దేవరకొండ: ట్రాక్టర్ కింద పడి ఓ బాలుడు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోల్‌ముంతల్‌పహాడ్ గ్రామపంచాయతీ బాపూజీనగర్‌కు చెందిన సంపెంగల సతీశ్, జంగమ్మ దంపతులకు నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు కుమార్తెలు, కుమారుడు చరణ్ (15)ఉన్నారు. సతీశ్ కంకర మిల్లులో రాయి కొట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం సతీశ్ ఇంటి సమీపంలో గల బండరాయి వద్ద ట్రాక్టర్‌లో రాళ్లను నింపే క్రమంలో ట్రాక్టర్ ముందు టైరు కింద ఓ రాయిని ఉంచారు.
రాళ్లను నింపిన తర్వాత టైరు కింద ఉంచిన రాయిని తీయాలని అక్కడే ఉన్న చరణ్‌ను ట్రాక్టర్ డ్రైవర్ అడిగాడు. దీంతో అతను రాయిని తీసే క్రమంలో ట్రాక్టర్ ముందుకు కదలడంతో చరణ్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు.
న్యాయం చేయాలంటూ రాస్తారోకో
మృతుడు చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, స్థానికులు కొండమల్లేపల్లి–దేవరకొండ ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న దేవరకొండ సీఐ బీసన్న, కొండమల్లేపల్లి సీఐ రవీందర్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు రాస్తారోకో విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment