లింగోజిగూడ: అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇమ్మన్నందుకు వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం దోనకొండకు చెందిన యక్కలి కాశీరావు (37), భార్య సుమలత, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్ భాగ్యలత అరుణోదయ నగర్‌లో రెండున్నరేళ్లుగా ఉంటున్నాడు. కాశీరావు స్థానికంగా కార్ల క్రయ విక్రయాలు చేస్తుంటాడు. కాశీరావు కిరాయికి ఉంటున్న ఇంట్లోని మొదటి అంతస్తులోనే నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన బ్యాచ్‌లర్లు పెద్దగాని శేఖర్, పెద్దగాని సాయి, ఐతరాజు శంకర్‌లు అద్దెకి ఉంటున్నారు. వీరిలో సాయి, శంకర్ హయత్‌నగర్‌లోని బొమ్మలగుడి సమీపంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో కాశీరావు, పెద్దగాని శేఖర్ ఇద్దరూ కలిసి కార్ల వ్యాపారం ప్రారంభించారు. 2023లో రూ.1.5 లక్షలు ఒకసారి, రూ. 3.60 లక్షలు మరోసారి కాశీరావు వద్ద శేఖర్ అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు డబ్బులు ఇవ్వాలని శేఖర్ గదికి వెళ్లి కాశీరావు అడుగుతుండేవాడు. ఈ విషయమై వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సాయి, శంకర్ వ్యక్తిగత పనిపై గదిలోంచి బయటకు వెళ్లారు. 10 గంటల సమయంలో కాశీరావు.. పైఅంతస్తులో ఉన్న శేఖర్ గదికి వెళ్లాడు.
20 నిమిషాలు గడుస్తున్నా కాశీరావు కిందకు రాలేదు. 10.20 గంటల సమయంలో శేఖర్ రక్తపు మరకలతో కిందకు దిగి వచ్చాడు. అక్కడే దుస్తులు ఆరేస్తున్న కాశీరావు భార్య సుమలతతో.. ‘నీ భర్తను చంపేశాను’ అంటూ వెళ్లిపోయాడు. సుమలత వెంటనే పైఅంతస్తులోని గదికి వెళ్లి చూడగా.. మెడ భాగంలో బలమైన గాయాలతో కాశీరావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
భర్తను పైకి లేపాలని సుమలత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడు అప్పటికే మృతి చెందినట్లు గ్రహించిన సుమలత స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది. అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడనే కోపంతోనే గొడపడిన శేఖర్.. కాశీరావును గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుమలత ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శేఖర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment