‘జన్యుమార్పిడి’ దూకుడు!
ఫ్రాన్స్‌లో ఆ మధ్య మొక్కజొన్నలు తిని పెరిగిన ఎలుకలు జబ్బులపాలై ముందుగానే కాలం చేశాయట. ఎలుకలు ఎప్పుడు, ఎలా చస్తే ఎవరిక్కావాలంటారా? నిజమే! అయి తే, ఈ ఎలుకలు తిన్నది ఆషా మాషీ మొక్కజొన్నలు కావు. అవి తిన్నది జన్యుమార్పిడి(జీఎం) చేసిన మొక్కజొన్నలు కావడం, చని పోయింది పెద్ద విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.
ఫాన్స్‌కు చెందిన సీనియర్ జీవశాస్త్రవేత్త డాక్టర్ జీఈ సెరాలిని సారథ్యంలో జరిగిన ఒక అధ్యయనంలో ఎలుకలు అకాల మృత్యువు పాలయ్యాయి. గత ఏడాది హెదరాబాద్‌లో గత ఏడాది అం తర్జాతీయ జీవవైవిధ్య సదస్సు సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ అధ్యయన ఫలితాలు అప్పట్లోనే కలకలం సృష్టించాయి. ఈ అధ్యయన వ్యాసాన్ని ‘ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ (ఎఫ్‌సీటీ)’ పత్రిక అప్పటికే ప్రచురించడంతో జన్యుమార్పిడి ఆహారం మంచిచెడులపై తీవ్రస్థాయిలో చర్చ సాగింది. అయితే, ఉన్నట్టుండి ఈ అధ్యయనం అరకొరగా ఉం దంటూ వ్యాసాన్ని ఉపసంహరించుకుంటున్న ట్లు ఇటీవల ఆ పత్రిక ప్రకటించింది. దాంతో శాస్త్రవేత్తల్లో మరోమారు చర్చ రాజుకుంది.
సుదీర్ఘ అధ్యయనం
మోన్‌శాంటో కంపెనీ రూపొందించిన కలుపు మందు (రౌండప్ రెడీ)ను తట్టుకొనే జన్యుమార్పిడి మొక్కజొన్న(ఎన్‌కే603)లను ఎలుకలకు మేతగా పెట్టి... వాటి ఆరోగ్యంపై కేన్ యూనివర్సిటీ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సెరాలిని బృందం అధ్యయనం చేసింది. కొత్త జీఎం విత్తనాలపై 90 రోజుల పాటు అధ్యయ నం చేసి దాని మంచి చెడులను అంచనావేయ డం రివాజు. అయితే, డా.సెరాలిని రెండేళ్ల పా టు వంద ఆడ, వంద మగ ఎలుకలపై ప్రయోగాలు చేశారు. వీటికి జీఎం మొక్కజొన్నల మేత తినిపించారు. వీటికి అసాధారణంగా పెద్ద కణుతులు రావడంతోపాటు పిట్యుటరీ గ్రంధి, కిడ్నీలు పాడయ్యాయి. ఆడ ఎలుకలు 70%, మగ ఎలుకలు 50% అకాల మృత్యువు పాలయ్యాయి. ‘సాధారణంగా పరిశోధనలు 3 నెలలతో ముగిస్తుంటారు.
అయితే, 4 నెలల నుంచి కణుతులు పెరగడం మా అధ్యయనం లో గమనించాం..’ అని డా. సెరలిని బృంద సభ్యుడు రాబిన్ మసంగె హైదరాబాద్ జీవవైవిధ్య సదస్సుకు వచ్చినప్పుడు చెప్పారు. ఈ అధ్యయన ఫలితాలపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. మోన్‌శాంటో కంపెనీ స్పం దిస్తూ.. ఈ అధ్యయనంలో పరిశోధన ప్రమాణాలు పాటించలేదని, మొక్కజొన్నలను ఎక్క డి నుంచి తెచ్చి ఎలుకలకు మేపారో తెలియదని, ఇంకా అనేక లోపాలు జరిగాయని పేర్కొంది.
ఏ తప్పూ లేదంటూనే..!
డా.సెరలిని అధ్యయన వ్యాసాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఎఫ్‌సీటీ ఎడిటర్ హయెస్ గత నెల 29న ప్రచురించిన ఏడాది తర్వాత ప్రకటించారు. ఎఫ్‌సీటీ పత్రిక యాజమాన్యం ఎల్‌సెవీర్ మొత్తం 2 వేలకు పైగా శాస్త్రసాంకేతిక పత్రికలను ప్రచురిస్తుంటుంది. ఈ అధ్యయనంలో ఎటువంటి అక్రమాలూ చోటుచేసుకోలేదని, గణాంకాల వక్రీకరణ జరగలేదని, అసమగ్రంగా ఉన్నందునే దీన్ని తమ రికార్డుల నుంచి తొలగిస్తున్నామని ఎడిటర్ పేర్కొనడం విశేషం. అయితే, అధ్యయనంలో ఏ తప్పూలేదని ఒప్పుకుంటూనే ఉపసంహరించుకోవడం ఈ అంతర్జాతీయ సంప్రదాయాలకు విరుద్ధమని డా. సెరలిని నిరసన తె లిపారు. వత్తిళ్లవల్ల ఇలా చేయడం బొత్తిగా అసమంజసమని వాపోయారు. వ్యాసాన్ని వెనక్కితీసుకోవడం వెనుక ‘ప్రజారోగ్యానికి సంబంధించిన కుట్ర’ దాగి ఉందని జన్యుమార్పిడి సాంకేతికతపై స్వతంత్ర పరిశోధన, సమాచార సంస్థ (ఫ్రాన్స్) ఆరోపించింది.
స్వతంత్ర శాస్త్రవేత్తలకు సెగ
బహుళజాతి కంపెనీలో పనిచేసిన ఓ సీనియర్ శాస్త్రవేత్త కొద్ది నెలల క్రితం ‘ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ’ పత్రిక బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ఎడిటర్‌గా నియమితులయ్యారు. ఈ వ్యాసం ఉపసంహరణలో నేరుగా ఆ శాస్త్రవేత్త ప్రమేయం ఉందనడానికి రుజువుల్లేకపోయినప్పటికీ... ఆ తదనంతర పరిణామాల క్రమం గమనార్హమని స్వచ్ఛంద కార్యకర్తలు అంటున్నారు. స్వతంత్ర భావాలు కలిగిన శాస్త్రవేత్తల నోరు నొక్కే ప్రయత్నాలు జరగడం కొత్తకాదని, మెక్సికోకు చెందిన ఇగ్నాసియో చాపెల... అంతకుముందు అర్పడ్ పుస్‌తాయ్ విషయంలోనూ గతంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేస్తున్నారు.
పంతంగి రాంబాబు
‘సాక్షి’ స్పెషల్ డెస్క్