పెళ్లి అంటే జీవితంలో ముఖ్యమైన రోజు. మరిచిపోలేని రోజు కూడా. అందుకే బంధువులు, స్నేహితులు, అతిథుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంటారు. కొందరు విమానంలో, పడవలో, చివరకు నీటి అడుగున ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు తమ వివాహాలను ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు.. కొందరి వివాహాలు మాత్రం తాము అనుకున్నట్లు కాకుండా పరిస్థితులు బట్టి మరోలా జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట పెళ్లి మండపంలో కాకుండా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే..
ప్రస్తుతం ఉత్తర భారతంలో భారీ వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ రోడ్లు స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట మండపానికి వెళ్లడం కుదరలేదు. వేదమంత్రాలు, పెద్దల ఆశీస్సులతో పెళ్లి పీటలు ఎక్కాలని భావించిన ఓ జంటకు అనూహ్యంగా ప్రకృతి అడ్డుతగిలింది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కటి కావడానికి ఇవేవీ అడ్డంకి కాబోవని ఆ దంపతులు భావించారు. అందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో వారి వివాహం జరుగుతోందని అందరికీ తెలియజేసి, పెళ్లికి సంబంధించిన ఆన్‌లైన్ లింక్‌ను అందరికీ పంపారు. అనంతరం వారి పెళ్లిని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ ఆన్‌లైన్ వెడ్డింగ్‌లో ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని ఆ నవ దంపతులకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. పెద్దలు నిర్ణయించిన సరైన సమయానికి ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకుని తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment