National Commission for Women
-
కూటమి ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దారుణలపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్కు ఫిర్యాదు చేయనున్నారు.మంగళవారం మద్యాహ్నం 2గంటలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవిలు.. ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్తో భేటీ కానున్నారు.ఈ భేటీలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వ పాలనలో రోజూ మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయని ఫిర్యాదు చేయనున్నారు. మహిళలపై 100కు పైగా జరిగిన దురాగతాల నివేదికను అందించనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యంపై వైఎస్సార్సీసీ మహిళ నేతలు జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు. -
ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా విజయా కిశోర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు. అదేవిధంగా, కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ అర్చనా మజుందార్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రహాట్కర్ మూడేళ్ల పాటు, లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. మజుందార్ మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది. తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రహాట్కర్ 1995లో బీజేపీలో చేరారు. 2007–2010 మధ్య ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. నేషనల్ మేయర్స్ కౌన్సిల్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా 2010–2014 మధ్య పనిచేశారు. 2016–21 సంవత్సరాల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. -
గిరిజన మహిళల ఆరోగ్యంపై నివేదిక
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల మహిళల సమస్యలపై 2024–2025 యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జాతీయ మహిళా కమిషన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమహిళా కమిషన్ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం, భద్రత, ప్రభుత్వ విధానాలు, మహిళా కమిషన్ల కార్యాచరణపై జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హరియాణలో నిర్వహించిన రెండ్రోజుల జాతీయస్థాయి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి మహిళా కమిషన్ చైర్ పర్సన్లు, సభ్యులు హాజరైన ఈ జాతీయస్థాయి సమావేశంలో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి నివేదికను సమర్పించారు.ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంత మహిళల హక్కులు, అక్షరాస్యత, ఆరోగ్యం, ఆర్ధిక, సామాజిక అవగాహన కార్యక్రమాలు, అనాదిగా కొనసాగుతున్న అనాగరిక ఆచార పద్ధతులపై పలు అంశాలను ఆ నివేదికలో వివరించారు. వెంకటలక్ష్మి మాట్లాడుతూ వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని మాతంగి, బసివిని, జోగిని వంటి అనాగరిక ఆచారాలతో తలెత్తే సమస్యలే పెద్ద సవాల్‌గా మారాయన్నారు. ఈ నివేదికపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ స్పందిస్తూ ఒక్క ఏపీలోనే కాకుండా అన్ని రాష్ట్రాల గిరిజన ప్రాంతాల్లో మహిళా కమిషన్ల సందర్శనతో పాటు అక్కడ మహిళా సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకు జాతీయ మహిళా కమిషన్ తరఫున కొంత నిధిని కేటాయించి రాష్ట్ర కమిషన్లతో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తామని తీర్మానం చేశారు. పనిప్రాంతం (వర్క్‌ప్లేస్)లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013 కింద ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని చైర్పర్సన్ రేఖా శర్మ అన్ని రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్ పర్సన్లకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. కమిషన్ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల పాల్గొన్నారు. -
శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం
పరిగి, సాక్షి న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థి శిరీష మృతిపై మిస్టరీ వీడలేదు. యువతిది హత్యా.. ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాళ్లాపూర్ శివారులోని నీటి కుంటలో ఆదివారం మధ్యాహ్నం శిరీష (19) మృతదేహం లభ్యమైంది. ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉండటం, రెండు కళ్లనూ పొడిచి ఉండటంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పలువురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సోమవారం గ్రామానికి చేరుకున్న వైద్యులు శిరీష మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. యువతి శరీరంపై గాయాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. శిరీషది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి జంగయ్య, బావ అనిల్‌పై వారు మండిపడ్డారు. శిరీష మృతికి వారే కారణమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కల్పించుకుని త్వరలోనే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. తన చెల్లిని చంపిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని మృతురాలి తమ్ముడు శ్రీకాంత్ కోరాడు. పోలీసుల అదుపులో మరో ఇద్దరు శిరీష అంత్యక్రియలు ముగిసిన తర్వాత తండ్రి జంగయ్య, బావ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి తండ్రి జగయ్యను పోలీసులు వదిలేయగా.. బావ అనిల్‌ను విచారిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. కేసు దర్యాప్తులో ఉందని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. మూడు రోజుల్లో రిపోర్టు పంపండి: తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం శిరీష దారుణ హత్యను జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. స్క్రూ డ్రైవర్‌తో బాలిక కళ్లు పీకి, బ్లేడ్‌తో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటనపై ఢిల్లీలోని ఎన్సీడబ్ల్యూ సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. అంతేగాక మూడు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను పంపించాలని తెలంగాణ డీజీపీకి సూచించింది. తెలంగాణలో బాలికలు, యువతులు, మహిళలపై పెరిగిపోతున్న నేరాలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
దుర్గం చిన్నయ్యకు షాక్!.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ అనే యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా శేజల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ క్రమంలో కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, అంతకుముందు బాధితురాలు శేజల్ వేధింపుల అంశంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. ఇక, 15 రోజుల్లో దీనిపై అప్డేట్ ఇవ్వాలని కమిషన్ లేఖలో పేర్కొంది. ఇది కూడా చదవండి: దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్ -
8 ఏళ్లప్పుడు మా నాన్న లైంగికంగా వేధించాడు
చెన్నై/జైపూర్: నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ సంచలన విషయాలు వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రే తనను లైంగికంగా వేధించారని చెప్పారు! ‘మోజో స్టోరీ’ డిజిటల్ వార్తా చానల్ ఇటీవల జైపూర్‌లో నిర్వహించిన ‘వుయ్ ది విమెన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. అమ్మను, నన్ను కొట్టేవాడు. లైంగికంగా వేధించేవాడు. ఒక మగవాడిగా దాన్ని జన్మహక్కుగా భావించేవాడు. నాకు 8 ఏళ్లప్పుడే లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది. ఆపైన ఉన్నవన్నీ తీసేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు’ అని గుర్తు చేసుక్నున్నారు. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైతే అది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు. -
మహిళలపై పెరుగుతున్న అరాచకాలు.. 2022లో 31వేల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: మహిళలపై జరిగిన నేరాలు ఘోరాలకు సంబంధించి 2022లో దాదాపుగా 31 వేల ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. 2014 తర్వాత ఇవే అత్యధికమని తెలిపింది. 2021లో 30,864 ఫిర్యాదులు అందితే , తర్వాత ఏడాదికి స్వల్పంగా పెరిగి 30,957 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినవే ఉన్నాయని, 9,710 వరకు ఆ ఫిర్యాదులేనని గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత గృహ హింసకు సంబంధించి 6,970 కేసులు, వరకట్నం వేధింపులు 4,600 ఫిర్యాదులు అందాయి. ఇదీ చదవండి: సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి -
బాధ్యులపై చర్యలు తప్పవు
ఇబ్రహీంపట్నం రూరల్/ ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనలో బాధ్యులను వదిలిపెట్టేది లేదని జాతీయ మహిళా కమిషన్ కార్యదర్శి మీటా రాజీవ్ లోచన్ హెచ్చరించారు. జాతీయ మహిళా కమిషన్ బృందం శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది. బృందం సభ్యులు వైద్యులతో సమీక్ష నిర్వహించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతారాంపేట్ గ్రామానికి వెళ్లి కు.ని. ఆపరేషన్ వికటించి మృతి చెందిన లావణ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆపరేషన్ జరిగిన సమయం నుంచి.. లావణ్య మరణించే వరకు ఏం జరిగిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా మీటా రాజీవ్ లోచన్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఘటనపై ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. బాధితులకు అందాల్సిన పరిహారంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి నివేదిక అందజేస్తామన్నారు. చివరగా కేంద్ర బృందం రంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుంది. అక్కడ అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో బృందం సభ్యులు సమావేశమయ్యారు. పూర్తిస్థాయిలో విచారణకు వైద్యాధికారులను ఆదేశించాలని.. వివరాలను మహిళా కమిషన్‌కు అందజేయాలని సూచించారు. -
అత్యాచార ఘటనలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన అత్యాచార ఘటన లపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ రాష్ట్ర డీజీపీని పూర్తిస్థాయి నివేదిక కోరింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రంలో వరుసగా జరిగిన ఐదు అత్యాచార ఘటన లపై ఏడు రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని కమిషన్ ఆదేశించింది. ఐదు అత్యాచార ఘటనల్లో ముగ్గురు మైనర్ బాలికలు బాధితులు కావడంతో మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనల్ని సుమోటోగా స్వీకరించినట్లు పేర్కొంది. పోలీస్ శాఖ నేరాలు జరగకుండా చూసుకోవడమేకాక, ఇలాంటి అత్యాచార ఘటనల్లో నిందితులను త్వరితగతిన గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచిం చింది. ఇదే అంశంపై హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్‌కు సైతం మరో లేఖ రాసినట్టు రేఖ శర్మ వెల్లడించారు. -
నిశ్శబ్దం గొంతు విప్పింది!
కోవిడ్ నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ విధించిన కాలం అది. జాతీయ మహిళా కమిషన్‌కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి. ఇవన్నీ గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులే! రోజురోజుకూ ఫిర్యాదుల వరద పెరుగుతుందే తప్ప తగ్గలేదు... ఈ విషయం పుణేకి చెందిన ఫిల్మ్‌మేకర్ దీప్తి గాడ్గేను ఆలోచనల్లోకి తీసుకువెళ్లింది. ‘లాక్డౌన్ సమయంలో ప్రతి ముగ్గురిలో ఒకరు గృహహింసకు గురయ్యారు...అనే విషయం తెలిసినప్పుడు బాధ అనిపించింది. నాలోని బాధను వ్యక్తీకరించడానికే ఈ లఘుచిత్రాన్ని తీశాను’ అని చెబుతుంది దీప్తి. ‘స్వమాన్’ పేరుతో ఆమె తీసిన అయిదు నిమిషాల నిడివిగల షార్ట్‌ఫిల్మ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు... రోమ్‌లో జరిగే గోల్డెన్ షార్ట్ ఫిల్మ్‌ఫెస్టివల్, కాలిఫోర్నియాలో జరిగే ఉమెన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, టోక్యో షార్ట్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. ‘ఇది ఎవరి కథా కాదు. పూర్తిగా కల్పితం’ అని దీప్తి చెబుతున్నప్పటికీ... గృహహింస ఎదుర్కొన్న ఎంతోమంది బాధితుల జీవితానికి దర్పణంగా అనిపిస్తుంది. ఒకరోజు దీప్తి మార్నింVŠ వాక్కు వెళుతున్నప్పుడు ఒక మహిళ రోడ్డుపక్కన దిగాలుగా కూర్చొని ఉంది. పెద్దింటి మహిళ అని ఆమె ఆహార్యం సూచిస్తుంది. రాత్రంతా నిద్ర లేనట్లు కళ్లు చెబుతున్నాయి. ఉండబట్టలేక...‘మీకు ఏమైనా సహాయం చేయగలనా?’ అని అడిగింది. ‘లేదు’ అంది ఆమె ముక్తసరిగా. కాస్త ముందుకు వెళ్లిన దీప్తి వెనక్కి తిరిగిచూస్తే... ఆమె కనిపించలేదు! ఆ బాధితురాలి గురించే ఆలోచిస్తూ నడుస్తోంది...ఆమె బాధితురాలు అనేది కాదనలేని వాస్తవం. అయితే ఆమెకు తాను ఎదురొన్న హింస గురించి చెప్పుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే పరువు సమస్య. గృహహింస ఎదుర్కొంటున్న వాళ్లలో చాలామంది మహిళలు ‘లోకం ఏం అనుకుంటుందో!’ ‘భర్తపై ఫిర్యాదు చేస్తే పిల్లల భవిష్యత్ ఏమిటీ’... ఇలా రకరకాల కారణాలతో రాజీ పడుతుంటారు. ఈ ధోరణి గృహహింసను మరింత పెంచుతుంది. తన ఆలోచనలకు అయిదునిమిషాల వ్యవధిలో చిత్రరూపం ఇవ్వడం అనేది కత్తి మీద సామే. అయితే ‘స్వమాన్’ రూపంలో ఆ పని విజయవంతంగా చేసి శభాష్ అనిపించుకుంది దీప్తి. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా షార్ట్‌ఫిల్మ్‌కు చక్కటి ప్రశంసలు లభించడం ఒక ఎత్తయితే, సామాన్య మహిళల మెప్పు పొందడం అనేది మరో ఎత్తు’ అంటుంది ఈ లఘుచిత్ర నిర్మాణ బాధ్యతలు చూసిన డా.అనిత. ‘కథలో నాటకీయతకు తావు ఇవ్వకూడదు అనుకున్నాను. చిన్న సంభాషణ లు మాత్రమే ఉపయోగించాను. ఇందులో కథానాయిక ఆశ గృహ హింస ను ఎదుర్కొంటుంది. అందరిలాగే తనలో తాను కుమిలిపోతుంది. చివరికి మాత్రం గొంతు విప్పి గర్జిస్తుంది. ఈ చిత్రం చూసి ఒక్క మహిళ స్ఫూర్తి పొందినా నేను విజయం సాధించినట్లే’ అంటుంది దీప్తి. -
ఆ ఘటన మహిళలకు తీవ్ర అవమానకరం.. ఎన్సీడబ్ల్యూ తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ: రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష సందర్భంగా బికనీర్ జిల్లాలోని ఓ కేంద్రం బయట మహిళా అభ్యర్థి ధరించిన టాప్ పొడుగు చేతులను పురుష సిబ్బంది ఒకరు కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు మహిళలను ఘోరంగా అవమానించడమేనని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల సోదా కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించకపోవడంపై వివరణ అడిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఒక అభ్యర్థిని ధరించిన పొడుగు చేతుల టాప్‌ను పురుష గార్డు కత్తెరతో కట్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. (చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు) -
ముంబైకి జాతీయ మహిళా కమిషన్ బృందం
ముంబై: ముంబైలో ఇటీవల ఓ మహిళపై పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వ్యవహారంపై కేంద్ర జాతీయ మహిళా కమిషన్ బృందం ముంబై చేరుకుంది. బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించిందని పోలీసులు వెల్లడించారు. నగరంలోని సాకినాక ప్రాంతంలో నివాసముంటున్న బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని రాజవాది ఆస్పత్రికి వెళ్లారు. బాధితురాలు మరణించే వరకు అక్కడే 36 గంటల పాటు ప్రాణాల కోసం పోరాడారు. అక్కడ వైద్యుల నుంచి పలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సాకినాక పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లారు. కేసుకు సంబంధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యాచార కేసుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ సంజయ్ పాండేని కలిసిందని అధికారులు వెల్లడించారు. ఆర్థిక రాజధానిలో జరిగిన ఈ ఘటన 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచారంలాగే అత్యంత అమానవీయంగా జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. -
మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా...జాతీయ హెల్ప్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా ఏర్పాటు చేసిన జాతీయ హెల్ప్‌లైన్ నంబరు 7827170170ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆవిష్కరించారు. 24 గంటలూ పనిచేసే ఈ హెల్ప్‌లైన్‌ను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఏర్పాటు చేసింది. అలర్లు, హింసాకాండ బాధిత మహిళలకు ఆన్లెన్ ద్వారా సహాయం అందించేందుకు, వారికి అండగా నిలిచేందుకు ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటైంది. పోలీసు యంత్రాంగం, ఆసుపత్రులు, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ, మానసిక నిపుణుల సేవలు తదితర సదుపాయాలతో ఈ నంబరును అనుసంధానం చేయడం ద్వారా బాధిత మహిళలకు భద్రత కల్పించనున్నారు. -
Twitter: అసభ్య సమాచారం తొలగించండి
న్యూఢిల్లీ: ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ నుంచి అసభ్య, పోర్నోగ్రఫిక్ డేటాను వారంలోగా పూర్తిగా తొలగించాలని జాతీయ మహిళ కమిషన్ బుధవారం ఆ సంస్థను ఆదేశింంది. అలాగే, దీనికి సంబంధిం సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలని కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. కొన్ని ట్విటర్ ఖాతాలు అసభ్య వీడియోలు, సందేశాలను షేర్ చేస్తున్న విషయాన్ని గుర్తించామని, వీటిని తొలగించాలని ఆదేశిస్త ట్విటర్ ఎండీకి లేఖ రాశామని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా ఖాతాల వివరాలను కూడా అందించామని పేర్కొంది. గతంలోనూ ఇదే తరహాలో కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ట్విటర్ పట్టించుకోకపోవడం గమనార్హం. -
క్యాష్ ఇస్తారా? కేటాయిస్తారా?
ఇది సామాన్యుల బడ్జెట్ అని, ఇది రైతుల బడ్జెట్ అని, ఇది వ్యాపారుల బడ్జెట్ అని, ఇది ఉద్యోగుల బడ్జెట్ అని ఏటా ఏదో ఒక వ్యాఖ్యానం వినిపిస్తుంది. ఈసారి మాత్రం ఇది పూర్తిగా ‘మహిళా బడ్జెట్’ అవవలసిన అవసరమైతే ఉంది. కొద్ది గంటల్లో బడ్జెట్! కష్టకాలంలో వస్తున్న బడ్జెట్. కరోనా వల్ల అందరూ కష్టపడ్డారు. అందరికన్న ఎక్కువ కష్టం అనుభవించింది మహిళలు, బాలికలు, బాలలే! లాక్డౌన్ సమయంలో వారికి రక్షణ, భద్రత లేకుండా పోయాయి. వారిపై లైంగిక హింసకు అడ్డు లేకుండా పోయింది! సొంత ఇంట్లోనే వారికొక ‘స్పేస్’ కరువై పోయింది. ఆ స్పేస్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ఇవ్వబోతున్నారా? లైంగిక హింసను నిరోధించడానికి కొత్త విధానాలు, కేటాయింపులు బడ్జెట్లో ఏమైనా ఉంటాయా? అయితే అవి ఎలాంటివి అయి ఉంటాయి?! ధీమా కోసం మహిళల కొంగుకు పది రూపాయలు ముడేస్తారా? భారీ నిధుల ప్రణాళిలతోనే ధైర్యం కల్పిస్తారా? స్త్రీ శిశు సంక్షేమానికి యేటా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. ఈసారి సంక్షేమం కన్నా కూడా లైంగిక హింస నుంచి మహిళలకు రక్షణ, భద్రత కల్పించడానికి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరాన్ని కరోనా కలిగించింది. ఈ సంగతి బడ్జెట్ వేసే వాళ్ల దృష్టికి చేరనిదేమీ కాదు. నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇండియా లాక్డౌన్లో ఉన్న సమయంలో ఒక్క జూన్ నెలలోనే మహిళలు, బాలలపై లైంగిక నేరాలు జరిగినట్లు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కు 2043 ఫిర్యాదులు అందాయి! ఇక పిల్లలపై జరిగిన హింసకైతే అంతే లేకుండా పోయింది. లాక్ డౌన్ మొదలైన తొలి 11 రోజుల్లో చైల్డ్ హెల్ప్ లైన్‌కు 3 లక్షల కాల్స్ వెళ్లాయి! కరోనా పరిస్థితులు తెచ్చిపెట్టిన మానసిక ఒత్తిడి కారణం గా మహిళలు, బాలలు లాక్డౌన్ మొత్తం క్షణక్షణం భయం భయం అన్నట్లుగానే గడిపారని మరికొన్ని నివేదికలు వచ్చాయి. స్కూళ్లు మూత పడటం, ఆన్లైన్ చదువులకు సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఇరవై నాలుగు గంటలూ ఒకరి కళ్లెదురుగా ఒకరు ఉండిపోవడం, అభిప్రాయభేదాలు, అనవసర ఘర్షణలు, దంపతుల మధ్య మనస్పర్థలు అన్ని కలసి మహిళలు, పిల్లలపైనే దుష్ప్రభావం చూపించాయని స్వచ్ఛంద సంస్థల సర్వే నిపుణులు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఆర్థిక శాఖకు, పోలీసు శాఖకు తమ నివేదికలను అందించారు. ఆ సమాచారం ఆధారంగానైనా నేటి బడ్జెట్లో మహిళలు బాలల భద్రతకు, రక్షణకు మరింతగా నిధులను కేటాయించడం, కొత్తగా ప్రభుత్వ విధానాలను రూపొందించడం వంటివి ఉండొచ్చని, ఉంటే బాగుంటుందని ఒక ఆశ, ఒక ఆకాంక్ష ఈసారి వ్యక్తం అవుతోంది. ∙∙ మహిళా సంక్షేమం కోసం ఇప్పటికే అనేక చట్టాలు, శాసనాలు, పథకాలు, ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. మళ్లీ కొత్తగా బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి అనే సందేహాన్ని రానివ్వనంతగా మహిళల జీవితాన్ని దుర్భరం చేసేసింది లాక్డౌన్. వారి ఉద్యోగాలు పోయాయి. ఉపాధులు కొండెక్కాయి. ఇంటెడు చాకిరి కొండంతైంది. ఇంట్లో హింస పెరిగింది. పర్యవసానంగా మహిళల ఆరోగ్యం క్షీణించింది. శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు. అంతకన్నా దారుణం వారికి వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, కరోనా కాలపు అగమ్యగోచరం రెండూ కలిసి మహిళల్ని జీవచ్ఛవాలను చేశాయి. ఈ దుస్థితి నుంచి వారిని తెరిపిన పడేసే ప్రాధాన్యాలు, నిధులు బడ్జెట్లో లేకుంటే.. స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికి ఉన్న మహిళల శ్రమ శక్తి వాటా పదిహేడు శాతానికంటే తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గత శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును కనీసం 11 శాతానికైనా పెంచుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం అందుకు అవసరమైన మహిళల శక్తి సామర్థ్యాలను, వాళ్లకు కల్పించవలసిన రక్షణ భద్రతలను కూడా గుర్తించి నేటి బడ్జెట్‌కు తుది రూపును ఇచ్చి ఉంటుందనే అనుకోవాలి. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడూ మహిళలపై జరిగే లైంగిక నేరాలను తగ్గించే విషయంలో పరోక్షమైన పాత్రను వహిస్తాయి. షెల్టర్ హోమ్‌లు ప్రత్యక్ష నరక కూపాల నుంచి కాపాడతాయి. ఈ హోమ్‌ల సంఖ్య పెంచేందుకు, సమర్థవంతంగా వాటిని నిర్వహించేందుకు అవసరమైన నిధులు కూడా ఈ బడ్జెట్లో ఉండాలని సూచిస్తున్న ఆర్థిక రంగ నిపుణులు.. ‘క్యాష్ బేస్డ్ సోషల్ ప్రొటెక్షన్’ ని కూడా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో కల్పించవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. క్రమం తప్పకుండా మహిళల అకౌంట్లో కొంత డబ్బును విధిగా జమ చేయడమే నగదు రక్షణ విధానం. గ్రామీణ ప్రాంత మహిళల సంక్షేమానికి, లైంగిక హింస నుంచి రక్షణకు ఈ మనీ ట్రాన్స్ఫర్ చాలా వరకు తోడ్పడుతుంది. పై పెచ్చు వారికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. దీనిపైన కూడా ఇవాళ్టి బడ్జెట్లో విధానం నిర్ణయమై ఉంటుందని నేషనల్ ఉమెన్ కమిషన్ అంచనా వేస్తోంది. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
‘కొడుకు కోసం ఐదుగురు కూతుళ్లను కన్నారు’
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు భారతీయ జనతా పార్టీని విమర్శించబోయి తానే స్వయంగా చిక్కుల్లో పడ్డారు. దీంతో జాతీయ మహిళా కమిషన్ ఆయన మీద కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జీతు పట్వారీ బుధవారం 2014,19 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించిన ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ నినాదాన్ని విమర్శించే ఉద్దేశంతో.. ‘ప్రజలు ఒక కొడుకు కోసం ఆశతో ఉన్నారు. కాని వారికి లభించింది ఐదుగురు కుమార్తెలు. కూతుళ్లందరూ జన్మించారు కాని వికాస్ అనే కుమారుడు ఇంకా పుట్టలేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ వికాస్(అభివృద్ధి)ని కుమారుడితో పోల్చగా.. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పథకాలను కుమార్తెలుగా పోల్చారు. దాంతో నెటిజనులు జీతు పట్వారీని విపరీతంగా ట్రోల్ చేశారు. (‘విపత్తు వేళ చౌకబారు రాజకీయాలు’) అయితే జరగాల్సిన నష్టం అంతా జరిగాక మేల్కొన్న జీతు పట్వారీ.. కుమార్తెలను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని.. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే అందుకు తాను చింతిస్తున్నానని క్షమించమని కోరారు. కుమార్తెలను తాను దైవంగా భావిస్తానని తెలిపారు. అంతేకాక మోదీ నోట్లరద్దు, జీఎస్టి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మాంద్యంతో దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచారన్నారు. ప్రజలు వీటన్నింటిని అభివృద్ధి ఆశతో మాత్రమే భరించారని తెలిపారు. బీజేపీ బలహీనతలను ఎత్తి చూడమే తన ఉద్దేశమని.. బీజేపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని జీతు పట్వారీ ఆరోపించారు. జీతు పట్వారీపై విరుచుకుపడిన వారిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు మహిళలను దారుణంగా అవమానించారని.. దీనికి సోనియా గాంధీ ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దేశ ప్రజలు రాణి దుర్గావతి త్యాగాన్ని స్మరించుకుంటున్నారని.. ఇలాంటి సమయంలో ‘కొడుకు కోసం ఎదురు చూస్తే.. ఐదుగురు కుమార్తెలు జన్మించారు’ అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నాయకుల నీచ మనస్తత్వానికి నిదర్శనం అన్నారు. కుమార్తెలు పుట్టడం నేరమా అని చౌహాన్ ప్రశ్నించారు. సోనియా గాంధీ.. జీతు పట్వారీకి ఆడవారిని అవమానించే పని అప్పగించారా ఏంటి అని ఆయన విమర్శించారు. (కొత్త సారథి కావలెను) జీతు పట్వారీ ట్వీట్ పట్ల జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఇందుకు అతను సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రకమైన మనస్సు ఉన్న వారు తమను తాము నాయకులుగా భావించుకోవడం విచారకరమన్నారు. ఇలాంటి మనస్తత్వంతో వారు తమ అనుచరులకు ఏం బోధిస్తున్నారు అని ప్రశ్నించారు. -
టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలి: ఎన్సీడబ్ల్యూ
న్యూ ఢిల్లీ : అసభ్యకరమైన వీడియోలతో యువతను టిక్‌టాక్ పెడదోవ పట్టిస్తుందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ ధ్వజమెత్తారు. టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు. సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను యువత అత్యంత ఎక్కువ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. సరాదా కోసం వినియోగించే టిక్‌టాక్ ప్రస్తుతం హింసను రెచ్చగొట్టే విధంగా తయారవుతోంది. మహిళలపై అత్యాచార వీడియోలు యాసిడ్ దాడులను ప్రోత్సహించే విధంగా టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు తాజిందర్ సింగ్ బగ్గా చేసిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. (వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్! ) I am of the strong openion that this @TikTok_IN should be banned totally and will be writting to GOI. It not only has these objectionable videos but also pushing youngsters towards unproductive life where they are living only for few followers and even dying when no. Decline. https://t.co/MyeuRbjZAy — Rekha Sharma (@sharmarekha) May 19, 2020 టిక్‌టాక్‌లో అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేయడంతోపాటు హింసను ప్రేరేపిస్తున్నారని రేఖ శర్మ మండిపడ్డారు. టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. కాగా యాసిడ్ దాడులను ప్రోత్సహించే విధంగా టిక్‌టాక్ కంటెంట్ క్రియేటర్ ఫైజల్ సిద్దిఖీ వీడియో పోస్ట్ చేశారు. ఇతనికి 13.4 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. ఈ క్రమంలో ఇలాంటి అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా సమాజంపై చెడు ప్రభావం పడుతుందని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. ఫైజల్ చేసిన పోస్ట్‌ను వెంటనే తొలగించాలని ఎన్సీడబ్ల్యూ డిమాండ్ చేసింది. (మహేశ్ జిమ్ బాడీ చూసి ఫ్యాన్స్ ఫిదా! ) సల్మాన్‌ను టార్గెట్ చేసిన సింగర్ సోనా @NCWIndia has written to @DGPMaharashtra Shri. Subodh Kumar Jaiswal to take action against #FaizalSiddiqui for the video he posted that promotes a grievous crimes of #acidattack on social media using @TikTok_IN App. @CyberDost @MahaCyber1 pic.twitter.com/pcjyXtGiJG — NCW (@NCWIndia) May 18, 2020 -
లాక్డౌన్ ఎంత పనిచేసింది?
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా బాధితులతో పాటు గృహహింస కేసులు పెరిగిపోతున్నాయి. మార్చి 24 దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి మహిళలపై గృహహింస ఎక్కువయినట్టు జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) వెల్లడించింది. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న భర్తలు నిరాశతో తమ ప్రతాపాన్ని భార్యలపై చూపిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 23 నుంచి 30 వరకు 58 ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. వీటిలో ఎక్కువగా ఉత్తర భారత్ నుంచి రాగా, పంజాబ్ నుంచి అధికంగా వచ్చాయని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ‘గృహ హింస ఫిర్యాదులు సంఖ్య పెరిగింది. పని లేకుండా ఇంట్లో గడపాల్సి రావడంతో పురుషులు నిరాశకు గురవుతున్నారు. తమ నిరాశను మహిళలపై చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ పంజాబ్‌లో ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే పంజాబ్ నుంచి మాకు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయ’ని రేఖా శర్మ వివరించారు. అయితే పంజాబ్ నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనేది వెంటనే వెల్లడి కాలేదు. (పరిమళించిన మానవత్వం) ఫోన్లు కూడా చేస్తున్నారు తమకు అందిన 58 ఫిర్యాదులు ఈ-మెయిల్ వచ్చాయని రేఖా శర్మ చెప్పారు. మొత్తం ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో ఉండే అవకాశముందన్నారు. సమాజంలో దిగువ శ్రేణిలోని మహిళల నుంచి పోస్ట్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు వచ్చినందున వాస్తవ సంఖ్య అధికంగానే ఉండొచ్చని చెప్పారు. గృహ హింస ఎదుర్కొంటున్న చాలా మంది మహిళలకు ఈ-మెయిల్ పంపించడం తెలియక పోస్ట్ ద్వారా ఫిర్యాదులు పంపిస్తున్నారని తెలిపారు. అయితే లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోస్టు ద్వారా వచ్చే ఫిర్యాదులు కూడా తగ్గాయన్నారు. గృహహింస ఫిర్యాదులు తమకు కూడా ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్రాల మహిళా కమిషన్లు తెలిపాయని చెప్పారు. గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు.. పోలీసులను లేదా రాష్ట్ర మహిళా కమిషన్లను సంప్రదించాలని సూచించారు. బాధితురాళ్ల నుంచి పెద్ద సంఖ్యలో తమకు ఫోన్లు వస్తున్నాయని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. కాగా, గృహ హింసకు సంబంధించి ఎన్సీడబ్ల్యూకు మార్చి 23 వరకు ఈ-మెయిల్ ద్వారా 291 ఫిర్యాదులు వచ్చాయి. ఫిబ్రవరిలో 302, జనవరిలో 270 ఫిర్యాదులు అందాయి. కాపాడమంటూ వేడుకున్న తండ్రి కూతురు, అల్లుడు బారి నుంచి తనను కాపాడాలంటూ రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతం నుంచి ఓ తండ్రి తమను అభ్యర్థించాడని రేఖా శర్మ వెల్లడించారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి అన్నం పెట్టకుండా తనను కూతురు వేధిస్తోందని ఆయన ‘పీటీఐ’కి తన గోడు వెల్లబోసుకున్నారు. ఆయన అల్లుడు టీచర్‌గా పనిచేస్తుండటం గమనార్హం. (కరోనా: తప్పిన పెనుముప్పు!) -
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనతో తనకు సంబంధం లేదని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని కోమల్ శర్మ పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోలో కనిపించింది తాను కాదంటూ జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. జనవరి 5న జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు మరో 37 మందిని అనుమానితులుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీసీటీవీ పుటేజీలు, వాట్సప్‌లో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా.. ముసుగులు ధరించి హాస్టల్లో దాడికి పాల్పడిన ఓ యువతిని.. ఢిల్లీ యునివర్సిటీకి చెందిన విద్యార్థిని కోమల్ శర్మగా పోలీసులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన వార్తలు, సదరు విద్యార్థిని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.(జేఎన్‌యూ హింస: ముసుగు ధరించింది ఆమేనా!?) ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన కోమల్ మాట్లాడుతూ.. ‘ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. నన్ను కావాలనే అందులో ఇరికించారు. దురుద్దేశంతో.. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పరిస్థితి అధ్వానంగా తయారైంది. బంధువులు, స్నేహితుల నుంచి అధిక సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ వీడియోలో మాస్క్ ధరించి ఉన్నది నేనే అని.. నా గురించి చెడుగా అనుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జేఎన్‌యూ ఘటనపై ఓ జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీవీపీకి చెందిన విద్యార్థులే దాడి చేసినట్టు వెల్లడయిన విషయం తెలిసిందే. అక్షత్ ఆవాస్థీ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు నాయకత్వం వహించింది తానేనని వీడియో ముందు ఒప్పుకున్నాడు. అంతేకాదు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై ప్రతీకారం తీర్చుకునేందుకు హాస్టల్ బయట నుంచి కొంతమంది వ్యక్తులను లోపలికి తీసుకెళ్లి ఈ దాడికి పాల్పడ్డటు కూడా అంగీకరించాడు. ఆయితే అవాస్థీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏబీవీపీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
పోలీసుల తీరుపై మహిళా కమిషన్ అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ప్రియాంకపై లైంగికదాడి, హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్య్లూ) స్పందించింది. జరిగిన ఘటన చాలా దారుణమని కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ అభివర్ణించారు. ప్రియాంక అదృశ్యమవగానే పోలీసులు స్పందించిన తీరుపైనా ఆమె ట్వీట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మాయి కనిపించకండా పోగానే వెతకకుండా ఎవరితోనో వెళ్లిపోయిందని ఎలా నిందిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రియాంక హత్య కేసులో దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు, కేసు త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకునేలా పోలీసులతో స్వమన్వయం చేసుకునేందుకు తమ ప్రతినిధులను పంపనున్నట్లు తెలిపారు. సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, తెలంగాణ సీఎంవో కార్యాలయానికి సూచించారు. ఊహే భయానకంగా ఉంది: రాహుల్ ప్రియాంక హత్య తనను తీవ్రంగా కలచివేసిం దని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. ఒక మనిషి సాటి మనిషిపై ఇంత క్రూరంగా ఎలా దాడికి పాల్పడతాడనేది ఊహే భయానకంగా ఉందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్’ వివాదం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్-3’ వివాదం ఢిల్లీకి చేరింది. ఈ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ.. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. వెంటనే ఈ షో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానికి సంబందించిన వీడియోను కూడా విడుదల చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదును కమిషన్ స్వీకరించిందని శ్వేతారెడ్డి పేర్కొన్నారు. హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన ఓయూ జేఏసీ బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలివేయాలని కోరుతూ ఓయూ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేసింది. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో షోను రద్దు చేయాలని కోరారు. ఒకవేళ షో నిర్వహించాల్సి వస్తే.. మహిళలపై వేధింపులు, అసభ్యకరమైన సన్నివేశాలు లేవని నిరూపించిన తర్వాతే షో వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో షో నిర్వాహకుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే ఈ షోపై శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ రియాలిటీ షోను నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ఇప్పటికే ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. బిగ్ బాస్ షో ప్రదర్శన వల్ల యువత చెడిపోతుందంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
రాహుల్‌కు మహిళా కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై అనైతిక వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) గురువారం నోటీసులు జారీ చేసింది. జైపూర్‌లో ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో రాహుల్ నిర్మలా సీతారామన్‌పై వ్యాఖ్యలు చేశారు. ‘పార్లమెంట్లో రఫేల్ ఒప్పందం గురించి చర్చ జరిగే సమయంలో ప్రధాని మోదీ పారిపోయి తనను కాపాడమని ఓ మహిళ (నిర్మలా సీతారామన్)ను కోరారు. ఆయన తనను తాను కాపాడుకోలేకపోయారు’అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ రాహుల్‌కు నోటీసులు ఇచ్చింది. -
భర్తల గోడు చెప్పుకునేందుకు ‘పురుష్ ఆయోగ్’..!
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలు, భార్యల చేతిలో ఇబ్బందులకు గురవుతున్న పురుషులకు కూడా తమ గోడు చెప్పుకునేందుకు ఓ కమిషన్ ఉండాలని బీజేపీ ఎంపీలు హరినారాయణ్ రాజ్‌బిహార్, అన్షుల్ వర్మ అన్నారు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ భర్తలకు చుక్కలు చూపెడతున్న భార్యల నుంచి రక్షణ పొందేందుకు ‘పురుష్ ఆయోగ్’ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మగవారి బాధలు చెప్పుకునేందుకు సరైన వేదిక లేనందున ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పురుష్ ఆయోగ్ ఏర్పాటుకు మద్దతు కూడగట్టేందుకు సెప్టెంబర్ 23న సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తామని పేర్కొన్నారు. డిమాండ్ ఓకే.. కానీ, అనవసరం.. ప్రతి ఒక్కరికి తమ డిమాండ్లను లేవనెత్తే హక్కు ఉంటుందని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్) శనివారం వెల్లడించిన నేపథ్యంలో.. పురుషులకు కూడా ఒక కమిషన్ ఉండాలని కోరుతున్నట్టు ఎంపీలు వివరించారు. అయితే, పురుషుల కోసం ఎలాంటి కమిషన్ ఏర్పాటు అవసరం లేదని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ చెప్పడం విశేషం. సెక్షన్ 498ఎ సవరించాలి.. దాడులు, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు ఐపీసీలోని సెక్షన్ 498ఎ రక్షణ కల్పిస్తోంది. అయితే, కొందరు మహిళలు ఈ సెక్షన్‌ను ఆసరాగా చేసుకుని వారి భర్తలు, అత్తింటివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ వర్మ అన్నారు. తప్పుడు కేసుల మూలంగా 1998 నుంచి 2015 వరకు 27 లక్షల మంది అరెస్టయ్యారని తెలిపారు. 498-ఎను సవరిస్తే తప్పుడు కేసులు నమోదు కావని అన్నారు. కాగా, తప్పుడు ఫిర్యాదులతో మగవారిపై కేసుల నమోదు సంఖ్య పెరిగిందని గతేడాది కేంద్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మేనకా గాంధీ పేర్కొనడం గమనార్హం. -
హదియా నవ్వుతోందిగా...
సాక్షి, తిరువనంతపురం : కేరళ లవ్ జిహాద్ కేసులో బాధితురాలిని తండ్రి హింసిస్తున్నాడన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మహిళా సంఘం స్పష్టత ఇచ్చింది. సోమవారం జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు కొట్టాయంలోని వైకోమ్ గ్రామంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం బృందం ప్రతినిధి రేఖా శర్మ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆమె చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంది. తండ్రి ఆమెను హింసిస్తున్నాడన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. యువతి తల్లితో కూడా మేం మాట్లాడాం. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు రక్షణగా ఉన్నారు. ఆమె భద్రతకు వచ్చిన ముప్పేం లేదు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ముందు తాను జరిగిందంతా వివరిస్తానని యువతి మాతో చెప్పింది‘‘ అని రేఖా వివరించారు. చివర్లో ఆమె తన సెల్లో హదియా నవ్వుతున్న ఫోటోలను మీడియాకు చూపించటం విశేషం. కాగా, ఇన్నాళ్ల ఈ కేసులో ఉన్నతాధికారులు ఆమెను కలవటం ఇదే తొలిసారి. హదియాను తండ్రి దగ్గరే ఉండాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఉద్యమకారుడు రాహుల్ ఈశ్వర్ రెండు వీడియోలను విడుదల చేయగా.. అందులో తనను తండ్రి హింసిస్తున్నాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ వీడియో ఆధారంగా హదియా భర్త షఫిన్ జెహాన్ సుప్రీంలో తాజాగా ఓ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. అఖిల అశోకన్ అనే యువతి గతేడాది డిసెంబర్లో మతమార్పిడి చేసుకుని మరీ షెఫీన్‌ను వివాహం చేసుకోవటం.. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘‘లవ్ జిహాద్ కేసు’’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూడగా.. తండ్రి చెంత ఉన్న యువతిని వచ్చే నెల 27న సుప్రీంకోర్టులో హాజరుపరచాలంటూ కేరళ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. -
ఎన్సీడబ్ల్యూ బహిరంగ విచారణ
హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)కు అందిన ఫిర్యాదులపై కమిషన్ సభ్యురాలు సుష్మా సాహు గురువారం బహిరంగ విచారణ చేపట్టారు. 2016-17 కాలంలో సైబర్ క్రైం, గృహహింసకు సంబంధించి నమోదైన 58 కేసుల పరిష్కారంపై విచారణ చేపట్టి 30 వరకు కేసులను పరిష్కారించారు. మరో 10 కేసులపై విచారణ కొనసాగుతోంది. వీటితోపాటు మరో 18 కేసులు హైదరాబాద్ న్యాయ అధికారుల పరిధికి మించినవి. తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్టు పెళ్లిళ్లు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని సుష్మా తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ స్వాతి లక్రా పాల్గొన్నారు.