సాక్షి, నల్గొండ: పన్నెండేళ్ల బాలిక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.. ఆత్మహత్యేమో అని భావించిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ గ్రామంలోని కొందరి వ్యవహారశైలిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో బాలిక మృతదేహాన్ని తవ్వి తీసి పోస్టుమార్టం చేయించారు. ఇదంతా జరిగి నాలుగు నెలలైంది. ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. పైగా ఇటీవల సదరు బాలిక సమాధి తవ్వేసి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంతకాలమైనా పోలీసులు ఏమీ తేల్చడం లేదని, నిందితులను విచారించలేదని బాలిక తల్లిదండ్రులు శుక్రవారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.
నాలుగు నెలల కింద ఘటన
పెర్కకొండారం గ్రామానికి చెందిన పెరుమాండ్ల రమేశ్–పుషష్పలతల కుమార్తె మెర్సి(12). స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదివే ఆమె.. ఈ ఏడాది జూలై 13న ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. మెర్సి నోట్‌బుక్‌లో సుసైడ్ నోట్ రాసి పెట్టి ఉంది. ఆమెది ఆత్మహత్యగా భావించిన తల్లిదండ్రులు, బంధువులు అదేరోజు రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే అంత్యక్రియల సమయంలో గ్రామానికి చెందిన కట్ట పద్మారావు, పెరుమాండ్ల కృష్ణ, పెరుమాండ్ల ప్రభాకర్‌లు ఆ ఇంటికి వచ్చి.. నోట్‌బుక్‌లో రాసి ఉన్న సుసైడ్ నోట్‌ను చించివేశారు. మెర్సి మృతి చెందిన మూడో రోజు ఆమె సమాధి వద్ద తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో తల్లిదండ్రులకు అనుమానం వచ్చిన, పద్మారావు, కృష్ణ, ప్రభాకర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూతగాదాల నేపథ్యంలో వారే తమ కుమార్తెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే తప్పుడు సుసైడ్‌నోట్‌ను వారే రాసి, తర్వాత చించివేశారని పేర్కొన్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరో రోజున సమాధి నుంచి మెర్సి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆ తర్వాత కేసు ముందుకు కదలలేదు. సమాధి తవ్వేసి ఉండటంతో..: మెర్సి తల్లిదండ్రులు కుమార్తెకు నివాళులు అర్పించేందుకు గత నెల 28న సమాధి వద్దకు వెళ్లారు. కానీ అప్పటికే సమాధి తవ్వి పైకప్పు రాయి దూరంగా పడవేసి ఉంది. తల్లిదండ్రులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు కేసు విచారణ చేపట్టలేదని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని వివరించారు. దీనితో ఎస్పీ విచారణకు ఆదేశించారు.
దర్యాప్తు చేస్తున్నాం
మెర్సి మృతిపై తల్లిదండ్రుల ఫిర్యా దు ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం. కేసును పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అవాస్తవం. మెర్సి పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దాని ఆధారంగా విచారణ జరుగుతోంది. మెర్సి సమాధిని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేసిన విషయం వాస్తవమే. ఈ ఘటనపైనా
దర్యాప్తు చేపట్టాం. కానీ సమాధిలో మృతదేహం ఉందో, లేదో మేం చూడలేదు.
సీఐ రాఘవరావు, శాలిగౌరారం
Comments
Please login to add a commentAdd a comment