పకడ్బందీగా మహిళల రక్షణ చట్టాల అమలు
సాక్షి, హైదరాబాద్: మహిళా హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఉన్న వివిధ చట్టాలను పకడ్బందీగా, మరింత ప్రభావవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ రంగాల ప్రతినిధులు జాతీయ మహిళా కమిష న్‌కు సూచించారు. మహిళలు ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లు, సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్‌క్రైమ్‌కు ఎక్కువగా మహిళలే గురవుతున్నందున, వాటిని అదుపు చేసేందుకు నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలనే సూచనలు చేశారు.
విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో మహిళలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వ్యవసాయ రంగంలోని మహిళల హక్కులను గుర్తించి సహాయ చర్యలను చేపట్టాలని, ఇళ్లల్లో పనిచేసే పనిమనుషుల సంక్షేమానికి, వివిధరూపాల్లో మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు గృహహింస చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో జాతీయ, తెలంగాణ మహిళా కమిషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ మహిళా విధానం-2016 ముసాయిదాపై దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపుల ప్రక్రియ నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరిల నుంచి మహిళాహక్కులు, సమస్యలపై పనిచేస్తున్న ఎన్జీవోలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు, వివిధ సంఘాల ప్రతినిధులు, నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యకార్యదర్శి ప్రీతిమదన్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా ముసాయిదా జాతీయవిధానాన్ని గురించి వివరించారు. గురువారం సాయంత్రంలోగా జాతీయ మహిళా కమిషన్‌కు ముసాయిదా మార్పులు, చేర్పులపై తమ సలహాలు, సూచనలు తెలియజేస్తే, వాటిని పరిశీలించి జాతీయ విధానంలో చేరుస్తామని ప్రీతిమదన్ తెలిపారు. సమావేశంలో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్న పనేని రాజకుమారి, కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కేసీ రోసా కుట్టి, రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రశాంతి, డెరైక్టర్ విజేంద్ర బోయి తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ రిజర్వేషన్లు రాలేదా: ప్రీతిమదన్
లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఎప్పుడు వాస్తవరూపం దాల్చుతాయో తెలియడం లేదని త్రిపురాన వెంకటరత్నం వ్యాఖ్యానించగా, ఈ రిజర్వేషన్లు వచ్చాయి కదా అని ప్రీతిమదన్ ప్రతిస్పందించారు. రాజకీయ రిజర్వేషన్లు ఎక్కడ వచ్చాయంటూ ఆమె వ్యాఖ్యలను త్రిపురానతోపాటు పలువురు విభేదించారు. దీనితో ఆమె సర్దుకుని పోటీ పడి హక్కులు సాధించుకోవాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి, మెరుగైన వైద్యంపై దృష్టి పెట్టాలని రమా మెల్కోటె సూచించారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఉమాపతి సూచించారు. గ్రామ పంచాయతీలలోనే వీటిని అరికట్టేలా ప్రత్యేకచర్యలు, రైళ్లలో వీరి రవాణాను అడ్డుకునేందుకు టీసీలను భాగస్వాములను చేయాలన్నారు.