బడ్జెట్ స్వరూపంపై ప్రధాని మోదీ పరోక్ష సంకేతం
సాక్షి, న్యూఢిల్లీ: పేదలు, మధ్య తరగతి ప్రజలపై సంపదల దేవత లక్ష్మీదేవి కటాక్షం చూపాలని తాను ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా వర్గాలకు లక్ష్మీదేవి ప్రత్యేకంగా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ బడ్జెట్‌లో పేదలు, మధ్య తరగతితోపాటు మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నారు.
వారిపై వివక్ష అంతం కావాలని ఆకాంక్షించారు. మహిళల గౌరవాన్ని పెంచే చర్యలు చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే మహిళల సాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరంచారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పలు చరిత్రాత్మక బిల్లులు, ప్రతిపాదనలపై చర్చించబోతున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. దేశాన్ని మరింత బలోపేతం చేసే చట్టాలు రాబోతున్నాయని పేర్కొన్నారు.
యువ ఎంపీలే విధాన రూపకర్తలు
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఎదిగేందుకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు విశ్వాసాన్ని, శక్తిని నింపుతాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఈ తీర్మానాన్ని సమష్టిగా నెరవేరుస్తారని ఆయన నొక్కి చెప్పారు. మూడో దఫా ప్రభుత్వంలో భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా సమగ్ర అభివృద్ధి దిశగా మిషన్ మోడ్‌లో ముందుకు సాగుతోందని, ఆవిష్కరణలు, చేరికలు, పెట్టుబడులు స్థిరంగా దేశ ఆర్థిక రోడ్‌మ్యాప్‌కు పునాదిగా ఉన్నాయని పేర్కొన్నారు.
దేశాన్ని బలోపేతం చేసే చట్టాలకు దారితీసే అనేక చరిత్రాత్మక బిల్లులు, ప్రతిపాదనలు ఈ సెషన్‌లో చర్చిస్తామన్నారు. స్త్రీల గౌరవాన్ని పెంచేలా, ప్రతి మహిళకు సమాన హక్కులు కల్పించడంతోపాటు మతపరమైన చిచ్చుల , వర్గ విభేదాలు లేకుండా చేయడం.. తమ ప్రా«థామ్యాలని ఆయన నొక్కిచెప్పారు. ఈ లక్ష్య సాధన దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వేగవంతమైన అభివృద్ధిని సాధించడంలో సంస్కరణలు, పనితీరు, మార్పు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
దేశం అపారమైన యువశక్తితో తొణికిసలాడుతోందని, ఈ రోజు 20–25 సంవత్సరాల వయస్సు గల యువత 45–50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అభివృద్ధి చెందిన భారతదేశంలో అతిపెద్ద లబి్ధదారులు అవుతారని అన్నారు. వారంతా విధాన రూపకల్పనలో కీలక స్థానాల్లో ఉంటారని, అభివృద్ధి చెందిన భారతాన్ని రాబోయే శతాబ్దంలో గర్వంగా నడిపిస్తారన్నారు. 1930, 1940లలో స్వాతంత్య్రం కోసం పోరాడిన యువతతో వారిని పోల్చారు.
యువ ఎంపీలకు ఇది సువర్ణావకాశమని, సభలో వారి చురుకైన భాగస్వామ్యంతో వికసిత్ భారత్‌కు సాక్షులుగా ఉంటారని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రతి ఎంపీ, ముఖ్యంగా యువ ఎంపీలు వికసిత్ భారత్ ఎజెండాకు ఇతోధికంగా కృషి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సంస్కరణలు, పనితీరు, పరివర్తన’ తమ మంత్రంగా ఉంటుందన్నారు. వేగంగా అభివృద్ధిని సాధిస్తామని, సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యమన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని పేర్కొన్నారు.
పదేళ్లలో విదేశీ జోక్యం లేని సమావేశాలివే
గడిచిన పదేళ్లలో విదేశీ జోక్యం లేకుండా జరుగుతున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు ఇవేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి సమావేశాలకు ముందు విదేశాల నుంచి అగ్గిరాజేయడం పరిపాటిగా వస్తోందని, ఈసారి మాత్రం అలాంటిదేమీ జరుగలేదని విపక్షాలకు చురకలు వేశారు. ‘‘2014 నుంచి నేను గమనిస్తున్నాను. ప్రతి సమావేశానికి ముందు ఇక్కట్లు సృష్టించేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇక్కడ దేశంలో ఈ ప్రయత్నాలను ఎగదోసే వారికి కొదవలేదు. విదేశీ మూలాల నుంచి ఎలాంటి జోక్యం లేని మొదటి సమావేశం ఇదే’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment