వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులు పిల్లలు అవుతారు.కాని వారి కడుపున పుట్టిన పిల్లలు వారికి పూర్తిగా తల్లిదండ్రులుగా మారడంలో ఫలమవుతున్నారు.మనల్ని కని పెంచిన వారికి తల్లిదండ్రులుగా మారాల్సిన సందర్భం వచ్చాక పూర్తి సమయం, శ్రద్ధ ఇవ్వడంలో చాలామంది విఫలం అవుతున్నారు. కాని పెద్దల సంరక్షణ గొప్ప బాధ్యత. దాని గురించి మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిందే.ఏం చేయాలి?
చిన్నప్పుడు మనం ‘అమ్మా.. యూనిఫామ్ ఎక్కడా’ అనడిగితే వృద్ధులయ్యాక మన తల్లిదండ్రులు ‘నాన్నా.. నా కళ్లద్దాలు ఎక్కడున్నాయో చూడు’ అంటారు. చిన్నప్పుడు మనం ‘అప్పచ్చి కావాలి’ అని మారాం చేస్తే వృద్ధులయ్యాక తల్లిదండ్రులు ‘కొన్ని అరటి పండ్లు తెచ్చి పెట్టు’ అని అడుగుతారు. మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్లు బజారుకు వెళ్లి మనకు కావలసినవన్నీ తెచ్చి పెడతారు. మనం పెద్దవాళ్లయ్యాక వాళ్లకు కావలసిన వాటిని తేవడానికి ‘టైమ్ లేదంటాం’, ‘వచ్చే నెల చూద్దాం’ అంటాం... ‘ఉన్నవాటితో సర్దుకో’ అంటాం. ఎన్నో అంటాం. ఎన్నో అంటే పడాల్సిన వారా వారు? తల్లిదండ్రులు. వయసు మళ్లిన మన జన్మదాతలు.
రెండు రకాల పిల్లలు
వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే పిల్లలు రెండు రకాలు. తమతో ఉంచుకుని చూసుకునేవారు, వేరే ఏరియా/ ఊరు/దేశంలో ఉంటూ చూసుకునేవారు. ఈ రెండు విధాల పిల్లలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే తల్లిదండ్రుల విషయంలో ఆ ఇబ్బందులను స్వీకరించి ముందుకు సాగాల్సిందే.
ముందు చేయాల్సిన పని
తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వయసుకు వారు వచ్చి, నిస్సహాయస్థితికి చేరుకున్నాక పిల్లలు చేయాల్సిన పని వారి గత తప్పులు, ΄పొరపాట్లు అన్నీ మన్నించి ఇక వీరి అంతిమక్షణాల వరకు మనదే బాధ్యత అని సంకల్పం చెప్పుకోవడం. మనం చిన్నగా ఉన్నప్పుడు వారు అది చేయకపోవచ్చు, ఇది చేయకపోవచ్చు, మన కలలను భగ్నం చేసి ఉండొచ్చు... కాని ఇప్పుడు ఆపాత బాకీలు గుర్తు చేసి పేచీ పెట్టే సమయం కాదు. ఇక వారు చిన్నపిల్లలు అయిపోయారు. వారి మీద ప్రేమ మాత్రమే చూపగలం.
దూరంగా ఉండి చూసుకోవాల్సిన వారు మొదట తమలో ఆ గిల్ట్‌ను తీసేయాలి. మీ భృతి కోసమో మరో కారణం కోసమో మీరు తల్లిదండ్రులతో ఉండే వీలు లేదు. ఆల్‌రైట్. కాని వారిని చూసుకోవడంలో మీకు నిజాయితీ ఉంటే చాలు. మీరు నిజాయితీగా ఏ మేరకు చూసుకోగలరో ఆ మేరకు చూసుకుంటున్నారని మీ తల్లిదండ్రులకు అర్థమైతే వారు ఇక ఫిర్యాదులు ఏమీ చేయరు.
బంధాలు నిలబెట్టుకోవాలి
దగ్గర ఉండి చూసుకుంటున్నా దూరంగా ఉన్నా రోజూ తల్లిదండ్రులతో మాట్లాడటం తప్పనిసరి. ఈ బంధం ఏమీ మారలేదు అనే భరోసా వారికి సగం బలాన్ని ఇస్తుంది. వీడియో కాల్స్ చేయడం, రోజువారీ ఫొటోలేమైనా పంపడం, మనవలు, మనవరాళ్లతో మాట్లాడించడం, కోడలు/అల్లుడు తప్పకుండా పలకరించేలా చూడటం... ఇవన్నీ పెద్దలకు బెంగ తీరుస్తాయి.
వినోదం
పెద్దలకు బోర్ కొట్టకుండా మంచి ఫోన్‌లు ఇచ్చి అవి ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తే వారు కాలక్షేపం చేస్తారు. టీవీలో ఓటీటీ చానల్స్ సబ్‌స్క్రయిబ్ చేసి వాటిని ఎలా చూడాలో నేర్పాలి. అంతే కాదు వారు ఉంటున్న ఏరియాలో వారి వయసు వారు నడిపే వాట్సప్ గ్రూపుల్లో చేరేలా చూడటం, వారి వయసు వారు ఎక్కడైనా కలుస్తూ ఉంటే వెళ్లి వచ్చే ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.
ఆ సమస్య వద్దు
ఒకరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ఆ సంతానం మధ్య ΄పొర΄పొచ్చాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా తల్లిదండ్రుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. తాము జీవించి ఉండగా తమ సంతానం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటం తల్లిదండ్రులకు క్షోభ. వారిని వీలైనంత సంతోషం పెట్టాలి. ముఖ్యమైన పండగలకు అందరూ కలుస్తూ ఉంటే అదే పెద్ద పెన్నిధి. పెద్దలు వారి జీవితంలో ఎన్నో మాటలు పడి ఉంటారు. ఇక పిల్లల నుంచి మాటలు పడే శక్తి ఉండదు. పెద్దలను మాటలతో బాధించ రాదు.
పెద్దలు ఉండగా వారి విలువ తెలియదు. వారు లేనప్పుడు అదెంత పెద్ద లోటో తెలుస్తుంది. అందుకే వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రతి సంతానం తల్లిదండ్రులుగా మారాలి. ఆ పసివాళ్లను ప్రేమగా చూసుకోవాలి.
తల్లిదండ్రులతో ఉన్నవారైనా, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చూసుకునేవారైనా తప్పనిసరిగా చేయాల్సిన పనులు
⇒ వారికి హెల్త్ ఇన్సూరెన్సులు చేసి పెట్టడం
⇒ వ్యక్తిగత సహాయానికి, వైద్య సహాయానికి మనుషుల్ని ఏర్పాటు చేయడం
⇒ వారికి ఇష్టమైన వంటలు, ఆహారం తినే ఏర్పాటు చేయడం
⇒ రి ఎమర్జెన్సీ అవసరాలకు కాల్ చేయదగ్గ మనుషులున్నారని చెప్పడం
⇒ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా తగినన్ని డబ్బులు వారి ఆధీనంలో కూడా పెట్టడం
⇒ ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్ల వంటివి వారి అనుమతితో సంరక్షించడం
Comments
Please login to add a commentAdd a comment