
శరీరంలోని ప్రతి కణంలో జన్యుమార్పులను గుర్తించి సరిచేసేందుకు ఓ యంత్రం సిద్ధమవుతోందా? అవునంటున్నారు అల్‌బ్రెట్టా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. బ్రిడ్జ్‌డ్ న్యూక్లియిక్ యాసిడ్ లేదా బీఎన్‌ఏ అనే కృత్రిమ ఆర్‌ఎన్‌ఏ ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునని బాసిల్ హబ్బార్డ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. జన్యువులను మన అవసరాల మేరకు కత్తిరించేందుకు, అదనపు భాగాలను జోడించేందుకు ప్రస్తుతం క్రిస్పర్ క్యాస్ 9 పేరుతో ఒక టెక్నాలజీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. బ్యాక్టీరియా తనపై జరిగిన దాడులను గుర్తుంచుకుని భవిష్యత్తులో అవే రకమైన దాడులు జరిగినప్పుడు తగు విధంగా ప్రతిఘటించడం క్రిస్పర్‌లోని ముఖ్యమైన అంశం.
అయితే ఈ టెక్నాలజీ ద్వారా కూడా కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశముందని బీఎన్‌ఏ ద్వారా జన్యుమార్పులు కనీసం పదివేల రెట్లు ఎక్కువ కచ్చితంగా జరుగుతాయని బాసిల్ తెలిపారు. శరీరంలోని కోటానుకోట్ల కణాల్లో మార్పులు చేయడం క్రిస్పర్‌తో సాధ్యమైనప్పటికీ ఒక్క చిన్న పొరబాటు జరిగినా క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చేస్తాయి. ఈ సమస్యలను కూడా బీఎన్‌ఏ ద్వారా అధిగమించవచ్చునని బాసిల్ తెలిపారు. ప్రస్తుతానికి తమ పరిశోధన ప్రాథమిక స్థాయిలోనే ఉందని.. కాకపోతే తప్పులకు దాదాపు ఆస్కారం లేని బీఎన్‌ఏ ద్వారా భవిష్యత్తులో ఎన్నో వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించవచ్చునని హాబార్డ్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment