old age parents
-
నాన్న ఉన్నట్టుండి పడిపోతున్నారా?, అయితే..
ఆరు పదుల వయసు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు?, ఎలా ఉంటున్నారు? అనేది పిల్లలు గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అంతకుముందు చురుగ్గా తిరిగిన తండ్రి.. ఇప్పుడు ఉన్నట్టుండి డల్‌గా మారిపోవడం, శరీరం అంతా బిగుసుకుని ఉండిపోవడం, ఎక్కువగా నడవలేకపోవడం, ఒకవేళ నడిచినా పడిపోతుండడం లాంటి లక్షణాలు కనపడితే, అది కేవలం వయసు ప్రభావం మాత్రమే కాదు.. పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు. పై లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించాలి. తగిన పరీక్షల ద్వారా దానికి కారణాలేంటో తెలుసుకుని తక్షణం చికిత్స ప్రారంభిస్తే లక్షణాలు తగ్గడమే కాదు, కొన్ని కేసుల్లో పూర్తిగా నయం అయిపోతుంది కూడా! మెదడులో ఉండే డొపమైన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వచ్చే పార్కిన్సన్స్ వ్యాధి గురించి సామాన్య ప్రజల్లో కూడా అవగాహన ముఖ్యమని.. దాని లక్షణాలను గమనించి వెంటనే చికిత్స చేయించడం అవసరమని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ నెల 11న ప్రపంచ పార్కిన్సన్స్ డే(World Parkinson's Day) సందర్భంగా ఆయన మాట్లాడారు.“మన శరీరంలో ఇన్సులిన్ తగ్గితే మధుమేహం ఎలా వస్తుందో... అలాగే డొపమైన్ తగ్గితే పార్కిన్సన్స్ వస్తుంది. సాధారణంగా ఇది 60 ఏళ్లు దాటినవారిలోనే కనిపిస్తుంది గానీ, ఇటీవల కొన్ని కేసుల్లో మాత్రం 20లలో ఉన్నవారికి కూడా చూస్తున్నాం. ఇతర వ్యాధుల్లా కాకుండా.. శారీరకంగా కనిపించే లక్షణాలను బట్టే దీన్ని గుర్తించేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది. 👉ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం, గతంతో పోలిస్తే బాగా డల్‌గా ఉండడం, ముఖంలో ఎలాంటి హావభావాలు పలికించకపోవడం, శరీరం అంతా బిగుతుగా అయిపోవడం, చేతులు కొద్దిగా వణకడం, చేత్తో ఏవీ సరిగ్గా పట్టుకోలేకపోవడం, నడక తగ్గిపోవడం, నడుస్తుంటే పడిపోవడం... ఇలాంటివన్నీ కూడా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలే. వీటిలో ఏవి కనిపించినా కూడా అవతలివాళ్లు వెంటనే గుర్తించగలరు. 👉అలా గుర్తించినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో.. కుటుంబంలో ఏదైనా మరణం సంభవించడం వల్ల కుంగుబాటు (డిప్రెషన్)తో అలా అయిపోయారని, కొన్ని రోజులు పోతే అదే నయమైపోతుందని వదిలేయకుండా వెంటనే వైద్యులకు చూపించాలి. చూపించినప్పుడు ఆ సమస్య మానసికమా, శారీరకమా అన్నది గుర్తించి అందుకు తగిన చికిత్సలు అందిస్తారు.👉గతంలో పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ) వచ్చిందంటే దానికి ప్రధానంగా డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) లాంటి శస్త్రచికిత్సలే ఉండేవి. లేదంటే శరీరంలో డొపమైన్ స్థాయిని పెంచేందుకు కొన్ని రకాల మందులు వాడేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి కారణాలు ఏంటో తెలుసుకుని అందుకు తగిన చికిత్స చేసేందుకు అవకాశం వచ్చింది. ఇటీవల నా దగ్గరకు ఒక రోగి వచ్చారు. ఆయనకు పార్కిన్సన్స్ లక్షణాలే ఉన్నాయి. పరీక్షించినప్పుడు యాంటీబాడీలు తయారవ్వడం వల్ల డొపమైన్ స్థాయి తగ్గుతోందని గుర్తించాం. దాంతో ఇమ్యునోథెరపీ ప్రారంభిస్తే చాలా తక్కువ సమయంలోనే ఆయనకు పూర్తిగా నయమైంది. ఇప్పుడు మామూలు మనిషిలా ఉన్నారు. అందువల్ల సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొస్తే, పార్కిన్సన్స్ వ్యాధిని కూడా పూర్తిగా నయం చేసేందుకు కొన్ని కేసుల్లో అవకాశం ఉంటుంది. అదే ఇంతకుముందయితే జీవితాంతం డొపమైన్ పెంచేందుకు ఉపయోగపడే మందులు వాడుతూ ఉండాల్సి వచ్చేది, లేదా డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చేది. కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీరంలో కణాలు చచ్చిపోతాయి. అందువల్ల కూడా డొపమైన్ ఉత్పత్తి తగ్గిపోయి ఈ సమస్య వస్తుంది. అందువల్ల.. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే రసాయనాలకు గురికావడాన్ని కూడా తగ్గించాలి. అలాగే ఎంత త్వరగా ఈ లక్షణాలు గుర్తిస్తే అంత త్వరగా వైద్యులకు చూపించి, త్వరగా చికిత్స చేయడం మొదలుపెడితే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. చురుకైన జీవనశైలిని పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం, నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధి రాకుండా నిరోధించుకోవచ్చు” అని డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ వివరించారు.డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్,ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్,స్ట్రోక్ స్పెషలిస్ట్ -
జన్మదాతా సుఖీభవ... కనిపెంచినవారిని కడుపులో పెట్టుకుని
వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులు పిల్లలు అవుతారు.కాని వారి కడుపున పుట్టిన పిల్లలు వారికి పూర్తిగా తల్లిదండ్రులుగా మారడంలో ఫలమవుతున్నారు.మనల్ని కని పెంచిన వారికి తల్లిదండ్రులుగా మారాల్సిన సందర్భం వచ్చాక పూర్తి సమయం, శ్రద్ధ ఇవ్వడంలో చాలామంది విఫలం అవుతున్నారు. కాని పెద్దల సంరక్షణ గొప్ప బాధ్యత. దాని గురించి మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిందే.ఏం చేయాలి?చిన్నప్పుడు మనం ‘అమ్మా.. యూనిఫామ్ ఎక్కడా’ అనడిగితే వృద్ధులయ్యాక మన తల్లిదండ్రులు ‘నాన్నా.. నా కళ్లద్దాలు ఎక్కడున్నాయో చూడు’ అంటారు. చిన్నప్పుడు మనం ‘అప్పచ్చి కావాలి’ అని మారాం చేస్తే వృద్ధులయ్యాక తల్లిదండ్రులు ‘కొన్ని అరటి పండ్లు తెచ్చి పెట్టు’ అని అడుగుతారు. మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్లు బజారుకు వెళ్లి మనకు కావలసినవన్నీ తెచ్చి పెడతారు. మనం పెద్దవాళ్లయ్యాక వాళ్లకు కావలసిన వాటిని తేవడానికి ‘టైమ్ లేదంటాం’, ‘వచ్చే నెల చూద్దాం’ అంటాం... ‘ఉన్నవాటితో సర్దుకో’ అంటాం. ఎన్నో అంటాం. ఎన్నో అంటే పడాల్సిన వారా వారు? తల్లిదండ్రులు. వయసు మళ్లిన మన జన్మదాతలు.రెండు రకాల పిల్లలువృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే పిల్లలు రెండు రకాలు. తమతో ఉంచుకుని చూసుకునేవారు, వేరే ఏరియా/ ఊరు/దేశంలో ఉంటూ చూసుకునేవారు. ఈ రెండు విధాల పిల్లలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే తల్లిదండ్రుల విషయంలో ఆ ఇబ్బందులను స్వీకరించి ముందుకు సాగాల్సిందే.ముందు చేయాల్సిన పని తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వయసుకు వారు వచ్చి, నిస్సహాయస్థితికి చేరుకున్నాక పిల్లలు చేయాల్సిన పని వారి గత తప్పులు, ΄పొరపాట్లు అన్నీ మన్నించి ఇక వీరి అంతిమక్షణాల వరకు మనదే బాధ్యత అని సంకల్పం చెప్పుకోవడం. మనం చిన్నగా ఉన్నప్పుడు వారు అది చేయకపోవచ్చు, ఇది చేయకపోవచ్చు, మన కలలను భగ్నం చేసి ఉండొచ్చు... కాని ఇప్పుడు ఆపాత బాకీలు గుర్తు చేసి పేచీ పెట్టే సమయం కాదు. ఇక వారు చిన్నపిల్లలు అయిపోయారు. వారి మీద ప్రేమ మాత్రమే చూపగలం.దూరంగా ఉండి చూసుకోవాల్సిన వారు మొదట తమలో ఆ గిల్ట్‌ను తీసేయాలి. మీ భృతి కోసమో మరో కారణం కోసమో మీరు తల్లిదండ్రులతో ఉండే వీలు లేదు. ఆల్రైట్. కాని వారిని చూసుకోవడంలో మీకు నిజాయితీ ఉంటే చాలు. మీరు నిజాయితీగా ఏ మేరకు చూసుకోగలరో ఆ మేరకు చూసుకుంటున్నారని మీ తల్లిదండ్రులకు అర్థమైతే వారు ఇక ఫిర్యాదులు ఏమీ చేయరు.బంధాలు నిలబెట్టుకోవాలిదగ్గర ఉండి చూసుకుంటున్నా దూరంగా ఉన్నా రోజూ తల్లిదండ్రులతో మాట్లాడటం తప్పనిసరి. ఈ బంధం ఏమీ మారలేదు అనే భరోసా వారికి సగం బలాన్ని ఇస్తుంది. వీడియో కాల్స్ చేయడం, రోజువారీ ఫొటోలేమైనా పంపడం, మనవలు, మనవరాళ్లతో మాట్లాడించడం, కోడలు/అల్లుడు తప్పకుండా పలకరించేలా చూడటం... ఇవన్నీ పెద్దలకు బెంగ తీరుస్తాయి.వినోదంపెద్దలకు బోర్ కొట్టకుండా మంచి ఫోన్లు ఇచ్చి అవి ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తే వారు కాలక్షేపం చేస్తారు. టీవీలో ఓటీటీ చానల్స్ సబ్స్క్రయిబ్ చేసి వాటిని ఎలా చూడాలో నేర్పాలి. అంతే కాదు వారు ఉంటున్న ఏరియాలో వారి వయసు వారు నడిపే వాట్సప్ గ్రూపుల్లో చేరేలా చూడటం, వారి వయసు వారు ఎక్కడైనా కలుస్తూ ఉంటే వెళ్లి వచ్చే ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.ఆ సమస్య వద్దుఒకరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ఆ సంతానం మధ్య ΄పొర΄పొచ్చాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా తల్లిదండ్రుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. తాము జీవించి ఉండగా తమ సంతానం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటం తల్లిదండ్రులకు క్షోభ. వారిని వీలైనంత సంతోషం పెట్టాలి. ముఖ్యమైన పండగలకు అందరూ కలుస్తూ ఉంటే అదే పెద్ద పెన్నిధి. పెద్దలు వారి జీవితంలో ఎన్నో మాటలు పడి ఉంటారు. ఇక పిల్లల నుంచి మాటలు పడే శక్తి ఉండదు. పెద్దలను మాటలతో బాధించ రాదు.పెద్దలు ఉండగా వారి విలువ తెలియదు. వారు లేనప్పుడు అదెంత పెద్ద లోటో తెలుస్తుంది. అందుకే వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రతి సంతానం తల్లిదండ్రులుగా మారాలి. ఆ పసివాళ్లను ప్రేమగా చూసుకోవాలి.తల్లిదండ్రులతో ఉన్నవారైనా, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చూసుకునేవారైనా తప్పనిసరిగా చేయాల్సిన పనులు⇒ వారికి హెల్త్ ఇన్సూరెన్సులు చేసి పెట్టడం ⇒ వ్యక్తిగత సహాయానికి, వైద్య సహాయానికి మనుషుల్ని ఏర్పాటు చేయడం ⇒ వారికి ఇష్టమైన వంటలు, ఆహారం తినే ఏర్పాటు చేయడం ⇒ రి ఎమర్జెన్సీ అవసరాలకు కాల్ చేయదగ్గ మనుషులున్నారని చెప్పడం⇒ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా తగినన్ని డబ్బులు వారి ఆధీనంలో కూడా పెట్టడం⇒ ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్ల వంటివి వారి అనుమతితో సంరక్షించడం -
‘మాతో ఉండండి.. వేధించకండి..వేడుకుంటున్నాం ’
సాక్షి, హైదరాబాద్: తమతో పిల్లలు మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారు కొందరు. అదే సమయంలో పిల్లల వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటున్నారు. మరికొందరు. ఓ వయసు దాటిన తర్వాత అటు సమాజం ఇటు కుటుంబం రెండు వైపులా నిర్లక్ష్యాన్ని ఎదుర్కుంటున్న వృద్ధాప్యపు స్థితిగతులపై ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల వ్యాప్తంగా ‘హెల్పేజ్ ఇండియా’ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఎన్నో ఆసక్తికర, ఆలోచించాల్సిన, తప్పకుండా స్పందించాల్సిన అంశాలు వెలుగు చూశాయి. అవి శాతాల వారీగా ఇలా... ఎంతెంత దూరం..ఆరోగ్యం ► కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నవారు 78 శాతం ► డయాబెటిస్ తో 48 శాతం రక్తపోటు సమస్యతో 37 శాతం ► గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు 21 శాతం ► ఆరోగ్యం కోసం రోజూ నడక కొనసాగిస్తున్నారు 76 శాతం ► యోగా, ప్రాణాయామం చేసేవారు 21 శాతం ► సరైన పద్ధతిలో ఔషధాలు వాడుతున్నవారు 71 శాతం ► తమ ఆరోగ్యం పట్ల పిల్లలు శ్రద్ధ తీసుకోవాలంటున్నారు 50 శాతం ► ఆరోగ్య బీమా తమకు అన్ని విధాలా అందుబాటులో ఉండాలంది 43 శాతం ► ఆహారాన్ని నియంత్రిత పద్ధతిలో తీసుకుంటున్నది 69 శాతం ► సరైన ఆరోగ్య సేవలు పొందుతున్నది 32 శాతం ► బలహీనమైన కాళ్ల కారణంగా పడిపోతామని భయపడుతున్నవారు 37 శాతం ► కంటిచూపు తగ్గిందని బాధపడుతున్నవారు 37 శాతం ► ప్రైవేట్ ఆసుపత్రుల్లో, డయాగ్నసిస్ సెంటర్లలోనూ తమకు తక్కువ ధరకు వైద్య సేవలు లభించాలని ఆశిస్తోంది 35 శాతం ఆర్థికం.. అంతంత మాత్రం.. ► ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపైనే ఆధారపడింది 67 శాతం ► ఆర్థిక భద్రత కలిగి ఉంది 58 శాతం ► పింఛను తదితరాలపై ఆధారపడ్డవారు 45 శాతం పరివారం.. పరిస్థితి ఇదీ... ► కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవుతున్నది 56 శాతం ► తరచూ కుటుంబ సభ్యుల చేత తిట్లు తింటోంది 36 శాతం ► పిల్లల చేతిలో దెబ్బలు తింటున్నవారు 18 శాతం ► తమ ఉనికిని కుటుంబం నిర్లక్ష్యం చేస్తోందంటున్నవారు 9 శాతం ► తమను ఆర్ధిక ఇబ్బందులు పెడుతున్నారంటున్నవారు 9 శాతం ► వేధింపుల నుంచి ఎలా బయటపడాలో తెలియని వారు 24 శాతం ► తమ కుటంబ సభ్యులకు కౌన్సెలింగ్ కావాలంటున్నవారు 71 శాతం ► సామాజిక వేధింపులకు గురవుతున్నామని అంటోంది 42 శాతం ఇలా ఉన్నాం.. అలా ఉండాలనుకుంటున్నాం... ► సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు 21 శాతం ► సమాజసేవకు సై అంటోంది 25 శాతం ► కుటుంబంతో సమయం గడుపుతున్నవారు 53 శాతం ► సెల్‌ఫోన్ వాడుతున్న వృద్ధులు 96 శాతం ► వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నవారు 15 శాతం ► తమ వయసువారిని ముఖాముఖి కలుసుకుంటోంది 45 శాతం ► పిల్లలకు దూరంగా ఉన్న వృద్ధుల్లో పిల్లలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నవారు 43 శాతం ► కుటుంబంతోనే ఉన్నప్పటికీ, తమ కుటుంబ సభ్యులు తమతో మరింత సమయం గడపాలని కోరుకుంటున్న వారు 61శాతం ► తమ సమస్యలపై సమాజం స్పందించాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆశిస్తోంది 53 శాతం -
కరోనాతో వయోవృద్దులకు కష్టకాలం
-
వయసు మీద పడితే?
ఫలానా వారు బాత్రూమ్లో కాలుజారి పడిపోయారనే వార్త తరచూ వింటూనే ఉంటాం. ఇలా అందరూ పడిపోవచ్చు. కానీ అలా పడేవారిలో సాధారణంగా పెద్ద వయసువారే ఎక్కువగా ఉండటం ఎప్పుడైనా గమనించారా? అరవై అయిదేళ్లు – డెబ్భయిల్లోకి వచ్చిన ప్రతి ముగ్గురిలోనూ ఒకరు ఇలాగే పడిపోతుంటారు. నిజానికి పడిపోవడం అనేది ఒక యాక్సిడెంట్. దాన్నెవరూ ఊహించలేరూ, ఆపలేరు. కానీ పెద్దవయసు వచ్చిన వారు పడిపోవడానికి కొన్ని ఆరోగ్యపరమైన కారణాలుంటాయి. తెలుసుకుంటే వాటిని నివారించవచ్చు కదా! పైగా చిన్న వయసు వారు పడిపోతే కోలుకోడానికి అవకాశాలెక్కువ. కానీ పెద్ద వయసు వారు పడిపోతే వచ్చే అనర్థాలెన్నో. ఒక్కోసారి వారు పూర్తిగా మంచం పట్టారంటే అది వారికీ, వారిని చూసుకునే ఇంట్లోని వారికీ ఇబ్బంది. అందుకే పెద్దవయసు వారు అలా పడిపోడానికి కారణాలేమిటో, ఏయే జాగ్రత్తలతో వాటిని నివారించవచ్చో తెలుసుకుంటే పెద్దలను జాగ్రత్తగా చూసుకున్నట్లూ ఉంటుంది. వారు పడిపోవడంతో వచ్చే అనర్థాలనూ, అసౌకర్యాలనూ నివారించినట్లూ ఉంటుంది. ఈ విధంగా అనేక బహుళ ప్రయోజనాలిచ్చేలా ఉపకరించేందుకూ, పెద్దలు పడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడే కథనమిది. పెద్దలు పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఎక్కువ. ఒకసారి పడిపోయిన తర్వాత వారు అలా పడిపోవడానికి కారణాలను అప్పుడు తెలుసుకున్నామనుకోండి. ఆ కారణాలకు వైద్యపరంగా చికిత్స చేసి సరి చేయవచ్చేమోగానీ... ఇలా పడటం మూలంగా ఒక్కోసారి అప్పటికే కాళ్లూ, చేతులు, తుంటి వంటి కీలకమైన ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్ కావడం), తలకు పెద్ద గాయం (హెడ్ ఇంజ్యూరీ) కావడం వంటివి జరిగితే మాత్రం... దాని వల్ల కలిగే ఇబ్బంది చాలా ప్రమాదకరంగా ఉండవచ్చు. ఒక్కోసారి అది కుటుంబసభ్యులందరికీ జీవితాంతం వేధించవచ్చు. అందుకే పెద్ద వయసు వారు ఏయే సమస్యల వల్ల పడిపోతారు, వాటిని ఎలా నివారించవచ్చే తెలుసుకోవాలి. మామూలుగా ఉన్న వారితో పోలిస్తే పెద్ద వయసు వారిలో పడిపోవడాల సంభావ్యత ఎక్కువ. వయసుతో పాటు అలా పడిపోయే ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న కొద్దీ ప్రమాదాలూ, వాటి తీవ్రత కూడా పెరుగుతూ పోతుంది. సాధారణ వయసువారు మొదలుకొని, మధ్యవయస్కులు, పెద్ద వయసు వారి వరకూ అకస్మాత్తుగా కింద పడిపోవడానికి కొన్ని కారణాలేమిటో చూద్దాం. పెద్దలు పడిపోవడానికి కొన్ని కారణాలివే... ♦ వయసు పెరుగుతున్న కొద్దీ కొందరి పాదాల్లో స్పర్శజ్ఞానం తగ్గుతుంది. దాంతో తమకు తెలియకుండానే వారు పడిపోవచ్చు. ♦ వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలూ పలచబడతాయి. నిర్దిష్టంగా చెప్పాలంటే మజిల్ మాస్ తగ్గుతుంది. ఇలా (మజిల్ మాస్ తగ్గి) కండరాలు పలచబడటం వల్ల కండరాల్లోని శక్తి కూడా క్షీణిస్తుంటుంది. పడిపోవడానికి ఇలా కండరాల శక్తి తగ్గిపోవడమూ ఒక కారణం కావచ్చు. ♦ వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని కీళ్లలో ముఖ్యంగా మోకాలు, చీలమండ, తుంటి ఎముకల కీళ్లలో కొన్ని మార్పులు వస్తుంటాయి. ఆ మార్పుల కారణంగా కూడా పడిపోవడం జరగవచ్చు. ♦ వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగించడం, వినికిడి శక్తి క్షీణించడం వంటివి చాలా సాధారణం. ఒక్కోసారి పెద్దవారు అకస్మాత్తుగా పడిపోడానికి ఈ అంశాలు కూడా దోహదం చేస్తుంటాయి. ♦ మీరు జాగ్రత్తగా గమనిస్తే వయసు పెరుగుతున్న కొద్దీ వారు నిటారుగా ఉండలేదు. వాస్తవానికి పెద్దవయసు వారు పడిపోకుండా ఉండేందుకే ప్రకృతి వారిని ఇలా ముందుకు ఒంగిపోయేలా చేస్తుంది. దాంతో వారి గరిమనాభి (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) భూమికి చాలా దగ్గరగా ఉండటం వల్ల పడిపోవడానికి అవకాశాలు తగ్గడం కోసమే ప్రకృతి వారిని ముందుకు వంగిపోయేలా చేస్తుంది. ఇది సాధారణంగా జరిగే పరిణామం. అయితే వారిలా ముందుకు వంగిపోవడమే ఒక్కోసారి పడిపోవడానికి కారణం కావచ్చు. ♦ పెద్ద వయసు వచ్చాక గుండె జబ్బులనీ లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్యలంటూ వారు అనేక రకాల మందులు వాడాల్సి వస్తుంటుంది. ఒక్కోసారి ఆ మందుల ప్రభావం కారణంగా కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ♦ కొందరిలో నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా నరాల సమస్యలున్నప్పుడు పడిపోయే అవకాశాలు మరింత ఎక్కువ. అయితే ఒక్క విషయం. కొందరిలో నరాలకు సంబంధించిన కారణాలేమీ లేకుండానే ముందుకో వెనక్కో పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మొబైల్లో మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరగవచ్చు. అందుకే మొబైల్లో మాట్లాడుతూ నడవకూడదు. పెద్ద వయసు వారికే కాదు... ఈ నియమం అందరికీ వర్తిస్తుంది. వృద్ధాప్యంలో అకస్మాత్తుగా పడిపోవడానికి మరికొన్ని వైద్యపరమైన కారణాలు ♦ సింకోప్: కొంతమంది కొద్దిసేపు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినట్లుగా అయిపోతారు. కళ్లు తిరుగుతాయి. చూపు తాత్కాలికంగా మసకబారుతుంది. ముఖంలో రక్తపుచుక్క లేనట్లుగా పాలిపోతారు. శరీరం చల్లబడి, ఒళ్లంతా చెమటలు పట్టవచ్చు. ఇలాంటి కండిషన్లతో వ్యక్తులు అకస్మాత్తుగా పడిపోయి, ఎముకలు విరగడం, తలకు గాయం కావడం వంటి ప్రమాదం జరగవచ్చు. ఒక్కోసారి మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. ఇలా అకస్మాత్తుగా తాత్కాలికంగా స్పృహ కోల్పోడాన్ని సింకోప్ అంటారు. దీనికి అనేక అంశాలు కారణం కావచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, మన మనసుకు ఏమాత్రం నచ్చని విషయాలను చూడటం (ఉదాహరణకు ఎవరైనా గాయపడటం, ఎవరికైనా తీవ్రమైన రక్తస్రావం అవుతుండటం, తీవ్రమైన నొప్పి/వేదనతో బాధపడటం వంటి అన్‌ప్లెజెంట్ విజువల్ స్టిములై వల్ల) ఇలా జరగవచ్చు. ♦ పోష్చరల్ హైపోటెన్షన్ (లో బీపీ): ఇది అకస్మాత్తుగా బీపీ పడిపోయే పరిస్థితి. సాధారణంగా దీనికి ముందు శరీరంలోని ద్రవాలు, ఖనిజాల పాళ్లు తగ్గడం, ఏదైనా మందు/ఔషధం తీసుకోవడం వల్ల ఇలా జరగవచ్చు. ఒక్కోసారి మనం కూర్చున్న స్థితి నుంచి అకస్మాత్తుగా పైకి లేవడం లేదా ఉన్నట్టుండి పక్కపై నుంచి లేవడం జరిగినప్పుడు కూడా బీపీ అకస్మాత్తుగా పడిపోవచ్చు. ఇలా పడిపోవడం అన్నది 20 హెచ్‌జీ/ఎంఎం కంటే ఎక్కువగా పడిపోతే (అంటే బీపీ అకస్మాత్తుగా తగ్గితే) మెదడుకు చేరాల్సిన రక్తం పరిమాణం ఒకేసారి తగ్గిపోతుంది. దాంతో ఇలా పడిపోవడం జరుగుతుంది. ♦ నిలబడి మూత్రవిసర్జన చేసే సమయంలో లేదా అకస్మాత్తుగా దగ్గు వచ్చినప్పుడు ఒక్కోసారి బీపీ అకస్మాత్తుగా తగ్గిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. ♦ వర్టిగో : ఒక్కోసారి కళ్లు తిరిగినట్లుగా అయిపోయి ఒళ్లు స్వాధీనం తప్పి పడిపోవచ్చు. ఇది సాధారణంగా లోపలిచెవి లేదా బ్రెయిన్ స్టెమ్‌లో ఉన్న వ్యాధుల వల్ల ఇలా జరగవచ్చు. ♦ ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (టీఐఏ): ఒక్కోసారి కొందరిలో చాలా తక్కువ తీవ్రతతో పక్షవాతం వచ్చి, మళ్లీ వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఇలాంటి కండిషన్‌ను వైద్య పరిభాషలో ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ అంటారు. అకస్మాత్తుగా పడటడానికి ఇది కూడా ఒక కారణం. ఇలాంటి సందర్భాల్లో కొందరిలో సరిగా మాట రాకపోవడం, మాటలు ముద్దగా రావడం, కాళ్లూ, చేతులు తాత్కాలికంగా బలహీనంగా మారడం జరగవచ్చు. ♦ ఫిట్స్ : కొందరిలో ఒక్కోసారి ఫిట్స్ రావడం / స్పృహ కోల్పోవడం / శరీరమంతా కుదుపునకు (జెర్క్) లోనుకావడం వల్ల పడిపోవడం జరగవచ్చు. ♦ పార్కిన్సన్ డిసీజ్ : ఈ వ్యాధి ఉన్నవారిలో పడిపోవడం అన్నది శరీరం సరైన బ్యాలెన్స్ లేకపోవడం వల్ల జరుగుతుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో శరీర కదలికలు మందగించడం వల్ల పడిపోవడం జరగవచ్చు. ♦ వెన్నెముక / నరాలు / కండరాల వ్యాధుల వల్ల ఒక్కోసారి కాళ్లూ చేతులు బలహీనమైపోయి పడిపోవచ్చు. ♦ మన శరీరంలోని సోడియమ్, పొటాషియమ్ వంటి లవణాల పాళ్లు, చక్కెర పాళ్లు తగ్గిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. ♦ చాలా అరుదుగా ఒక్కోసారి మెదడులో కణుతులు, మతిమరపు, సైకోసిస్ వంటి అంశాలు కూడా పడిపోవడానికి దోహదం చేయవచ్చు. పడిపోయే అవకాశాలుఎవరెవరిలో ఎక్కువ... ♦ రెండు కాళ్ల మధ్య తక్కువ ఖాళీ ఉంచుతూ నడిచేవారు. నడిచే సమయంలో అడుగులు చిన్నవి చిన్నవిగా వేసేవారు. ♦ నిల్చున్నప్పుడు రెండు కాళ్ల మధ్య చాలా తక్కువగా ఖాళీ ఉంచేవారు. ♦ నడిచే సమయంలో కళ్లు మూసుకునేలా ముఖం ఎక్కువగా రుద్దుకునేవారు. ♦ అకస్మాత్తుగా పడిపోవడాన్ని నివారించడం ఇలా... ♦ గతంలో అకస్మాత్తుగా పడిపోయిన సంఘటనలు జరిగినవారు లేదా అలాంటి వైద్యచరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉన్నవారు ముందుగా తాము అలా పడిపోవడానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. సమస్యను గుర్తించి అందుకు అవసరమైన మందులు వాడాలి. ♦ వైద్యపరమైన కారణాలు కాకుండా... అలా పడిపోవడానికి నిర్దిష్టమైన కారణాలను తెలుసుకొని... వాటిని సరిదిద్దుకోవాలి. అంటే ఉదాహరణకు ... పడుకున్నవారు అకస్మాత్తుగా లేవడం వల్ల పడిపోయినా / కూర్చుని ఉన్నవారు అకస్మాత్తుగా లేచి నిల్చున్నప్పుడు పడిపోవడం జరిగినా, ముఖ్యంగా మూత్ర విసర్జన చేసిన తర్వాత... అలా వెంటనే ఠక్కుమంటూ కదలడం / లేవడం సరికాదు. ఒక్కోసారి నిల్చుని మూత్ర విసర్జన చేసే వారు పడిపోతున్నట్లుగా అనిపిస్తే... అలాంటివారు కూర్చుని మూత్ర విసర్జన చేయడం అలవాటు చేసుకోవాలి. ♦ ఇక పడుకున్న వారు లేవాల్సి వస్తే పక్కలో మెల్లగా ఒక పక్కకు ఒరుగుతూ లేచి కూర్చుని... ఆ తర్వాత మెల్లగా నించోవాలి. అలాగే కూర్చున్న వారు కూడా ఒకేసారి కుర్చీలోంచి లేవకుండా... మెల్లగా లేని నిల్చోవాలి. ♦ అకస్మాత్తుగా పడిపోవడానికి నరాలకు సంబంధించిన (న్యూరలాజికల్) కారణాలు ఏవైనా ఉంటే వాటిని వైద్యపరంగా లేదా ఇతరత్రా సరిదిద్దుకోవాలి. ♦ ఉపకరణాలు వాడటం: అకస్మాత్తుగా పడిపోయే వారు తమకు అవసరమైన ఉపకరణం... అంటే వాకర్ / చేతికర్ర (వాకింగ్ స్టిక్) / కళ్లజోడు వంటి ఉపకరణాలు వాడటం అవసరం. అవి లేకపోతే పడిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే వాటి అవసరం ఉన్నవారు వాటిని విస్మరించకూడదు. ♦ మహిళలు హైహీల్స్ వాడటం సరికాదు. దానికి బదులు తమకు సురక్షితంగా ఉంటూ నచ్చే పాదరక్షలు ధరించాలి. ♦ కాలి కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేయడం అవసరం. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాలను నివారించుకోవచ్చు. ఇవి మరికొన్ని జాగ్రత్తలు... ♦ పడిపోవడాన్ని నివారించే నాన్‌స్టిక్ మ్యాట్స్ వాడాలి. ♦ ఘర్షణ (ఫ్రిక్షన్) ఎక్కువగా ఉంటే ఫ్లోరింగ్ వేయించాలి. టాయిలెట్స్, బాత్రూమ్లలో కూడా జారిపడేందుకు ఆస్కారం ఉన్న పూర్తిగా నున్నగా ఉండే టెయిల్స్‌కు బదులు మంచిగా నిలబడటానికి పట్టునిచ్చే తరహా టైల్స్ వాడాలి. ♦ కాలుజారడానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకు ఫ్రిక్షన్‌ను పెంచే కార్పెట్స్ పరచుకోవాలి. ♦ గదిలో ధారాళంగా మంచి వెలుతురు / గాలి వచ్చేలా చేసుకోవాలి. ♦ టాయిలెట్స్, బాత్రూమ్స్లో మంచి పట్టు ఉండటానికి వీలుగా హ్యాండ్ రెయిల్స్ అమర్చుకోవడం, బాత్రూమ్ బయట కాలుజారకుండా ఉండే మ్యాట్స్ వాడటం వంటివి చేయాలి. ♦ మరీ అవసరమైతే తప్ప ఎక్కడా ఎత్తులకు ఎక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఎత్తుల నుంచి దిగేటప్పుడు పడిపోవాడానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి అలా దిగాల్సి వచ్చినప్పుడు మెట్ల పక్కన ఉండే పట్టు (రెయిలింగ్స్) పట్టుకుని జాగ్రత్తగా దిగాలి. -డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి,చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,రోడ్ నెం. 12, బంజారాహిల్స్,హైదరాబాద్ -
భారమయ్యారని..తల్లిదండ్రులను నడిరోడ్డుపై వదిలేసిన కొడుకులు
శాలిగౌరారం, న్యూస్‌లైన్ : నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులు నడిరోడ్డుపై వదిలేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మల్లాల గ్రామానికి చెందిన నర్సయ్య(98), లింగమ్మ(85)లకు ముగ్గురు కుమారులు రామచంద్రయ్య, వెంకటయ్య, సత్తయ్యలతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. వీరికి వివాహాలు జరిగాయి. నర్సయ్య రెక్కల కష్టంతో సంపాదించిన ఆరు ఎకరాల భూమిని కుమారులకు సమానంగా పంచాడు. ఇటీవల వారి ఆరోగ్యం క్షీణించడంతో పూర్తిగా కొడుకులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను చూసుకునే విషయంలో కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి. చిన్నకొడుకు సత్తయ్య తనకు వాటా తక్కువ వచ్చిందని తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు. కులపెద్దలు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో అతనిని కులం నుంచి వెలేశారు. తమ్ముడు పట్టించుకోవడం లేదు కాబట్టి.. తామూ చూసుకోమంటూ శనివారం గ్రామ ప్రధాన కూడలిలోని మర్రిచెట్టు కింద వదిలి వెళ్లిపోయారు. గ్రామపెద్దల తీర్మానానికి సత్తయ్య ససేమిరా అనడంతో మిగిలిన ఇద్దరూ అదే దారిలో వెళ్లారు. ఉదయం నుంచి చెట్టు కిందనే ఉన్న వృద్ధులను చూసి చలించిన చుట్టుపక్కల వారు మంచినీళ్లు, ఆహారం అందించారు.