ఎండలు మండించే సమ్మర్‌... చైల్డ్‌ కేర్‌! | how to take care of children in this hot summer | Sakshi
Sakshi News home page

ఎండలు మండించే సమ్మర్‌... చైల్డ్‌ కేర్‌!

Published Sun, Apr 20 2025 12:04 PM | Last Updated on Sun, Apr 20 2025 12:04 PM

how to take care of children in this hot summer

పిల్లలకు ఆటల్లో ఒళ్లు తెలియకపోవడమే కాదు... ఎండ తీవ్రతా తెలియదు. ఇప్పటికే ఎర్రటి ఎండ మండుతోంది. ఇంతటి ఎండల తీవ్రత వల్ల ఆరుబయట ఆడే పిల్లలకు వడదెబ్బ మొదలుకొని, డీహైడ్రేషన్‌ వరకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీడపట్టున ఉంటే వడదెబ్బ తగలదని కొందరి అభిప్రాయం. కానీ నీడ ఉన్నప్పటికీ అక్కడ వేడిమి తీవ్రత ఎక్కువగా ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం లేకపోలేదు. వేసవిలో చిన్నారులకు ఎండ ముప్పులు ఏయే రూపాల్లో వస్తాయో చూద్దాం. 

ఎండ తీవ్రతతో సమస్యలివి...  
మజిల్‌ క్రాంప్స్‌ : దేహం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలు అందుతూ ఉంటాయి. ఈ ఆదేశాలన్నీ లవణాలలోని విద్యుదావేశం కలిగిన అయాన్లు నరాల ద్వారా ప్రసరించడం వల్ల కండరాలకు ఆదేశాలందుతూ ఉంటాయి. 

ఇదీ చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో

ఎండవేడిమి తీవ్రతతో చెమట రూపంలో నీటినీ, లవణాలనూ కోల్పోవడం వల్ల నరాల ద్వారా మెదడునుంచి కండరాలకు సరైన ఆదేశాలందవు. దాంతో డీ–హైడ్రేషన్‌కు గురి కాగానే కండరాలు బిగుసుకుపోతాయి. వీటినే మజిల్‌క్రాంప్స్‌గా చెబుతారు. మజిల్‌క్రాంప్స్‌ వస్తే వెంటనే దేహానికి నీటిని అందించాలి. 

పిల్లల్లో మజిల్‌ క్రాంప్స్‌ వస్తే : పిల్లలకు మజిల్‌క్రాంప్స్‌ కారణంగా కండరాలు బిగదీసుకుపోతుంటే వారికి ‘ఓరల్‌–రీ-హైడ్రేషన్‌ (ఓఆర్‌ఎస్‌) ద్రావణాన్ని తాగించాలి. ∙ఓఆర్‌ఎస్‌ అందుబాటులో లేక΄ోతే కొబ్బరినీళ్లు కూడా తాగించవచ్చు. 

ఓఆర్‌ఎస్‌గానీ, కొబ్బరినీళ్లుగానీ అందుబాటులో లేకపోతే... ఒక అరటిపండు తినిపించి, మంచినీళ్లు తాగించాలి. అరటిపండులో  నొటాషియం వంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండూ, నీళ్లతో అవి చాలావరకు భర్తీ అవుతాయి.

వడదెబ్బ : ఒక్కోసారి చాలా  ప్రాణాంతకంగా మారే మెడికల్‌ ఎమర్జెన్సీ కండిషన్‌ ఈ వడదెబ్బ.  శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్‌. కానీ పిల్లలు వడదెబ్బకు లోనైతే వారి శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి΄ోతుంది. వాస్తవానికి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు మెయింటెయిన్‌ అయ్యేందుకు మెదడులోని హై΄ోథెలామస్‌ అనే గ్రంథి తోడ్పడుతుంది. 

చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

దేహ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమటలు పట్టి... దేహంలోంచి ఉష్ణోగ్రతను తీసుకుని ఆ చెమటలు ఆవిరైపోతూ ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒకే స్థాయిలో మెయింటైన్‌ అవుతుంటుంది. కానీ దేహ ఉష్ణోగ్రత అదేపనిగా పెరిగి΄ోతూండటంతో స్వేదగ్రంథులు అలసిపోయి ఇక ఏమాత్రం పనిచేయని స్థితికి చేరుకుంటాయి. దాంతో శరీరం వేడెక్కుతున్నా... దాన్ని నియంత్రిస్తూ ఉష్ణోగ్రత సమంగా ఉండేలా చేయడానికి అవసరమైన యంత్రాంగం విఫలం కావడంతో దేహ ఉష్ణోగ్రత ఇంకా ఇంకా పెరిగి΄ోతుంది. దీనికి ఓ సూచన కూడా ఉంటుంది. పిల్లల చంకల్లోనూ చెమట పట్టని స్థితి రావడం ఒక్కోసారి పిల్లలు స్పృహ తప్పిపోయి అపస్మారక స్థితికి చేరడం వడదెబ్బను సూచిస్తాయి.

వడదెబ్బలో లక్షణాలివి... 
వికారం, వాంతులు; కళ్లు తిరగడం; ∙నీరసం, స్పృహ తప్పడం, ఫిట్స్‌ రావడం,చివరగా కోమాలోకి వెళ్లడం జరగవచ్చు. 
వడదెబ్బకు చికిత్స: దేహ ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరి అంతకంతకూ పెరుగుతుంటే... ఆ కారణంగా మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ స్థాయికి (నార్మల్‌కు) తీసుకురావడం అవసరం. 
ఒంటి ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్‌కు మించుతున్నట్లు తెలియగానే వెంటనే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్‌ కింద ఉంచాలి. ఫ్యాన్‌ కింద కూడా వేడిగాలి వస్తుంటే  పిల్లల  దుస్తులను వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. దుస్తులు ఇబ్బందికరంగా ఉంటే నడుముకు చిన్న ఆచ్ఛాదన ఉంచి, బట్టలన్నీ తీసేయాలి. చల్లటి నీటిలో ముంచిన గుడ్డతో ఒళ్లంతా తుడుస్తూ చల్లటి గాలి ఒంటికి వేగంగా తగులుతూ వెళ్లేలా చూడాలి. ఇలా ఒళ్లు త్వరగా చల్లబడుతుంది.

 

∙ఈ చర్యల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల దగ్గర ఐస్‌ గడ్డలనుంచాలి. దాంతో శరీరం మరింత చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్‌ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. 

ఒబేస్‌ పిల్లలకు జాగ్రత్త అవసరం! మామూలు పిల్లలతో పోలిస్తే కాస్త ఒబేస్‌గా ఉండే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లల ఒంట్లోంచి నీళ్లు కోల్పోతున్నప్పుడు ఆ నీటితో  పాటు విలువైన ఖనిజలవణాలనూ కోల్పోతున్నారని గ్రహించాలి. స్థూలకాయమున్న పిల్లలు బాగా ఆటలాడుతున్నప్పుడు ప్రతి కిలోకు 50 మిల్లీలీటర్ల నీరు కోల్పోవచ్చు. దాంతో తమ పిల్లలు బరువు కోల్పోతూ, ఆరోగ్యంగా మారుతున్నారంటూ పెద్దలు అపోహ పడటం సరికాదు. వాళ్లు విలువైన ఖనిజలవణాలు కోల్పోయి డీ–హైడ్రేషన్‌కు గురవుతున్నారనే విషయాన్ని గ్రహించాలి. అందుకే ఇలా బరువు తగ్గుతున్నప్పుడు పెద్దలు వారి ఒంటిలో జరిగే జీవక్రియలకు (మెటబాలిక్‌ యాక్టివిటీస్‌కు) అవసరమైన నీటిని వెంటవెంటనే భర్తీ చేస్తూ ఉండాలి. అందుకే స్థూలకాయులైన పిల్లలు వెంటవెంటనే మరింత బరుతు తగ్గుతున్నట్లు గ్రహిస్తే పెద్దలు వారి ఒంట్లోకి తగిన ఎలక్ట్రోలైట్స్‌ పంపించేందుకు కొబ్బరినీళ్లు, గ్లూకోజ్‌ వంటివి ప్రతి 20 నిమిషాలకొకసారి తాగిస్తూ ఉండటం తప్పనిసరి. 

ఎండ దుష్ప్రభావాల నివారణ ఇలా... 
ఎండవేళల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి ప్రదేశాల్లోనే ఆడుకునేలా  ప్రోత్సహించాలి. ఎండవేళల్లో ఇన్‌డోర్‌ గేమ్స్‌కు మాత్రమే వారిని పరిమితం చేస్తే బాగుంటుంది. ∙ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే, అందునా ఇంట్లో కూడా చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఉండేలా చూడాలి. ఆటల్లో పూర్తిగా నిమగ్నమైపోయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారు కొద్దికొద్దిగా మంచినీళ్లు తాగుతుండేలా చూడాలి. వీలైతే  మధ్యమధ్యలో కొబ్బరినీళ్లు, పళ్లరసాలు కూడా ఇవ్వవచ్చు.  ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలతో పిల్లలు వేసవి దుష్ప్రభావాలకు లోనుకాకుండా జాగ్రత్త పడాలి. సాయంత్రాలు బాగా చల్లబడ్డ తర్వాతనే వాళ్లను ఔట్‌డోర్‌ గేమ్స్‌కు అనుమతించాలి. 

ఎండలు మండిపోతున్నాయి.  
పిల్లలకు సెలవులూ వచ్చాయి. నీడపట్టున ఉండాల్సిన పిల్లలు కాస్తా సెలవుల్లో ఆడుకోవడం కోసం ఎండల్లోకి వెళ్తే...? అది మరింత ప్రమాదం. ఈ వేసవి వేడిమితో చిన్నారులకు వచ్చే సమస్యలేమిటో, ఈ సెలవుల ఎండల్లోంచి పిల్లలను కాపాడుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.

ఎండల్లో పిల్లలు ఎక్కువగా చెమట వల్ల నీరూ, లవణాలూ కోల్పోతున్నారని తెలియడానికి విపరీతంగా చెమట పట్టడమే సూచన అని కొందరు అ΄ోహపడుతుంటారు. అది వాస్తవం కాదు. పిల్లలతో పోలిస్తే పెద్దల్లో చెమట గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రత పెరగగానే చెమటలు పట్టడం పెద్దల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ పిల్లల్లో అలా కాదు. వాళ్లలో పెద్దల మాదిరిగా చెమటలు పట్టాలంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. ఒంటిని చల్లబరిచే మెకానిజమైన చెమట పట్టడమన్నది పిల్లల్లో కాస్త తక్కువే కావడం వల్ల పెరిగే కొద్దిపాటి వేడిమి కూడా పిల్లలపై ఎక్కువగా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలకు పెద్దగా చెమటలు పట్టక΄ోయినా... వాళ్ల ఒంటి ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుందని తెలుసుకోవడంతోపాటు చిన్నపిల్లల్లో చెమట గ్రంథుల సంఖ్య తక్కువ కాబట్టి వేడెక్కిన ఒళ్లు వెంటనే చల్లబడదు కాబట్టి బాగా చల్లగా ఉండేచోటే వాళ్లు ఆడుకుంటూ ఉండేలా చూడాలి. ఆరుబయటి ఉష్ణోగ్రత బాగా తగ్గాకే వారిని బయట ఆటలాడటానికి అనుమతించాలి. 
డా. శివనారాయణ రెడ్డి వెన్నపూస,
సీనియర్‌ నియోనేటాలజిస్ట్‌  అండ్‌ పీడియాట్రీషియన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement