
Image Credits: parkinsonssocietyindia
ఆరు పదుల వయసు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు?, ఎలా ఉంటున్నారు? అనేది పిల్లలు గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అంతకుముందు చురుగ్గా తిరిగిన తండ్రి.. ఇప్పుడు ఉన్నట్టుండి డల్‌గా మారిపోవడం, శరీరం అంతా బిగుసుకుని ఉండిపోవడం, ఎక్కువగా నడవలేకపోవడం, ఒకవేళ నడిచినా పడిపోతుండడం లాంటి లక్షణాలు కనపడితే, అది కేవలం వయసు ప్రభావం మాత్రమే కాదు.. పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు.
పై లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించాలి. తగిన పరీక్షల ద్వారా దానికి కారణాలేంటో తెలుసుకుని తక్షణం చికిత్స ప్రారంభిస్తే లక్షణాలు తగ్గడమే కాదు, కొన్ని కేసుల్లో పూర్తిగా నయం అయిపోతుంది కూడా! మెదడులో ఉండే డొపమైన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వచ్చే పార్కిన్సన్స్ వ్యాధి గురించి సామాన్య ప్రజల్లో కూడా అవగాహన ముఖ్యమని.. దాని లక్షణాలను గమనించి వెంటనే చికిత్స చేయించడం అవసరమని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ నెల 11న ప్రపంచ పార్కిన్సన్స్ డే(World Parkinson's Day) సందర్భంగా ఆయన మాట్లాడారు.
“మన శరీరంలో ఇన్సులిన్ తగ్గితే మధుమేహం ఎలా వస్తుందో... అలాగే డొపమైన్ తగ్గితే పార్కిన్సన్స్ వస్తుంది. సాధారణంగా ఇది 60 ఏళ్లు దాటినవారిలోనే కనిపిస్తుంది గానీ, ఇటీవల కొన్ని కేసుల్లో మాత్రం 20లలో ఉన్నవారికి కూడా చూస్తున్నాం. ఇతర వ్యాధుల్లా కాకుండా.. శారీరకంగా కనిపించే లక్షణాలను బట్టే దీన్ని గుర్తించేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది.
👉ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం, గతంతో పోలిస్తే బాగా డల్‌గా ఉండడం, ముఖంలో ఎలాంటి హావభావాలు పలికించకపోవడం, శరీరం అంతా బిగుతుగా అయిపోవడం, చేతులు కొద్దిగా వణకడం, చేత్తో ఏవీ సరిగ్గా పట్టుకోలేకపోవడం, నడక తగ్గిపోవడం, నడుస్తుంటే పడిపోవడం... ఇలాంటివన్నీ కూడా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలే. వీటిలో ఏవి కనిపించినా కూడా అవతలివాళ్లు వెంటనే గుర్తించగలరు.
👉అలా గుర్తించినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో.. కుటుంబంలో ఏదైనా మరణం సంభవించడం వల్ల కుంగుబాటు (డిప్రెషన్)తో అలా అయిపోయారని, కొన్ని రోజులు పోతే అదే నయమైపోతుందని వదిలేయకుండా వెంటనే వైద్యులకు చూపించాలి. చూపించినప్పుడు ఆ సమస్య మానసికమా, శారీరకమా అన్నది గుర్తించి అందుకు తగిన చికిత్సలు అందిస్తారు.
👉గతంలో పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ) వచ్చిందంటే దానికి ప్రధానంగా డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) లాంటి శస్త్రచికిత్సలే ఉండేవి. లేదంటే శరీరంలో డొపమైన్ స్థాయిని పెంచేందుకు కొన్ని రకాల మందులు వాడేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి కారణాలు ఏంటో తెలుసుకుని అందుకు తగిన చికిత్స చేసేందుకు అవకాశం వచ్చింది.
ఇటీవల నా దగ్గరకు ఒక రోగి వచ్చారు. ఆయనకు పార్కిన్సన్స్ లక్షణాలే ఉన్నాయి. పరీక్షించినప్పుడు యాంటీబాడీలు తయారవ్వడం వల్ల డొపమైన్ స్థాయి తగ్గుతోందని గుర్తించాం. దాంతో ఇమ్యునోథెరపీ ప్రారంభిస్తే చాలా తక్కువ సమయంలోనే ఆయనకు పూర్తిగా నయమైంది. ఇప్పుడు మామూలు మనిషిలా ఉన్నారు. అందువల్ల సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొస్తే, పార్కిన్సన్స్ వ్యాధిని కూడా పూర్తిగా నయం చేసేందుకు కొన్ని కేసుల్లో అవకాశం ఉంటుంది.
అదే ఇంతకుముందయితే జీవితాంతం డొపమైన్ పెంచేందుకు ఉపయోగపడే మందులు వాడుతూ ఉండాల్సి వచ్చేది, లేదా డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చేది. కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీరంలో కణాలు చచ్చిపోతాయి. అందువల్ల కూడా డొపమైన్ ఉత్పత్తి తగ్గిపోయి ఈ సమస్య వస్తుంది.
అందువల్ల.. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే రసాయనాలకు గురికావడాన్ని కూడా తగ్గించాలి. అలాగే ఎంత త్వరగా ఈ లక్షణాలు గుర్తిస్తే అంత త్వరగా వైద్యులకు చూపించి, త్వరగా చికిత్స చేయడం మొదలుపెడితే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. చురుకైన జీవనశైలిని పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం, నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధి రాకుండా నిరోధించుకోవచ్చు” అని డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ వివరించారు.
డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్,
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్,స్ట్రోక్ స్పెషలిస్ట్