భారమయ్యారని..తల్లిదండ్రులను నడిరోడ్డుపై వదిలేసిన కొడుకులు
భారమయ్యారని..తల్లిదండ్రులను నడిరోడ్డుపై వదిలేసిన కొడుకులు
Published Sun, Sep 8 2013 6:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
శాలిగౌరారం, న్యూస్‌లైన్ : నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులు నడిరోడ్డుపై వదిలేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మల్లాల గ్రామానికి చెందిన నర్సయ్య(98), లింగమ్మ(85)లకు ముగ్గురు కుమారులు రామచంద్రయ్య, వెంకటయ్య, సత్తయ్యలతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. వీరికి వివాహాలు జరిగాయి.
నర్సయ్య రెక్కల కష్టంతో సంపాదించిన ఆరు ఎకరాల భూమిని కుమారులకు సమానంగా పంచాడు. ఇటీవల వారి ఆరోగ్యం క్షీణించడంతో పూర్తిగా కొడుకులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను చూసుకునే విషయంలో కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి. చిన్నకొడుకు సత్తయ్య తనకు వాటా తక్కువ వచ్చిందని తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు. కులపెద్దలు చెప్పినా పట్టించుకోలేదు.
దీంతో అతనిని కులం నుంచి వెలేశారు. తమ్ముడు పట్టించుకోవడం లేదు కాబట్టి.. తామూ చూసుకోమంటూ శనివారం గ్రామ ప్రధాన కూడలిలోని మర్రిచెట్టు కింద వదిలి వెళ్లిపోయారు. గ్రామపెద్దల తీర్మానానికి సత్తయ్య ససేమిరా అనడంతో మిగిలిన ఇద్దరూ అదే దారిలో వెళ్లారు. ఉదయం నుంచి చెట్టు కిందనే ఉన్న వృద్ధులను చూసి చలించిన చుట్టుపక్కల వారు మంచినీళ్లు, ఆహారం అందించారు.
Advertisement
Advertisement