సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం శివారులో ఈ నెల 8న వెలుగుచూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. చేతబడి నెపంతో సమీప బంధువులే దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి సీఐ వెంకన్న, ఎస్‌ఐ సుధాకర్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. సంస్థాన్ నారాయణపురానికి చెందిన చిలువేరు మల్లయ్యకు గ్రామంలో తన తోడపుట్టిన సోదరులు నలుగురితో పాటు బంధువులు ఉన్నారు. ఇటీవల మల్లయ్య బంధువు అయిన వినయ్‌కుమార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అదేవిధంగా మరో బంధువైన శివకుమార్ అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. వారి మృతికి మల్లయ్య చేతబడే కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. శివకుమార్ కర్మకాండ ఈ నెల 7న సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించారు. ఆ రోజే మల్లయ్యను అంతం మొందించాలని మల్లయ్య బంధువులైన సంస్థాన్‌నారాయణపురానికి చెందిన చిలివేరు మహిపాల్, చిలివేరు వెంకటేశం, పుట్టపాకకు చెందిన నడికూడి నాగరాజులు కుట్రపన్నారు. ఈ నెల 8న శ్రీవారి వనం ప్రాంతంలో మల్లయ్య పశువులను మేపడానికి వెళ్లడాన్ని గమనించారు.
పథకం ప్రకారం ముగ్గురు మల్లయ్యపై గొడ్డళ్లతో అకస్మాత్తుగా దాడి చేసి నరికి చంపారు. ముగ్గురు నిందితులను శనివారం ఉదయం చౌటుప్పల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉండగా అరెస్ట్ చేసినట్లు వివరించారు. వారి నుంచి బైక్, గొడ్డళ్లు, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముగ్గురిని నల్లగొండ కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment