
యేటి మంగొదినా పండుగ అయిపొయింది.. మాఘమాసం వచ్చిసింది.. మన రాజేష్ కోసం పిల్లను చూస్తున్నారా లేదా.. యేటి మరి.. ఇంకెన్నాళ్లు ఉంచుతావు.. ఎంత ఉంచితే అంతెక్కువ కట్నం వస్తాదని గట్రా లెక్కేస్తున్నావా యేటి అంది వరలక్ష్మి .. లేదొదినా అదేట్లేదు .. సూత్తన్నాము.. మేము చూసిందాన్ని వాడు నచ్చడం లేదు.. వాడికి నచ్చిందేమో మాకు కుదరడంలేదు.. అన్నిటికి మించి ఇప్పుడు ఆడపిల్లలు కూడా బోలెడు లెక్కలేస్తాన్నారు..అంటూ చెబుతోంది మంగ... 'ఆ నీ నోటికి భయపడి ఎవరూ ఇవ్వడం లేదని చెప్పొచ్చుగా.. లోలోన అనుకుంది వరలక్ష్మి.. అయినా నాకెందుకులే అని ఊరుకుని.. లేదులే వదినా నీకు కోడలు అవ్వాలంటే ఎవరికో బీభత్సంగా రాసిపెట్టి ఉండాలి.. అంటూ కవరింగ్ ఇచ్చింది. వాస్తవానికి మంగమ్మ పేరులోనే అమ్మ ఉందికానీ మనిషి మాత్రం మహంకాళీ అని చుట్టుపక్కల పేరు.. నోరు తెరిస్తే శృతి ఆరున్నరకు చేరుతుంది.. మామూలోళ్ళంతా పరారవ్వాల్సిందే.. ఇప్పటికే పెద్దకోడలు ఈమెకు దండం పెట్టేసి మొగుడు సూర్యనారాయణతో పట్నంలో వేరుకాపురం పెట్టేసింది.. ఇప్పుడు చిన్నోడు రాజేష్ కోసం పిల్లను చూస్తున్నారు. కానీ మంగమ్మ నోటికి జడిసి ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు..
మాకేమో కట్నం ప్రసక్తి లేదు.. పిల్ల బాగుంటే చాలు... బుద్ధిమంతురాలైతే ఇంకా మేలు.. అయినా మనం అడిగినా లేకున్నా ఆడపిల్లకు ఇవ్వాల్సినవి వాళ్ళు ఇస్తారు కదా వదినా అంటూ అసలు విషయం చెప్పింది మంగమ్మ. అయినా ఈరోజుల్లో మీలాగా కట్నం వద్దంటున్నవాళ్ళు ఎవరున్నారు.. నువ్వంటే మంచిదానివి కాబట్టి సరిపోయింది అని అంటూనే దీనికి కట్నం వద్దట కానీ డబ్బున్న సంబంధాలే చూస్తోంది అని మనసులోనే బుగ్గలు నొక్కుకుంది వరలక్ష్మి. పోనీ వాడికి ఎవరైనా నచ్చినపిల్ల ఉందేమో చూడలేకపోయావా సలహా ఇచ్చింది వరలక్ష్మి.. ఊరుకో వదినీ.. వాడికేం తెలుసు.. నోట్లో వేలెడితే కొరకలేని అమాయకుడు.. వాడికి నచ్చడం ఏంది... వాడి చెడ్డీలు. బనీన్లు కూడా నేనే కొనాలి.. నా మాటే వాడికి వేదం.. గర్వంగా చెప్పింది.. మంగమ్మ.. ఎంతైనా నువ్వు లక్కీ వదినా.. అటు అన్నయ్యను.. ఇటు పిల్లలను ఆడిస్తున్నావు అనేసింది వరలక్ష్మి.. అదేటి అంతమాట అనేశావు అంది మంగమ్మ.. ఆడించడం అంటే వాళ్లంతా నీ కనుసన్నల్లో ఉంటారు అంటున్నా.. అంటూ కవర్ చేసేసింది వరలక్ష్మి..
మొత్తానికి ఆ చుట్టుపక్కల ఆరేడు మండలాలు.. మూడు నియోజకవర్గాలు కవర్ చేసినా మంగమ్మాకొడుక్కి పిల్ల దొరకలేదు.. పిల్లలు ఉన్నా ఈమె నోటికి జడిసి ఇవ్వడం లేదు. చూసిచూసి ఈవిడకు విసుగొచ్చింది.. అలాగని నోటిని కంట్రోల్ చేసుకుని మంచిగా ఉండడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.. పైగా ఇన్నేళ్ళపాటు గయ్యాళి బ్రాండ్ దక్కించున్న మంగమ్మ ఇప్పటికిప్పుడు అమాయకపు కన్నాంబ పాత్రలోకి మారడం కష్టమే.. అందుకే ఇక ఆమె పెళ్లి విషయాల ప్రస్తావన ఆపేసింది.
ఓరోజు తెల్లారేసరికి కార్లో దిగాడు రాజేష్.. పక్కన దండలతో ప్రమీల.. తాను చూస్తున్నది కలయా నిజమా .. తెలీక కాసేపు మంగమ్మ అలాగే కొయ్యలా నిలబడిపోయింది. ఒరేయ్ రాజేష్ ఏందిరా ఇది అని అడిగింది.. అవునమ్మా ఇక నీ నోటి బ్రాండ్ దెబ్బకు నాకు పెళ్లవ్వదని అర్థం ఐంది.. అందుకే ఇదిగో పక్కూరి వజ్రమ్మ కూతుర్ని చేసుకున్నాను.. ప్రమీల నాతోబాటే ఉద్యోగ చేస్తోంది.. అన్నాడు.. వజ్రమ్మ అంటే తనను మించిన నోటి దురుసు.. తనది మండల్ లెవెల్ అయితే ఆమెది జిల్లా లెవెల్.. ఆపిల్లతో తనకొడుకు ఎలా వేగుతాడో అనుకుంటూనే మరి వేరే మార్గం లేక దిష్టి తీసి ఇంట్లోకి పిలిచింది..
సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment