పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని, బ్రహ్మదేవుని నిర్ణయం ప్రకారం ఎవరెవరి ఎప్పుడు, ఎవరితో వివాహం జరగాలో నిశ్చయమవుతుందని అంటారు. ఆలోచిస్తే ఇది కొందవరకూ నిజమేనని అనిపిస్తుంది. హర్యానావాసి అమిత్, ఫ్రాన్స్‌కు చెందిన సీసెల్ జంటను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని పల్వాల్ జిల్లాలోని కలువా గ్రామానికి చెందిన అమిత్ నర్వార్(30) ఫ్రాన్స్ యువతి సీసెల్‌ను వివాహమాడటం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 12న వీరి వివాహం పాల్వాల్‌లోని విష్ణు గార్డెన్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా విదేశీ వధువును చూసేందుకు ఊరిజనమంతా తరలివచ్చారు. ఈ సందడిలో సదరు విదేశీ యువతి తన భర్త, అత్తామామలతో కలసి నృత్యం చేసి అందరినీ అలరించారు.
అమిత్ నర్వార్ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 2019లో యోగా టీచర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో అతని దగ్గర యోగా నేర్చుకునేందుకు ఫ్రాన్స్ నుంచి సీసెల్ మార్లీ వచ్చారు. ఈ కోర్సు రెండు నెలల పాటు సాగింది. ఈ నేపధ్యంలో అమిత్, సీసెల్ ప్రేమలో పడ్డారు. యోగా కోర్సు ముగిసిన అనంతరం సీసెల్ తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఆ తరువాత వారిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోసాగారు.
ఇదిలా ఉండగా అమిత్ కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం చేయాలనుకున్నారు. అయితే అమిత్ తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అమిత్ చేస్తున్న ఉద్యోగాన్ని, ఇంటిని విడిచిపెట్టి 2022లో ఫ్రాన్స్‌కు వెళ్లారు. అప్పటికే సీసెల్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. డబ్బుకు ఇబ్బంది లేకపోవడంతో అమిత్, సీసెల్ లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో 2022 నుంచి 2024 వరకు ఉన్నారు. ఇదే సమయంలో సీసెల్ తండ్రి క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత సీసెల్, అమిత్‌లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలవారికీ చెప్పారు. వారు ఓకే చెప్పడంతో సీసెల్ తమ కుటుంబసభ్యులతో సహా భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 12న అమిత్, సీసెల్‌ల వివాహం ఘనంగా జరిగింది.
ఇది కూడా చదవండి: Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో..
Comments
Please login to add a commentAdd a comment