
మా మామయ్యకు 65 ఏళ్లు. ఆయనకు బీపీ, షుగర్ చాలా కాలంగా ఉన్నాయి. సంవత్సరం క్రితం పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని చెప్పారు. ఇక్కడే నరాల డాక్టర్‌కి చూపిస్తున్నాం. కొన్ని రోజులుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. మా అత్త గారిని విపరీతంగా అనుమానిస్తున్నారు. ఇంటికి ఎవరైనా మగవాళ్ళు వస్తే వాళ్ళకి, మా అత్తగారితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. అలాగే రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోకుండా మధ్యలో లేచి బయటకు, ఇంట్లోకి తిరుగుతున్నారు. మాకు ఎవరికీ కనపడని మనుషులు ఆయనకు కనపడుతున్నారు. ఈమధ్య అనుమానం నా మీద కూడా మొదలైంది. ఇంట్లో ఆడవాళ్ళని బయటకు వెళ్ళనీయట్లేదు. మా ఆయనకి చెప్తే వాళ్ళ నాన్నను మందలించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రవర్తనతో, మాటలతో మాకు నరకం కనిపిస్తోంది.
– భానుప్రియ, మదనపల్లె
మీరు రాసిన దాన్ని బట్టి మీ మామ గారికి గతంలో ఎప్పుడూ మానసిక సమస్యలు లేవు, బీపీ, షుగర్ మాత్రమే ఉన్నాయి, ఈ మధ్యే పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని తెలుస్తోంది. మెదడులో ‘డోపమైన్’ అనే రసాయనం స్థాయి తగ్గినప్పుడు పార్కిన్సన్ జబ్బు, అదే డోపమైన్ పెరిగినపుడు ‘సైకోసిస్’ జబ్బు వస్తుంది.
పార్కిన్సన్ జబ్బులో డోపమైన్ రసాయనం స్థాయి తగ్గడం వల్ల చేతులు వణకడం, నిదానంగా నడవడం, శరీరంలో కదలికలు తగ్గడం లాంటివి జరుగుతాయి. మందులు వాడినపుడు డోపమైన్ లెవల్స్ పెరిగి వారిలో ఈ లక్షణాలు మెరుగవుతాయి. ఐతే ఇలా మందులు వాడే వారిలో కొందరికి అనుమానాలు, భ్రాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనపడతాయి. దీనికి ప్రధాన కారణం డోపమైన్ లెవెల్స్ అవసరానికి మించి పెరగడం.
మీ మామ గారి విషయంలో జరిగింది కూడా ఇదే! కనుక ముందు మీ న్యూరాలజిస్ట్‌ని కలిసి మందులు తగ్గిస్తారో లేదా మారుస్తారో కనుక్కోండి. అలా కుదరని పక్షంలో సైకోసిస్ లక్షణాలు తగ్గడం కోసం కొన్నాళ్ళు సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ఉండి ‘యాంటీ సైకోటిక్’ మందులు వాడాల్సి ఉంటుంది.
ఇలా మందులు వాడినప్పుడు పార్కిన్సన్ జబ్బు లక్షణాలు కొంత పెరగవచ్చు కూడా! అందుకే హాస్పిటల్లో డాక్టరు పర్యవేక్షణలో అడ్మిట్ అయి వైద్యం చేయించుకోవడం మంచిది. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన కావాలని ఇదంతా చేయడం లేదని గ్రహించండి. వీలైనంత త్వరగా దగ్గర్లోని మానసిక వైద్యున్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)
(చదవండి: 'ట్విన్‌టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!)