Age Limit: Aging Can Be Delayed - Sakshi
Sakshi News home page

వృద్ధాప్యానికి చెక్.. తాజా పరిశోధన ఫలితాలతో కొత్త ఆశలు!

Published Sun, Jan 8 2023 5:13 AM | Last Updated on Sun, Jan 8 2023 9:50 AM

Age Limit: Aging can be delayed - Sakshi

వృద్ధాప్యం. మనిషి పరిణామ క్రమంలో అనివార్యమైన దశ. చాలామందికి నరకప్రాయం, బాధాకరం అయిన దశ కూడా. ఒంట్లో అవయవాలన్నీ ఒక్కొక్కటిగా శిథిలమవుతూ పట్టు తప్పి క్రమంగా పనికి రాకుండా పోతుంటే, అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సిన నిస్సహాయత కుంగదీస్తుంటే, నీడలా వెంట తిరుగుతూ దోబూచులాడే మృత్యువు ఎప్పటికి కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ దుర్భరంగా గడుస్తుంటుంది. అలాంటి వృద్ధాప్యాన్ని వీలైనంత వరకూ వాయిదా వేయగలిగితే? ఆ దిశగా ఇప్పటికే పరిశోధనలు మహా జోరుగా జరుగుతున్నాయి. సౌరశక్తి సాయంతో వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయవచ్చని అటువంటి అధ్యయనమొకటి తాజాగా చెబుతుండటం ఆసక్తికరం!

ఎండలో నిలబడితే ఏమొస్తుందంటే విటమిన్‌ డి అనేస్తాం. కదా! ఇకపై ఎండలో నిలబడటం ద్వారా ముసలితనానికి టాటా చెప్పేయొచ్చని, వయసు పెరుగుదలను బాగా తగ్గించుకోవచ్చని అంటోంది తాజా అధ్యయనమొకటి. ‘‘సౌరశక్తిని మానవ కణాలు నేరుగా వాడుకునేందుకు అవసరమైన రసాయన శక్తిగా మార్చడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేయొచ్చు. కణాల్లోని కీలకమైన మైటోకాండ్రియాలో నిర్దిష్టమైన జన్యుమార్పులు చేయడం దీన్ని సాధించవచ్చు. ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమై తీరుతుంది’’ అంటూ అది కుండబద్దలు కొడుతుండటం ఆసక్తికరం! వృద్ధాప్యానికి దారి తీసే అంశాల్లో మనిషి కణజాలంలోని కీలకమైన మైటోకాండ్రియా పనితీరు మందగించడమే ప్రధాన కారణం.

కాకపోతే ఎటువంటి జీవక్రియలు ఇందుకు కారణమవుతాయన్నది మనకింకా తెలియదు. ఈ సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ‘‘సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి నిర్దిష్ట పద్ధతితో కణ కేంద్రకంలోని ప్రోటాన్లను శక్తిమంతం చేస్తే మైటోకాండ్రియాలోని జీవన పరిమాణాన్ని పెంచేందుకు తోడ్పడే సమలక్షణాలు సమృద్ధిగా పెరుగుతాయి. యుక్త వయసులో ఇలా కణజాలంలోని మైటోకాండ్రియా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయొచ్చు. వయో సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స కూడా అందజేయడం వీలు పడుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లోని రోచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు.

ఇలా చేశారు...: మౌలిక జీవపరమైన సూత్రాలను అవగాహన చేసుకోవడానికి చిరకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న ఒకరకం నట్టలనే ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వాటి కణజాలంలోని మైటోకాండ్రియాలో జన్యుపరంగా మార్పుచేర్పులు చేశారు. అనంతరం సౌరశక్తి సాయంతో దాన్ని పరిపుష్టం చేశారు. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మైటోకాండ్రియా పైపొరలోని అయాన్లన్నీ మరింత శక్తిమంతంగా మారి దాని సామర్థ్యంతో పాటు తాజాదనం కూడా బాగా పెరిగాయి. మైటోకాండ్రియా–ఓఎన్‌గా పిలుస్తున్న ఈ ప్రక్రియ ద్వారా మెటబాలిజం రేటులో వృద్ధి జరిగి సదరు నట్టలు మరింత ఆరోగ్యకరంగా మారాయి.

పైగా వాటి జీవితకాలం కూడా 30 నుంచి 40 శాతం దాకా పెరగడం గమనించారు. ‘‘మా పరిశో ధనలు విజయవంతమయ్యాయి. వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే వయో మనుషుల్లోనూ సంబంధమైన వ్యాధులను మరింత మెరుగ్గా నయం చేయడమే గాక ఆరోగ్యకరంగా, నిదానంగా వృద్ధాప్యం వైపు సాగేలా చూసే మార్గం చిక్కుతుంది’’ అని పరిశోధనలో పాలు పంచుకున్న సీనియర్‌ ఆథర్‌ ఆండ్రూ వొజోవిక్‌ చెప్పుకొచ్చారు. ‘‘మనిషి శరీరంలో జీవక్రియలపరంగా మైటోకాండ్రియా పోషించే సంక్లిష్టమైన పాత్రను గురించి ఈ అధ్యయనం ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఫలితాలు జర్నల్‌ నేచర్‌లో పబ్లిషయ్యాయి.  

శక్తి కేంద్రం...
మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి కేంద్రంగా చెప్పొచ్చు. కణాల్లో జరిగే జీవ క్రియలకు కావాల్సిన శక్తిని ఇవే తయారు చేస్తాయి. కణంలో రెండు పొరలతో కూడుకుని ఉండే మైటోకాండ్రియాలు స్థూప, గోళాకృతుల్లో ఉంటాయి. జీవ క్రియలు చురుగ్గా సాగే కణాల్లో వీటి సంఖ్య అపారంగా ఉంటుంది. మైటోకాండ్రియా పనితీరు ఎంతగా తగ్గుతుంటే అవయవాలు క్షీణించి శిథిలమయ్యే ప్రక్రియ అంతగా వేగం పుంజుకుంటుంది.

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement