Mitochondria
-
అరుదైన ప్రయోగం.. ముగ్గురి డీఎన్ఏతో జన్మించిన శిశువు.. పోలికలు వాళ్లవే!
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు సంచాలనాత్మక శాస్త్రీయ ప్రయోగంలో విజయం సాధించారు. ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్ఏలతో జన్మించింది. ఇందులో 99.8 శాతం డీఎన్ఏ తల్లిదండ్రలదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను ఉయోగిస్తున్నారు. దీనికి మైటోకాండ్రియల్ డోనేషన్ ట్రీట్మెంట్(ఎండీటీ)గా నామకరణం చేశారు. ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన మహిళా దాత అండాల కణజాలన్ని ఉపయోగించి ఐవీఎఫ్ పిండాలను సృష్టిస్తారు. తద్వారా పిల్లలకు తల్లుల ద్వారా మైటోకాండ్రియా సోకకుండా నిరోధిస్తారు. మైటోకాండ్రియా వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటితో పుట్టిన బిడ్డలు గంటల్లో లేదా కొన్ని రోజుల తర్వాత చనిపోయే ప్రమాదం ఉటుంది. తల్లుల ద్వారా మాత్రమే పిల్లలకు ఈ వ్యాధులు సోకుతాయి. అందుకే వీటిని నిరోధించేందుకు ఇతర మహిళల అండాల కణజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పిల్లలు మైటోకాండ్రియా వ్యాధుల బారినపడకుండా చేస్తున్నారు. పోలికలు తల్లిదండ్రులవే.. ఈ పద్ధితిలో జన్మించిన శిశువు తన తల్లిదండ్రుల ద్వారా వచ్చే న్యూక్లియర్ డీఎన్ఏను కలిగి ఉంటుంది. అందుకే శిశువు వ్యక్తిత్వం, కంటి రంగు వంటి ముఖ్యమైన లక్షణాలు తల్లిదండ్రుల లాగే ఉంటాయి. అయితే ఈ విధానంలో పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని, ఇప్పటివరకు అతికొద్ది మంది మాత్రమే ఇందులో భాగమయ్యారని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే దీని భద్రత, ప్రభావశీలత గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమన్నారు. ఎండీటీ పద్ధతి ద్వారా శిశువు జన్మించిన ఘటన యూకేలో ఇదే తొలిసారి అయినప్పటికీ.. అమెరికాలో మాత్రం 2016లోనే ఈ ప్రయోగం జరిగింది. జోర్డాన్‌కు చెందిన ఓ జంట ఈ సాంకేతికతతోనే ఆ ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చదవండి: ట్రంప్‌కు బిగ్ షాక్.. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేల్చిన జ్యూరీ.. రూ.410 కోట్లు చెల్లించాలని ఆదేశం -
వృద్ధాప్యానికి చెక్.. తాజా పరిశోధన ఫలితాలతో కొత్త ఆశలు!
వృద్ధాప్యం. మనిషి పరిణామ క్రమంలో అనివార్యమైన దశ. చాలామందికి నరకప్రాయం, బాధాకరం అయిన దశ కూడా. ఒంట్లో అవయవాలన్నీ ఒక్కొక్కటిగా శిథిలమవుతూ పట్టు తప్పి క్రమంగా పనికి రాకుండా పోతుంటే, అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సిన నిస్సహాయత కుంగదీస్తుంటే, నీడలా వెంట తిరుగుతూ దోబూచులాడే మృత్యువు ఎప్పటికి కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ దుర్భరంగా గడుస్తుంటుంది. అలాంటి వృద్ధాప్యాన్ని వీలైనంత వరకూ వాయిదా వేయగలిగితే? ఆ దిశగా ఇప్పటికే పరిశోధనలు మహా జోరుగా జరుగుతున్నాయి. సౌరశక్తి సాయంతో వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయవచ్చని అటువంటి అధ్యయనమొకటి తాజాగా చెబుతుండటం ఆసక్తికరం! ఎండలో నిలబడితే ఏమొస్తుందంటే విటమిన్ డి అనేస్తాం. కదా! ఇకపై ఎండలో నిలబడటం ద్వారా ముసలితనానికి టాటా చెప్పేయొచ్చని, వయసు పెరుగుదలను బాగా తగ్గించుకోవచ్చని అంటోంది తాజా అధ్యయనమొకటి. ‘‘సౌరశక్తిని మానవ కణాలు నేరుగా వాడుకునేందుకు అవసరమైన రసాయన శక్తిగా మార్చడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేయొచ్చు. కణాల్లోని కీలకమైన మైటోకాండ్రియాలో నిర్దిష్టమైన జన్యుమార్పులు చేయడం దీన్ని సాధించవచ్చు. ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమై తీరుతుంది’’ అంటూ అది కుండబద్దలు కొడుతుండటం ఆసక్తికరం! వృద్ధాప్యానికి దారి తీసే అంశాల్లో మనిషి కణజాలంలోని కీలకమైన మైటోకాండ్రియా పనితీరు మందగించడమే ప్రధాన కారణం. కాకపోతే ఎటువంటి జీవక్రియలు ఇందుకు కారణమవుతాయన్నది మనకింకా తెలియదు. ఈ సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ‘‘సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి నిర్దిష్ట పద్ధతితో కణ కేంద్రకంలోని ప్రోటాన్లను శక్తిమంతం చేస్తే మైటోకాండ్రియాలోని జీవన పరిమాణాన్ని పెంచేందుకు తోడ్పడే సమలక్షణాలు సమృద్ధిగా పెరుగుతాయి. యుక్త వయసులో ఇలా కణజాలంలోని మైటోకాండ్రియా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయొచ్చు. వయో సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స కూడా అందజేయడం వీలు పడుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని రోచెస్టర్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా చేశారు...: మౌలిక జీవపరమైన సూత్రాలను అవగాహన చేసుకోవడానికి చిరకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న ఒకరకం నట్టలనే ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వాటి కణజాలంలోని మైటోకాండ్రియాలో జన్యుపరంగా మార్పుచేర్పులు చేశారు. అనంతరం సౌరశక్తి సాయంతో దాన్ని పరిపుష్టం చేశారు. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మైటోకాండ్రియా పైపొరలోని అయాన్లన్నీ మరింత శక్తిమంతంగా మారి దాని సామర్థ్యంతో పాటు తాజాదనం కూడా బాగా పెరిగాయి. మైటోకాండ్రియా–ఓఎన్గా పిలుస్తున్న ఈ ప్రక్రియ ద్వారా మెటబాలిజం రేటులో వృద్ధి జరిగి సదరు నట్టలు మరింత ఆరోగ్యకరంగా మారాయి. పైగా వాటి జీవితకాలం కూడా 30 నుంచి 40 శాతం దాకా పెరగడం గమనించారు. ‘‘మా పరిశో ధనలు విజయవంతమయ్యాయి. వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే వయో మనుషుల్లోనూ సంబంధమైన వ్యాధులను మరింత మెరుగ్గా నయం చేయడమే గాక ఆరోగ్యకరంగా, నిదానంగా వృద్ధాప్యం వైపు సాగేలా చూసే మార్గం చిక్కుతుంది’’ అని పరిశోధనలో పాలు పంచుకున్న సీనియర్ ఆథర్ ఆండ్రూ వొజోవిక్ చెప్పుకొచ్చారు. ‘‘మనిషి శరీరంలో జీవక్రియలపరంగా మైటోకాండ్రియా పోషించే సంక్లిష్టమైన పాత్రను గురించి ఈ అధ్యయనం ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఫలితాలు జర్నల్ నేచర్‌లో పబ్లిషయ్యాయి. శక్తి కేంద్రం... మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి కేంద్రంగా చెప్పొచ్చు. కణాల్లో జరిగే జీవ క్రియలకు కావాల్సిన శక్తిని ఇవే తయారు చేస్తాయి. కణంలో రెండు పొరలతో కూడుకుని ఉండే మైటోకాండ్రియాలు స్థూప, గోళాకృతుల్లో ఉంటాయి. జీవ క్రియలు చురుగ్గా సాగే కణాల్లో వీటి సంఖ్య అపారంగా ఉంటుంది. మైటోకాండ్రియా పనితీరు ఎంతగా తగ్గుతుంటే అవయవాలు క్షీణించి శిథిలమయ్యే ప్రక్రియ అంతగా వేగం పుంజుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం
అయిదేళ్ల ఆ చిన్నారి పేరు రెండు వారాల కిందట ఆసీస్ ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. కారణం.. ఓ ప్రాణాంతక వ్యాధిపై పోరుకోసం చేయనున్న చట్ట సవరణ ప్రతిపాదన బిల్లుకు ఆ చిన్నారి పేరు పెట్టడమే. దీనిని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ ఏకంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఆ చట్టం మావె లా.. ఆ చిన్నారి పేరు మావె హుడ్. విప్లవాత్మక చట్ట సవరణకు ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం దాగి ఉంది. సారా హుడ్, జోయెల్ హుడ్ దంపతుల మూడో కూతురు మావె హుడ్. ఐదు నెలల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది మావెలో. వైద్యుల పర్యవేక్షణ, చికిత్సతో కోలుకున్నప్పటికీ ఆ తర్వాతా అనేక సమస్యలు వెంటాడాయి. 18 నెలల వయసులో చిన్నారి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈసారి పాపను పరీక్షించిన వైద్యులు.. మైటోకాండ్రియా లోపంతో వచ్చే లీ సిండ్రోమ్‌కు గురైనట్లు గుర్తించారు. పాపను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ, అప్పటికప్పుడు మాత్రలతో వ్యాధి తీవ్రతను తగ్గించి, మరణాన్ని వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదన్నారు డాక్టర్లు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ పాప పరిస్థితికి తల్లఢిల్లినా, పాపను అప్రమత్తంగా చూసుకోసాగారు. ఇటీవల ఈ విషయం పత్రికల ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్‌కు చేరింది. మావె పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఆయన దేశంలో మరే చిన్నారికీ ఇలాంటి అవస్థ రాకూడదంటే ఏం చేయాలో చెప్పాలని వైద్యులనడిగారు. డీఎన్ఏ మార్పిడి ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని వాళ్లు చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే.. తల్లి గర్భిణిగా ఉన్నప్పడు చిన్నారిలోని ఆమె డీఎన్ఏ స్థానంలో మరొకరి నాణ్యమైన డీఎన్ఏను ఐవీఎఫ్ పద్ధతిలో ప్రవేశపెడితే ప్రాణాంతక వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని వివరించారు. అయితే, ఇది కష్టమైన పని. ఎందుకంటే డీఎన్ఏ మార్పిడిపై ఆసీస్‌లో నిషేధం ఉంది. దీంతో ఈ చట్టాన్ని సవరించేందుకు గ్రెగ్ హంట్ తీర్మానించాడు. అందులో భాగంగానే చట్ట సవరణ కోరుతూ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు, ఆ బిల్లుకు మావె పేరు పెట్టాడు. నిజానికి ఆస్ట్రేలియాలో ఏటా కనీసం 56 మంది చిన్నారులు మైటోకాండ్రియా డిసీజ్‌తో జన్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో చాలామంది ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించి, పసిప్రాణాలను కాపాడడం, తల్లిదండ్రుల కడుపుకోతను అడ్డుకోవాలనే తన ప్రయత్నానికి మనఃస్ఫూర్తిగా సహకరించాలని గ్రెగ్ హంట్ పార్లమెంట్లో విపక్ష సభ్యులందరినీ కోరాడు. ఈ చట్ట సవరణకు ఆమోదం లభిస్తే ఆ తరువాత ఆస్ట్రేలియాలో మైటోకాండ్రియాతో చిన్నారులు మరణించడమేనేది ఉండకపోవచ్చు. మైటోకాండ్రియా డిసీజ్ అంటే... మనిషిని పట్టి పీడించే ప్రాణాంతక వ్యాధుల్లో ఇదొకటి. మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుందనే విషయం తెలిసిందే కదా. అయితే, ఆహారం జీర్ణమై శక్తిగా రూపొందడంలో కీలకంగా వ్యవహరించే పాత్ర మన శరీరంలోని ఉండే కణాల్లోని మైటోకాండ్రియాదే. ఏ కారణం వల్ల అయినా మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోయినా, నిర్జీవమైనా మన శరీరానికి తగిన శక్తి ఆహారం నుంచి అందదు. ఫలితంగా రకరకాల రుగ్మతలు వస్తాయి. అందులో ముఖ్యమైనది ఆర్గాన్ ఫెయిల్యూర్.. అంటే అవయవం పనిచేయకపోవడం. ఇది మరణానికి దారి తీస్తుంది. అలాగే గుండెపోటు, చెవుడు, దృష్టిలోపం, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటివీ సంభవిస్తాయి. జన్యులోపం వల్లో, వంశపారంపర్యంగానో, జీవన శైలిలో మార్పుల వల్లో వచ్చే ఈ వ్యాధికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేలోగా ఎప్పుడైనా సరే ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది. -
ఉపవాసం మేలు గుట్టు తెలిసింది
తరచూ ఉపవాసం ఉండటం వల్ల ఆయువు పెరుగుతుందని వింటుంటాం.. ఇందుకు కారణాలను సశాస్త్రీయంగా హార్వర్డ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లోని మైటోకాండ్రియా నెట్‌వర్క్‌ల చర్యలను మార్చడం ద్వారా ఉపవాసం ఆయువును పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ మైటోకాండ్రియానే కణాలకు అవసరమైన శక్తిని తయారు చేస్తుంది. హార్వర్డ్ శాస్త్రవేత్తలు నులిపురుగులపై ప్రయోగాలు చేశారు. రెండు వారాల పాటే బతికే ఈ నులిపురుగులకు అందే ఆహారాన్ని నియంత్రించినప్పుడు వేర్వేరు కణాల్లోని మైటోకాండ్రియాలు స్థిరంగా ఉండిపోయినట్లు గుర్తించారు. సాధారణ పరిస్థితుల్లో మైటోకాండ్రియా ఒక దశ నుంచి ఇంకోదశకు సులువుగా మారేందుకు ఈ ప్రక్రియ వీలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఉపవాసం కారణంగా మైటోకాండ్రియా.. ఆక్సిజన్ సాయంతో కొవ్వులను మండించే భాగాలైన పెరాక్సీసోమ్స్ మధ్య సమన్వయం కూడా పెరిగిందని తెలిసింది. -
దానిమ్మతో దీర్ఘాయుష్షు!
మీరు రోజూ పండ్లు తింటారా..? అందులో దానిమ్మ పండ్లు ఎక్కువగా ఉంటాయా..? అయితే మీ ఆయుష్షుకు ఢోకా లేదు. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎక్కువగా తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందని స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానిమ్మ గింజల్లో ఉండే ఓ పరమాణువు కడుపులో ఉండే బ్యాక్టీరియా వల్ల వయోభారంతో వచ్చే సమస్యలను సరిచేసేదిగా మారుతుందని పేర్కొంటున్నారు. ఎలుకలతోపాటు నెమటోడ్ సి.ఎలిగాన్స్ జీవులపై జరిగిన పరిశోధనల్లో ఇప్పటికే రుజువు కాగా, మానవులపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. వయసు మీద పడుతున్న కొద్దీ మన శరీర కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా బలహీనపడుతుంటాయి. చేయాల్సిన పనులు కూడా చేయలేక పోగుపడుతుంటాయి. దీని ప్రభావం కండరాలు, కణజాలంపై పడి అవి బలహీనమవుతుంటాయి. పార్కిన్సన్స్ వ్యాధికి కూడా ఇలా పోగుబడిన మైటోకాండ్రియాలు ఒక కారణం కావచ్చని ఇప్పటికే కొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఉరోలిథిన్-2 అనే ఓ రసాయనం.. ఈ బలహీనపడ్డ మైటోకాండ్రియాను పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దానిమ్మ గింజల్లో ఉరోలిథిన్-ఏ తయారీకి అవసరమైన పరమాణువులు ఉంటాయని, పేగుల్లోని బ్యాక్టీరియా సాయంతో దీన్ని తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. 8 నుంచి 10 రోజులు మాత్రమే జీవించే నెమటోడ్లపై దీన్ని ప్రయోగించినప్పుడు వాటి ఆయువు దాదాపు 45 శాతం వరకు ఎక్కువైంది. ఎలుకల్లో కూడా 42 శాతం వృద్ధి కనిపించడంతో పాటు అవి మరింత చురుగ్గా కదులుతున్నట్లు గుర్తించారు. తగిన బ్యాక్టీరియా లేకపోతే కొంతమంది ఎన్ని దానిమ్మ పండ్లు తిన్నా ఫలితం ఉండకపోవచ్చునని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అమేజెనిటిస్ అనే కంపెనీ ముందుకొచ్చింది. ఉరోలిథిన్-ఏను నేరుగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది యూరప్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ప్రయోగాలు చేపడుతోంది. ఈ పరిశోధన తాలూకూ వివరాలు నేచర్ మెడిసిన్ మేగజీన్‌లో ప్రచురితమయ్యాయి.