కైరో: పాకిస్తాన్లో వందలాది మంది జనాల్ని పొట్టనపెట్టుకున్న ప్రచండ భానుడు ఇప్పుడు వడగాల్పులతో ఈజిప్టు దేశానికి పయనం సాగిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి పాక్లో పసిముద్ద నుంచి పండుటాకుల వరకు 630 మందికిపైగా మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో భానుడు అగ్నిగుండంలా మండిపోతూ వడగాలులతో ఈజిప్ట్ను బెంబేలెత్తిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి ఇప్పటివరకూ ఈజిప్ట్లో 70 మంది మృత్యువాత పడినట్టు అక్కడి ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది.
ఈజిప్టులో గురువారం నాటికి నమోదైన మృతుల సంఖ్య 16 కాగా, బుధవారం 6గురు మృతిచెందినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మృతుల సంఖ్య76కు చేరగా, 187 మంది ఆస్పత్రి పాలయ్యారని పేర్కొంది. ఈజిప్టు రాజధాని కైరోలో గడిచిన ఐదురోజుల్లో వడగాల్పుల ప్రభావం ప్రమాద స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ పెరిగిపోతున్న తీవ్ర వేడిగాలుల వల్ల పలుప్రాంతాల్లో తేమ శాతం ఒక్కసారిగా పడిపోయింది. దాంతో తీవ్రమైన వేడిని తట్టుకులేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావద్దంటూ, వడదెబ్బ తగిలి ప్రాణాలకు హాని వాటిల్లే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యగా మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచనలు చేస్తోంది. ప్రత్యేకించి అనారోగ్యంతో ఉన్నవాళ్లు, పిల్లలు, ఇంట్లో నుంచి బయటకు రావద్దొంటూ జాగ్రత్తలను వివరిస్తోంది. కానీ, ఈజిప్టులో గత కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు ఉన్నదానికంటే హెచ్చుస్థాయిలో భారీగా పెరిగిపోతున్నాయి. కైరోలోని దక్షిణ ప్రాంతాలైన లక్సోర్ ప్రాంతంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, అశ్వన్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల ఆఖరు వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
ఈజిప్టులో వడగాల్పులు; 70 మంది మృతి
Published Thu, Aug 13 2015 6:36 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement