జాతీయస్థాయి సదస్సులో సమర్పించిన ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వెంకట లక్ష్మి
త్వరలో గిరిజన గ్రామాల సందర్శనకు ఉమ్మడి ప్రణాళిక
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల మహిళల సమస్యలపై 2024–2025 యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జాతీయ మహిళా కమిషన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమహిళా కమిషన్ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం, భద్రత, ప్రభుత్వ విధానాలు, మహిళా కమిషన్ల కార్యాచరణపై జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హరియాణలో నిర్వహించిన రెండ్రోజుల జాతీయస్థాయి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి మహిళా కమిషన్ చైర్ పర్సన్లు, సభ్యులు హాజరైన ఈ జాతీయస్థాయి సమావేశంలో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి నివేదికను సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంత మహిళల హక్కులు, అక్షరాస్యత, ఆరోగ్యం, ఆర్ధిక, సామాజిక అవగాహన కార్యక్రమాలు, అనాదిగా కొనసాగుతున్న అనాగరిక ఆచార పద్ధతులపై పలు అంశాలను ఆ నివేదికలో వివరించారు. వెంకటలక్ష్మి మాట్లాడుతూ వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని మాతంగి, బసివిని, జోగిని వంటి అనాగరిక ఆచారాలతో తలెత్తే సమస్యలే పెద్ద సవాల్‌గా మారాయన్నారు.
ఈ నివేదికపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ స్పందిస్తూ ఒక్క ఏపీలోనే కాకుండా అన్ని రాష్ట్రాల గిరిజన ప్రాంతాల్లో మహిళా కమిషన్ల సందర్శనతో పాటు అక్కడ మహిళా సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకు జాతీయ మహిళా కమిషన్ తరఫున కొంత నిధిని కేటాయించి రాష్ట్ర కమిషన్లతో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తామని తీర్మానం చేశారు.
పనిప్రాంతం (వర్క్‌ప్లేస్)లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013 కింద ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని చైర్‌పర్సన్ రేఖా శర్మ అన్ని రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్ పర్సన్‌లకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. కమిషన్ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment