
రోదిస్తున్న మహేష్ కుటుంబ సభ్యులు
సాక్షి, హుజూర్‌నగర్(నల్లగొండ): పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన బాతుక మహేష్(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మహేష్ అదే గ్రామానికి చెందిన సైదులు భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని గొడవలు జరుగుతున్నాయి. పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి.
ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
మహేష్ మంగళవారం గ్రామ శివారులోని డొంకదారి గుండా బైక్‌పై వస్తున్నాడు. అదే సమయంలో సైదులు ట్రాక్టర్‌తో వచ్చి ఢీకొట్టాడు. దీంతో మహేశ్ ఎగిరి పక్కన పొలంలో పడిపోయాడు. అనంతరం ట్రాక్టర్‌తో మరోమారు ఢీకొట్టడంతో మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి కుటుంబంతో సహా నిందితుడు పారిపోయాడు.
రైతులు గమనించడంతో..
ఉదయం వ్యవసాయ పొలాలకు వెళ్తున్న రైతులు వ్యవసాయ పొలంలో బైక్, మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పాతకక్షల నేపథ్యంలో సైదులే ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య యమున, ఇద్దరు కుమార్తెలు స్పందన, హారికలు ఉన్నారు. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైదులుపై హత్య కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.వెంకట్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment