పరిగి, సాక్షి న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థి శిరీష మృతిపై మిస్టరీ వీడలేదు. యువతిది హత్యా.. ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాళ్లాపూర్ శివారులోని నీటి కుంటలో ఆదివారం మధ్యాహ్నం శిరీష (19) మృతదేహం లభ్యమైంది. ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉండటం, రెండు కళ్లనూ పొడిచి ఉండటంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పలువురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా సోమవారం గ్రామానికి చేరుకున్న వైద్యులు శిరీష మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. యువతి శరీరంపై గాయాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. శిరీషది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి జంగయ్య, బావ అనిల్‌పై వారు మండిపడ్డారు.
శిరీష మృతికి వారే కారణమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కల్పించుకుని త్వరలోనే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. తన చెల్లిని చంపిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని మృతురాలి తమ్ముడు శ్రీకాంత్ కోరాడు.
పోలీసుల అదుపులో మరో ఇద్దరు
శిరీష అంత్యక్రియలు ముగిసిన తర్వాత తండ్రి జంగయ్య, బావ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి తండ్రి జగయ్యను పోలీసులు వదిలేయగా.. బావ అనిల్‌ను విచారిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. కేసు దర్యాప్తులో ఉందని, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.
మూడు రోజుల్లో రిపోర్టు పంపండి: తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం
శిరీష దారుణ హత్యను జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. స్క్రూ డ్రైవర్‌తో బాలిక కళ్లు పీకి, బ్లేడ్‌తో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటనపై ఢిల్లీలోని ఎన్సీడబ్ల్యూ సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. అంతేగాక మూడు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను పంపించాలని తెలంగాణ డీజీపీకి సూచించింది. తెలంగాణలో బాలికలు, యువతులు, మహిళలపై పెరిగిపోతున్న నేరాలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment