోగ్యానికి సంబంధించిన కుట్ర’ దాగి ఉందని జన్యుమార్పిడి సాంకేతికతపై స్వతంత్ర పరిశోధన, సమాచార సంస్థ (ఫ్రాన్స్) ఆరోపించింది. స్వతంత్ర శాస్త్రవేత్తలకు సెగ బహుళజాతి కంపెనీలో పనిచేసిన ఓ సీనియర్ శాస్త్రవేత్త కొద్ది నెలల క్రితం ‘ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ’ పత్రిక బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ఎడిటర్‌గా నియమితులయ్యారు. ఈ వ్యాసం ఉపసంహరణలో నేరుగా ఆ శాస్త్రవేత్త ప్రమేయం ఉందనడానికి రుజువుల్లేకపోయినప్పటికీ... ఆ తదనంతర పరిణామాల క్రమం గమనార్హమని స్వచ్ఛంద కార్యకర్తలు అంటున్నారు. స్వతంత్ర భావాలు కలిగిన శాస్త్రవేత్తల నోరు నొక్కే ప్రయత్నాలు జరగడం కొత్తకాదని, మెక్సికోకు చెందిన ఇగ్నాసియో చాపెల... అంతకుముందు అర్పడ్ పుస్తాయ్ విషయంలోనూ గతంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేస్తున్నారు. పంతంగి రాంబాబు ‘సాక్షి’ స్పెషల్ డెస్క్